Friday, September 30, 2011

అంతర్జాలంలో తెలుగు వైభవానికి చర్యలు: మంత్రి పొన్నాల

ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అనే విధంగా తెలుగు భాష ఖ్యాతిని నలుదిశలా విస్తరింపజేయడానికి అందరూ కృషి చేయాలని న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, ప్రవాసాంధ్ర ప్రముఖుడు చివుకుల ఉపేంద్ర పిలుపునిచ్చారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్‌లో జరుగుతున్న 'అంతర్జాలంలో తెలుగు ఆంతర్జాతీయ సదస్సు' సందర్భంగా ఏర్పాటైన విందు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి ఇక్కడి ప్రవాసాంధ్ర తెలుగు సంఘాలు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. భాషా సంస్కృతులను పరిరక్షించడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అంతర్జాలం(ఇంటర్నెట్‌)లో తెలుగు వైభవాన్ని చాటడం కోసం తొలిసారి సదస్సును అమెరికాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భాషాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ..
ఇకనుంచి అంతర్జాలంలో తెలుగు వైభవం కనిపించనుందని, దీనికోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తొలి సదస్సును నిర్వహించడానికి చొరవ చూపిన సిలికానాంధ్ర సంస్థను ఆయన అభినందించారు. రెండో అంతర్జాతీయ సదస్సును వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించడానికి గీతమ్‌ విశ్వవిద్యాలయం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.

కూచిపూడి నాట్య విశిష్టతను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ చెప్పారు. ఈ నాట్యానికి పుట్టినిల్లయిన కృష్ణాజిల్లా కూచిపూడిలో రెండెకరాల విస్తీర్ణంలో కూచిపూడి వారసత్వకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలుగులో అందమైన ఫాంట్ల(అక్షరశైలి)ను రూపొందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగు అభివృద్ధికి, ఈ భాషను అభ్యసించిన వారికి ఉపాధి కల్పించడంకోసం రానున్న రెండేళ్లలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. సమాజ సేవా కార్యక్రమాల కోసం తాను ఇప్పటివరకు దాదాపు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చానని ప్రవాసాంధ్ర ప్రముఖుడు లక్కిరెడ్డి హనిమిరెడ్డి చెప్పారు. రెండు తెలుగు ఫాంట్లను రూపొందించడానికి అయ్యే ఖర్చు రూ.12 లక్షలను విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, రాష్ట్రేతరుడు సంజయ్‌జాజు 'నా అటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌' సినిమాలోని గుర్తుకొస్తున్నాయి.. అనే పాటను పాడి సభికులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఈనాడు జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎం.నాగేశ్వరరావు, టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఆవుల మంజులత, అనుమాండ్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
-ఈనాడు 

Tuesday, September 13, 2011

విశాఖలోతెలుగు సాంస్కృతిక మ్యూజియం

విశాఖపట్నం: తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచే ఓ మ్యూజియం విశాఖలో రూపుదిద్దుకోబోతోంది. తెలుగు సాంస్కృతిక నికేతనం పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ మ్యూజియంలో జాతి సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి వివిధ ఘట్టాలను ఉంచబోతున్నారు. శాతవాహనుల కాలం నుంచి ఇప్పటి వరకూ ఉన్న తెలుగు వారి ప్రాభవం ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా వివరించబోతున్నారు. స్థానిక కైలాసగిరిపై ఈ మ్యూజియం నిర్మాణానికి 2005లోనే శంకుస్థాపన చేశారు. ఐదు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియం నిర్మించడానికి వరల్డ్ తెలుగు ఫెడరేషన్ (డబ్ల్యుటిఎఫ్), విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఎంఓయును కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కైలాసగిరిపై సుమారు 1.20 కోట్ల రూపాయల విలువైన భూమిని వుడా ఈ మ్యూజియం కోసం కేటాయించింది. మిగిలిన 3.80 కోట్ల రూపాయలను డబ్ల్యుటిఎఫ్ ఇచ్చేందుకు నిర్ణయించింది. పర్యాటకంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో ఈ మ్యూజియంను నిర్మిస్తే, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి తెలుగు భాషా ప్రాచుర్యాన్ని, తెలుగు వారి వైభవాన్ని వివరించడానికి వీలవుతుందని నిర్ణయించి ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. తొలుత ఐదు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకున్నారు., కానీ ఈ వ్యయం సుమారు 10 కోట్ల రూపాయల వరకూ పెరిగింది. అత్యంత కళాత్మంగా ఈ మ్యూజియం నిర్మాణం సాగుతోంది. భవన నిర్మాణం దాదాపూ పూర్తికావచ్చింది. ఈ మ్యూజియంలో తెలుగు జాతి చరిత్రను వివరించేందుకు 35 ఎపిసోడ్‌లను రూపొందిస్తున్నారు. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ హాల్‌లో సుమారు గంటసేపు సాగే ఒక్కో ప్రదర్శనలో తెలుగు చరిత్రను శిల్పాలు, సౌండ్ షో ద్వారా ప్రేక్షకులకు వివరించబోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాషలో కూడా వివరించనున్నారు. ఇందులో మొత్తం 35 ఘట్టాలు ఉంటాయి. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి శిల్పాలను రూపొందించే బాధ్యతలను సోమవారం అప్పగించారు. అలాగే సి.నారాయణరెడ్డి అధ్యక్షతన నలుగురు నిష్ణాతులైన తెలుగు కవులకు స్క్రిప్ట్ రాసే బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఈ మ్యూజియంను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. కేరళలో కన్నడ మ్యూజియంను కూడా ఇక్కడి అధికారులు సందర్శించి వచ్చారు. దానికి పది రెట్లు మన మ్యూజియం ఉంటుందని ఈ మ్యూజియం నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న డబ్ల్యుటిఎఫ్ ప్రాంతీయ చైర్మన్ యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతాల చరిత్రకు సంబంధించి ఇంత పెద్ద మ్యూజియంలు లేవని ఆయన చెప్పారు.

-ఆంధ్రభూమి దినపత్రిక