1. ద్రావిడ భాషలన్నింటిలోకి తెలుగు మధురాతి మధురమైన భాష
-హెన్రీ మోరీస్ (1890)
2.తెలంగా, తెలింగా, తెలాంగ్ అనేవి జాతికి, భాషకి, లిపికీ పేర్లు. తెలుంగులు వ్రాసే
లిపిని ఆంధ్రీ లిపి అంటారు.
- అల్ బెరూని (కీ.శ.1014)
3.తెలుగు భాష తూర్పు దేశాలలో ఇటలీ లాంటిది. -(నికొలా కాంటె - 1420)
4. తెలుగు లిపి ఒరియా లిపి లాగా గుండ్రంగా వుంటుంది. గంటంతో అడ్డగీతలు
గీస్తే తాటాకు చినిగిపోతుంది కాబట్టి గుండ్రంగా రాసేవాళ్ళు. - జె.డి.అండర్‌సన్ (1913)
5.దేశ భాషలందు తెలుగు లెస్స
-శ్రీకృష్ణదేవరాయలు
6.తెలుగు కష్టమయిన భాషేకానీ, సంస్కారయుతమైన భాష. భావాలను సొంపుగా, సౌలభ్యంతో చక్కగా వ్యక్తం చేయవచ్చు.
- విలియం కేరీ (1814)
7.శబ్ద సంపదలో,
శబ్ద సౌష్టవంలో,
భావ వ్యక్తీకరణలో,
శ్రావ్యతలో తెలుగుతో మిగతా దేశ భాషలు సాటి రావు. వీనుల విందుగా
వుండబట్టే తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అన్నారు. తెలుగు భాష అభివృద్ధి చెందుతున్న కొద్దీ తనకు దగ్గరగా వచ్చే చాలా
శబ్దాలను ఆయా ప్రాచీన కావ్య భాషలనుండి గ్రహించింది కాబట్టి ‘ఇంగ్లీష్ ఆఫ్ ద ఈస్ట్’ అనవచ్చు. సంస్కృతం తనంతట తానుగా వాడుక
భాష కాలేకపోయింది. కానీ సరళమైన,
సులభమైన తెలుగు భాష ద్వారా సంస్కృతం వాడుకలోకి వచ్చింది. -ఎ.ది.క్యాంప్‌బెల్ (1816)
8. అన్ని ప్రాంతీయ భాషల కంటె తెలుగు భాష మధురమైనది. - మూల్ బెర్నెల్ (1837)
9.తెలుగు భాషలో అచ్చులు ఎక్కువగా వుండటంవలన ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అనే పేరు వచ్చింది.
- మోనియల్
విలియమ్స్ (1878)
10.ద్రావిడ భాషల్లో తెలుగే అతిమధురమైనది, ప్రాచీనతలో రెండవది.
-రెవరెండ్ రాబర్ట్ కాల్‌వెల్ (1857)
11.తెలుగు వీనులకు విందు. ద్రావిడ భాషలన్నింటిలోకి మధురాతి మధురమైనది.
చదువురానివాడు మాట్లాడినా చెవులకింపుగా వుంటుంది. దీనిని ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అనడం ఎంతో సమంజసం.
-హెన్రీ మోరీస్ (1890)
12. తూర్పు దేశాలలో తెలుగు భాష అతి
మృదువైన భాష. తెలుగువారి సంస్కృతోచ్ఛారణ కాశీవాసుల సంస్కృతోచ్ఛారణలాగా వుంటుంది.
-మాన్యువల్ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్, మద్రాసు (1893)
13. ద్రావిడ భాషల్లోకెల్లా తెలుగే
శ్రావ్యమైనది. ప్రతి పదం అజంతం. అందుకే అది ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అనిపించుకుంది.
-జి.ఎ.గారిసన్ (1906)
14.తెలుగు ద్రావిడ భాషా కుటుంబంలో ఉత్తరాదిది, ఆర్యభాషా కుటుంబంలో దక్షిణాదిది.
రెంటి లక్షణాలు కొద్దిగా దీనిలో వున్నాయి. పొందికగల శక్తివంతమైన భాష, వ్యాకరణ సౌలభ్యం గల భాష. ఇతర భాషల్ని
తేలికగా తనలో కలుపుకుంటుంది. సహజంగా శ్రవణానందకరంగా వుంటుంది. పరభాషా పదాలను
ఉపయోగించినా ఔదార్యంతో అన్ని భాషలను స్వీకరిస్తుంది. దానికి సంకుచితత్వం లేదు.
-జి.హోమ్ ఫీల్డ్ మెక్‌లాయిడ్ (1958)
15. బ్రిటిష్ పరిపాలన అంతమయి ఆంధ్రులకు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డనాడు వారి భాషలోనే వారి పరిపాలనా వ్యవహారాలు
సాగించడానికి తప్పక ప్రయత్నం చేయాలి.
-ఆర్.కాల్‌ట్టెల్ (1935)
16. భారతీయ భాషలన్నింటిలోకి పరభాషా పదాలను
తెలుగు గ్రహించినంత సులభంగా మరే భాషా స్వీకరించలేదు. కాబట్టి ఎప్పటికైనా సైన్సు, మెడిసిన్, ఇంజనీరింగ్‌ల బోధనలో హిందీకి తెలుగే
ధీటైన ప్రత్యర్థి అవుతుంది. జాతీయ భాషకు కావాల్సిన అన్ని లక్షణాలు తెలుగుకు
వున్నాయి.
-జె.బి.ఎస్.హాల్‌దెన్ (1958)
17.తెలుగువారు ఐరోపా ఖండవాసులవలే నాగరికులు. వారి భాష ఇటలీలాగా
వుంటుంది.
-ఛర్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ (1857)
18.సుందరమైన తెలుగు పాట పాడుతూ సింధూ నదిలో పడవ నడుపుదాం.
-సుబ్రమణ్యం భారతి
19. ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ నాల్పస్య
తప్యఫలమ్ - అప్పయ్య దీక్షితులు
ఎంతో తపస్సు చేస్తేగానీ, ఆంధ్రదేశంలో పుట్టే అదృష్టంగానీ, ఆంధ్ర భాష నేర్చుకునే అదృష్టం గానీ
లభించదు.
20.ఏ భాష చెణుకైనా,
ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు
-డా సి.నారాయణరెడ్డి
21.దేశభక్తి అంటే మాతృభాష మీద అభిమానమే. మాట్లాడుతున్న భాషను కాదని
పరభాషను పూజించటం ఎలాంటిదంటే,
ఆకలితో అలమటిస్తున్న సాటి మనిషికి అన్నం పెట్టకుండా చనిపోయిన వారి
పేరుతో శ్రాద్ధా భోజనం పెట్టడం లాంటిది.
-గిడుగు వేంకట రామమూర్తి
22.‘తెలుగు’శబ్దానికి సంస్కృతీకృత రూపమే ‘త్రిలింగం’. -కొమ్మర్రాజు
లక్ష్మణరావు
23. ద్విభాషా నాణాలపైన గౌతమీపుత్ర
శాతకర్ణి ప్రాకృతంతోపాటు ‘తెలుగు’ను వాడాడు.
-డి.సి.సర్కార్
24.ఒక్క సంగీతమేదో పాడునట్లు, మాట్లాడునప్పుడు విన్పించు భాష తెలుగు
భాష. భాషలొక పది తెలిసిన ప్రభువు చేత భాషయన యిద్దియని అనిపించుకున్న భాష.
-విశ్వనాధ సత్యనారాయణ
25.క్రీ.శ. ఒకటో శతాబ్ది నాటి ప్రాకృతంలో వచ్చిన గాథాసప్తశతిలోని 700 పద్యాలలో తెలుగు
మూల పదాలున్నాయి.
-డా. సి.నారాయణరెడ్డి
26.పూలలోని మధువు,
పున్నమి వెనె్నల,
చిట్టిపాప నవ్వు,
పుట్ట తేనె కలిపి చూడు. తెలుగు పలుకులై భాసించు.
-డా ఆచార్య తిరుమల రామచంద్ర
27.తెనుగుదనము వంటి తియ్యదనము లేదు, తెలుగు కవులువంటి ఘనులు లేరు.
-డా కరుణశ్రీ
28.కలదయేని పునర్జన్మ కలుగుగాక
మధుర మధురంబయిన తెల్గు మాతృభాష
-విశ్వనాధ సత్యనారాయణ
29.తెలుగు పదార్చన చేసినందుకు
ధన్యుడనైతిని -తుమ్మల సీతారామ్మూర్తి
30.తెనుగుం జేయరు మున్ను భాగవతమున్
దీనిం దెనిగించి నా జననంబున్
సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్
-బమ్మెర పోతన
31.దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశానికి
వలసవచ్చి స్థానికులైన తెలుగు జాతులతో కలిసిపోయిన తమిళుల భాష కంటే, క్రీ.పూ.12వ శతాబ్దంలో ఆర్య బ్రాహ్మణులు
రూపొందించుకున్న సంస్కృతం కంటే ఎంతో ప్రాచీనమైనది మన తెలుగు భాష
-భపతి నారాయణమూర్తి
32.తెలుగు పతాకం యెరుగని దేశమే లేదు
తెలుగు దివ్వె వెలుగునట్టి దిశయే లేదు
-శ్రీ దాశరథి రంగాచార్య
33.తెలుగు దీప్తి సహస్ర కళలతో సాగినది
తెలుగు గీతి సహస్ర దిశలయందు మ్రోగినది
-డా సి.నారాయణరెడ్డి
34.తెలుగువాడు ఏడనున్నా తెలుగువాడే
తెలుగు భాషనే సొంపుగా పలుకుతాడు
-కొసరాజు రాఘవయ్య
35.తెలుగు బిడ్డవయుండి, తెలుగు రాదంచు
సిగ్గులేకా ఇంక చెప్పడమెందుకురా?
అన్య భాషలు నేర్చి, ఆంధ్రమ్ము రాదంచు
సకలించు ఆంధ్రుడా చావవెందుకురా
-శ్రీ కాళోజీ నారాయణరావు
36.తెలుగుదనం మనకు ధనం
తెలుగు భాష చరిత ఘనం
-ఎలమర్తి రమణయ్య
37.దేశ భాషలలోన
దేదీప్యమానమైన
నిత్యమై - సత్యమై
నిలిచి గెలిచిన భాష
ఎంత కమ్మని భాష మనది
ఎదను కదిపే భాష మనది
-డా మల్లెమాల
38.చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడుపెరుగు తెలుగు చక్కని పలుకుల
సొబగుల నడకల హంస హొయల తెలుగు
-జొన్నవిత్తుల
39.ఆ సరస్వతి రూపు ప్రత్యక్ష మొనరించు ప్రథమ భాష
నన్నయాదుల నుం నవయుగ కవి దాకా ఆత్మశక్తిని గూర్చు అమృత భాష
-విశ్వనాథ సత్యనారాయణ
40.తెలుగు భాష మధురమైనది. ఆ భాష నేర్చుకోవాలని నేను చేసిన ప్రయత్నం
అక్షరక్రమంతోనే ఆగిపోయింది. తెలుగువారు అమాయకులు, మధుర స్వభావులు, త్యాగనిరతులు.
-మహాత్మా గాంధీ
41. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు దెనుగు లెస్స, జగతి దల్లికంటె సౌభాగ్య సంపద మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ----శ్రీనాధ కవి
ఈ విధంగా మన తెలుగు భాషను వేనోళ్ళుగా పండితులు, ప్రముఖులు ప్రస్తుతించారు. అంతటి
ఘనకీర్తి కల్గిన మన తెలుగులో మాట్లాడుదాం, తెలుగులో రాద్దాం, తెలుగులో జీవిద్దాం. తెలుగు భాషా
పునాదులపై మన మేధోవికాసం, జీవన వికాసం పెంపొందించుకుందాం.
-మొగిలిచెండు సురేశ్
"ఆంధ్రభూమి" దినపత్రిక సౌజన్యంతో..