తెలుగు భాషోద్యమ సమాఖ్య పతాకం |
డిసెంబర్ 1,2 తేదీల్లో గుంటూరులో తెలుగు భాషోద్యమ సమాఖ్య వార్షిక సభలను నిర్వహించబోతోంది. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలోని బాలాజీ కల్యాణమండపంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సభలకు సమాఖ్య అధ్యక్షుడు సామల రమేశ్‌బాబు అధ్యక్షత వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీన 10 గంటలకు సభలను శాసనమండలి సభ్యులు డాక్టర్ చుక్కారామయ్య ప్రారంభిస్తారు. ముఖ్య అతిథిగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, విశిష్ట అతిధిగా మాజీ డిజిపి సి.ఆంజనేయ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక మండలి సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి పాల్గొంటారు. ప్రత్యేక అతిథిగా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ఆత్మీయ అతిధిగా కె.ఎస్.లక్ష్మణ్‌రావు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు డాక్టర్ కె.శ్రీనివాస్ పాల్గొంటారని సమాఖ్య అధ్యక్షుడు సామల రమేష్‌బాబు, ప్రధానకార్యదర్శి వెన్నిశెట్టి సింగారావులు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు ప్రతినిధుల సభలను డాక్టర్ జయధీర్ తిరుమల రావు ప్రారంభిస్తారని, తెలుగుభాషోద్యమ సమాఖ్య ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై మూడు గంటల పాటు జరిగే చర్చలో ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెబుతారని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల పట్ల సమాఖ్య వైఖరిని, చేపట్టదలచుకున్న కార్యక్రమాన్ని నిర్ణయించి తీర్మానాలు చేస్తామని వారు చెప్పారు. డిసెంబర్ 2వ తేదీన ప్రభుత్వానికి భాషా విధానం- ప్రజల్లోకి భాషోద్యమం అనే అంశంపై సదస్సులను నిర్వహిస్తామని సమాఖ్య ఉపాధ్యక్షురాలు డాక్టర్ పోలవరపు హైమావతి కీలక ఉపన్యాసం చేస్తారని అన్నారు. రాజకీయ రంగం నుండి ఎస్ తులసిరెడ్డి, దాడి వీరభద్రరావు, జూలకంటి రంగారెడ్డి, డాక్టర్ కె.నారాయణ, బండారు దత్తాత్రేయ, భూమన కరుణాకర్‌రెడ్డి, డివిఎస్ వర్మ పాల్గొంటారని, ఉపాధ్యాయ రంగం నుండి ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ సంఘం నాయకులు కె.సుబ్బారెడ్డి, పి.పాండురంగవరప్రసాద్, చామర్తి శంకరశాస్ర్తీ పాల్గొంటారని అన్నారు. ముగింపు సభలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కోదాటి వియన్నారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు వివరించారు.