2009, అక్టోబరు 26 వ తేదీన కడప జిల్లా మైదుకూరులోని సెయింట్ జోసెఫ్ ఆంగ్లమాధ్యమ పాఠశాలలో తెలుగు
మాట్లాడారని.. మూడవ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలమెడలలో " I NEVER SPEAK TELUGU 'అని రాసిన అట్ట ఫలకాలను తగిలించి శిక్షించిన సంఘటన పత్రికలద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చి తెలుగు భాషాభిమానులలో ఒక తీవ్ర దుమారాన్ని లేపింది. ఆ దాష్టీకాన్ని ఖండిస్తూ, తెలుగు భాషకు జరుగుతున్న అవమానంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక " తెలుగు సమాజం " ప్రతినిధులు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి నాయకత్వంలో ఈ సంఘటనపై ఉద్యమాన్ని లేవనెత్తారు. మైదుకూరు సంఘటన నేపథ్యంలో తెలుగు పత్రికలలో వచ్చిన వ్యాసాలు, సంపాదకీయాలు, స్పందనలు, అభిప్రాయాలను "తెలుగు పౌరుషం" పేరుతో" సంకలనకర్త , రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మనకు అందిస్తున్నారు . మైదుకూరు తెలుగు ఉద్యమం తాలూకు ఛాయాచిత్రమాలిక కూడా ఈ పుస్తకంలో చేర్చబడింది. అలాగే తెలుగు సమాజం మైదుకూరులో నిర్వహిస్తున్న భాషా వికాస కార్యక్రమాలతో పాటు, తవ్వా ఓబుల్ రెడ్డి జరుపుతున్న చారిత్రక పరిశోధనల వివరాలు, నూతన చారిత్రక ఆవిష్కరణలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఆసక్తికరమైన ముఖ చిత్రం, మంచి ముద్రణతో వెలువడిన ఈ పుస్తకానికి.. సంకలనకర్త తవ్వా ఓబుల్ రెడ్డితో పాటు తెలంగాణా సాహిత్య అకాడెమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు ,సామల రమేష్‌బాబు, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణల ముందుమాటలున్నాయి. శ్రీయుతులు ఎబికె ప్రసాద్, డాక్టర్ చుక్కా రామయ్య, ప్రముఖ పాత్రికేయులు విశ్లేషకులు తెలకపల్లి రవి, సాహితీవేత్త అక్కిరాజు రమాపతి రాజు, ప్రముఖ పాత్రికేయులు హెబ్బార్ నాగేశ్వర రావు, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్, ప్రముఖ రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు, ప్రముఖ రచయితలు డాక్టర్ దుగ్గిరాజు శ్రీనివాస రావు, డాక్టర్ రామకృష్ణ , ప్రముఖ పాత్రికేయులు టి. ఉడయవర్లు , ప్రముఖ రచయిత వీరాజీ, సహజ కవి మల్లెమాల, కాలమిస్ట్ , రచయిత పడాల్ లాంటి వారి వ్యాసాలతో పాటు, చీరాల శ్రీశ్రీ గా పేరుగాంచిన కీ.శే. వెలుగు వెంకట సుబ్బారావు మైదుకూరు ఉదంతంపై రాసిన గేయంతో పాటు సంకలనకర్త పరిచయాన్ని ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత , ప్రముఖ రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి , పార్లమెంట్ సభ్యులు ఎస్.పి.వై రెడ్డి, త్రిపురనేని హనుమాన్ చౌదరి, రాజకీయ నాయకులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, మాణిక్య వరప్రసాదరావు, పలువురు తెలుగు భాషాభిమానుల అభిప్రాయాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ఈ "తెలుగు పౌరుషం" పుస్తకం ఆవిష్కరించబడింది.
పుస్తకం పేరు:తెలుగు పౌరుషం
సంకలనం: తవ్వా ఓబుల్ రెడ్డి
ప్రచురణ: తెలుగు సమాజం, మైదుకూరు
ప్రతులకు: తవ్వా పార్వతి, ఇంటి నెం.13/478-1, ఎల్.ఐ.సి ఆఫీసు వీధి, మైదుకూరు, కడపజిల్లా
ఫోన్ : 9440024471
పేజీలు: 104
వెల:రూ 100/-
No comments:
Post a Comment