మేలత్తూరు భాగవతుల ప్రదర్శన |
తమిళనాడు లోని తంజావూరునేలిన చోళులు విజయనగర రాజుల చేతిలో ఓడిపోయిన తరువాత తంజావూరు రాజ్యాన్ని విజయనగర పాలకులు పాలించారు. అక్కడ విజయనగర రాజుల పాలనలో తెలుగు సంస్కృతి, వైష్ణవ మతం బలపడింది. భాగవత మేళా నాటకాల పోషకులు తంజావూరునేలిన చోళులు, నాయక రాజులు, మరాఠాలు.
చోళులు తమిళ సంస్కృతిని, తమిళ సాహిత్యాన్ని పోషించారు. తరువాత తంజావూరు నాయక రాజుల కాలంలో వారి పాలన తెలుగు, సంస్కృతాలకు స్వర్ణ యుగంగా మారింది. నాయక రాజులే కాక, వారి సభలోని అధికారులు, ఉద్యోగులు కూడా సంస్కృతం. తెలుగులో మంచి పండితులు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఎందరో కవులు, పండితులు, కళాకారులు ఆంధ్రప్రాంతంనుండి తంజావూరు వలస వచ్చినప్పుడు అక్కడ ఆంధ్రత్వం, ఆంధ్ర సంస్కృతి వేళ్లూని క్రమక్రమాభివృద్ధి చెందింది.
ఆ విధంగా వలస వచ్చిన వారికి నాయక రాజైన అచ్యుతప్ప నాయకుడు (క్రీ.శ. 1560-1600) ఆశ్రయం కల్పించాడు. ప్రతి కుటుంబానికి ఒక ఇంటిని, కొంత వ్యవసాయభూమిని ఇచ్చిన గొప్ప దాత. ఆ విధంగా ఏర్పడిన ఊరిని అచ్యుతప్ప నాయకుని పేరు మీద అచ్యుతాబ్ది అని, అచ్యుతపురమని పిలిచినప్పటికీ దానికి స్థిరనామం మెలట్టూరు (మేళా+ఊరు)గా నిలిచిపోయింది.
తంజావూరునేలిన రఘునాథ నాయకుడు స్వయంగా గొప్ప కవి, పండితుడు. కవి పోషకుడు. అతని కాలంలో ఆ ప్రాంతం కళలకు, సంస్కృతికి, కర్ణాటక సంగీతానికి, నాట్యానికి, నాటకాలకు ఆలవాలమయింది. అతని చివరిదశ వరకూ కవిపండితులు అతనిని ఆశ్రయిస్తూనే వచ్చారు. ఈ కాలంలోనే ఇతని సభలో ఒక పండిత పరిషత్తు ఏర్పాటు చేయబడింది. అప్పటి తెలుగు సాహిత్య విద్యాలయం కూడా ఎంతో గుర్తింపు పొందింది. ఇతని కుమారుడు విజయరాఘవ నాయకుడు కూడా తండ్రి బాటలోనే నడిచిన రాజు. ఇతరు సమారుగా 57 రచనలు చేసినప్పటికీ, వాటిలో 12 ఒపెరాలు. వీటిలో అత్యంత ప్రసిద్ధి పొందినది 'ప్రహ్లాద మహానాటకమే. వీరి తరువాత రాజ్యాధిపత్యాన్ని పొందిన మరాఠా రాజులు శహాజి, తులజాజీలు. శరభోజి కూడా తెలుగు సంస్కృతాలను ఎతో ప్రోత్సహించడమే కాక, స్వయంగా యక్షగానాలు, ప్రబంధాలు రచించారు.
పైన పేర్కొన్నట్లు రాజులు తెలుగు సంస్కృతాలకు ఎనలేని ఏవ చేస్తే, వీరి ఏలుబడిలోని కవిపండితులు చేసిన సేవ కూడా గణనీయమైనదే. తెలుగులో నృత్య నాటకాలు రాయడం నాయక రాజుల కాలంలోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. విజయరాఘవు రచించిన పన్నెండు నాటకాలలో ప్రహ్లాద మహానాటకమే చాలా ప్రసిద్ధి చెందింది. 'కృష్ణలీలా తరంగిణి రచించి, సంగీతజ్ఞుల చేత, నాట్యాచార్యుల చేత నేటికీ నీరాజనాలందుకుంటున్న నారాయణ తీర్థులకు, మెలట్టూరు వారికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇతడే 'పారిజాతాపహరణమ్ అనే నృత్య నాటకాన్ని కూడా రచించినట్లు తెలుస్తున్నది. అందువల్లనే మెలట్టూరు వారు నారాయణతీర్థుల జ్ఞాపకార్థం ఇప్పటికీ ఆశ్వీయుజ మాసం నెలరోజులు వారి తరంగాలను పారాయణం చేస్తారు. భజన సాంప్రదాయం కూడా నారాయణతీర్థుల కాలంలోనే ప్రారంభమైంది.
నారాయణతీర్థుల శిష్యుడు గోపాలకృష్ణశాస్త్రి ధృవ, గౌరీ కల్యాణం, సీతా కల్యాణం, రుక్మిణీ కల్యాణం అనే నాలుగు నాటకాలు రాసినట్లు చెబుతారు. వాటిని మెలట్టూరులోను, ఇతర ప్రాంతాలలోను హరికథలు చెప్పడానికి వాడారని కూడా చెబుతారు. గోపాలకృష్ణశాస్త్రి కుమారుడే మెలట్టూరు నాట్య, నాటకాల పితామహుడుగా పేరొందిన మెలట్టూరు వెంకటరామశాస్త్రి. ఇతడే మెలట్టూరు నాట్య నాటకాల రచనకు, ప్రదర్శనకు, వ్యాప్తికి ఆద్యుడని అందరి విశ్వాసం. ఆయన పేరు మెలట్టూరులోనే కాక భారతదేశమంతటా మార్మోగుతూనే ఉంటుంది. కర్ణాటక సంగీతానికి మణికిరీటమైన త్యాగరాజస్వామి వెంకటరామశాస్త్రి సమకాలికుడే. వెంకటరామశాస్త్రి రచించిన ప్రహ్లాద చరిత్ర నాటకం వల్ల ప్రభావితుడైన త్యాగరాజస్వామి స్వయంగా ' ప్రహ్లాద భక్త విజయమ్ ' అనే గీత నాటకాన్ని ఇదే కథ ఆధారంగా రచించారు. కృష్ణలీలా తరంగిణి రచించిన నారాయణతీర్థులు, కర్ణాటక సంగీత పితామహుడైన త్యాగరాజస్వామి, మెలట్టూరు భాగవత మేళా సంప్రదాయ పితామహుడైన వెంకటరామశాస్త్రి తెలుగువారు కావడం మనకెంతో గర్వకారణం.
వెంకటరామశాస్త్రి రచించిన పన్నెండు నృత్యనాటకాలు - ప్రహ్లాద చరిత్ర, మార్కండేయ చరిత్ర, ఉషాపరిణయం, హరిశ్చంద్ర నాటకం, రుక్మాంగద నాటకం, హరిహరవిలాసం, సీతాపరిణయం, రుక్మిణీ వివాహం, కంస వధ, సతీసావిత్రి నాటకం, గొల్లభామ నాటకం ఎంతో ప్రసిద్ధి చెందాయి. వీటిలో ప్రహ్లాద చరిత్ర ఎంతో ఉత్కృష్ట రచన అని అందరూ అంగీకరించిందే. దీనిని ఈనాటికీ లక్ష్మీనృసింహ జయంతినాడు ప్రదర్శిస్తూ ఉంటారు. మెలట్టూరు వెంకటరామశాస్త్రి రచించిన నాటకాల రచనకు సంబంధించి 1990లో ఒక కమిటీని వేసినప్పుడు ఆరుద్ర కూడా అందులో ఒక సభ్యుడు. దీని ఉద్దేశ్యం వెంకటరామశాస్త్రి రచించిన నాటకాలను ఎడిట్ చేసి స్వరపరిచి సాంకేతికంగా తయారు చేసి వీడియో తీసి పరిరక్షించడానికి కావలసిన చర్యలు సూచించడమే.
మెలట్టూరు వెంకటరామశాస్త్రి తరువాత చెప్పుకోదగిన గొప్ప రచయిత కాశీనాథయ్య. ఇతడు గొప్ప నాట్యాచార్యుడే కాక, అలరిప్పు, శబ్దం, సలామ్ జతుల ప్రథమ రచయితగా పేరుగాంచిన వాడు. ఇతడు తన రచనలను శహాజీ, శరభోజి, తులజాజీ మహరాజులకు, ప్రతాపసింహునికి అంకితమిచ్చినాడు కనుక ఇతని కాలం 1684నుండి 1735గా చెప్పుకోవచ్చు. ఇతనికాలం 1700నుంచి 1769గా చెప్పడం జరిగింది. మెలట్టూరు వీరభద్రయ్య కాశీనాథయ్యకు శిష్యుడు. ఇతని రచనలన్నీ బుద్ధికుశలతతో, విస్తృతమైన విషయ పరిజ్ఞానంతో కూడుకున్నవే. ఇతడెన్నో సంగీతకృతులను రచించి కర్ణాటక సంగీతానికెంతో సేవ చేసినాడు. ఇతడు కూడా శరభోజి, తులజాజీ, ప్రతాపసింహులకు సమకాలికుడు. దక్షిణ భారతావనికి చెందిన ప్రతి సంగీత విద్వాంసుడు తన మొదటి స్వరజతి, రాగమాలిక, వర్ణం, తిల్లానా వీరభద్రయ్యకే చెందేట్లు పాడతారు. ఇతడు రామస్వామి దీక్షితార్కు గురువు . తంజావూరు త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ రామస్వామి దీక్షితార్ కుమారుడు.
పైన పేర్కొన్న తెలుగువారిలో కొందరు ప్రముఖులైతే, కనిపించ కుండా సేవ చేసినవారు ఎందరో. అచ్యుతప్ప నాయకుని పాలనా కాలంలో ఆంధ్రప్రాంతమైన పాకనాడు, వెలనాడుకు చెందిన తెలుగు కుటుంబాలు ఆ రాజు ఆశ్రయం కోరి తంజావూరుకు వచ్చినప్పుడు ఆ రాజు వారికి వివిధ ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజుకు కళలపట్ల ఉన్న అభిమానం తెలియవచ్చింది. ఇట్లా ఏర్పాటు చేసిన గ్రామాలలో మెలట్టూరు ఒకటి. నెల్లూరు మండలంలోని ఇసు పాటి గ్రామంనుండి వచ్చినవారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ విధంగా ఆశ్రయం పొందినవారు సుమారు ఐదు వందల బ్రాహ్మణ కుటుంబాల వారు ఎదురెదురుగా ఉన్న ఇండ్లలో నివసించేవారు. వీరందరూ వేద పండితులు, కవులు, కళాకారులే కావడం విశేషం. మెలట్టూరు నాట్య నాటకాలు, భాగవత మేళా సంప్రదాయం తెలుగువారు పెట్టిన భిక్షేననేది నిర్వివాదాంశం. దీనిపైన కూచిపూడి ప్రభావం ఉందనేది కూడా నిర్వివాదాంశమే. ఈ విధంగా తెలుగువారు రెండు సంప్రదాయాలను నిలబెట్టినవారైనారు. కూచిపూడి ప్రపంచ ప్రఖ్యాతిని పొందితే మెలట్టూరు ఊరుదాటి ప్రదర్శించడానికి ఇష్టపడరు కనుక అది ఊరుదాటి బైటికి రాక, చాలామంది దృష్టిలోకి రాలేదు.
-డాక్టర్ కె. రత్నశ్రీ
( వార్త దినపత్రిక సౌజన్యంతో..)