తెలుగు భాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాల్సిన తరుణం
ఆసన్నమైందని కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో భాషా సాహిత్యాలతో సన్నిహితంగా
ఉన్న తరం, తమ సంతానం తెలుగుకు దూరం కావడం చూసి
భాషకే ప్రమాదం వాటిల్లిందని భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి తెలుగుకు
వారు భయపడుతున్నంత ప్రమాదం ఏమీలేదన్నారు. "ఇంకా రాష్ట్రంలో 50 శాతం మంది నిరక్షరాస్యులున్నారని చెప్పారు. ఇంగ్లీష్ స్పర్శకు
దూరంగా ఉన్న వీళ్లతో తెలుగు భాష పదిలంగా ఉంటుంది'' అన్నారు. ఆధునిక అవసరాలకు తగట్టుగా భాషను సంసిద్ధం చేయకపోవడం
సమస్యలకు మూలం అవుతోందని పేర్కొన్నారు. తెలుగు సమాజానికి ఒక శాశ్వత నిఘంటువు
ఉండాలని., కొత్త పదాలను వాడుకలోకి తీసుకొచ్చేందుకు
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అకడమిక్ వ్యవస్థ ఉండాలని కె.శ్రీనివాస్
అభిప్రాయపడ్డారు.
భాష ఒక అధికారం: చుక్కా రామయ్యభాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకే కాదని, దానికి ఒక అధికారం ఉంటుందన్న విషయాన్ని నైజాం హయాంలోనే గ్రహించానని మహాసభల ప్రారంభోపన్యాసంలో ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పేర్కొన్నారు. తెలుగు భాషపై చర్చించడానికి ఏర్పడిన ఆంధ్ర మహాసభ వెట్టి చాకిరీని పారదోలిందని, దున్నే వాడిదే భూమి నినాదాన్ని కూడా తీసుకొచ్చిందని గుర్తు చేశారు. భూసంస్కరణలు, తెలంగాణలో సాయుధ పోరాటానికి ఊపిరి పోసిందని చెప్పారు.
"ప్రజా సమస్యలపై తెలుగు భాష
చర్చించిన రోజే అందరూ ఇందులో భాగస్వామ్యులు అవుతారు. భాష పండితుల గుప్పిట్లో నుంచి
గుడిసెల్లోకి పోవాలి. అధికారిక ముద్రపడిన భాష నిరంకుశత్వానికి దారి తీస్తుంది తప్ప
ప్రజల సమస్యల్ని పరిష్కరించదు. శ్రమ జీవి బతికున్నంత వరకు తెలుగు భాష పదిలంగా ఉంటుంది'' అని చుక్కా రామయ్య చెప్పారు. తెలుగు భాష వికాసం కావాలంటే కనీసం పదో
తరగతి వరకైనా తెలుగు మాధ్యమాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఒక
కారణం కోసం వెయ్యి మందికి పైగా ఆత్మహత్య చేసుకొన్నారని, ఏ రోజు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతోన్న తరుణంలో
ప్రపంచ తెలుగు మహాసభలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం శోచనీయమన్నారు.
తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ: రమేశ్తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు సామల రమేశ్ బాబు కోరారు. పాలనాపరమైన ఉత్తర్వులు తెలుగులోనే వెలువడేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేడు తెలుగు భాషను అభిమానించే వారున్నారు కానీ, అది అన్నం పెడుతుందని నమ్మే వారు కరువయ్యారని సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
భాష ఉపాధి కల్పిస్తుందన్న భరోసా కలిగినప్పుడే అభివృద్ధి
చెందుతుందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన తెలుగు యూనివర్సిటీ ఏం
చేస్తోందని వేమన ఫౌండేషన్ అధ్యక్షుడు, మిసిమి సంపాదకుడు సి.ఆంజనేయ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్సీ కె.సుబ్బారెడ్డి, కవి, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment