Thursday, December 16, 2010

19న హైదరాబాద్‌లో "తానా" 'తెలుగు వైభవం'

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే సంకల్పంతో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఈ నెల 19న రవీంద్రభారతిలో 'తానా చైతన్య స్రవంతి-తెలుగు వైభవం' ఉత్సవాలను నిర్వహించనుంది. మంగళవారమిక్కడ తానా అధ్యక్షుడు కోమటి జయరామ్‌ విలేకరులతో మాట్లాడారు. ఔత్సాహిక కళాకారుల ప్రతిభను వెలుగులోకితెచ్చేందుకు రెండేళ్లకోసారి రాష్ట్రంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రతిభావంతులకు 2011లో అమెరికాలో జరిగే తానా సభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇదే నెల 22, 23 తేదీల్లో చంద్రగిరికోట (తిరుపతి)లో ఆధ్యాత్మిక వైభవం, 24, 25 తేదీల్లో విజయవాడలోని సిద్దార్థ కళాశాల మైదానంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. తెలుగు కవితల పోటీలు, రాష్ట్రస్థాయి నాటికల పోటీలు, వేదపఠనం, భక్తిగీతాలపాన, జానపద కళల ప్రదర్శన, తెలుగు సాంస్కృతిక సమ్మేళనం వంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సీనియర్‌ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌ను గిడుగు రామ్మూర్తి పురస్కారంతో, మల్లాది సుబ్బమ్మను సేవా పురస్కారంతో సత్కరిస్తామని తెలిపారు.
తానా' ఆధ్వర్యంలో విజయవాడలో జానపద కళావైభవం
ప్రాభవం కోల్పోతున్న తెలుగు జానపద కళలకు ప్రాచుర్యం కల్పించి, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో విజయవాడలో 'జానపద కళావైభవం' పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటుచేయబోతున్నట్టు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు కోమటి జయరాం తెలిపారు. ఈనెల 24, 25  తేదీల్లో సిద్ధార్థ అకాడమీ మైదానంలో వీటిని ఘనంగా నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. వీటిల్లో మంచి ప్రావీణ్యం చూపిన కళాకారులకు తానా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. విజయవాడలో జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులను సన్మానించనున్నట్టు తెలిపారు. న్యూజెర్సీలో ఉండే విజయవాడ వాసి సుబ్బారావు అనుమోలు అమెరికాలో స్థిరపడిన వారికి ఇచ్చే అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకున్నారని, ఆయన్ను కూడా విజయవాడలో సన్మానించనున్నట్టు తెలిపారు. 23, 24 తేదీల్లో నాటికలు, కవితల పోటీలు, జానపద కళల ప్రదర్శన, దివంగత తెలుగు దిగ్గజాల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటుచేస్తామని సాంస్కృతిక సమన్వయకర్త విజయ ఆసూరి చెప్పారు. తెలుగుజాతి సంస్కృతి పేరుతో కవితాగోష్ఠి, రచయితల చేత పత్రాల సమర్పణ ఉంటుందనీ, వీటిని పుస్తకరూపంలో ముద్రించి తానా సభల్లో ఆవిష్కరిస్తామని తానా సమన్వయకర్త బీఎస్‌ కోటేశ్వరరావు తెలిపారు. అమెరికాకు వచ్చే తెలుగువారికి తానా ఎప్పుడూ సహాయంగా ఉంటుందని కోమటి జయరాం చెప్పారు. ఇక్కడి నుంచి కొత్తగా వచ్చే వారి కోసం ఉపయోగపడే సమాచారం తానా వెబ్‌సైట్‌లో ఉంటుందని పేర్కొన్నారు. అక్కడికొచ్చి చదువుకునే వారికి ప్రతి ఏటా 35 మందికి ఉపకార వేతనాలు ఇస్తున్నట్టు చెప్పారు. అంతరించిపోతున్న కళలకు తానా ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అన్నారు. ఈ సమావేశంలో తానా భారత సమన్వయకర్త గారపాటి ప్రసాద్‌, ఆహ్వాన సంఘం సభ్యులు పట్టాభి, బెల్లపు బాబ్జీ, కృచ్ఛేవ్‌, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Sunday, December 5, 2010

తెలుగువారి పండువగా ప్రాణహిత పుష్కరాలు!

ప్రాణహితనది
ప్రాణహిత పుష్కరాలు  ఈ సంవత్సరం స్వస్తిశ్రీ వికృతినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత రుతువు, మార్గశీర మాసం, శుద్ధపాడ్యమి, బృహస్పతి గురువు మీనరాశిలో ప్రవేశించిన సందర్భంలో ( 2010 డిసెంబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు) వారం రోజుల పాటు   ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి . ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ యేడు గత ఎన్నడూ లేని విధంగా ఈ పుష్కరాలను నిర్వహించేందుకు సిద్ధపడింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో, కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం లోని త్రివేణి సంగమం వద్ద వీటిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పుష్కరాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇందుకోసం రూ.తొమ్మిది కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్‌కు రూ.ఐదు కోట్లు, ఆదిలాబాద్‌ జిల్లాకు నాలుగు కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుష్కరాలను ప్రారంభిస్తారు.
ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాణహిత జన్మస్థానమైన కౌటాల మండలం తుమ్డిహేటి, కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండలాల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నారు. పుష్కర స్థలం వద్ద స్నాన ఘట్టాలు, విశ్రాంతి గదుల నిర్మాణంతో పాటు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. యాత్రికులకు తాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలిక రోడ్లు తదితర ఏర్పాట్లు  సాగుతున్నాయి. వేమనపల్లి, ముత్తారం నుండి ప్రాణహిత నది వరకు మట్టి రోడ్డు వేశారు. మరుగుదొడ్లు, స్నానాల గదులను తడకలతో ఏర్పాటు చేశారు. విశ్రాంతి గదుల పేరిట పందిళ్లు వేశారు.
ప్రాణహిత పుష్కరాలు - విశిష్టత ! 
బృహస్పతి మీనరాశిలో ప్రవేశం జరగడంచే ప్రాణహితనదికి ఈసారి పుష్కరాలు సంభవించాయి.
పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి సంభవించే పవిత్ర నదీ పండుగ.పన్నెండు నెలల పాటు ఒక్కో రాశిలో తిరిగే బృహస్పతి (గురువు) ఒక్కోరాశి ప్రవేశించినప్పుడు ఒక్కోనది 'పుష్కరిణి'గా దేశంలోని పన్నెండు నదులకు ఒక క్రమపద్ధతిలో పుష్కరాలను  రూపొందించారు. అందులో భాగంగానే గురువు మేషరాశి లో ప్రవేశిస్తే గంగానదికి, వృషభరాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి, మిథునంలోనయితే సరస్వతీ నదికి, కర్కాటకం లో యమునా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరీ నదికీ, కన్యలో ప్రవేశిస్తే కృష్ణానదికీ, తులారాశిలోనయితే కావేరీ నదికీ, వృశ్చికంలో తామ్రపర్ణీ నదికీ పుష్కరాలుగా భావిస్తారు. గురువు ధనస్సులో ప్రవేశిస్తే సింధూనదికీ, మకరంలో ప్రవేశిస్తే తుంగభద్రా నదికీ, కుంభంలో ప్రవేశిస్తే భీమరథీ నదికీ, మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి  పుష్కరాలను నిర్వహిస్తారు. .
 బృహస్పతి ఒకరాశి నుండి ఇంకొక రాశికి వెళ్లేప్పుడు పన్నెండు నదుల జలాలను శక్తివంతంగా ప్రభావితం చేస్తాడు. కనుక పుష్కరసమయంలో ఆయా నదులలో స్నానాదులు బుద్ది బలాన్ని పెంచుతాయి. వైదిక కార్య కలాపాల ద్వారా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తాయి. పుష్కరాల సమయంలో ముప్పదిమూడు కోట్ల దేవతలు కొలువుంటారు. పుష్కరాల సమయంలో స్నానం చేసినా, దానం చేసినా, జపం చేసినా, పితృ తర్పణంగానీ, పిండప్రదానం గానీ చేసినా సకల పాపాలు హరిస్తాయని భారతీయుల నమ్మకం.
'నవగ్రహాలలో ఒక గ్రహం బృహస్పతి', శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో గ్రహాలలో బృహస్పతిని నేనే అని చెప్పినందున బృహస్పతి శ్రీమహావిష్ణువు అంశ స్వరూపుడై, సకల దేవతలకు గురువు అయిన వాడు. బుద్ధిని కలిగించేది కాబట్టి గురువైన బృహస్పతిని ప్రార్థిస్తే బుద్ధి కుశలతోపాటు ఐశ్వర్య సిద్ధికూడా కలుగుతుంది.
ఒకనాడు ఇంద్రుడు, బృహస్పతి శివదర్శనార్థం ముని వేషదారులై కైలాసానికి బయలు దేరుతారు. శివుడు వీరిరువురిని పరీక్షించదలచి ఉగ్రరూపం ధరించి, దిగంబరుడై వీరి మార్గానికి అడ్డుగా నిలు స్తాడు. అప్పడు ఇంద్రుడు శివున్ని గుర్తించలేక అతనిపైకి వజ్రాయుధాన్ని ప్రయోగించబోగా శివుడతనిని భస్మం చేస్తాడు. ఆ దిగంబరుడే శివుడని గ్రహించిన బృహస్పతి శివుని స్తుతించి, ఇంద్రుని పునర్జీవున్ని చేయమని ప్రార్థిస్తాడు. శివుడు అనుగ్రహిస్తాడు. అందువల్ల బృహస్పతికి జీవుడనే పేరు వచ్చిందని కథనం. అట్టి బృహస్పతి పుష్కరిని కలిసి 12 సంవత్సరాల కొకసారి పవిత్ర నదులను ఆవహిస్తాడు. అటువంటి పవిత్ర నదుల్లో 12 నదులు పుష్కర నదులుగా పేర్కొన బడుతున్నాయి. సువర్ణ, రజిత, ధాన్య, భూదాన, వస్త్రం, లవణ, శాక, ఫలదానాలు, ఘృత, తైల, కర్పూర, కస్తూరి, చందన, కంబళ, సాలగ్రామ, పుస్తకదానాలు మిక్కిలి ప్రశస్తమైన దానాలు పుణ్య ప్రదంగా పుష్కర సమ యంలో చేయాలని పురాణాలు తెల్పుతున్నాయి. ప్రణీతానదినే 'ప్రాణహిత' నదిగా పిలువబడుతుంది. గోదావరీనదికి ప్రధానమైన ఉపనది ప్రాణహితానది.ఈ నదికే 'ప్రణీతా'నది అని మరోపేరు. ఈ నది సహాద్రి పర్వత శ్రేణుల్లో జన్మించి,  పెనగంగా, వైన్‌గంగా, వార్ధ అనే మూడు చిన్న నదులను కలుపుకొని ఏర్పడినది. ఈ నది ఆదిలాబాదు జిల్లా చెన్నూర్‌వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రాణహితనదీ తీరంలో కాళేశ్వర క్షేత్రం ఉన్నది.కాళేశ్వర క్షేత్రంలో బ్రహ్మచే సృష్టించబడి సర్వతీర్థములకు ప్రధానమైన ప్రణీతానది, వరదానది, వింధ్యపర్వత శిఖరం నుంచి బయలుదేరిన శివప్రియమగు వైన్యగంగ, లోకపావని గౌతమీ నది, ప్రణీత గోదావరి నదుల గుప్తగామినిగా ప్రవహించుచున్న బ్రహ్మపత్నియగు సరస్వతీ నదియను ఐదు నదులు పంచగంగగా సంగమిస్తాయి. త్రిలింగాలలో ఒకటైన కాళేశ్వర క్షేత్రం ముక్తేశ్వర క్షేత్రం,దక్షిణ ప్రయాగ అనికూడా పిలువబడుతుంది.
పుష్కర సమయంలో పేదలకు, బ్రాహ్మణులకు దానాలు చేస్తే  శుభ ఫలితాలు లభిస్తాయి. మొదటిరోజు, ఆహార ధాన్యాలు, రెండవరోజు గోవులు, వస్త్రములు, ఉప్పు, ; మూడవరోజు, పళ్లు, శాఖములు; నాల్గవరోజు  నెయ్యి, నూనె, పాలు; ఐదవరోజు నాగలి, ఆవు, మహిష దానాలు; ఆరవరోజు పళ్లు, సెజ్జలు (మంచాలు),  కుర్చీలు, పీటలు,; ఏడవరోజు  కంది, పెసర, మినుము, శనగ, పప్పుధాన్యాలు; ఎనిమిదవరోజు పసుపుకుంకుమ, చీరలు, సారెలుసుమంగళ ద్రవ్యాలు, గాజులు, పూలు; తొమ్మిదవరోజు యజ్ఞోపవీతాలు, పుస్తకాలు, రుద్రాక్షలు, పూజా సామాగ్రి; పదియవరోజు నగదు సొమ్మునవరత్నాలు, ; పదకొండవరోజు గో.భూ. తిలదశ దానాలు; పన్నెండవరోజు షోడశ దానాలు చేస్తే పుణ్య ఫలాలు లభిస్తాయి. పుష్కర సమయంలో తల్లిదండ్రులను, గురువులను, ఆకలితో ఉన్నవారిని  ఆదరిస్తే  పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు.