విశాఖపట్నం: తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచే ఓ మ్యూజియం విశాఖలో రూపుదిద్దుకోబోతోంది. తెలుగు సాంస్కృతిక నికేతనం పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ మ్యూజియంలో జాతి సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి వివిధ ఘట్టాలను ఉంచబోతున్నారు. శాతవాహనుల కాలం నుంచి ఇప్పటి వరకూ ఉన్న తెలుగు వారి ప్రాభవం ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా వివరించబోతున్నారు. స్థానిక కైలాసగిరిపై ఈ మ్యూజియం నిర్మాణానికి 2005లోనే శంకుస్థాపన చేశారు. ఐదు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియం నిర్మించడానికి వరల్డ్ తెలుగు ఫెడరేషన్ (డబ్ల్యుటిఎఫ్), విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఎంఓయును కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కైలాసగిరిపై సుమారు 1.20 కోట్ల రూపాయల విలువైన భూమిని వుడా ఈ మ్యూజియం కోసం కేటాయించింది. మిగిలిన 3.80 కోట్ల రూపాయలను డబ్ల్యుటిఎఫ్ ఇచ్చేందుకు నిర్ణయించింది. పర్యాటకంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో ఈ మ్యూజియంను నిర్మిస్తే, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి తెలుగు భాషా ప్రాచుర్యాన్ని, తెలుగు వారి వైభవాన్ని వివరించడానికి వీలవుతుందని నిర్ణయించి ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. తొలుత ఐదు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకున్నారు., కానీ ఈ వ్యయం సుమారు 10 కోట్ల రూపాయల వరకూ పెరిగింది. అత్యంత కళాత్మంగా ఈ మ్యూజియం నిర్మాణం సాగుతోంది. భవన నిర్మాణం దాదాపూ పూర్తికావచ్చింది. ఈ మ్యూజియంలో తెలుగు జాతి చరిత్రను వివరించేందుకు 35 ఎపిసోడ్‌లను రూపొందిస్తున్నారు. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ హాల్‌లో సుమారు గంటసేపు సాగే ఒక్కో ప్రదర్శనలో తెలుగు చరిత్రను శిల్పాలు, సౌండ్ షో ద్వారా ప్రేక్షకులకు వివరించబోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాషలో కూడా వివరించనున్నారు. ఇందులో మొత్తం 35 ఘట్టాలు ఉంటాయి. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి శిల్పాలను రూపొందించే బాధ్యతలను సోమవారం అప్పగించారు. అలాగే సి.నారాయణరెడ్డి అధ్యక్షతన నలుగురు నిష్ణాతులైన తెలుగు కవులకు స్క్రిప్ట్ రాసే బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఈ మ్యూజియంను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. కేరళలో కన్నడ మ్యూజియంను కూడా ఇక్కడి అధికారులు సందర్శించి వచ్చారు. దానికి పది రెట్లు మన మ్యూజియం ఉంటుందని ఈ మ్యూజియం నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న డబ్ల్యుటిఎఫ్ ప్రాంతీయ చైర్మన్ యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతాల చరిత్రకు సంబంధించి ఇంత పెద్ద మ్యూజియంలు లేవని ఆయన చెప్పారు.
మంచి విషయం చెప్పారు. కొత్తసంవత్సరం లో వసంతమాసంలో సిద్ధమౌతుందన్నమాట.
ReplyDelete