పోర్ట్‌లూయిస్(మారిషస్), డిసెంబర్ 9 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి భావ సమైక్యతకూ, మాతృభాషా సంస్కృతుల పరిరక్షణకే తెలుగు విశ్వవిద్యాలయం పాటుపడుతోందని ఉపాధ్యక్షుడు ఆచార్య యాదగిరి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల వల్ల తెలుగువారంతా ఒకే వేదిక మీదకు వచ్చి మాతృభాషా సంస్కృతుల గురించి చర్చించుకోవడం వల్ల సమైక్య చైతన్యాన్ని పొందుతారని ఆయన చెప్పారు. మారిషస్ ప్రపంచ తెలుగు మహాసభల రెండో రోజున ముఖ్యఅతిథిగా యాదగిరి ప్రసంగించారు. మహాభారత, రామయాణాది ఇతిహాసాల వల్ల ధర్మాధర్మ సంఘర్షణ గురించి తెలుసుకోవచ్చని ఆచార్య సి మృణాళిని అన్నారు. ప్రాచీన సాహిత్యపు చివరి రోజుల్లో వచ్చిన తరిగొండ వెంగమాంబ తిరుగుబాటు, సంస్కరణ భావాలను తమ జీవితంలోనూ, రచనల్లోనూ పొందుపరచి, ఆధునికతకు నాంది పలికారని అన్నారు. : ప్రాచీన సాహిత్యంలో పదాలను అధ్యయనం చేయడం వల్ల భాషా సంపద పెంచుకోవచ్చని మృణాళిని అన్నారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మారిషస్‌లోని తెలుగువారిపై రచించిన కవితను చదివి అలరించారు. ఆచార్య ప్రీతి ఆర్ కుమార్ జాతీయోద్యమ కవి గరిమెళ్ల ఆంగ్లకవిత హార్ట్ ఆఫ్ ఇండియాను గుర్తుచేశారు. న్యూయార్క్ నుండి వచ్చిన డాక్టర్ సముద్రాల బాబూరావు తెలుగు భాషకు తెలుగేతరులు చేసిన సేవ అనే అంశంపై మాట్లాడారు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం , శిల్పం తదితర కళలను పాఠ్యాంశంగా చేర్చాలని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ కోరారు. నృత్యకళను ప్రాధమిక స్థాయి నుండే పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని డాక్టర్ పి. అలేఖ్య కోరారు. కర్ణాటక సంగీతానికి తమ దేశంలో ప్రాచుర్యం పెరుగుతోందని మారిషస్ నుండి వచ్చిన గురుమూర్తి పాపయ్య తెలిపారు. ఈ సందర్భంగా మారిషస్‌లో ఆంధ్రమహాసభ ఆవిర్భావానికి, తెలుగుభాషా వికాసానికి కృషి చేసిన సోమన్న సోమయ్యకు మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాన్ని అందజేసి మండలి బుద్ధప్రసాద్ సత్కరించారు.
No comments:
Post a Comment