తమిళభాష 'ప్రాచీనత' పేరిట తీర్చిన మహాసభ (జూన్ 23-27 కోయంబత్తూరులో) విజయవంతంగా, జాజ్వల్యమానంగా ముగిసింది.
ఆరుద్ర ఒక చోట ప్రస్తావించినట్టుగా ప్రాచీన జానపద సాహితీ సంపదను రక్షించుకుని తమిళులు ప్రాచీన సాహిత్యంగల వాళ్లయ్యారు. మనవాళ్లు అంతే ప్రాచీన చరిత్ర, వాఙ్మయం కలిగి ఉండి కూడా దానిని కాపాడుకోలేక లేనివాళ్లయ్యారు. అయితే కోల్పోయింది కోల్పోగా ఏతావాతా మిగిలిన పాత వాఙ్మయం సహితం క్రీ.పూ. ఆరవ శతాబ్దానిదే కావడం విశేషం.
"భాషకు తగ్గ వేష మూ ఉండాలి' అంటా రు! కాని మన తెలుగు వాడు రెండింటిలోనూ పేలవమైపోయాడు;పైగా సిగ్గూ, ఎగ్గూ కూడా లేదు. పొరుగువాడి భాషాభిమానాన్ని, సాంస్కృతికపరమైన వాడి చైతన్యాన్ని చూసైనా నేర్చుకోవాలన్న తపన కూడా వీడికి కరువైంది. చూసిరమ్మంటే కాల్చివచ్చే వాడికన్నా చూసైనా నేర్చుకునేవాడు తెలివిగలవాడు. తమిళ నాడు ముఖ్యమంత్రి కరుణానిధి తన కొడుకూ, మంత్రీ అయిన స్టాలిన్‌కు రేపటి ముఖ్యమంత్రి పదవి అనే సోపానపటాన్ని దిద్దితీర్చుకునే మహా ప్రయత్నంలో భాగంగా తమిళభాష 'ప్రాచీనత' పేరిట తీర్చిన మహాసభ (జూన్ 23-27 కోయంబత్తూరులో) విజయవంతంగా, జాజ్వల్యమానంగా ముగిసింది.
ఈ సందర్భంగా ప్రాచీన ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటైన తమిళ భాషకు, తమిళుల విశిష్ట సంప్రదాయాలకు, చరిత్రకు వారసులైన నేటి తమిళ ప్రజలందరికీ శుభాభినందనలు తెల్పడంతో పాటు ప్రాచీన తమిళ మహాసభలో కరుణానిధి, ఆయన సత్కారం అందుకున్న ఒక విదేశీ చరిత్రకారుడూ పేల్చిన కొన్ని అవాకులకు, చవాకులకూ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది! తన భాష గొప్పతనాన్ని చెప్పుకోవడం వేరు, తన భాష తప్ప ఇతర భాషలకు చరిత్రలేదని, ప్రాచీనతలేదనీ చెప్పడానికి సాహసించడం వేరు! ఈ విషయంలో తమిళ మహాసభ ఎన్ని స్కోత్కర్షలతో ముగిసినా, తమ భాషాసంస్కృతులను, వాటి ప్రాచీనతను మరచి పోతూ చిరునామా చెరుపుకుంటున్న తెలుగువారికి ఆ సభ గుణపాఠం కావాలి.
తమిళాన్ని విదేశాల్లో ప్రమోట్ చేయించుకుని, అత్యంత ప్రాచీన భాషలైన గ్రీకు, లాటిన్, సంస్కృతాలతో సమఉజ్జీగా నిలబెట్ట డానికి ప్రొఫెసర్ జి.ఎల్.హార్డ్ అనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ దక్షిణాసియా చరిత్రాధ్యయనశాఖ అధికారి ద్వారాను, అలాగే సింధు లిపిని, ద్రావిడ చరిత్రాధ్యయనం ప్రాతిపదికగా పరిశీలించిన భారత దేశ చరిత్రాధ్యయన కర్త అయిన ఆస్కో పర్పోలా ద్వారాను "ప్రపంచ భాషలలో తమిళమే ప్రాచీనమని చెప్పించడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగు తున్నాయి. కాని విచిత్రమేమంటే ఈ ఇద్దరు విదేశీ ప్రొఫెసర్లు భాషాశాస్త్రంతో సంబంధం లేనివారే, భాషా శాస్త్రవేత్తలు కానివారే! కొందరు తమిళ పాలకులు భాషను రాజకీయం చేయడంలో అంతర్భాగంగా 'తాటితోనే దబ్బనం' దూర్చినట్లుగా భాషాశాస్త్రంతో బొత్తిగా సంబంధంలేని విదేశీ ఆచార్యోత్తముల ద్వారా 'ప్రపంచ భాషలలో తమిళమే' గొప్పదని చెప్పించడం లో సఫలీకృతులయ్యారు.
అయితే, అందుకు మనం నొచ్చుకోవలసిన పని లేదుగాని ద్రావిడ భాషా కుటుంబంలో సమ ప్రతిపత్తితో వందేళ్లు అటూ ఇటుగా స్వతంత్రంగా ఎదుగుతూ వచ్చిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో తమిళానికి ఉన్న 'ప్రత్యేక ప్రతిపత్తి' ఏమిటో తెలుసుకోవాలంటే తమిళనాడు ప్రభుత్వం విద్యాశాఖ విడుదల చేసిన ఒక ఉత్తర్వు చూడాలి. అందులో ఆ భాష పూర్వాపరాల గురించి ఇలా ఉంది. "భూమి పుట్టకముందే, భూమిపైన రాయీరప్పా పుట్టకముందే తమిళభాష పుట్టింది' కాలాన్ని మానవమాత్రుడెవడూ గుర్తించలేనంత వెనక్కి నడిపించగల మూర్ఖశిఖామణులకు ఈ దేశంలో కొదవలేదు. అయితే అటువంటి వారిలో తమిళులది అగ్రస్థానం అని ఈ మాట రుజువుచేస్తోంది.
తమిళసభలో 'ప్రాచీన తమిళ పురస్కారం' అందుకోవడానికి కరుణానిధి 'ఆహ్వానం'పై వచ్చిన ప్రొఫెసర్ పర్పోలా పురస్కారానికి స్పందిస్తూ చేసిన ప్రసంగంలో కొన్ని వైరుధ్యాలున్నాయి. అవి- 1) "ఎంతో కొంత గర్వించగల హక్కు తమిళులకు ఉంది. కాని సుసంపన్నమైన వారసత్వంగల భాషలలో తమిళం ఒక్కటే సంపదగల భాషకాదు.
అనేక భాషలతో దీపిస్తున్న దేశం భారతదేశం. అద్భుతమైన లిత, మౌక సాహిత్యం ఉన్న భాషలు ఈ దేశంలో ఉన్నాయి- 'ఈమాట చెప్పిన ఈ పెద్ద మనిషి' తరువాత మాటమార్చి "ప్రాచీన భాషా, సాంస్కృతిక వారసత్వానికి ప్రాచీన తమిళం ఒక్కటే ఆధారం' అని చెప్ప సాహసించాడు. "ప్రాచీన తమిళం ఆధారంగా లేకుండా సింధులిపి పుట్టుపూర్వోత్తరాలను ఛేదించడం కష్టం' అన్నాడు! కానీ భాషాశాస్త్రంతో సంబంధంలేని ఈ విదేశీ ఆచార్యుడికి తెలియని ఒక చారిత్రక సత్యం ఉంది- ద్రావిడభాషా కుటుంబం నుంచి స్వతంత్ర ప్రతిపత్తితో, స్వతంత్ర మౌక(జానపద/'దేశి') వాఙ్మయంతో విడివడి వచ్చిన మొట్టమొదటి భాష తెలుగే! ఈ పరిణామం, ఈ స్వతంత్ర ప్రతిపత్తీ క్రీస్తుపూర్వం 6000 సంవత్సరం నాటికే సంభవిం చిందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృత భాషాచార్యుడైన ప్రొఫెసర్ టి.బర్రో వెల్లడించాడు. అతను భాషాశాస్త్రవేత్త కూడా. ఈ తెలుగు ప్రాచీనత ఆధునిక రూపం తొడిగి శరవేగంతో ముందుకు దూసుకుపోవడం క్రీ.శ. 600-1000 సంవత్సరాల మధ్య ప్రారంభమైౖందన్నాడు.
భాషాభిమానం దురభిమానం కింద మారితే ఏ వికృత రూపం తీసుకుంటుందో చెప్పడానికి- తెలుగు భాష ప్రాచీనతకు అద్దంపడుతున్న 'భట్టిప్రోలు శాసన' 'లిపి' తెలుగుది కాదు మాది అని నిన్నమొన్నటి దాకా హూంకరించి చాలించుకున్నవాళ్లు ఎవరో కాదు, కొందరు తమిళ పండితులే!
నిన్న మొన్నటిదాకా అన్ని భాషలకు మూలం 'సంస్కృతం' అని కొందరు ఛాందసులు చాటగా, ఇప్పుడు ప్రపంచ భాషలకే 'తమిళం' ఆదిగురువని గొప్పలు చెప్పుకునే స్థితికి కొందరు దిగజారారు. అప్పకవి లాంటి వాడు సహితం "భారతీదైవి శైశవ భారతంబు ప్రాకృతంబు' అని అంగీకరించవలసి వచ్చింది! నిజానికి సంస్కృతం సహా అన్ని భాషలకూ మూలం "బ్రాహ్మీ' లిపి అని మహామహా పండితులే తేల్చి చెప్పారు. అంతేగాదు, తమిళపండితుడూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొలువులో ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన కాశీపాండ్యన్ తమ తమిళభాషకన్నా తెలుగు భాషా ప్రాచీనతకే ప్రాధాన్యమిచ్చాడు! ఈ 'బ్రాహ్మీ' మూలం ద్రావిడ భాషా కుటుంబంలోని ప్రాచీన తెలుగు రూపమేననీ, అశోకుని కాలానికంటే(క్రీ.పూ. 300) ముందటిదైన తెలుగుకు, అంటే క్రీ.పూ. 400 సంవత్సరాల నాటి తెలుగుకు ప్రాచీనరూపం బ్రాహ్మీ కాగా, భాష మాత్రం "తెలుగు ప్రాకృతం' అనీ పురాతత్వశాస్త్రవేత్తలూ భావించారు.
తమిళం, తెలుగు ప్రాచీన ద్రావిడ భాషలు కాబట్టి, ప్రాచీన తమిళం 'గ్రంథి' లిపిలో రాయగా, ప్రాచీన తెలుగు 'బ్రాహ్మీ' లిపిలో ఉందనీ, ప్రాకృతం, పాళీ, సంస్కృ తం- ఈ మూడూ తెలుగు నుంచే 'బ్రాహ్మీ' లిపి అరువు తెచ్చుకున్నాయనీ కాశీపాండ్యన్('హిడెన్ హెరి టేజ్') పేర్కొన్నాడు.
అంతేకాదు, కవి పండి తులు, పరిశోధకులైన మారే పల్లి రామచంద్రశాస్త్రి కూడా "తొలి 'తెన్' (తెలుగు) పలుకుమానుపు భరత ఖండమంతటను నెరసి యుండెననుటకు' ఉదాహ రణంగా మల్తో, పాట్నాల దగ్గర, కొలామీ, నాగపుర వాయవ్య భాగంలోనూ, బ్రాహుయీ సింధు, బెలూ చిస్థాన్‌లలోనూ వాడుకలో తెలుగు వ్యాపించి ఉండటా న్ని పేర్కొన్నారు. అంతే గాదు, ప్రాచీన 'తెన్' (తెలు గు) పలుకులో 'వ్రాగమి' అంటే వాఙ్మయం ఉందనీ, దాని తొలి బిడ్డలైన తమిళం లోనూ, తెలుగులోనూ 'వ్రాగమి' అప్పటి నుండే ఉందనీ భావించవచ్చు. ఈ వాఙ్మయం ఆ పిమ్మటి తరాలకూ, నేటి తరాల దాకా అందక పోవడానికి తెలుగుదేశంలో జైన, బౌద్ధాలపై పెచ్చరిల్చిన శైవ, వైష్ణవ మత విద్వేషాలు, నేటి పాలకుల మాదిరే నాటి పాలకుల అశ్రద్ధే కారణమని చరిత్ర చెబుతోంది. కనుకనే ఆరుద్ర ఒక చోట ప్రస్తావించినట్టుగా ప్రాచీన జానపద సాహితీ సంప దను రక్షించుకుని తమిళులు ప్రాచీన సాహిత్యంగల వాళ్లయ్యారు.
మనవాళ్లు అంతే ప్రాచీన చరిత్ర, వాఙ్మయం కలిగి ఉండి కూడా దానిని కాపాడుకోలేక లేనివాళ్లయ్యారు. అయితే కోల్పోయింది కోల్పోగా ఏతావాతా మిగిలిన పాత వాఙ్మయం సహితం క్రీ.పూ. ఆరవ శతాబ్దానిదే కావడం విశేషం. అందుకే, నన్నయకు వేయి సంవత్సరాలకు పూర్వమే (అంటే, 2,000 సంవత్సరాలకు పైబడే) తెలుగు భాష ఉందని ఆచార్య గంటి జోగి సోమయాజులు గుర్తు చేయాల్సి వచ్చింది. అలాగే, ద్రావిడ నాగరికతకు ముందున్న ఎన్నో గిరిజన (ఆదివాసీల) భాషల ఉనికీ, ఉసురూ ఏమయ్యాయో తెలియదు. ఈ భాషలు బతికివున్న కాలాన్ని క్రీ.పూ. 300గా బర్టన్‌సేన్ ఉదహరించాడు. 'బ్రాహ్మీ' లిపిలో ఆది తమిళ శాసనాలు వెలువడక ముందే ఈ గిరిజన భాషలు తమ ఉనికిని దీటుగా చాటుకున్నాయి. కాగా, శాతవాహనుల కాలానికి (క్రీ.పూ 250-క్రీ.శ 245) ముందే ఆదితెలుగు పరివ్యాప్తమై ఉందన్నాడు బర్టన్! ఆయన మరో విషయాన్ని వెల్లడించాడు; అంతటి సువిశాల ప్రాంతంలో వెలుగొందిన తెలుగు, బలమైన సమైక్యతా లక్షణాలు లేకుండానే క్రీ.పూ. 1500 నుంచీ చారిత్రక విభాత సంధ్యల వరకూ చెక్కుచెదరకుండా ఉండడం అసా«ధ్యం' అని కూడా కితాబిచ్చాడు!.
తెలుగువారి నాగరికతకూ సింధు నాగరికతకూ మధ్య సంబంధ బాంధవ్యాలు
ఇక పర్పోలా, కరుణానిధులూ సింధు లిపికీ, తమిళానికీ మధ్య ఉన్నదని పేర్కొంటున్న సంబంధ బాంధవ్యాలు- ప్రాచీన తెలుగుకు, తెలుగువారి నాగరికతకూ సింధు నాగరికతకూ మధ్య కూడా ఉన్నాయని పరిశోధకుల నిర్ధారణ. సింధు నాగరికత ద్రావిడ నాగరికతగా చెప్పే కొందరు తమిళ సోదరులు, అదే ద్రావిడ భాషా, నాగరికత లలో అంతర్లీనమైన తెలుగు భాషా నాగరికతలకు మాత్రం ఎందుకు వర్తించ దో చెప్పరు. ఈ మూర్ఖత్వమే, తమిళభాషకు ప్రాచీన ప్రతిపత్తిని వెయ్యి సంవత్సరాల ప్రమాణ పరిమితిలోనే పరోక్షంగా దొంగచాటుగా సాధించు కుని అదే ద్రావిడభాషా కుటుంబంలోని తెలుగు, కన్నడాలకు 1,500-2,000 సంవత్సరాల 'ప్రాచీనతా' పరిమితిని తమిళ పాల కులు ప్రతిపాదించారు. పైగా ఆ పరిమితిని కూడా తరువాత దొంగచాటుగా మార్చి 1,500 సంవత్స రాలకు మించి ఉండాలని ఒకసారి, కాదు 2,000 సంవత్సరాలు, ఆపైన ప్రాచీనత కలిగిన భాషలకు మాత్రమే ప్రాచీన భాషా ప్రతిపత్తిని కల్పించాలని 'సొడ్డు' పెట్టారు!
ప్రాచీన భాషల పూర్వాపరాలపై విశేష పరిశోధన చేసిన తమిళ పండితుడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య మలయాండీ తమిళనాడులోని 'వైగై' నదీ లోయలో వర్ధిల్లిన తమిళ నాగరికత, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్రా నదీలోయలో వర్ధిల్లిన తెలుగు వారి నాగరికతా సమాంతరంగా ప్రభవిల్లాయని, ఈ రెండు నాగరికతలు క్రీ.పూ. 4000-3000 నాటి సింధు నదీలోయ నాగరికతతో బరాబరీగా తులతూగాయనీ, ఇవి ప్రపంచంలోని ఎగువ పాత రాతియుగపు నాగరికతలతో (పెరూ, ఈస్టర్ ఐలాండ్, కొలంబియా, పొలినీషియా) ఎలా సరిపోలాయో సాక్షాత్తూ ముద్రి కలతో సహా నిరూపించాడు. కుత్సితం రాజకీయం లోనే కాదు, భాషారంగంలో, పురాపరిశోధనల్లో కూడా ఉందని మన తెలుగువాళ్లకు అప్పుడుగాని అర్థం కాలేదు. "కుడుమిస్తే చాలు, పండగ' అనుకునే తెలుగువాడికి, భాషా సంస్కృతుల నుంచి దూరమవుతున్న విద్యావ్యవస్థకు సారథ్యం వహిస్తున్న పాలకులకూ ఇది గుణపాఠం!
ఇక కరుణానిధి ప్రసంగం 'అంతర్జాతీయ' సరి హద్దులు తాకింది! ఎలా? "తమిళం అంతర్జాతీయ భాష మాత్రమే కాదు, అది ప్రపంచ భాషలన్నింటికీ తల్లి భాష' అన్నాడు! అంతేకాదు, ఒక భాషను 'విశిష్ట' లేదా 'ప్రాచీన' లేదా 'శ్రేష్ఠ' భాషగా ప్రకటించడానికి ప్రపంచ భాషాశాస్త్రవేత్తలు పెట్టిన పదకొండు విధాల ప్రమాణాలకన్నా 'మించిన యోగ్యతలు' తమిళానికి ఉన్నాయన్నది 'ప్రపంచ వ్యాపిత స్థూలాభిప్రాయ'మని కరుణానిధి ఉవాచ! తెలుగు ప్రాచీనతకు వేల సంవత్సరాల లిపి, నాణాల, శాసనాల, పురావస్తు చారిత్రక ఆధారాలు కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగు గ్రామ నామాలు, వంశనామాలు శతాబ్దాల నాటివి కావు, వేల సంవత్సరాల నాటివి ఉన్నాయి. శాతవాహనుల నాటి (450 ఏళ్ల పాలన- క్రీ.పూ 230-క్రీ.శ. 225 దాకా) కోట లింగాల (తెలంగాణ) వద్ద, సింగవరం(కృష్ణా జిల్లా) వద్ద దొరికిన నాణాలను, శాసనాలనూ తమిళ పురాతత్త్వ వేత్త ఐరావతం మహదేవన్ ఈనెల 24న 'హిందూ'లో ప్రచురించిన నాణాల, శాసనాల ఆధారాలతో ఏవిధంగా పోల్చిచూసినా, మిన్నగా తులతూగు తాయి!
తెలుగుదేశంలో మెకంజీ కాలం నాటికే 6,000కు పైగా శాసనాలు లభించాయి. ఇంత పురాసంపద దక్షిణ భారతంలోనే మరొక జాతికి లేదు. మహదేవన్ ప్రచురించిన వాటిలో ఒక రాతి శాసనం క్రీ.పూ. 2-1 శతాబ్దాల నాటిది; మరొకటి మట్టి పాత్రల మీద రాసిన శాసనం క్రీ.పూ. 2వ శతాబ్దిది. ఇంకొకటి ఒక వెండి నాణెం క్రీ.పూ. 3వ శతాబ్దిది. కానీ, ప్రాచీన నాణాల ప్రసిద్ధ తెలుగు పరిశోధకుడు డాక్టర్ దామె రాజారెడ్డి తమిళ పరిశోధనలకు సంబంధించిన కొన్ని 'కొత్త' విశేషాలు తెలిపారు! తమిళులు 'సంగం'(కవులు, రచయితల సంఘం) సాహిత్యాన్ని క్రీ.పూ. 3వ శతాబ్దిదిగా పేర్కొంటే, 'బ్రిటానికా విజ్ఞాన సర్వస్వం' పండిత సంపాదకులు 'సంగం' సాహిత్యా కాలాన్ని క్రీ.శ. 1-4 శతాబ్దుల మధ్య కాలానికి దించేశారు! ఇక ఈ సాహిత్యంలో ఉన్నవని చెప్పే పాటలు మధురైలో రాసినవనీ, వాటిలో రాజుల ప్రణయ గాథలు, వారి పాలనా చర్యలే ప్రధానమనీ, సంగం సాహిత్యంలో పేర్కొన్న రాజులు, పురాణ కల్పిత వ్యక్తులా, వాస్తవమైన రాజులా! అనే అంశంపై నిన్నమొన్నటి దాకా వివాదం నడిచిందనీ డాక్టర్ రాజారెడ్డి వెల్లడించారు.
ఎందు కంటే మద్రాసులో తమిళ సోదరులు చెబుతున్నట్టు రాజులు లేదా వారి సేనానులకు చెందిన నాణాలు సంగం కాలానివి కావనీ, ఆ తరువాతి కాలానికి చెందిన చేర, చోళ, పాండ్య రాజులకు ఆ నాణాలను అంటకట్టడం జరిగిందనీ డాక్టర్ రాజారెడ్డి నిరూపిం చారు! తమిళులు 'పెరుంగదై' పేరిట అనువదించు కున్న కథలు తెలుగు కథలకు, ప్రపంచ కథలకూ మూలంగా భావిస్తున్న గుణాఢ్యుని ప్రాచీన బృహ త్కథగా పండితులు నిర్థారణ చేశారు! కొన్ని దశాబ్దాల క్రితం కోయంబత్తూరు 'దొంగ కరెన్సీ నోట్ల'కు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు ఇతర భాషలను న్యూనపరిచే మనోవైక ల్యానికీ పేరొందడమే చిత్రం! మన పాలకులకూ, పౌరులకూ ఇప్పటికైనా రోషమొస్తుందా?! మాతృ భాషనూ, సంస్కృతినీ అంటిపెట్టుకుని ఉండే పాలకు లకు పునర్నవమే గాదు, పునర్జయమూ ఉంటుంది!.
సాక్షి సొజన్యంతో..,
చాలా కొత్త మరియు తెలియని విషయాలు, ఆసక్తికర విషయాలు పంచుకొన్నందుకు ధన్యవాదాలండీ.
ReplyDeletegood informative article. kudos for your research.
ReplyDeleteచాలా మంచి వ్యాసాన్ని అందించారు. నెనరులు. తెలుగు వారికి భాషా దురభిమానం లేకపోవడం ఒక మంచి విషయం గా చెప్పుకోవచ్చు. కానీ భాషాభిమానం అస్సలు లేకపోవడం శోచనీయం. ఇప్పుడైనా మన జాతి గౌరవాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నాలు జరగాలి. ఈ సందర్భంగా తెలుగు భాషకి ప్రాచీన హోదా ఇవ్వలేదని, జాతీయ పురస్కారాన్నే తిరస్కరించిన మన వేటూరి గారిని స్మరించుకోవలని అనిపిస్తోంది. అందరూ ఆ స్ఫూర్తితో ముందుకి నడిస్తే - మన భాష ని కాపాడుకోగలుగుతాము.
ReplyDeleteమరో మాట చెప్పడం మరిచాను. ఉత్తరాన హిందీ ఎలానో దక్షిణాదిన తెలుగు అంత ఎక్కువ మంది మాట్లాడేవారు - బ్రిటీషు అధికారులెవరైనా దక్షిణాదిన ఉద్యోగం చెయ్యాల్సి వస్తే తెలుగు భాష ని తప్పనిసరిగా నేర్చుకోవలసి వచ్చేది. భాష ప్రయుక్త రాష్ట్రాల వల్ల మనం తెలుగు మాట్లాడే దాదాపు 10 జిల్లాలని కోల్పోయాము. ఫలితంగా వారంతా తెలుగు భాషకి దూరం అవుతున్నారు. మొన్న ఈ మధ్య తెలుగు వారు "కృష్ణగిరి" జిల్లాలో చేసిన అందోళనే ఇందుకు సాక్ష్యం. ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న సరిహద్దు జిల్లాలన్నీ తెలుగు వారితో నిండి ఉన్నాయి. అస్సలు చాలా మంది మూలాలు తెలుగు నాడు నుంచే ఉన్నాయి. తమిళనాడులో రాజుపాళెం ప్రాంతంలో చాలా మంది తెలుగు వారు ఉన్నారు. చాలా మంది ఇంట్లో తెలుగు మాట్లాడుతారు - కానీ వ్రాయను, చదువను రాదు. (ఆ రాష్ట్రంలో తెలుగు ని బోధించేవారు లేరు కదా! అయినా, మన రాష్త్రంలోనే తెలుగుని సరిగ్గా బోధించడం లేదు. ఇక పక్క రాష్ట్రాలలో అది ఎక్కడ సాధ్యం అవుతుందీ?) ఈ దురదృష్ట పరిస్థితి నుంచీ మనల్ని మనం బయట పడేసుకోవాలంటే, కేవలం మన రాష్ట్రంలోనే కాక బయట రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారిని కూడా మనతో కలుపుకోని పోగలిగితే - ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మాతృభాషని నేర్చుకునే సౌలభ్యం అందరికీ లభిస్తే - చాలా మంది తెలుగు నేర్చుకోడానికి సిధ్ధంగానే ఉంటారు.
ReplyDeleteతెలుగు ప్రజలు,పాలకులు నిద్ర నటించడం మొదలై కొన్ని దశాబ్ధాలయ్యింది. ప్రస్తుతం ఆ నిద్ర నటించడం కాస్తా జీవించడం అయిపోయింది. వార్ని లేపడం ఎవరితరంకాదు. మహా అయితే అప్పుడప్పుడూ ఆవులింత నటిస్తూ తమిళోళ్ళ మీదబడి ఏడవటం తప్పిస్తే ఏమీ చెయ్యలేరు. చెయ్యరు.
ReplyDelete