Saturday, July 16, 2011

విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు!

కృష్ణా జిల్లా రచయితల సంఘం 2011 ఆగస్టు 13, 14, 15 తేదీలలో విజయవాడలో రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు సమాయత్తం అవుతోంది. మరొకసారి మధురానుభూతిని మిగిల్చే సాహిత్య పండుగ జరుగబోతోంది. దేశ విదేశాల నుంచి భాషాభిమానులూ, భాషోద్యమ కార్యకర్తలూ, భాషా వేత్తలు, సాహితీ వేత్తలు, చరిత్ర పరిశోధకులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైన సమావేశవౌతున్న ఒక అపురూప సన్నివేశం ఇది.
తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో ప్రజల గుండె తలుపులు తట్టేందుకు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు కొత్త ఊపునందిస్తున్నాయి. 2007లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఆ మేరకు గొప్ప ఫలితాలు సాధించాయి కూడా! మనం తెలుగు వారిమనీ, మన భాషలో మనం మాట్లాడుకోవటంలో నామోషీ పడవలసిందేమీ లేదనే భావన ప్రజల్లో కొంతయినా కలగటానికి కారణమైన కలగటానికి కారణమైన తెలుగు భాషోద్యమాన్ని ఈ మొదటి ప్రపంచ మహాసభలు అమిత బలసంపన్నం చేశాయి.
తెలుగువారి చరిత్ర, సంస్కృతి, సాంకేతిక రంగాలలో రేపటి అవసరాలపైన, రేపటి మనుగడెపైన, రేపటి సామాజిక స్థితిగతులపైనా ప్రధానంగా దృష్టి పెట్టుకొని రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల చర్చా వేదికలకు రూపకల్పన జరుగుతోంది. తెలుగు భాషా సంస్కృతుల విషయమై కొన్ని వౌలికమైన అంశాల గురించి కచ్చితమైన చర్చ జరగవలసి ఉంది కూడా!
* చాలామంది సాహితీ వేత్తలు, మేధావులు తెలుగు సాహిత్యానికి శూన్యయుగం నడుస్తోందనే భావనలో ఉన్నారు. ఇది నిజమే అయితే వెలుగు నింపటానికి తీసుకోదగిన చర్యలేమిటి? జరగవలసిన మార్పులేమిటి? రేపటి సమాజానికి సాహిత్యం ఏ విధమైన దిశా నిర్దేశం చేయగలుగుతుంది?
* తెలుగువారి సమగ్ర చరిత్ర నిర్మాణంపై విశ్వవిద్యాలయాలు గానీ, చరిత్రకు సంబంధించిన సంస్థలు గాని ఎందుకని దృష్టి పెట్టలేక పోయాయి? రేపటి అవసరాలను చరిత్ర పరిశోధకులు ఎంతమేర గుర్తించారు? ఏ విధంగా గుర్తించారు? ఇప్పుడు చేపట్టదగిన చర్యలేమిటి?
* మరణశయ్యనెక్కిన భాషల్లో తెలుగు చేరటానికి గల కారణాలమీద శాస్ర్తియమైన అధ్యయనం జరిగిందా? చరిత్ర నేర్పుతున్న పాఠాల్లోంచి మనం నేర్చుకొంటున్నదెంత? రేపటి సమాజంలో తెలుగు మనుగడ ఏమిటి?
* అంతరించి పోతున్న తెలుగు కళా రూపాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి తీసుకోదగిన చర్యలేమిటి? వాటి రేపటి మనుగడ మాటేమిటి?
* తెలుగు మాధ్యమంలో చదువు ఎందుకు ప్రాధాన్యత కోల్పోయింది? రేపటి సమాజం తెలుగుని అసలు చదువుకుంటుందా? ప్రాథమిక విద్యలో కూడా తెలుగుని నేర్పకుండా చెప్పే ఇవి చదువులేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే విధంగా గట్టి చర్చలు జరగవలసిన అవసరం ఎంతయినా ఉంది. వేయి గొంతులు ఒక్కటై ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది.
తెలుగు భాషా సంస్కృతుల విషయంలో ప్రపంచీకరణం ఒక వైపు, దృశ్య మాధ్యమాలు, సినిమాలు ఇంకొకవైపూ ముప్పేట దాడి కొనసాగిస్తుండగా ప్రజలలో ఏర్పడిన పాశ్చాత్య వ్యామోహం, ప్రభుత్వంలో నెలకొన్న నిరాసక్తత, పాలనా వ్యవస్థలో చోటుచేసుకొన్న నిర్లిప్తలను తొలగించి, తెలుగు భాషనీ, తెలుగు సంస్కృతినీ కాపాడుకోవటానికి మేధావులూ, భాషాభిమానులూ ప్రజల గుండె తలుపులు తట్టే కార్యక్రమాలకు రూప కల్పన చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు కృష్ణాజిల్లా రచయితల సంఘం మరొకసారి పూనిక వహిస్తోంది. భాషా సంస్కృతులు ప్రమాద స్థితిలో ఉన్న నేటి రోజుల్లో ఈ సభలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.
తెలుగు భాషా ప్రాచీనతపైన తొలి జాతీయ సదస్సు నిర్వహణ, మచిలీపట్నం నుంచి నెల్లూరు దాకా రచయితల ‘తెలుగు భాషా సంస్కృతి చైతన్య యాత్ర’ సింధూనాగరికతకు సమాంతరంగా తెలుగు నేలమీద సంస్కృతీ సంపన్నులైన ప్రజలు నివసించారని అంగీకరిస్తున్నప్పుడు, ఆ నాటి సంస్కృతిని తెలుగు సంస్కృతిగా పిలవాలని కోరుతూ రాష్ట్రంలోని పురావస్తు శాస్తవ్రేత్తలు అనేకమందిని ఆహ్వానించి జరిపిన ‘సింధు - కృష్ణ లోయల నాగరికతల అధ్యయన సదస్సు’, తెలుగులో న్యాయపాలనపైన మరొక జాతీయ సదస్సు, భాషోద్యమ స్ఫూర్తితో ‘జాతీయ తెలుగు రచయితల మహాసభలు’... తానా వారితో కలిసి తరతరాల తెలుగు సంస్కృతిపైన ఒక అధ్యయన సదస్సు... ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలు నిర్వహించి భాషోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు కృష్ణాజిల్లా రచయితల సంఘం ఎంతగానో శ్రమిస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే! తెలుగు పసిడి, వజ్రభారతి, తెలుగు మణిదీపాలు, కృష్ణాజిల్లా సరస్వం, తెలుగు వ్యాసమండలి లాంటి ప్రచురణలు గొప్ప ఆకార గ్రంథాలుగా నిలిచాయి.
తెలుగు భాషోద్యమ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గౌరవాధ్యక్షులుగా, ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కార్యనిర్వాహఖ అధ్యక్షులుగా, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షులుగా, డా. జి.వి. పూర్ణచందు ప్రధాన కార్యదర్శిగా ఏర్పడిన కార్యనిర్వాహక వర్గం కృష్ణాజిల్లా రచయితల సంఘం నేతృత్వంలో ఈ మహాభలకు రూపకల్పన చేస్తోంది.
భాషా సంస్కృతుల రేపటి మనుగడ గురించీ, రేపటి అవసరాల గురించీ ప్రధానంగా చర్చించే లక్ష్యంతో ఇప్పుడీ రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాయి. ప్రామాణికమైన, సాధికారికమైన ప్రతిపాదనలను ఈ మహాసభలు చేయగలవని కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆశిస్తోంది. దేశ విదేశాల నుండి అనేక మంది రచయితలు, పరిశోధకులూ, సాంకేతిక నిపుణులూ అందరూ ఒక వేదికపైన చేరడం ద్వారా మరొకసారి ప్రజల గుండె తలుపులు తట్టడమే ఈ మహాసభల లక్ష్యం. వీటి స్వరూప స్వభావాలు ఇలా ఉండబోతున్నాయి.
* చరిత్ర పూర్వయుగానికి, చారిత్రక యుగానికి సంబంధించిన పురావస్తు పరిశోధనల పైనా, తెలగు నాణాలు, తెలుగు శాసనాలపైనా, తెలుగు వారి కట్టడకళకు సంబంధించిన చారిత్రక ఆధారాలపైన ఈ సభలలో విశేష చర్చలు జరుగుతాయి. తెలుగు భాష ప్రాచీనతను నిరూపించే పరిశోధనాంశాలు, ఇటీవల వెలుగు చూసిన పురావస్తు ఆధారాలను ఈ సభలు పరిశీలన చేస్తాయి.
* తెలుగు సాహిత్యంలో ప్రధాన ఘట్టాలపైన, సంప్రదాయాలపైన, సాహిత్య పరిశోధనలపైన నాటక, నవలా, కథా, కవితా రచనల రేపటి పరిస్థితులపైన ప్రధాన చర్చలు జరుగుతాయి. తెలుగు విమర్శ గురించి, సాహిత్యంలో నిబద్ధత, ఆధునికత, అవాంఛనీయ ధోరణుల గురించీ, పత్రికా రంగంలో భాషావ్యాప్తి గురించీ పరిశీలన జరుగుతుంది. ముఖ్యంగా బాలసాహిత్యంపైన ప్రత్యేక దృష్టి ఉంటుంది.
* తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర మొదలైన ప్రాంతాలలో తెలుగువారి జీవనం, భాషాసంస్కృతుల పరంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు... రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదగిన చర్యల గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది.
* రేపటి అవసరాలకు తగ్గట్టుగా తెలుగు భాషా బోధన, తెలుగు మాధ్యమంలో పాఠ్యాంశాలలో చేయదగిన మార్పులు, శాస్ర్తియ దృక్పథంతో మాతృభాషలో ప్రాథమిక విద్యపై అవగాహన, ఇతర దేశాలలో తెలుగువారి కోసం పాఠ్యపుస్తకాల రూపకల్పన, తెలుగు పండితులపట్ల వివక్షత లేకుండా సముచిత గౌరవాన్ని ప్రభుత్వమూ, విద్యాసంస్థలూ అందించటం మొదలైన అంశాలపై చర్చలుంటాయి.
* మేలిమి భాషగా తెలుగును కేంద్ర ప్రభుత్వం గుర్తించి, విశిష్ట ప్రాచీన సంపన్నతా హోదా (క్లాసికల్ స్టేటస్) ప్రకటించిన తరువాత కూడా స్తబ్దత వదల్లేదు. విశ్వవిద్యాలయాలు గాని, సంబంధిత సంస్థలు గాని నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించే పనికి ఇంకా శ్రీకారాలు చుట్టలేదు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఈ అంశంపై తప్పనిసరిగా దృష్టి పెట్టవలసి ఉంది. హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం, మైసూరులోని భారతీయ భాషా కేంద్రం, కేంద్ర సాహిత్య ఆకాడమి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ తక్కిన సంబంధిత సంస్థలు ప్రాచీనతా హోదా అనంతరం చేపట్టనున్న నిర్దిష్ట కార్యక్రమాలను ఈ సదస్సులో ప్రతిపాదించనున్నాయి. తెలుగు భాషా సంస్కృతుల ప్రాచీనత నిరూపించే పరిశోధనలను విశ్వవిద్యాలయాలు చేపట్టటం, తెలుగు బృహన్నిఘంటువు (లెక్సికాన్) నిర్మాణానికి పూనిక వహించటం, తాళపత్ర గ్రంథాల పరిరక్షణ, తెలుగులో విజ్ఞాన సర్వస్వాల రూపకల్పనల గురించి చర్చ ఉంటుంది.
* ఆధునిక అవసరాలకు తగినట్లు తెలుగు భాష ఆధునీకరణ, తెలుగు లిపి, కంప్యూటర్ అవసరాలు, కంప్యూటర్‌లో తెలుగు పదజాలం, తెలుగు వెబ్ మేగజైన్లు, తెలుగులో సాంకేతిక ఉపకరణాలు, తెలుగులో వెబ్ సైట్లూ, బ్లాగులూ, సోషల్ నెట్ వర్క్ సైట్లు, తెలుగులో లినాక్స్ ఆపరేటింగ్ విధానం మొదలైన అంశాలపైన విశేష చర్చ జరుగుతుంది. తెలుగు యూనికోడ్ విషయమై ప్రభుత్వపరంగా తీసుకోదగిన చర్యల గురించి, ఇతర సాంకేతిక అంశాల గురించి నిర్దిష్ట ప్రతిపానలూ, సూచనలూ ఉంటాయి.
ఇంకా జాతీయ కవి సమ్మేళనంతో పాటు, దేశవ్యాప్తంగా ఎందరో కవులు కవయిత్రులతో కవి సమ్మేళనం, అష్టావధానం, భువనవిజయం, సర్వ వాగ్గేయకారుల సంకీర్తనం, తెలుగు వైభవాన్ని కళ్ళకు కట్టించే నృత్య రూపకాల ప్రదర్శనలు, వివిధ రంగాలలో విశిష్ట కృషి చేసిన తెలుగు ప్రముఖులకు, కవి పండితులకు సత్కారాలూ ఉంటాయి.
ఈ మహాసభల గుర్తుగా విజయవాడలో ఒక ముఖ్యకూడలిలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ జరుగుతుంది. విజయవాడ నగరంలో మహాకవుల చిత్రపటాలు మరియూ మినీకవితల ప్రదర్శన, అవకాశం సమకూరితే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నివాసం ఉన్న ఇంటిలో ఆయన చరిత్రను తెలిపే ఫోటోల ప్రదర్శన లాంటి అనేక కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన జరుగుతోంది. నిన్నని స్పృశిస్తూ, నేటిని సమీక్షిస్తూ రేపటి అవసరాలకు తగ్గట్టుగా తెలుగు భాషా సంస్కృతులను తీర్చి దిద్దుకొనే లక్ష్యంతో రచయితలు, పరిశోధకులూ, సాంకేతిక నిపుణుల సమాహారంగా ఈ సభలు జరుగుతున్నాయి. భాషోద్యమ స్ఫూర్తితో పాల్గొనవలసిందిగా అందరికీ ఆహ్వానం.
- డా॥ జి.వి. పూర్ణచందు,
కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి 
ఫోన్: 9440172642,
అంధ్ర భూమి దినపత్రిక " నుడి " శీర్షిక సౌజన్యంతో

Sunday, July 10, 2011

కడుపాత్రం (కథ)- తవ్వా ఓబుల్ రెడ్డి

''కేబుల్‌ టీవీలు, గ్రాఫిక్‌ సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని... ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి... ఎందుకింత సెమ!''
 పొరుగూర్లో నిన్నరాత్రి గ్రామపెద్దలు అన్నమాటలు బండిలోని వెంకటరావును రోడ్డు గతుకుల్లా కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, బండ్లు కట్టించి, చక్రాలపల్లెకు దారిపట్టించినాడు వెంకటరావు.
చక్రాలపల్లె సమీపిస్తున్నకొద్దీ వెంకటరావులో తల్లి ఒడిలోకి చేరుకుంటున్న ఆనందం చోటు చేసుకోసాగింది. ఎనిమిదేళ్ళ తర్వాత తిరిగి ఆ వూరికి రావడం; రెండు బండ్లలోని బృందానికి కూడా సంతోషం కలిగించింది. బొమ్మలాటలు ఆడుతూ దేశాటనం చేయడం వెంకటరావు బృందానికి వంశపారంపర్యంగా సంక్రమించిన వృత్తి. ఆటలో విగ్రహాలను కదం తొక్కించి వీక్షకులను ఉర్రూతలూగించడం వెంకటరావుకు వెన్నతోపెట్టిన విద్య. దేశాటనంలో అన్ని మజిలీలూ ఒక ఎత్తు... చక్రాలపల్లె జ్ఞాపకాలు మరొక ఎత్తు! ఊరి చింతవనంలో తాము దిగిన సమాచారం అందిన వెంటనే రామగోవిందరెడ్డి సాదరంగా ఆహ్వానిస్తాడు. రెండుమూడు వారాలు  తిండిగింజెలు ఇచ్చి పోషణ భారాన్ని వహిస్తాడు. అవసరమైన విగ్రహాలు గీయించడానికి ఖర్చులు భరిస్తాడు. కోరిన ఆటను ఆడించుకుంటాడు. అవసరమైన పాటలను, పద్యాలను మళ్ళీ మళ్ళీ పాడించుకుంటాడు. ఇదిలా వుంటే... ఊరి వాతావరణం మరొక అద్భుతం. విశాలమైన చింతవనం, ఊరిచుట్టూ  పచ్చని పొలాలూ... ఊరికి దగ్గరలో నల్లమల కొండలూ... ఇసుక తిన్నెలూ... నీటి మడుగులతో ఊరిని చుడుతూ మెలికలు తిరిగి ప్రవహించే ఏరూ... ఏటి మడుగుల్లో చేపల వేట, చింత చిగురూ...రాగి సంకటి వంటకాలూ ఇలా... ఆ ఊరి జ్ఞాపకాలన్నీ ఆ బృందం మస్తిష్కాల్లో తెరతెరలుగా బయటికి వస్తున్నాయి.
ఊరు ముందరగా ఏరు సమీపించింది. బండ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇసుక దారిలో వెళ్ళి బండ్లు ఊరు చేరుకోవాలి. ఏటిలో ఇసుక, రాళ్ళూ తప్ప నీటి చెమ్మ ఉన్నట్టు లేదు.
''విశ్వరూప'' ముందు బండిని తోలుతున్నాడు. వెంకటరావు తర్వాత బృందానికి విశ్వరూప ఉపనాయకునిలా వ్యవహరిస్తూ ఉంటాడు. వెంకటరావుకు నమ్మిన బంటు. చిన్నతనంలో అనాధగా దారిలో తారసపడితే వెంకటరావు చేరదీశాడు. బొమ్మలాటలో నైపుణ్యాన్ని సాధించిపెట్టాడు. తమ కళ విశిష్టతను, కుల చరిత్రను ఔపోసన పట్టించాడు. 'సురభి' నాటక సంఘాల స్థాపకుడైన గోవిందరావు కూడా తొలుత గంపా పకీరప్ప పేరుతో మశూచివ్యాధి బారినపడి అనాధగా తిరుగుతూ పనారస సంజీవరాయుని ధర్మపత్ని చెన్నమ్మకు దేశాటనలో తారసపడగా, చెన్నమ్మ చేరదీసిందని, ఆమె కుమారుడు వెంకోజీ పకీరప్పను దత్తత స్వీకరించి గోవిందరావుగా పేరు మార్చాడని వెంకటరావు విశ్వరూపకు పదేపదే గుర్తుచేస్తూ ఉంటాడు. నాటి గోవిందరావును మించి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు.
విశ్వరూప వెంకటరావును 'వెంకోజీ' అని పిలుస్తూ ఉంటాడు.
'రేయ్‌... విశ్వరూపా... ఇసుకలో బండ్లు నెమ్మదిగా పోనీ... చెమ్మ ఉంటుందేమో... దిగబడతాయి జాగ్రత్త'' వెనుక బండిలోనుండి కేకేసినాడు వెంకటరావు.
అలాగేనన్నట్లు తలూపుతూ బండిని ఊరి దిశగా నడిపించాడు విశ్వరూప.
బండ్లు ఊర్లోకి ప్రవేశించాయి. ఎద్దులగంటల శబ్దాలకు కుక్కలు మొరగసాగినాయి. బండ్లను చింతవనంలో విడిచిన వెంటనే రామగోవిందరెడ్డిని కలుసుకోవాలనుకున్నాడు వెంకటరావు.
అయితే వెంకటరావు ఆలోచనకు ప్రతిబంధకం ఎదురైంది.
రామగోవిందరెడ్డి నాలుగేళ్ళ కిందటే కాలం చేశాడని దారిలోనే గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న వెంకటరావు నిశ్చేష్టుడైనాడు. ఈతపుల్ల విరిగిన తోలుబొమ్మలా కూలబడిపోయాడు.
విశ్వరూపతోపాటు బృందంలోని వారంతా కూడా లాభపడినారు.
బండ్లు ఊరిమీదుగా చింతవనానికి దారితీస్తున్నాయి. చింతవనం చాటుగా ఊరికి తూర్పున ఉన్న ఏరు, కొండలూ ఊళ్ళోకి నేరుగా కనిపించడంతో బృందంలోని వారంతా ఉలిక్కిపడ్డారు.
నిటారైన చింతవృక్షాలతో, మూడెకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న వనం అదృశ్యమైంది.
రామగోవిందరెడ్డి కొడుకు చిన్నారెడ్డి చింతవనాన్ని నరికించాడని, ఆ స్థలంలో కోత మిషను ప్రారంభించి కలప వ్యాపారం చేస్తున్నాడని బండ్లకు ఎదురుగా వచ్చిన ఒక గ్రామస్థుడు చెప్పడంతో విశ్వరూప పగ్గాలను బిగపట్టి బండిని ఒక్కసారిగా ఆపాడు.
విషయం తెలుసుకున్న వెంకటరావు బండ్లను అక్కడికి దగ్గరలో ఒక పాత సత్రం వద్ద విడిది చేయాలని చెప్పాడు.
''చూశావా వెంకోజీ చెక్రాలపల్లె... చెక్రాలపల్లె అంటూ కలవరిస్తూ వచ్చినాం. తీరా చూస్తే ఇక్కడ తలదాచుకునేందుకు నీడే కరువైపోయింది'' నిరాశగా అన్నాడు విశ్వరూప.
సత్రం వద్ద బండ్లను ఆపారు. ఆటసామగ్రిని సత్రం వసారాలోకి చేరవేశారు.
వెంకటరావు ఊరి పరిసరాలను నిశితంగా పరిశీలించసాగాడు. చింతవనంలో కోత మిషన్‌ రొద చేస్తూ కలప మొద్దులను నిలువునా చీరేస్తూ వున్నట్లు... అక్కడినుండి వినిపించే శబ్దాన్నిబట్టి అంచనావేశాడు వెంకటరావు.
వెంకటరావు అంచనాకు తార్కాణంగా రాళ్ళూరప్పలతో ఊరి సమీపంలోని కొండలు కనిపిస్తున్నాయి. కొండ సెలల్లోని నిటారైన వృక్షాల జాడ ఇప్పుడు కనిపించలేదు. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులకు వెంకటరావు ఏమాత్రం తొణకలేదు.
''ఏమైనా సరే చక్రాలపల్లెలో మజిలీ చేయాల్సిందే...! ఆట ఆడాల్సిందే'' మనసులో అనుకున్నాడు.
ఆ రోజు రాత్రికే ఆటకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విశ్వరూపను పురమాయించాడు. బృందంలోని మరో ముగ్గురు పురుషులూ, ముగ్గురు స్త్రీలూ ఆట ఏర్పాట్లలో భాగంగా విగ్రహాలను సరిచూడటం ప్రారంభించారు. బృందంలో వెంకటరావు చెల్లెలు శారదమ్మ, ఆమె భర్త రాజారావులతోపాటు తమ్ముడు శివాజీరావు, మరదలు రాధమ్మ, మేనల్లుడు కృష్ణాజీ, మేనకోడలు సత్యవతీ ఉన్నారు.
తన కొడుకులతోపాటు కూతురు దూరమైన సంఘటనలు అరవై ఏళ్ళప్రాయంలో వెంకటరావు మనసును తొలుస్తూ ఉంటాయి. జ్ఞాపకాలు అప్పుడప్పుడూ నిరుత్సాహానికి గురిచేస్తూ వున్నా... కళపట్ల అంకితభావం వెంకటరావులో పట్టుదలను పెంపొందిస్తూ ఉంటుంది.
అలా... ఊరు చుట్టి వద్దామని బయలుదేరాడు వెంకటరావు.
ఊరి స్వరూపం పూర్తిగా మారిపోయింది.
ఎనిమిదేళ్ళ కిందట కరెంటు తీగలు కూడా లేని ఊరి వీధుల్లో కేబుల్‌ టీవీ, టెలిఫోన్ల వైర్లు బారులు తీరి వేలాడుతున్నాయి. అడుగడుగునా మిద్దెలపై ఏర్పాటు చేసుకున్న డిష్‌ యాంటెన్నాలు, ప్రాచీన కళారీతులను మట్టుపెట్టేందుకు ప్రయోగించిన బోనుల్లా కనిపించాయి వెంకటరావుకు.
తూర్పువీధి వైపునకు నడిచాడు.
ఒక వేపచెట్టు కింద అరుగుపై కూర్చుని వున్న గ్రామస్తులు వెంకటరావును గుర్తుపట్టి పిలిచారు. పేపర్లు చూస్తూ జిల్లారాజకీయాలను చర్చిస్తున్నట్లు కనపడుతోంది అక్కడి వాతావరణం.
''ఏటామాదిరి కాకుండా ఈసారి ఆట మా వీధిలో శివాలయం ముందర వేయాలి'' ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు పేపరు మడిచి పక్కన వేస్తున్న ఒక యువకుడు
''రామగోవిందరెడ్డి కాలం పోయింది'' మరో యువకుడు ఆక్రోశంతో కేకేసినట్లుగా మాట్లాడాడు.
వెంకటరావు తల వూపుతూ ఏమీ మాట్లాడకుండా అక్కడినుండి గొల్లవీధికి వెళ్ళాడు. తర్వాత రెడ్లవీధి, బలిజవీధి, ఉప్పరవీధి, కమ్మవీధుల్లో తిరిగాడు. చివరగా ఊరికి దక్షిణంగా ఉన్న మాదిగవాడకు కూడా వెళ్ళాడు.
ఎక్కడికి వెళ్ళినా, తమ వీధుల్లోనే ఆటాడాలని, తమ వీధుల్లోనే మొదటిరోజు ఆట ప్రారంభించాలని పట్టుబట్టడం వెంకటరావుకు ఆశ్చర్యం కలిగించింది.
కులసంఘాలు, పార్టీల ప్రస్తావన, పంతాలూ పట్టింపులూ ఊరిలో బాగా నాటుకుంటున్నాయని వెంకటరావు అర్థం చేసుకున్నాడు.
ఏటా మాదిరిగా ఈసారి కూడా రామాలయం వద్దనే ఆట ఆడతామని, మరోసారి వచ్చినప్పుడు వేదిక స్థలాన్ని మార్పు చేస్తామని అందరికీ సర్ది చెప్పడానికి వెంకటరావు తలప్రాణం తోకకు వచ్చింది.
ఊర్లోనుండి సత్రం వద్దకు తిరిగివస్తుండగా వెంకటరావుకు ఎదురైన కొందరు గ్రామస్తులు మాత్రం అభిమానంగా పలుకరించారు. క్షేమసమాచారాలు, పిల్లల గురించి అడిగారు వాళ్ళు.
''ఎగిరిపోయిన పక్షుల గురించి ఏమని చెప్పాలి'' అనుకుంటూనే తన ఇద్దరుకొడుకుల గురించి, కూతురి గురించి గ్రామస్తులకు చెప్పడం ప్రారంభించాడు వెంకటరావు.
''పెద్దకొడుకు సినిమా వేషాలపై మోజుతో ఐదేళ్ళకిందట చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అంత సులభంగా వేషాలు ఎక్కడ దొరుకుతాయి? ఆ కాలంలో సురభి కళాకారులను అక్కున చేర్చుకున్న బొంబాయి 'కృష్ణాఫిలిం కంబైన్స్‌'లాంటి కంపెనీలు ఈకాలంలో ఎక్కడున్నాయి. ఉంటే ఒక సినిమాలోనైనా వాడు ఈ పాటికి ఎవరికైనా కనిపించడా?'' ఆవేదనగా గ్రామస్తులను అడిగాడు వెంకటరావు.
గ్రామస్తులు మౌనంగా వింటూ ఉన్నారు.
''రెండోవాడు... బొమ్మలాటనే అసహ్యించుకుని రికార్డు డ్యాన్సు బృందంలో కలిసిపోయినాడు. సురభి నాటకాల్లా రికార్డు డ్యాన్సులేమైనా దేశదేశాల్లో ఆదరణ పొందుతాయా? పాడా?''
వెంకటరావు చెబుతోంటే తలలు ఊపుతూ అలాగే నిలబడ్డారు గ్రామస్తులు.
''ఇక బిడ్డ శ్రీదేవి. ఏమైపోయిందో... పాపం పిచ్చితల్లి!... ఆటలో 'ప్రమీల'పాత్రకు శ్రీదేవి కంఠం అగరొత్తుల వాసనలా సరిపోయేది. మినుకుమినుకుమంటున్న ఆటకు 'బిడ్డ' ఆశాదీపం అవుతుందనుకున్నాను. పడమర పల్లెలో రెండేళ్ళ క్రిందట ఒక సాయంత్రం బిడ్డ అదృశ్యమైంది. ఆ వూరి రెడ్డేరు కొడుకూ అతని స్నేహితులు కూడా ఆ రాత్రినుంచే కనిపించకుండా పోయారు. రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఊళ్లో ప్రత్యక్షమైనారు. మద్రాసుకు గుర్రపు పందేలకు పోయొచ్చామని చెప్పినారు. బిడ్డ ఆచూకీ ఇప్పటికీ తెలియదు. పెళ్ళికి ఎదిగిన బిడ్డ ఏమైపోయిందో ఏమో?'' కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు వెంకట్రావు.
కొడుకుల సంగతిలా, కూతురి జ్ఞాపకాల్ని వెంకటరావు బలవంతంగానైనా దిగమింగుకోలేకపోతున్నాడు. సత్రానికి చేరుకున్నాడు.
ఊర్లోని పిల్లలంతా ఒక్కొక్కరే సత్రం దగ్గరికి చేరుకున్నారు. విగ్రహాలకు రంగులు గీసుకుంటున్న కళాకారులను ఆసక్తిగా గమనిస్తున్నారు వాళ్ళు.
కాలేజీల్లో చదువుకుంటూ పండుగ శెలవులకు ఇండ్లకు చేరిన కుర్రాళ్ళు కొందరు అక్కడ జమయ్యారు. రిలీజైన కొత్త సినిమాల గురించి, కుర్రతరం హీరోల గురించీ మాట్లాడుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆయా హీరోలపై తమకున్న అభిమానాలను చాటుకోవడంలో పోటీలు పడుతున్నారు.
విగ్రహాలకు రంగులు వేయడం పూర్తిచేసిన విశ్వరూప, ఇతర కళాకారులూ బొమ్మలకు ఆభరణాలుగా కనిపించేందుకు విగ్రహాలకు రంధ్రాలతో నగిషీలు చిత్రిస్తున్నారు. వెంకటరావుతోపాటు వారంతా కాలేజీకుర్రాళ్ళ వాగ్వివాదాలను గమనిస్తున్నారు.
''ఏం... ముసిలాయనా... బొమ్మలాట ఆడటానికి వచ్చినారా? మాంచి బొమ్మలున్నాయా?'' ఒక కుర్రాడు వెంకటరావును ప్రశ్నించాడు.
''ఓహో... విగ్రహాలా? అవి లేకుండా ఆటెట్లా ఆడతాం? బాబూ!... లక్షణంగా... దండిగా ఉన్నాయి. జుట్టుపోలిగాడూ... బంగారక్క... శ్రీరామచంద్రుడూ... సీతమ్మవారూ... ఆంజనేయుడూ... రావణాసురుడు... శూర్పణఖ... భారతం బొమ్మలూ... అన్నీ వున్నాయి'' సోదాహరణంగా వివరించాడు వెంకటరావు.
''అహో... అలాగా... మీ దగ్గరున్న బొమ్మలతో ఏమేమి ఆటలు ఆడతారు?'' మరో కుర్రాడు మళ్ళీ ప్రశ్నించాడు.
''సుందరకాండ, లక్ష్మణ మూర్ఛ, సతీసులోచన, విరాటపర్వం, ప్రమీలార్జునీయం, పద్మవ్యూహం, సైంధవవధ... ఇంకా చాలా ఆటలు ఆడతాం'' ఈసారి విశ్వరూప చెప్పారు.
''తోలుబొమ్మల మాట సరేలే... ఈ బొమ్మ కథ చెప్పండి'' బృందంలోని సత్యవతి వైపునకు ఓరగా చూస్తూ గుట్టుగా అడిగినట్లుగా అడిగాడు గళ్ళలుంగీని షర్టుపై బిగించుకుని ఉన్న డిస్కో కటింగ్‌ యువకుడు.
ఆ కుర్రాళ్ళ వాలకం అర్థం అయింది వెంకటరావుకు.
''కడుపాత్రంతో దేశాటనం చేసే మాతో మీకు చెతుర్లు, ఎకసెక్యాలు ఎందుకు బాబూ'' నెమ్మదిగా వారించాడు వెంకట్రావు.
''కంపుకొట్టే తోలుబొమ్మలతో, నలుగురు తలమాసిన వాళ్ళను జమచేసుకుని ఊర్లు తిరిగి బతికే మీతో, మాకు చెతుర్లు ఎందుకోయ్‌... నిజంగానే ఆ బొమ్మ నచ్చింది... అడుగుతున్నాం'' మరో చెవిపోగు యువకుడు దురుసుగా మాట్లాడాడు.
విశ్వరూపకు కోపం వచ్చింది. శూర్పనఖకు కొత్త విగ్రహం కోసం దున్నపోతు చర్మాన్ని  పారదర్శకంగా రుద్దుతున్న అతనల్లా ఆ పని ఆపి లేచి నిలబడ్డాడు.
''చూడండి... మేం తలమాసినవాళ్ళమే కావచ్చు... కానీ చెడిపోయినవాళ్ళం మాత్రం కాదు. రాత్రికి ఊర్లో ఆట ఆడ్తాం చూడండి. వెళ్ళేటప్పుడు మీకు తోచింది ఇవ్వండి. పూటగడవకపోతే మాడి చస్తాంగానీ మాటలు మీరితే పడి చచ్చేవాళ్ళం అనుకోకండి. మరొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా వెళ్ళండి'' హెచ్చరించాడు విశ్వరూప.
''రంభా... ఊర్వశి... తిలోత్తమలను వెంటబెట్టుకుని వచ్చార్రోయ్‌. పదండ్రా... బొమ్మలాటంట... బొమ్మలాట! బొమ్మలకు ప్రాణం వస్తుందా... ఆడటానికి ఇతగాళ్ళు జీవం పోస్తారా? పదండి'' అక్కడినుండి ఊరివైపు విసురుగా కదిలినాడు డిస్కో కటింగ్‌ యువకుడు.
''బ్రేకు డ్యాన్యులూ... రికార్డు డ్యాన్సులూ... ఎంటీవీ 'వి' చానళ్ళే బోరుకొట్టి ఛస్తుంటే, తోలుబొమ్మలాట చూడలంట'' శృతి కలుపుతూ అనుసరించాడు చెవికమ్మ యువకుడు. వారిద్దరితోపాటు దాదాపు పదిమంది కుర్రాళ్ళు పకపకా నవ్వుకుంటూ ఊళ్ళోకి దారిపట్టారు.
పాతవస్త్రాలు కుట్టుకుంటున్న శారదమ్మ, పరదాలు కుడుతున్న రాధమ్మ, సత్యవతి ఏం జరుగుతుందోనని భయపడ్డారు.
ఆ కుర్రాళ్ళ మాటలతో గుండెల్లో శూలాలు దించినట్లయింది వెంకట్రావుకు. వెంకటరావును సముదాయించాడు విశ్వరూప.
గట్టిగా పిడికిలి బిగించాడు వెంకటరావు. ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఊపిరి పీల్చుకున్న ఛాతీ మరింత విశాలమైంది.
''బ్రిటీషు వాళ్ళకు అలవికాని దివిటి దొంగలను మట్టుబెట్టేందుకు మరాట్వాడా నుంచి దత్తమండలానికి వలస తేబడిన మరాటావీర జాతిరా ఇది! కులశ్రేయస్సు కోసం అంబా భవానీ ఎదుట ఆత్మాహుతి చేసుకున్న సంజీవరాయుని వంశంరా మనది!'' చాతీ మీద అరచేతితో చరుచుకుంటూ ఆవేశంగా కేకలేసినాడు వెంకటరావు.
విశ్వరూపతోపాటు బృందంలోని వారంతా వెంకటరావును సముదాయించారు.
శివాజీ, కృష్ణారావు చేపలవేట కోసం సన్నద్దమయ్యారు. వాళ్ళ చేతుల్లో వలలు, కొడిమెలు ఉండటాన్ని చూసిన విశ్వరూప చేతిలో జింకచర్మాన్ని చుట్టి పెట్టెలో పెట్టాడు. దేవతావిగ్రహాలను గీయించడానికి వ్యయప్రయాసలకోర్చి అయినాసరే జింకచర్మమే ఉపయోగించాలంటాడు వెంకటరావు. చర్మాన్ని శుద్ధి చేసే పనిని వాయిదా వేసుకున్న విశ్వరూప కూడా శివాజీ కృష్ణారావులతోపాటు ఏటికి చేపలకోసం బయలుదేరినాడు.
ఏటిలో మడుగులన్నీ పూర్తిగా ఎండిపోయాయి.
లారీలతో ఇసుకనంతా పట్టణాలకు తరలిస్తూ ఉండటంతో ఏటి స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొంతసేపు తిరిగి వట్టి చేతులతో తిరుగుముఖం పట్టారు ముగ్గురూ. వాళ్ళని చూసిన గ్రామస్తులు కొందరు నవ్వుకున్నారు.
వంట చేసుకోడానికి సరుకులు ఏమీ లేవు.
వెంకటరావు గంభీరంగా... ఏదో ఆలోచిస్తూ అరుగు మీదపడుకుని ఉన్నాడు.
అన్నంకోసం ఊర్లోకి వెళ్ళాలని ఎవరికీ అనిపించలేదు.
తనవద్దనున్న కొంత డబ్బుతో పప్పులు, అటుకులు, బెల్లం అంగడినుండి తెప్పించినాడు విశ్వరూప.
వాటిని తలా ఇన్ని తిని, నీళ్ళు తాగి సరిపెట్టుకున్నారు.
పొద్దుగూకి చీకటిపడేసరికి, ఊర్లోని రామాలయం వద్ద వేదిక సిద్ధమైంది.
ఊరంతా వచ్చి ఆట చూడాలని చాటింపు వేయించాడు వెంకటరావు. చాటింపు విని అప్పుడొకరూ, అప్పుడొకరూ వచ్చినారు. ఎనిమిదిగంటల సమయం దాటిపోతున్నా ఆట చూసేందుకు ముప్ఫయిమంది జనం కూడా రాలేదు. వేదిక వద్దకు చేరిన పిల్లలు కొందరు ఏదో సంబరంతో గెంతులు వేస్తున్నారు.
పిల్లలను వేదిక ముందువైపున కూర్చోబెట్టడం ప్రారంభించాడు విశ్వరూప. బొమ్మలాటంటే ఎట్లా ఉంటుందో చూడాలనే ఆత్రుత, ఉత్సాహం ఆ పసిపిల్లల్లోనైనా కలుగుతున్నందుకు వెంకటరావుకు కొంత ఊరట కలిగింది.
రైతు జీతగాళ్ళూ... దళితవాడ మహిళలూ, కొందరు వృద్ధులూ మాత్రం ఆట చూడాలనే కోరికతో ముందుగానే చేరుకున్నారు.
గతంలో ఎన్నోసార్లు ఆ వూర్లో ఆట జరిగిన తీరూ... తండోపతండాలుగా గుమికూడిన జనసంఖ్య గుర్తుకువచ్చింది వెంకటరావుకు. విశ్వరూప, వెంకటరావు దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఆశాజనకంగా లేదన్నట్టుగా పెదవి విరిచాడు.
వెంకటరావు అబ్బిళ్ళను కొరుకుతూ పట్టుదలగా తలను పైకీ కిందికి ఊపాడు. ఊర్లోకి దారిపట్టాడు. తానే స్వయంగా ఒకసారి అందరినీ పిలిచివస్తానని విశ్వరూపకు చెప్పి వెళ్ళాడు. ముందుగా రామగోవిందరెడ్డి ఇంటికేసి అడుగులు వేశాడు. తనలో చెలరేగుతున్న ఉద్వేగాన్ని అణుచుకుని, ప్రశాంతతను అలవర్చుకున్నాడు.
టీవీలో ఏదో ఇంగ్లీషు ఛానల్‌ చూస్తూ నట్టింట్లోనే మందుకొడుతున్నాడు చిన్నారెడ్డి. వెంకటరావుకు. ఆ యింటితో గతంలో ఉన్న చనువుతో నేరుగా ఇంటిలోకి ప్రవేశించాడు. గోడకు వేలాడుతున్న రామగోవిందరెడ్డి నిలువెత్తు ఫోటోను చూశాడు. రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. జలజలా రాలుతున్న కన్నీటిబొట్లను తుడుచుకుంటూ చిన్నారెడ్డికి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు.
చిన్నారెడ్డి తలెత్తి వెంకటరావును గమనించాడు.
''రెడ్డిగారు... ధర్మప్రభువులు... తమరు దయచేస్తే ఆట మొదలుపెడతాం. మీ కోసమే ఎదురుచూపు'' వెంకటరావు తల గీరుకుంటూ చిన్నారెడ్డిని ఆట చూసేందుకు ఆహ్వానించాడు.
''చూడు ముసిలానా... ఇట్లాంటివన్నీ నాకు సరిపడవుకానీ... వెళ్ళిపోయేటప్పుడు రాండి! ఎంతో కొంత లెక్క ఇస్తా'' అంటూ మందు గుటిక లేసుకుని టీవీ చూడటంలో మళ్ళీ నిమగ్నమయ్యాడు చిన్నారెడ్డి.
చిన్నారెడ్డి మాటలకు హతాశుడైనాడు వెంకట్రావు. పొరుగూర్లో ముందురోజు గ్రామపెద్దల వ్యాఖ్యలు కూడా గుర్తుకు వచ్చాయి.
''తిండిగింజలకు ఇనాములకు ఇక్కడ కూడా కాలం చెల్లిందేమో'' అనుకున్నాడు. అక్కడినుండి ఇంటింటికీ వెళ్ళి అందరినీ ఆహ్వానించాడు వెంకటరావు.
టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు ఊరంతా కూడా!
''ఆ... ఆ... ఆట మొదలెట్టుపో... వస్తా ఉండాం'' అంటున్నారేగానీ టీవీల దగ్గరనుండీ ఎవరూ లేవడం లేదు.
వెంకటరావు రామాలయం వద్దకు చేరుకున్నాడు. ఆటకోసం విగ్రహాలను సిద్ధం చేస్తున్నాడు విశ్వరూప.
'లంకాదహనం' ఆట ఆడబోతున్నట్లు ప్రకటించాడు వెంకటరావు. పందాలకు సరైన దిశలో నూనె దీపాలను ఏర్పాటు చేశారు. ప్రార్థన ప్రారంభించారు.
ప్రార్థన విని సమీప ఇళ్ళలోని మరికొందరు గ్రామస్తులు రామాలయం వద్దకు వచ్చారు.
ఆంజనేయుని విగ్రహం చేతికి తీసుకున్నాడు వెంకటరావు. ఆట ప్రారంభమైంది. తెరపై విగ్రహాలు ప్రత్యక్షమైనాయి. జుట్టు పోలిగాడు... బంగారక్కలాంటి హాస్యవిగ్రహాలు తెరపైకి రాలేదు.
''ఆంజనేయుడు సముద్ర తలంపై లంకానగరం వైపునకు పయనిస్తున్నాడు. రామలక్ష్మణులు, వానరులు సముద్రపు ఒడ్డున చేరారు'' నూనె దీపాల వెలుతురులో తెరపై విగ్రహాలు రంగురంగుల్లో మెరుస్తూ స్వర్ణకాంతులను వెదజల్లుతున్నాయి.
గంభీరంగా ప్రారంభమైన ఆట ఊపందుకుంది. తక్కువ సంఖ్యలో ఉన్నా జనం కథలో లీనమైపోయారు.
''ఆంజనేయుడు లంకానగరంలో ప్రవేశించాడు. రాక్షసభటులు ఆంజనేయుడిని బంధించి, తోకకు నిప్పుపెట్టారు. మంటలు ఎగిసిపడుతున్న తోకను చేత్తో పట్టుకుని లంకానగర దహనానికి ఉద్యుక్తుడైనాడు ఆంజనేయుడు. మంటలబారినపడి, రాక్షసమూక చేస్తున్న ఆర్తనాదాలు, ఏడుపులు... పెడబొబ్బలూ మిన్నంటుతున్నాయి. పొగలు మేఘాలను కమ్ముకుంటున్నాయి.''
వెంకటరావు గొంతు ఉద్వేగపు జీరతో కూడిన పాటతో సాగుతోంది. కంఠస్వరాన్ని పాత్రలకు అనుగుణంగా మారుస్తూ, ఆలాపన చేస్తున్నాడు. విశ్వరూపతోపాటు బృందంలో సభ్యులు చెక్కలను, పాదాలతో తొక్కుతూ శబ్దాలు సృష్టించి రాగాలాపన చేస్తున్నారు.
వెంకటరావును గమనించిన విశ్వరూప నిశ్చేష్టుడైనాడు.
మంటలు అంటుకుంటున్న చేతిని విదుల్చుకుంటూ రాక్షస మూకల ఆర్తనాదాలను ఆలపిస్తున్నాడు వెంకటరావు. ఆయన చేతి మంటలు పరదాలకు ప్రాకాయి. వేదిక అంటుకుంది.
కథలో లీనమైన ప్రేక్షకులు ఉలిక్కిపడి వాస్తవదృశ్యాన్ని గమనించి కేకలు వేయసాగారు.
విశ్వరూపను, తోటి కళాకారులను అందరినీ మరో చేత్తో కిందికి తోశాడు వెంకటరావు. వెంకటరావును ఆపాదమస్తకం మంటలు అంటుకున్నాయి. నిలువెల్లా దహించుకుపోతున్నా రాగాలాపన మాత్రం ఆపలేదు.
చెల్లాచెదురైన జనం మంటలను ఆర్పేందుకు నీళ్ళకోసం పరుగులు తీస్తున్నారు. ఈ బీభత్సానికి బృందంలోని మహిళలు కొందరు స్పృహతప్పి కూలబడిపోయారు.
చేతులాడని స్థితిలో స్థాణువై నిలబడినాడు విశ్వరూప.
లంకాదహనపు సన్నివేశంలోని పాటే... వెంకటరావు సజీవ దహనపు ఆర్తనాదమైంది.
ఏ అఘాయిత్యం చేస్తాడోనని గ్రామస్తులు విశ్వరూపను పట్టుకున్నారు. కణకణజ్వాలలతో మండిన వేదిక, క్షణాల్లోనే కుప్పకూలిపోయింది.
ఈ సంఘటనతో చలించిన గ్రామస్తులు కన్నీరు కార్చారు. ఊరంతా స్మశాన ప్రశాంతత అలుముకుంది.
స్పృహలోకి వచ్చిన కళాకారులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు.
''దీపపు సమ్మెలోని నూనెను చేతిపై గుమ్మరించుకుని నిప్పు అంటించుకున్నాడు. ఆటలో జీవిస్తున్నాను. ఆటకు ప్రాణం పోస్తున్నాను. మీరు కిందికి దిగిపోండ్రా అంటూ మంటల్లో కాలుతూ మమ్మల్ని కిందికి తోశాడయ్యా'' వెంకటరావు చెల్లెలు శారదమ్మ వేదికపై ఏం జరిగిందో చెబుతోంది.
గ్రామంలో నెలకొన్న ప్రశాంతతను భగ్నపరిచేందుకు ఇక ఆ రాత్రి ఏ టీవీ శబ్దమూ వినపడలేదు!
 08.12.2002,  వార్త దినపత్రిక, ఆదివారం అనుబంధంలో ప్రచురితం . .
================================================================

Saturday, July 2, 2011

తెలుగు సీమను చూడాలి.! శ్రీలంక తెలుగువారిలో ఉత్సుకత!!

శ్రీలంకలో తెలుగుజాతి ప్రజలు
 ఆ చెరువు అన్ని చెరువుల్లాగా కాదు. ఆ చెరువుకు వేరే మరియాద ఒకటుంది. ఆ దేశాన ఎక్కడా కానని వింత మానుల గుంపును ఆ చెరువంచున మనం చూడొచ్చు. ఆ దేశాన ఇంకెక్కడా వినలేని యాసబాస ఒకటి మన చెవిన పడుతుందక్కడ. మాపటివేళ మునిముని మబ్బులో పొయ్యి పైనుంచి లేచివచ్చిన చేపల పులుసు పరిమళం మనల్నిహత్తుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పొద్దుపోయి ఊరు సద్దు మణిగిన వెనుక సోమరిగాలిపై తేలుతూ వచ్చిన లాలిపాట కాసంతసేపు మన పసితనాన్ని గురుతుచేసి అమ్మలా ఒళ్ళు తడుముతుంది. మనవడు నిదర పోయిందెరుగక చెబుతూ పోతున్న తాతకతకు గున్నమానుపైన గువ్వ ఊకొడుతుంటే ఆ మెత్తని మూలుగు మనను జోకొడుతుంది.
ఇదంతా మన అమ్మబాసలోనే.. అవును, నమ్మండి, నిదర, మెలకువ, బతుకు, చావు అన్నీ అమ్మబాసలోనే, అంతా కమ్మని తెలుగులోనే ఆ చెరువంతా ఆ చెరువు మన రాష్ట్రంలో లేదు. మన పొరుగునాడులలో ఉన్నదీ కాదు. మన దేశపుది అసలే కాదు. శ్రీలంకలో అనురాధాపురం జిల్లాలో ఉందా చెరువు. చెరువు చుట్టూ తెలుగు పల్లెలు. పల్లెల నిండా పాముల నాడించి బ్రతుకుతున్న తెలుగు అహికుంటికలు. కొలంబో నుంచి సుమారు 120 కి.మి. దూరంలోని చెరువంచునున్న ‘దేవరగమ్మ’లో ఉన్న అహికుంటికలను (తెలుగు పాములోళ్ళు), వాళ్ళకు తెలుగుపట్లగల మక్కువను మీకు తెలియజెయ్యాలనే ఇది వ్రాస్తున్నా. ‘డోర్’ అనే హిందీ సినిమా దర్శకుడు మన తెలుగువాడు ‘నగేశ్ కుకునూరు’కు సహాయకుల్లో నేనొకణ్ణి. ఆ సినిమాలో ‘బహురూపి’ పాత్ర ఒకటుంది. ‘బహురూపి’ అనేది ఒక సంచార కులం. ‘డోర్’ సినిమా కేసట్‌ను చూసిన నా మిత్రుడు తెలుగు భాషోద్యమకారుడు, కథారచయిత సం.వెం. రమేశ్ ఆ బహురూపుల గురించి అడిగాడు. వాళ్ళనే కర్ణాటకలో ఇంకా చాలాచోట్ల, ‘బుడగజంగాలు’ అంటారట.
వేమన సర్వఙ్గ సంవాదమనే పాటను వీళ్ళు పాడతారట. వీళ్ళు రాజస్థానం నుండి కన్యాకుమారిదాకా పరచుకొని వున్నారని, ఎక్కడున్నా వీళ్ళు తెలుగే మాట్లాడుకొంటారనీ రమేశ్ గారు చెప్పగావిని, తెలుగు సంచారకులాలపై ఆసక్తి కలిగింది. రెండేళ్ళ క్రితం క్రికెట్ చూడ్డానికి శ్రీలంక వెళ్ళబోతూ ఆయనకు ఫోన్ చేయగా ‘అక్కడ పాములవాళ్ళు అని ఉంటారు, వారితో మాట్లాడ్లు’ అని సూచించారు. నా వెతుకులాటలో - సిగిరియా బౌద్ధారామం దగ్గర పాములనాడిస్తున్న ఒక వ్యక్తి కన్పించాడు.
దగ్గరకు పోయి, పలుకరిస్తే ముందు సందేహంగా చూచి కాసేపటికి కలిసిపోయినాడు. అతని పేరు మసెన్న. వాళ్ళ ఊరి పేరు చెప్పి రమ్మని పిలిచినాడు. పక్క దినమే పయనమై ఆ పల్లెకు పోయినాను. ఆ పల్లెపేరు దేవరగమ్మ. ఒక పెద్ద చెరువు అంచునుంది అది. నలభై కుటుంబాలు, సుమారు ఇన్నూరు మంది అహికుంటికలున్నారు ఆ పల్లెలో.
వాళ్ళతో గడిపిన తీపి తలపులను దాదాపు మూడు గంటల నిడివిగల వీడియోలో భద్రం చేసినాను.
అహికుటికల కతలు చెప్పాలంటే అదొక పొత్తమవుతుంది. ఆ పల్లె పల్లెంతా వచ్చి నన్ను పలకరించింది. ఇల్లూ, వాకిలీ తెరువూ చెరువూ దేనినీ వదలకుండా చూపించినారు. పుట్టుకనుంచి చావువరకూ వాళ్ళ ఆచార వ్యవహారాలను విడమరిచి చెప్పుకొన్నారు.
సింహళంవాళ్ళు వీళ్ళని అహికుంటికలు అంటారు. వీళ్ళని వీళ్ళు కొరసజాతి అని చెప్పుకొంటారు. మగవాళ్ళు పాముల్నాడిస్తారు. ఆడవాళ్ళు సోది చెబుతారు. పచ్చబొట్లు పొడుస్తారు. అనురాధాపురం జిల్లాలో మూడు పల్లెలు, బట్టికలోవ జిల్లాలో రెండు, త్రికోణమల (ట్రింకోమలై) జిల్లాలో రెండు పల్లెలు మొత్తంమీద అంతా కలిసి వెయ్యికి
మించదు వీళ్ళ లెక్క. నిన్నమొన్నటి వరకూ ఊర్లు తిరిగిన కులమే గానీ ఇప్పుడిప్పుడే కుదురుకొన్నారు.
ఈ తరంలోవాళ్ళు బడికిపోతున్నారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మసెన్నకొడుకు దేవరగమ్మలో పెద్ద చదువరి. ఆ పల్లెలోని డెబ్బయేండ్ల ఎర్రన్న చాలా సంగతులను చెప్పినాడు.
వీళ్ళ తెలుగు తెందెలుంగు, ఇప్పటి తమిళనాడులోని చాలాచోట్ల కనిపించే రకరకాల తెలుగు యాసలు వీళ్ళల్లో కనిపించినాయి. చోళమండలపు తెలుగువాళ్ళలా ‘అల్లాఇల్లా’ అంటారు. హోసూరు ప్రాంతంలోని నంజర (మాంసం) లాంటి మాటలు, ఎదురుకాలంలో లింగభేదం లేని క్రియారూపాలు (నేను రాను, మేము రాము, నువ్వు రావు, వాడు రాడు, ఆమె రాదు అనే వాడుకకు బదులుగా నేను వచ్చేలే, మేము వచ్చేలే, నువ్వు వచ్చేలే, వాడు వచ్చేలే, ఆమె వచ్చేలే అని వాడడం) లంక తెలుగులో ఉన్నాయి. వచ్చేలే అంటే వచ్చేది లేదు అని. హోసూరు ప్రాంతంలో ఇప్పటికీ ఇదే వాడుక ఉంది. ఏతావునున్న తెలుగు వాళ్ళకైనా లంక తెలుగు బాగా తెలుస్తుంది. హోసూరు వాళ్ళకయితే మరీ తేటతెల్లంగా తెలుస్తుంది.
వీళ్ళలో రెండు ఇంటిపేర్లున్నాయి. దూవురోళ్ళు, దేబలోళ్ళు అని. ఒకరికొకరు మామా అల్లుళ్ళ వరుసవుతారట. ఒకే ఇంటి పేరువాళ్ళు పెండ్లి చేసుకోరు. దాదాపుగా అందరూ బౌద్ధంలోకో క్రైస్తవానికో మారిపోయి ఉన్నారు. అయినా పిళ్లారిసామిని అంటే వినాయకుడిని మటుకు విడువలేదు. మతం మారడానికి వాళ్ళు చెప్పిన కారణం వింటే మనకు నోట మాటరాదు. పిళ్లారి సామిని మొక్కేవాళ్లకి ‘ఒలుకులు’ లేదట. బుద్ధాగమ వాళ్ళకి క్రీస్తువులకి మటుకే ఒలుకులు ఉందంట. ఒలుకులు కోసమే మతం మారాల్సి వచ్చిందట. ‘ఒలుకులు’ అనే మాట తొండ మండలపు తెలుగు. ఆ మాటకు వల్లకాడు అని అర్థం. బతుకుకోసం మతం మారడం సరే చావుకోసం మారడం వింతగా
లేదా! మతం మారడం వలన వీళ్ళు ఎదిగినారు. సొంత ఇళ్ళూ, నేలలూ వచ్చినాయి. నాగరికత పెరిగింది. బిడ్డలను బడికి పంపుతున్నారు. బాగానే ఉంది కానీ మెల్లమెల్లగా తమ మూలాలను మరచిపోతున్నారు. వాళ్లకే సొంతమైన పండుగలూ పబ్బాలూ ఆచారాలూ ఆటలూ పాటలూ దాదాపుగా కనుమరుగయినట్లే. వాళ్ళ పాతతీరున పెండ్లి చేసుకొనేటప్పుడు ఆడవాళ్ళు అందంగా అలంకరించుకొని చిత్రమైన చీరకట్టుతో ఒక నృత్యం చేసేవారు.
పాతకాలపు ఫొటో ఒకటి చూపించి అందులో కనిపిస్తున్న ఆ నృత్యాన్ని గురించి వివరించినారు. ఇప్పుడు పెండ్లిండ్లు బుద్ధాగమమో, క్రైస్తవం తీరులోనూ జరుగుతున్నాయి. ఆ తెలుగాట ఆగిపోయింది.
ఎర్రన్న నాగసారం ఊది పామునాడించి చూపినాడు. ఈ నాగసారాన్ని చెయ్యడానికి కావలసిన చెట్టు కేవలం వీళ్ళ పల్లెల్లోనే ఉంటుంది. ఆ చెట్టు విత్తులను ఏకాలంలోనో లంకకు వలస పోయేటప్పుడు వాళ్ళ తొలితావరం నుంచి తీసుకొనిపోయినారట. శ్రీలంకకు ఎప్పుడు వచ్చినారు అని అడిగితే 70 ఏండ్ల ఎర్రన్న చెప్పిన బదులిది. ‘మాయబ్బడు, వాళ్ళ అబ్బడు, అబ్బని కబ్బడు అందరూ సిర్లంక వాళ్ళే. ఎప్పుడొచ్చింది చెప్పేకి అయ్యేలే’. ఆ నాగసారపు చెట్లను హేమాద్రి గారిలాంటి చెట్ల శాస్తవ్రేత్తలు పరిశీలిస్తే వాళ్ళ తొలితావును కనిపెట్టవచ్చునేమో! వాళ్ళున్నచోట తమిళ చానళ్ళు వస్తున్నాయి. ఇంటిల్లిపాదీ కూచుని తమిళ సినిమాలను బాగా చూస్తుంటారు. తమిళ నటీనటులు బాగా పరిచయం. తెలుగు నటీనటుల గురించి వాళ్ళెరుగరు. అడగగా అడగగా ఒకతను మటుకు ‘సురంజీవి తెలుసు’ అన్నాడు. ఎన్టీఆర్ తెలుసా అంటే ‘ఆ తాత సచ్చిపోయె గదా’ అన్నాడింకొకతను. మన బాసకు ఆకృతులు ఉండాయా అని ఆసక్తిగా అడిగినాడు ఎర్రన్న. ఆకృతులంటే అక్షరాలు. రామాయణంలోని లంకను కాల్చే కతను చెప్పినాడు. వాళ్ళమ్మ పాడిన జోలపాటను పాడి వినిపించినాడు.
నన్ను ‘నువ్వు పాములోడివా కోతులోడివా?’ అని ప్రశ్నించినారు. ఇక్కడి కులాలను వివరించి చెబితే కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. వాళ్ళకు తెలిసింది, తెలుగువాళ్ళంటే పాములవాళ్ళు, కోతులవాళ్ళు... అంతే.
శ్రీలంకలో పాములవాళ్ళకంటే కోతులవాళ్ళు ఎక్కువున్నారట.
బట్టికలోవ ప్రాంతంలో కోతులవాళ్ళున్నారని ఎర్రన్న చెప్పినాడు. బట్టికలోవకు పోదామని ప్రయత్నించాను గాని
అక్కడి ప్రభుత్వం అనుమతించలేదు. పాములోళ్ళు పుట్టినప్పటి నుంచీ చనిపోయేంతవరకూ వాళ్ళు కార్యాలు ఏమేమి ఎట్లెట్ల చేస్తారో ఎర్రన్న విశదంగా చెప్పినాడు. ఆంధ్ర దేశంలో ఎట్లా చేస్తారని అడిగి తెలుసుకొన్నారు.
నేను వాళ్ళనొక కీలకమైన మాట అడిగినాను. తెలుగును ఇంక ఎంతకాలం నిలబెట్టుకోగలరు అని? నలభై యేండ్ల తిమ్మన్న, ‘మా మాట పొయ్యేలే, అల్లనే ఉండు’ అని బదులిచ్చినాడు. వెంటనే డెబ్బయేండ్ల ఎర్రన్న అందుకొని, ‘ఏల పొయ్యేలే, నిన్న ఆట పొయ్యింది నేడు పాట పొయ్యింది రేపు మాట కూడా పోతాది’ అన్నాడు. ఎర్రన్న చెప్పింది నిజం. బాసంటే ఇంటమాటాడుకొనే నాలుగయిదు మాటలే కాదు, అంతకుమించి ఇంకేదో ఇంకెంతో ఉంది అని ఎర్రన్న చెప్పకనే చెప్పినాడు. ఎర్రన్నకున్నఇంగితం ఆంధ్రదేశంలోని కొందరు తెలుగు పెద్దలకు లేదెందుకనో. తెలుగు కనుమరుగు కాబోతున్నదని ఎవరైనా అంటే ఈ పెద్దలు విరుచుకుపడుతున్నారు. చివరగా అహికుంటికలు నన్ను కోరిన నాలుగు కోరికలను మీ ముందుంచుతున్నాను.
(1) టీవీల్లో తమిళ పటాలు వచ్చినట్లు తెలుగు పటాలూ వచ్చేటట్లు చేస్తారా?
(అంటే ఒక తెలుగు ఛానెల్‌ని అడుగుతున్నారు)
(2) పాముకాటుకు పనికివచ్చే మందుచెట్లు మనసీమలో ఉంటే ఆ విత్తులు పంపిస్తారా?
(3) తెలుగు ఆకృతుల (అక్షరాల)ను మాకు చెప్పిస్తారా?
(4) మా పిల్లలను తోడుకొనిపోయి మనసీమను సూపిచ్చి పంపతారా?
గమనించినారా... తెలుగు నేలను వాళ్లింకా ‘మనసీమ’ అంటున్నారు. ఆ మనదనాన్ని
వదలలేదు. ఆ ‘మనసీమ’లో చస్తే పూడ్చిపెట్టుకోడానికి చేరెడు నేలను కూడా
వాళ్ళడగలేదు. మనసీమను కండ్లారా ఒకసారి వాళ్ళ బిడ్డలకయినా చూపమంటున్నారు.
మన ఆకృతులను అక్షరాలను వాళ్ళు వాళ్ళలో నిలుపుకోవాలనుకొంటున్నారు.
మనసీమలోని ఆటపాటలలో మాటలలో బతుకులలో - అది టీవీ ద్వారానైనా సరే - మునిగి
తేలాలనుకొంటున్నారు. ఒకటి కావలనుకొంటున్నారు.
మనం ఆపాటి కూడా చేయలేమా?
మనం ఆపాటి అయినా చేయగలమా?
- సుబ్బారెడ్డి అడపా
అంధ్ర భూమి దినపత్రిక " నుడి " శీర్షిక సౌజన్యంతో..