వ్యవసాయ ప్రధానమైన పండుగగా ప్రసిద్ధిచెందిన సంక్రాంతి- భారతీయ రైతుల జీవన విధానంతో ముడివడి ఉంది. రైతన్న ప్రకృతిలోనే సుఖదుఃఖాలను పొందుతాడు. ఆడుతూపాడుతూ ఆనందిస్తాడు. పంటవేసి, కలుపుతీసి, కోతకోసి, ధాన్యం ఇంటికి రాగానే అతని పాదాలు ఆనందనాట్యం చేస్తాయి. ఉత్సవం జరుపుకోవడానికి ఉత్సాహపడతాయి. ఈ సందర్భమే భోగి- సంక్రాంతి, కనుమలు.
నెల రోజులనుంచి గోపాలకృష్ణుని లీలావిలాసాలను గోపిక గీతలుగాను, తిరుప్పావైగాను సూర్యోదయానికి ముందే గానంచేసి, ప్రతిరోజూ చక్కెర పొంగళి నైవేద్యాలు పెట్టిన తరవాత భోగినాడు పరవశిస్తారు. తమకు తోడుగా నిలిచిన ఎద్దులను పంచవర్ణ శోభలతో అలంకరించి, తలకు నెమలి పింఛాల కిరీటాన్ని కట్టి పూజిస్తారు. సాక్షాత్తు పరమశివుని వాహనమైన నందీశ్వరుని ఆరాధిస్తారు. హరిదాసుల భగవన్నామ సంకీర్తనలకు పొంగిపోయి కొత్త ధాన్యాన్ని కొంత సమర్పిస్తారు. తమ పిల్లలకు గాలిపటాలిచ్చి ఆకాశంలోకి ఎగురవేయిస్తారు. కూతురుని అల్లుణ్ని ఇంటికి పిలిచి, ఆదరించి కట్నకానుకలతో సన్మానిస్తారు. కొడుకులు, కోడళ్ళతో కలిసి విందు భోజనాలు ఆరగిస్తారు. ఆడపిల్లలు గోరింటాకుతో తమ కరకమలాలను, పారాణితో చరణాంబుజాలను శోభింపచేసుకొంటారు. పట్టువస్త్రాలతో ప్రభలు జిమ్ముతారు. మామిడి తోరణాల అలంకరణలతో, మహిమోపేత మంత్ర పూజలతో, తరింపజేసే దానధర్మాలతో, రుచింపజేసే చోష్యలేహ్యాలతో పండుగ పరవశిస్తుంది. భోగభాగ్యాలు పొంది 'భోగి'ననిపించుకొంటాడు. ఆనందానికి మించిన స్వర్గం ఇంకేముంటుంది. అదే భోగి పరమార్థం.
సూర్యుడు ఆదిపురుషుడు. అందుకే సూర్యనారాయణమూర్తి అంటారు. సూర్యుడు ప్రతినెలా ఒక రాశిలో సంచరిస్తాడు. ఆ రాశులలో అర్ధాంశ సంచారంతో రాశి షట్క 'భోగం' పొందిన కాలాన్ని 'అయనం' అంటారు. కర్కాటకం నుంచి ధనుస్సు వరకుగల ఆరు రాశులను దాటి మకరరాశిలో ప్రవేశించటమన్నమాట.
కర్కాటకం నుంచి ధనుస్సు వరకు సూర్య సంచారకాలం దక్షిణాయనంగాను, మకరంనుంచి మిథునం వరకు ఉత్తరాయణంగాను వ్యవహరిస్తారు. ఇలా అన్ని రాశుల్లో సంచరించే సమయంలో శీఘ్రగతి, మందగతి, సమగతి అనే త్రివిధ సంచార విశేషాలు ఏర్పడ్డాయి. మేష, తులారాశుల్లో రాత్రింబవళ్ళు సమంగాను- వృషభ, మిథున, కర్క, సింహ, కన్యలలో రాత్రి ఒక ఘడియ తక్కువగాను, వృశ్చికాది ఐదు మాసాలు ఒక్కొక్క ఘడియ అధికంగాను, దానికి తగినట్లుగా పగటి వేళ సంచరిస్తాడు. ఇలా ఏక పంచాశదుత్తర నవకోటి యోజనాల పరిమాణంగల మానసోత్తర పర్వతంలో సూర్యరథం తిరుగుతుంది. నెలకొకసారి సంక్రమణం జరుగుతుంది.
సూర్యుడు మకర సంక్రమణం చెందే సమయం ఎంతో పవిత్రమైంది. అంతకంటే ముందురోజు 'భోగి' పండుగ జరుపుకొంటారు. పురాతన పరంపరనుంచి కొత్తదనంలోనికి పరిణతి చెందడమే సంక్రమణం. పాత వ్యవస్థలోని చెడును మంటల్లో కాల్చి, సజీవతత్వాన్ని మాత్రం గ్రహించి, సమాజంలో గుణాత్మక పరివర్తనం చేయటమే 'భోగిమంటలు'. భోగిరోజున ఉదయమే ఇళ్లముందు కూడళ్లలో మంటలు పెట్టి, పాత వస్తువులను అందులో కాల్చి బూడిద చేస్తారు. వ్యక్తిగత సంవత్సరంలో తెలియక చేసిన చెడు పనులేమైనా ఉంటే వాటిని తమ నుంచి దూరంచేసి, నవోదయ స్వర్ణకిరణాల వెలుగులో ముందుకు నడుస్తారు.
భోగ్యమంటే ధనం, ధాన్యం మొదలైనవి. వీటిని భూమి ఇస్తుంది. ధాన్యాదుల్ని ఉత్పత్తిచేస్తుంది కనుక భూమి- కోరిన పదార్థాలనిచ్చే కామధేనువు. అలా లభించిన భోగ్యాలను అనుభవించేవాడు భోగి. ఆ విధంగా లభ్యమైన పదార్థ సేవనంతో ఆరోగ్యం, పుష్టి, ఆయువు, శాంతి, ఆనందం కలుగుతాయి. ఈ సంతోషమే సంక్రాంతినాడు జరుపుకొనే పండుగ. ఇదంతా సూర్య భగవానుని వరం.
భోగి రోజున ఇంటిని అలంకరించి, వాకిట్లో సప్తవర్ణాల్లో రథాల ముగ్గులుపెట్టి, వాటిలో గొబ్బెమ్మలను ఏర్పాటుచేసి, రవిని మకరరాశి లోనికి ఆహ్వానిస్తారు మహిళలు. సూర్యుడు, అగ్ని, భోగాన్ని స్వీకరించే దేవతలు. వేదకాలంనుంచి అగ్నిని, సూర్యుణ్ని ఆరాధిస్తున్నాడు మానవుడు. అది ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరుతో జరుగుతోంది. పంజాబ్లో 'లోహడీ' అని, అరుణాచల్ ప్రదేశ్లో పానుజ్ఞ్ అని, దక్షిణాదిలో భోగి అని అంటారు. మరుసటి రోజును సంక్రాంతిగాను, తిల్గుడ్గాను, పొంగల్గాను వ్యవహరిస్తారు.
భోగిరోజున పిల్లలకు భోగిపళ్లు (రేగుపళ్లు) తలపై పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పిల్లల మెళ్ళో పంచదార చిలకల మాలలు వేస్తారు. ముఖ్యంగా సంక్రమణానికి ముందు పొట్టలో వికారాలు లేకుండా ఉండటానికి నువ్వులతో తయారుచేసిన చకిలాలు (చక్రాలు), అరిసెలు, రేవడియాఁ (నువ్వుల లడ్డూలు) అందరూ భుజిస్తారు. పంజాబ్లో 'లోహడీ' అంటే చిన్న సంక్రాంతి అన్న అర్థం ఉంది. ఆరోజు వారు తమ ఇంటిముందు వాకిట్లో కర్రలు, పుల్లలు వేసి సాయంకాలం 'లోహడీ మంటలు' పెట్టి, కొత్తగా ఇంటికివచ్చిన మక్క ధాన్యాన్ని అందులోవేసి 'పేలాలు' తయారుచేసి, ప్రేమతో అందరికీ పంచుతారు.

- డాక్టర్ మాడుగుల భాస్కరశర్మ