Wednesday, September 1, 2010

తెలుగు భాషా పరిరక్షణ బాధ్యత భావి పౌరులదే!

తెలుగుభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భావిపౌరులైన విద్యార్ధులపై
ఉందని తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29 వ తేదీన వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో జరిగిన తెలుగు భాషాదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి తవ్వా ఓబుల్‌ రెడ్డి అధ్యక్షతన తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక తమిదేపాటి వెంకటసుబ్బయ్య స్మారక ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న శాసనాల పరిశోధకుడు డాక్టర్‌ అవధానం ఉమామహేశ్వర శాస్త్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలాన్ని బట్టి ఇంగ్లీషు తదితర పరభాషలను నేర్చుకోవాల్సి వచ్చినప్పటికీ మాతృభాష అయిన తెలుగు ను విస్మరించరాదని, ఉన్నత విద్యాభ్యాసంలో కూడా తెలుగును ఒక అంశంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇంగ్లీషు భాషపై మోజుతో తెలుగును నిర్లక్ష్యం చేయరాదని ఆయన హితవు పలికారు. తమిళభాష కంటే తెలుగు భాష ఎంత మాత్రం కొత్త భాష కాదనీ, ఏడవ శతాబ్దం వరకు తమిళభాషకు ' తెలుగు-కన్నడ' లిపిని వినియోగించిన దాఖలాలున్నాయని ఆయన వెల్లడించారు. తెలుగుభాష తల్లిపాల వంటిదైతే ఇంగ్లీషుభాష డబ్బా పాలవంటిదని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథి, జానపదకళల పరిశోధకుడు డాక్టర్‌ మూలే రామమునిరెడ్డి కార్యక్రమంలో ప్రసంగిస్తూ నేటి విద్యావిధానంలో తెలుగు భాషకు నానాటికీ ప్రాధాన్యత తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మైదుకూరులోని ఆంగ్లమాధ్యమ పాఠశాలలో తెలుగులో మాట్లాడిన విద్యార్థులను శిక్షించిన సంఘటనలో తెలుగుభాషోద్యమ స్ఫూర్తిని రగిలించడంలో ఇక్కడి తెలుగు
భాషాభిమానులు చేసిన కృషి రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తవ్వా ఓబుల్‌ రెడ్డి మాట్లాడుతూ వ్యవహారిక భాషా ఉద్యమకారుడు శ్రీగిడుగు రామమూర్తిపంతులు గారి జీవిత విశేషాలను సభికులకు తెలిపారు. తెలుగు భాషొద్యమ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ సామల రమేష్‌బాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న తెలుగుభాషోద్యమ సమాఖ్య కార్యక్రమాల గురించి వివరించారు. గిడుగు వారు నడిపిన ' తెలుగు' అనే పత్రిక స్మారకంగా తవ్వా ఓబుల్‌ రెడ్డి రూపొందించిన 'తెలుగు' అనే అంతర్జాల పత్రిక, 'శ్రీకృష్ణదేవరాయ' అనే మరో అంతర్జాల పత్రికను ఈ సందర్భంగా శ్రీఉమామహేశ్వర శాస్త్రి, శ్రీరామమునిరెడ్డి ఆవిష్కరించారు. శ్రీఉమామహేశ్వర శాస్త్రి, శ్రీరామముని రెడ్డి లను ఈ సందర్భంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలుగు భాషొద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఉపాధ్యక్షుడు అరబోలు వీరాస్వామి, కార్యదర్శి ముండ్లపాటి వెంకటసుబ్బయ్య, సహకార్యదర్శి ధరిమిశెట్టి రమణ, కార్యవర్గ సభ్యులు పెరుగు కృష్ణయ్య యాదవ్‌, తమిదేపాటి వెంకటేశ్వర్లు, విశ్రాంత తెలుగు పండితులు టి. పుల్లయ్య, తెలుగు భాషాభిమానులు ఉత్సలవరం శేఖర్‌, కె.జి.పి. వెంకటయ్య విద్యార్థులు పాల్గొన్నారు.









2 comments:

  1. తవ్వా ఓబుల్‌రెడ్డి గారు..మీరు చేస్తున్న కృషి బాగుంది, కాని నాది ఒక మనవి..మనం చరిత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము కదా..? మరి కడప జిల్లా ని వై.ఎస్.ఆర్ జిల్లా మార్చడం అన్నది ఎంతవరకు సబబు అంటారు..? ఆ పేరుకో చరిత్ర ఉన్నది..జిల్లాలకు వ్యక్తుల పేరేంటి విచిత్రంగా..?

    ReplyDelete