తెలుగు ప్రజలు అన్ని ప్రాంతాలకు వలసపోయినట్లే స్వాతంత్య్రానికి పూర్వమే ఉమ్మడి భారతదేశంలో ఉన్న (తూర్పు బెంగాలు) బంగ్లాదేశానికి వలస వెళ్ళారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, వడ్డాది, కె.కోటపాడు, సబ్బవరం, పెందుర్తి ప్రాంతాలకు చెందినవారున్నారు.
వలసవెళ్లిన తెలుగువారిలో ఈ ప్రాంతాలలోని దళిత కులాలైన మాల, మాదిగ, చచ్చడి (రెల్లి) కులాలకు చెందినవారు అధిక సంఖ్యలోను, కాపు, చాకలి (రజక), వెలమ కులానికి చెందినవారు అతి తక్కువలో ఉన్నారు. వీరంతా తాత ముత్తాతల కాలం నుండి పొట్టకూటి కోసం వచ్చినవారే. బంగ్లాదేశ్‌లోని హాట్‌పూల్, వారీ, గోబీబాగ్ ప్రాంతాలలో ఎక్కువ తెలుగు జనాభా ఉంది. ఇక్కడి తెలుగు జనాభా సుమారు 50 వేల వరకు ఉంటుందని అంచనా. బ్రిటీష్ పరిపాలనా పోయింది. పాకిస్తాన్ ప్రభుత్వపాలనా పోయింది. ప్రస్తుత బంగ్లాదేశ్ పాలనలోనూ వీరి జీవితాలకు వెలుగు లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇటు స్వదేశానికి రాలేక అటు బంగ్లాదేశ్‌లో స్థిరపడలేక రెండింటికి చెడిన రేవడిలా తయారైంది వీళ్ళ జీవితం. వీరిలో కొంతమంది మున్సిపాలిటీలలో నాల్గవతరగతి ఉద్యోగాలు చేస్తుండగా మిగతా ఎక్కువమంది చిన్న చిన్న వ్యాపారాలు, ప్రైవేటు కంపెనీలలోను, కూలీ పనులు చేస్తూ పూటగడవని స్థితిలో ఉన్నారు. ఎక్కువమంది మురికి వాడల్లో జీవనం సాగిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో కొంతమంది స్థిరపడిపోగా, మరికొంతమంది ఆంధ్రప్రదేశ్‌లో స్వగ్రామాలలో కుటుంబాలను విడచి నాలుగైదేళ్లకు ఒకసారి వెళ్లి వస్తుంటారు. పుట్టిన ఊర్లో ఉపాధి లేకపోవడం చేత వలస వచ్చినా వీరి జీవితాలలో వెలుగులేదు. మాతృభూమికి దూరంగా వున్నా వీరు ఎక్కువగా హిందూ సంప్రదాయాలను పాటిస్తూ తెలుగు సంఘాలను ఏర్పాటుచేసుకొని తెలుగు పండుగలైన వినాయక చవితి, నాగుల చవితి, దీపావళి, దుర్గాలమ్మ పండుగ, కొత్తామావస్య (ఉగాది) జరుపుకుంటూ తెలుగు సంస్కృతిని పరిరక్షించుకుంటున్నారు. తెలుగువారు వారానికి ఒకసారి కలిసి భజనలు, కీర్తనలు పాడుకుంటారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం స్థాపించిన పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ తెలుగు భాష వచ్చిన వారి వద్దకు పంపిస్తూ తెలుగు నేర్పిస్తారు. ఇంటిల్లిపాది అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటారు.
కొంతమంది ఆర్థిక పరిస్థితి గ్రామాలలోకంటె కొద్దిగా మెరుగుగా ఉన్నా మిగతా వారికి నివసించడానికి సరియైన ఇళ్లు లేవు. తినడానికి ఇబ్బందే. మురికివాడల్లో నివాసం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాధికారులు వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్తుంటారు. ధరలు చాలాఎక్కువ. వీరికి వచ్చే ‘టాకా’ చాలడంలేదు. వీరి సమస్యలను అక్కడ ప్రభుత్వంగాని, ఆంధ్రప్రదేశ్ (్భరత) ప్రభుత్వంగాని పట్టించుకోవడంలేదు. పాస్‌పోర్టు మొదలగు విషయాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా బంగ్లాదేశ్‌లో ఉండలేక అలాగని ఆంధ్రప్రదేశ్ రాలేక కాలం గడుపుతున్నారు. వీరి పిల్లలు కొంతమంది విశాఖ జిల్లా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుచున్నారు. వీరు ఎక్కువగా నిరక్షరాస్యులగుటచే సంఘటితంగా ఉండి తమ సమస్యలు విన్నవించుకోవడం తెలియకపోవడం చేత వీరి జీవితాలలో పెద్ద అభివృద్ధి లేదు.
బర్మా వలసవాసులకు విశాఖపట్నం తదితర ప్రాంతాలలో బర్మాకాలనీలు నిర్మించి పునరావాసం కల్పించినట్లే తమకు కూడా ఉపాధి చూపి పునరావాసం కల్పించాలని బంగ్లాదేశ్‌లోని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగు భాషాభివృద్ధి, తెలుగు సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకొని తమ జీవితాలలో వెలుగు నింపాలని ఇచ్చటి ప్రజలు కోరుకుంటున్నారు.
-బద్రి కూర్మారావు
అంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో..
బాంగ్లాదేశ్ లో తెలుగువారిగురించి మనలో చాలామందికి తెలియదు.తెలియజేసినందుకు ధన్యవాదాలు.ఇప్పుడయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ,ప్రజలు వారికి సాయంచేస్తారని ఆశిద్దాము.
ReplyDelete