శ్రీలంకలో తెలుగుజాతి ప్రజలు |
ఇదంతా మన అమ్మబాసలోనే.. అవును, నమ్మండి, నిదర, మెలకువ, బతుకు, చావు అన్నీ అమ్మబాసలోనే, అంతా కమ్మని తెలుగులోనే ఆ చెరువంతా ఆ చెరువు మన రాష్ట్రంలో లేదు. మన పొరుగునాడులలో ఉన్నదీ కాదు. మన దేశపుది అసలే కాదు. శ్రీలంకలో అనురాధాపురం జిల్లాలో ఉందా చెరువు. చెరువు చుట్టూ తెలుగు పల్లెలు. పల్లెల నిండా పాముల నాడించి బ్రతుకుతున్న తెలుగు అహికుంటికలు. కొలంబో నుంచి సుమారు 120 కి.మి. దూరంలోని చెరువంచునున్న ‘దేవరగమ్మ’లో ఉన్న అహికుంటికలను (తెలుగు పాములోళ్ళు), వాళ్ళకు తెలుగుపట్లగల మక్కువను మీకు తెలియజెయ్యాలనే ఇది వ్రాస్తున్నా. ‘డోర్’ అనే హిందీ సినిమా దర్శకుడు మన తెలుగువాడు ‘నగేశ్ కుకునూరు’కు సహాయకుల్లో నేనొకణ్ణి. ఆ సినిమాలో ‘బహురూపి’ పాత్ర ఒకటుంది. ‘బహురూపి’ అనేది ఒక సంచార కులం. ‘డోర్’ సినిమా కేసట్‌ను చూసిన నా మిత్రుడు తెలుగు భాషోద్యమకారుడు, కథారచయిత సం.వెం. రమేశ్ ఆ బహురూపుల గురించి అడిగాడు. వాళ్ళనే కర్ణాటకలో ఇంకా చాలాచోట్ల, ‘బుడగజంగాలు’ అంటారట.
వేమన సర్వఙ్గ సంవాదమనే పాటను వీళ్ళు పాడతారట. వీళ్ళు రాజస్థానం నుండి కన్యాకుమారిదాకా పరచుకొని వున్నారని, ఎక్కడున్నా వీళ్ళు తెలుగే మాట్లాడుకొంటారనీ రమేశ్ గారు చెప్పగావిని, తెలుగు సంచారకులాలపై ఆసక్తి కలిగింది. రెండేళ్ళ క్రితం క్రికెట్ చూడ్డానికి శ్రీలంక వెళ్ళబోతూ ఆయనకు ఫోన్ చేయగా ‘అక్కడ పాములవాళ్ళు అని ఉంటారు, వారితో మాట్లాడ్లు’ అని సూచించారు. నా వెతుకులాటలో - సిగిరియా బౌద్ధారామం దగ్గర పాములనాడిస్తున్న ఒక వ్యక్తి కన్పించాడు.
దగ్గరకు పోయి, పలుకరిస్తే ముందు సందేహంగా చూచి కాసేపటికి కలిసిపోయినాడు. అతని పేరు మసెన్న. వాళ్ళ ఊరి పేరు చెప్పి రమ్మని పిలిచినాడు. పక్క దినమే పయనమై ఆ పల్లెకు పోయినాను. ఆ పల్లెపేరు దేవరగమ్మ. ఒక పెద్ద చెరువు అంచునుంది అది. నలభై కుటుంబాలు, సుమారు ఇన్నూరు మంది అహికుంటికలున్నారు ఆ పల్లెలో.
వాళ్ళతో గడిపిన తీపి తలపులను దాదాపు మూడు గంటల నిడివిగల వీడియోలో భద్రం చేసినాను.
అహికుటికల కతలు చెప్పాలంటే అదొక పొత్తమవుతుంది. ఆ పల్లె పల్లెంతా వచ్చి నన్ను పలకరించింది. ఇల్లూ, వాకిలీ తెరువూ చెరువూ దేనినీ వదలకుండా చూపించినారు. పుట్టుకనుంచి చావువరకూ వాళ్ళ ఆచార వ్యవహారాలను విడమరిచి చెప్పుకొన్నారు.
సింహళంవాళ్ళు వీళ్ళని అహికుంటికలు అంటారు. వీళ్ళని వీళ్ళు కొరసజాతి అని చెప్పుకొంటారు. మగవాళ్ళు పాముల్నాడిస్తారు. ఆడవాళ్ళు సోది చెబుతారు. పచ్చబొట్లు పొడుస్తారు. అనురాధాపురం జిల్లాలో మూడు పల్లెలు, బట్టికలోవ జిల్లాలో రెండు, త్రికోణమల (ట్రింకోమలై) జిల్లాలో రెండు పల్లెలు మొత్తంమీద అంతా కలిసి వెయ్యికి
మించదు వీళ్ళ లెక్క. నిన్నమొన్నటి వరకూ ఊర్లు తిరిగిన కులమే గానీ ఇప్పుడిప్పుడే కుదురుకొన్నారు.
ఈ తరంలోవాళ్ళు బడికిపోతున్నారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మసెన్నకొడుకు దేవరగమ్మలో పెద్ద చదువరి. ఆ పల్లెలోని డెబ్బయేండ్ల ఎర్రన్న చాలా సంగతులను చెప్పినాడు.
వీళ్ళ తెలుగు తెందెలుంగు, ఇప్పటి తమిళనాడులోని చాలాచోట్ల కనిపించే రకరకాల తెలుగు యాసలు వీళ్ళల్లో కనిపించినాయి. చోళమండలపు తెలుగువాళ్ళలా ‘అల్లాఇల్లా’ అంటారు. హోసూరు ప్రాంతంలోని నంజర (మాంసం) లాంటి మాటలు, ఎదురుకాలంలో లింగభేదం లేని క్రియారూపాలు (నేను రాను, మేము రాము, నువ్వు రావు, వాడు రాడు, ఆమె రాదు అనే వాడుకకు బదులుగా నేను వచ్చేలే, మేము వచ్చేలే, నువ్వు వచ్చేలే, వాడు వచ్చేలే, ఆమె వచ్చేలే అని వాడడం) లంక తెలుగులో ఉన్నాయి. వచ్చేలే అంటే వచ్చేది లేదు అని. హోసూరు ప్రాంతంలో ఇప్పటికీ ఇదే వాడుక ఉంది. ఏతావునున్న తెలుగు వాళ్ళకైనా లంక తెలుగు బాగా తెలుస్తుంది. హోసూరు వాళ్ళకయితే మరీ తేటతెల్లంగా తెలుస్తుంది.
వీళ్ళలో రెండు ఇంటిపేర్లున్నాయి. దూవురోళ్ళు, దేబలోళ్ళు అని. ఒకరికొకరు మామా అల్లుళ్ళ వరుసవుతారట. ఒకే ఇంటి పేరువాళ్ళు పెండ్లి చేసుకోరు. దాదాపుగా అందరూ బౌద్ధంలోకో క్రైస్తవానికో మారిపోయి ఉన్నారు. అయినా పిళ్లారిసామిని అంటే వినాయకుడిని మటుకు విడువలేదు. మతం మారడానికి వాళ్ళు చెప్పిన కారణం వింటే మనకు నోట మాటరాదు. పిళ్లారి సామిని మొక్కేవాళ్లకి ‘ఒలుకులు’ లేదట. బుద్ధాగమ వాళ్ళకి క్రీస్తువులకి మటుకే ఒలుకులు ఉందంట. ఒలుకులు కోసమే మతం మారాల్సి వచ్చిందట. ‘ఒలుకులు’ అనే మాట తొండ మండలపు తెలుగు. ఆ మాటకు వల్లకాడు అని అర్థం. బతుకుకోసం మతం మారడం సరే చావుకోసం మారడం వింతగా
లేదా! మతం మారడం వలన వీళ్ళు ఎదిగినారు. సొంత ఇళ్ళూ, నేలలూ వచ్చినాయి. నాగరికత పెరిగింది. బిడ్డలను బడికి పంపుతున్నారు. బాగానే ఉంది కానీ మెల్లమెల్లగా తమ మూలాలను మరచిపోతున్నారు. వాళ్లకే సొంతమైన పండుగలూ పబ్బాలూ ఆచారాలూ ఆటలూ పాటలూ దాదాపుగా కనుమరుగయినట్లే. వాళ్ళ పాతతీరున పెండ్లి చేసుకొనేటప్పుడు ఆడవాళ్ళు అందంగా అలంకరించుకొని చిత్రమైన చీరకట్టుతో ఒక నృత్యం చేసేవారు.
పాతకాలపు ఫొటో ఒకటి చూపించి అందులో కనిపిస్తున్న ఆ నృత్యాన్ని గురించి వివరించినారు. ఇప్పుడు పెండ్లిండ్లు బుద్ధాగమమో, క్రైస్తవం తీరులోనూ జరుగుతున్నాయి. ఆ తెలుగాట ఆగిపోయింది.
ఎర్రన్న నాగసారం ఊది పామునాడించి చూపినాడు. ఈ నాగసారాన్ని చెయ్యడానికి కావలసిన చెట్టు కేవలం వీళ్ళ పల్లెల్లోనే ఉంటుంది. ఆ చెట్టు విత్తులను ఏకాలంలోనో లంకకు వలస పోయేటప్పుడు వాళ్ళ తొలితావరం నుంచి తీసుకొనిపోయినారట. శ్రీలంకకు ఎప్పుడు వచ్చినారు అని అడిగితే 70 ఏండ్ల ఎర్రన్న చెప్పిన బదులిది. ‘మాయబ్బడు, వాళ్ళ అబ్బడు, అబ్బని కబ్బడు అందరూ సిర్లంక వాళ్ళే. ఎప్పుడొచ్చింది చెప్పేకి అయ్యేలే’. ఆ నాగసారపు చెట్లను హేమాద్రి గారిలాంటి చెట్ల శాస్తవ్రేత్తలు పరిశీలిస్తే వాళ్ళ తొలితావును కనిపెట్టవచ్చునేమో! వాళ్ళున్నచోట తమిళ చానళ్ళు వస్తున్నాయి. ఇంటిల్లిపాదీ కూచుని తమిళ సినిమాలను బాగా చూస్తుంటారు. తమిళ నటీనటులు బాగా పరిచయం. తెలుగు నటీనటుల గురించి వాళ్ళెరుగరు. అడగగా అడగగా ఒకతను మటుకు ‘సురంజీవి తెలుసు’ అన్నాడు. ఎన్టీఆర్ తెలుసా అంటే ‘ఆ తాత సచ్చిపోయె గదా’ అన్నాడింకొకతను. మన బాసకు ఆకృతులు ఉండాయా అని ఆసక్తిగా అడిగినాడు ఎర్రన్న. ఆకృతులంటే అక్షరాలు. రామాయణంలోని లంకను కాల్చే కతను చెప్పినాడు. వాళ్ళమ్మ పాడిన జోలపాటను పాడి వినిపించినాడు.
నన్ను ‘నువ్వు పాములోడివా కోతులోడివా?’ అని ప్రశ్నించినారు. ఇక్కడి కులాలను వివరించి చెబితే కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. వాళ్ళకు తెలిసింది, తెలుగువాళ్ళంటే పాములవాళ్ళు, కోతులవాళ్ళు... అంతే.
శ్రీలంకలో పాములవాళ్ళకంటే కోతులవాళ్ళు ఎక్కువున్నారట.
బట్టికలోవ ప్రాంతంలో కోతులవాళ్ళున్నారని ఎర్రన్న చెప్పినాడు. బట్టికలోవకు పోదామని ప్రయత్నించాను గాని
బట్టికలోవ ప్రాంతంలో కోతులవాళ్ళున్నారని ఎర్రన్న చెప్పినాడు. బట్టికలోవకు పోదామని ప్రయత్నించాను గాని
అక్కడి ప్రభుత్వం అనుమతించలేదు. పాములోళ్ళు పుట్టినప్పటి నుంచీ చనిపోయేంతవరకూ వాళ్ళు కార్యాలు ఏమేమి ఎట్లెట్ల చేస్తారో ఎర్రన్న విశదంగా చెప్పినాడు. ఆంధ్ర దేశంలో ఎట్లా చేస్తారని అడిగి తెలుసుకొన్నారు.
నేను వాళ్ళనొక కీలకమైన మాట అడిగినాను. తెలుగును ఇంక ఎంతకాలం నిలబెట్టుకోగలరు అని? నలభై యేండ్ల తిమ్మన్న, ‘మా మాట పొయ్యేలే, అల్లనే ఉండు’ అని బదులిచ్చినాడు. వెంటనే డెబ్బయేండ్ల ఎర్రన్న అందుకొని, ‘ఏల పొయ్యేలే, నిన్న ఆట పొయ్యింది నేడు పాట పొయ్యింది రేపు మాట కూడా పోతాది’ అన్నాడు. ఎర్రన్న చెప్పింది నిజం. బాసంటే ఇంటమాటాడుకొనే నాలుగయిదు మాటలే కాదు, అంతకుమించి ఇంకేదో ఇంకెంతో ఉంది అని ఎర్రన్న చెప్పకనే చెప్పినాడు. ఎర్రన్నకున్నఇంగితం ఆంధ్రదేశంలోని కొందరు తెలుగు పెద్దలకు లేదెందుకనో. తెలుగు కనుమరుగు కాబోతున్నదని ఎవరైనా అంటే ఈ పెద్దలు విరుచుకుపడుతున్నారు. చివరగా అహికుంటికలు నన్ను కోరిన నాలుగు కోరికలను మీ ముందుంచుతున్నాను.
(1) టీవీల్లో తమిళ పటాలు వచ్చినట్లు తెలుగు పటాలూ వచ్చేటట్లు చేస్తారా?
(అంటే ఒక తెలుగు ఛానెల్‌ని అడుగుతున్నారు)
(2) పాముకాటుకు పనికివచ్చే మందుచెట్లు మనసీమలో ఉంటే ఆ విత్తులు పంపిస్తారా?
(3) తెలుగు ఆకృతుల (అక్షరాల)ను మాకు చెప్పిస్తారా?
(4) మా పిల్లలను తోడుకొనిపోయి మనసీమను సూపిచ్చి పంపతారా?
గమనించినారా... తెలుగు నేలను వాళ్లింకా ‘మనసీమ’ అంటున్నారు. ఆ మనదనాన్ని
(అంటే ఒక తెలుగు ఛానెల్‌ని అడుగుతున్నారు)
(2) పాముకాటుకు పనికివచ్చే మందుచెట్లు మనసీమలో ఉంటే ఆ విత్తులు పంపిస్తారా?
(3) తెలుగు ఆకృతుల (అక్షరాల)ను మాకు చెప్పిస్తారా?
(4) మా పిల్లలను తోడుకొనిపోయి మనసీమను సూపిచ్చి పంపతారా?
గమనించినారా... తెలుగు నేలను వాళ్లింకా ‘మనసీమ’ అంటున్నారు. ఆ మనదనాన్ని
వదలలేదు. ఆ ‘మనసీమ’లో చస్తే పూడ్చిపెట్టుకోడానికి చేరెడు నేలను కూడా
వాళ్ళడగలేదు. మనసీమను కండ్లారా ఒకసారి వాళ్ళ బిడ్డలకయినా చూపమంటున్నారు.
మన ఆకృతులను అక్షరాలను వాళ్ళు వాళ్ళలో నిలుపుకోవాలనుకొంటున్నారు.
మనసీమలోని ఆటపాటలలో మాటలలో బతుకులలో - అది టీవీ ద్వారానైనా సరే - మునిగి
తేలాలనుకొంటున్నారు. ఒకటి కావలనుకొంటున్నారు.
మనం ఆపాటి కూడా చేయలేమా?
మనం ఆపాటి అయినా చేయగలమా?
మనం ఆపాటి కూడా చేయలేమా?
మనం ఆపాటి అయినా చేయగలమా?
- సుబ్బారెడ్డి అడపా
అంధ్ర భూమి దినపత్రిక " నుడి " శీర్షిక సౌజన్యంతో..
naakem raayalo teleedam ledu idi chadivaaka
ReplyDeleteనిజమేనండి. . వాళ్ళు కోట్ల రూపాయలు ఏమీ అడగలేదు. ఈ నేలను చూడాలన్న వాళ్ళ కోరిక అభినందనీయం. ఇక్కడ చాలామందికి మాతృ భాష అన్నా, మాతృభూమి అన్నా అభిమానం లేదు. అక్కడివాళ్ళు ఇంకా తెలుగు గుర్తు పెట్టుకోవటం గొప్ప విషయం....
ReplyDeleteగుండెల్ని హత్తుకొనేలా ఉంది. వీరి కోసం మనం ఏదైనా చెయ్యగలమా? దూరతీరాన మన భాష ని ఇన్నాళ్ళు నిలుపుకుంటూ వచ్చిన ఈ అమాయక సోదరులు తెలుగు తల్లి నిజమైన బిడ్డలు. మీరు ఆ వీడియో ని పోస్ట్ చెయ్యగలరా?
ReplyDeleteచాలా బాగుంది..కర్నాటక తెలుగు వారు కూడా.. వచేదిలే పోయేదిలే అంటారు..మాట పోయిన తరువాత ఆలోచన కూడా పోయి భాష కనుమరుగౌతుంది. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, తెలుగుని బతికించాలంటే దానిని ఒక తీవ్రవాదం తరహాలో దానిని చేపట్టాలి.
ReplyDeletesir, could you pl give me Sam.vem.Ramesh garu email id. please share it to my email id given?
ReplyDeleteintaaraku teliyani kotta vishayam telisindi.Thanks.
ReplyDeleteచదివితే మనసు ఏదో అయిపోయింది.మీరు తీసిన విడియో అంతా గాని వీలు కాని పక్షంలో ఎడిట్ చేసి కొంతైనా ,షేర్ చేసుకోగలరా? ఎందుకంటే వారి మాటలూ వేషధారణా ఎలాఉన్నాయో చూస్తే గాని తెలీదు కదా? నా లాగే ఎందరికో ఈ విషయం లో కుతూహలం ఉంటుంది.అందరూ సంతోషిస్తారు కదా?
ReplyDeleteదూరదర్శన్ డి.టి.హెచ్. ద్వారా వాళ్ళు మన హైదరాబాద్ సప్తగిరి చానల్ ను పూర్తి ఉచితంగా చూడవచ్చు. మీకు వారితో ఇంకా లింక్ కొనసాగుతుంటే ఆ విషయం తెలియజేయండి. వాళ్ళ పిల్లలు నేర్చుకోవాల్సిన సంగతులెన్నో (టెలిస్కూల్ లాంటివి)ప్రసారం చేస్తున్నాం.
ReplyDelete