Monday, February 22, 2010

తెలుగు భాష కోసం ఉద్యమిద్దాం! రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి

మైదుకూరు, ఫిబ్రవరి 21: తమ మాతృభాష పరిరక్షణ కోసం తెలుగు వారమంతా ఉద్యమించ్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి పిలుపిచ్చారు. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన ధర్నా కు ఆయన అధ్యక్షత వహిస్తూ తెలుగు భాష పరిరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. మైదుకూరులోని సెయింట్ జోషెఫ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో తెలుగు భాష కు అవమానం జరిగిన సంఘటన పై ఎలాటి చర్యలను తీసుకోక పోవడమే ఇందుకు తార్కాణమని ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలుగును అధికార భాషగా సంపూర్ణంగా అమలు చేయాలని, తెలుగుకు ప్రాచీన హోదాను కల్పించడంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే చర్యలను చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషను, సంస్కృతిని రక్షించేందుకు శాశ్వత సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని, తెలుగు శాస్త్రసాంకేతిక రంగాల్లో వినియోగించేందుకు వీలుగా నిపుణులతో భాషా ఆధునీకరణ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని తవ్వా ఓబుల్ రెడ్డి కోరారు. రాయలసీమ పౌర హక్కుల సంఘం కన్వీనర్ ఎం.జె. సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అందరి మాతృభాషలను గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరారు. పత్రికా సంపాదకుడు వి.టి.ఎస్. నరసిం హాచారి మాట్లాడుతూ తమిళ కన్నడ భాషల అభివృద్దికి ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వపరంగా జరుగుతున్న కృషిని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదర్షంగా తీసుకోవాలని కోరారు. బి.జె.పి. రాష్ట్ర నాయకుడు ప్రతాప్ మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయలు స్ఫూర్తితో తెలుగు భాషాభివృద్ధి కై కృషి జరగాలన్నారు. సి.పి.ఐ. నేత రమణ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వకార్యాలయాల్లో తెలుగు లోనే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ప్రజాపక్షం కన్వీనర్ గోశెట్టి వెంకట రమణయ్య, యువజన విద్యార్థి సమాఖ్య నాయకులు పి. భాస్కర్, వై. శ్రీరాములు ఉపాధ్యాయ నాయకులు ఎం.వి.భాస్కర్ రెడ్డి, వై. అంకన్న, తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రతినిధులు ఎ. వీరాస్వామి, ధర్మిసెట్టి రమణ,ఎం. వెంకట సుబ్బయ్య, పి. బాబయ్య, తమిదేపాటి వెంకటేశ్వర్లు, రైతు నేత డి.ఎన్.నారాయణ అంకిరెడ్డి పల్లి నారాయణ రెడ్డి, గురప్ప, తెలుగు భాషాభిమానులు లెక్కల శ్రీనివాసుల రెడ్డి, మహానందప్ప, బి.సి.సంఘం నేత సందిళ్ళ బాలసుబ్బయ్య యాదవ్, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment