పోర్ట్‌లూయిస్(మారిషస్), డిసెంబర్ 9 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి భావ సమైక్యతకూ, మాతృభాషా సంస్కృతుల పరిరక్షణకే తెలుగు విశ్వవిద్యాలయం పాటుపడుతోందని ఉపాధ్యక్షుడు ఆచార్య యాదగిరి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల వల్ల తెలుగువారంతా ఒకే వేదిక మీదకు వచ్చి మాతృభాషా సంస్కృతుల గురించి చర్చించుకోవడం వల్ల సమైక్య చైతన్యాన్ని పొందుతారని ఆయన చెప్పారు. మారిషస్ ప్రపంచ తెలుగు మహాసభల రెండో రోజున ముఖ్యఅతిథిగా యాదగిరి ప్రసంగించారు. మహాభారత, రామయాణాది ఇతిహాసాల వల్ల ధర్మాధర్మ సంఘర్షణ గురించి తెలుసుకోవచ్చని ఆచార్య సి మృణాళిని అన్నారు. ప్రాచీన సాహిత్యపు చివరి రోజుల్లో వచ్చిన తరిగొండ వెంగమాంబ తిరుగుబాటు, సంస్కరణ భావాలను తమ జీవితంలోనూ, రచనల్లోనూ పొందుపరచి, ఆధునికతకు నాంది పలికారని అన్నారు. : ప్రాచీన సాహిత్యంలో పదాలను అధ్యయనం చేయడం వల్ల భాషా సంపద పెంచుకోవచ్చని మృణాళిని అన్నారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మారిషస్‌లోని తెలుగువారిపై రచించిన కవితను చదివి అలరించారు. ఆచార్య ప్రీతి ఆర్ కుమార్ జాతీయోద్యమ కవి గరిమెళ్ల ఆంగ్లకవిత హార్ట్ ఆఫ్ ఇండియాను గుర్తుచేశారు. న్యూయార్క్ నుండి వచ్చిన డాక్టర్ సముద్రాల బాబూరావు తెలుగు భాషకు తెలుగేతరులు చేసిన సేవ అనే అంశంపై మాట్లాడారు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం , శిల్పం తదితర కళలను పాఠ్యాంశంగా చేర్చాలని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ కోరారు. నృత్యకళను ప్రాధమిక స్థాయి నుండే పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని డాక్టర్ పి. అలేఖ్య కోరారు. కర్ణాటక సంగీతానికి తమ దేశంలో ప్రాచుర్యం పెరుగుతోందని మారిషస్ నుండి వచ్చిన గురుమూర్తి పాపయ్య తెలిపారు. ఈ సందర్భంగా మారిషస్‌లో ఆంధ్రమహాసభ ఆవిర్భావానికి, తెలుగుభాషా వికాసానికి కృషి చేసిన సోమన్న సోమయ్యకు మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాన్ని అందజేసి మండలి బుద్ధప్రసాద్ సత్కరించారు.
Saturday, December 10, 2011
Friday, December 9, 2011
తెలుగు సాంస్కృతిక వికాసానికి కృషి చేస్తున్నాం - మారిషస్ మంత్రి
పోర్ట్‌లూయా (మారిషస్), డిసెంబర్ 8: ఎన్నో కష్టాలు పడి, మారిషస్‌లో నిలదొక్కుకున్న 150 ఏళ్ల నాటి కూలీల సంతతికి చెందిన తాము తెలుగుభాషా సంస్కృతుల వికాసానికి పాటు పడుతున్నామని మారిషస్ ప్రభుత్వంలో తెలుగు మంత్రి తొలితరం మంత్రి అయిన వీరాస్వామి సింహాద్రి కుమారుడు, ప్రస్తుత పర్యావరణ మంత్రి దేవా వీరాస్వామి అన్నారు. మంత్రి మాట్లాడుతూ మహాసభలను ప్రారంభించాలని మారిషస్ ప్రధాని చంద్రరాంగులామ్‌ను ఆహ్వానించామని చెప్పారు. తాను ఆయన ప్రతినిధిగా పాల్గొంటున్నట్టు తెలిపారు. మారిషస్ సాంస్కృతిక మంత్రి ముకేశ్వర్ చునీ మాట్లాడుతూ మారిషస్ ఒక సూక్ష్మ భారతదేశమని అన్నారు. మారిషస్‌లో తెలుగువారి పరిణామక్రమాన్ని వివరిస్తూ ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచంలోని తెలుగు వారందరికీ వేదికగా మారిషస్‌లో తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక మంత్రి వట్టి వసంతకుమార్ ప్రకటించారు. మారిషస్‌లో జరుగుతున్న మూడు రోజుల ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీఠానికి ఏటా పది లక్షల రూపాయిలు నిధులు కేటాయిస్తామన్నారు. తెలుగు సంస్కృతీ పరిరక్షణకు, పరిశోధనకు మారిషస్ సహా ప్రపంచమంతా వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం 40 కోట్ల రూపాయిలు వెచ్చించి తెలుగు జానపద కళారూపాల డిజిటలైజేషన్‌కు, సంగీత, నృత్య కళల విస్తరణ తదితర కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.
ప్రాథమిక విద్యామంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ప్రపంచీకరణ ఫలితంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని నిలబడటానికి భాషను అభివృద్ధి పర్చుకోవాలని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రవాణా ఖర్చులు కూడా భరించి పాఠ్య పుస్తకాలను అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయమన్నారని తెలిపారు. భారత్‌తోపాటు అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, ఫిజి, యుకె, మారిషస్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, హిందీ అకాడమి చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలుగు యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ కె యాదగిరి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకుడు ఆచార్య డి మునిరత్నం నాయుడు, మారిషస్‌లో భారత రాయబారి టిపి సీతారాం, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు కోడి రమణ, తెలుగు మాట్లాడేవారి సంఘం అధ్యక్షుడు రామస్వామి అప్పడు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన భాషా సదస్సులో లిపి సమస్యలపై మునిరత్నం నాయుడు, భాషా బోధనపై డాక్టర్ రెడ్డి శ్యామల, నూతన పదకల్పనలపై డాక్టర్ జె చెన్నయ్య పత్ర సమర్పణ చేశారు. వీరితోపాటు ఆచార్య పి అప్పారావు, ఆచార్య పి చెన్నారెడ్డి తదితరులు తమ పత్రాలు సమర్పించారు.
(చిత్రం - మారిషస్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన పర్యావరణ మంత్రి దేవా వీరాస్వామి, సాంస్కృతిక మంత్రి ముకేశ్వర్ చునీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మంత్రి వట్టి వసంతకుమార్, ప్రాథమిక విద్యా మంత్రి శైలజానాథ్ తదితరులు)
Thursday, December 8, 2011
నేటి నుంచి మారిషస్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు మహాసభలను మారిషస్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని పోర్టులూయిస్‌లోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు సభలు జరగనున్నాయి. మారిషస్‌లోని భారత హైకమిషనర్ తీప్తి సితార మహాసభలను ప్రారంభిస్తారు. మహాసభలకు హాజరయ్యేందుకు వివిధ దేశాలకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు బుధవారం సాయంత్రానికి ఇక్కడికి చేరుకున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఉన్నారు. మారిషస్ తెలుగు సంఘం నిర్వాహకులు ఆత్మ ఆదినారాయణ, సతీశ్ అప్పడు, రామస్వామి తదితరుల ఆధ్వర్యంలో సభల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10న జరిగే ముగింపు ఉత్సవాలకు మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రాంగులాం, రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ ఎ చక్రపాణి ముఖ్య అతిధిలుగా హాజరవుతారు. మారిషస్ తెలుగు సంఘం నిర్వహకులు ఆత్మ నారాయణ, సతీష్ అప్పడు, రామస్వామి తదితరులు ఈ సభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జనవరి 5 నుంచి తెలుగు మహోత్సవాలు ఒంగోలులో ప్రపంచ తెలుగు మహోత్సవాలు జనవరి 5 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. మహోత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ వేడుకలను 'రామ్‌కీ ఫౌండేషన్' నిర్వహించడం అభినందనీయమని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.భాషా పరంగా మాత్రమే కాకుండా సంస్కృతులు, వాటి విశిష్టతను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహిస్తుండటం గర్వకారణమంటూ సీఎం ప్రశంసించారు. మూడురోజుల పాటు జరిగే ఉత్సవాల వివరాలను ముఖ్యమంత్రికి రామ్‌కీ మేనేజింగ్ ట్రస్టీ ఆళ్ల దాక్షాయణి వివరించారు. మొత్తం పదకొండు దేశాల నుంచి తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఫౌండేషన్ ప్రచురించిన 'ప్రకాశం జిల్లా వైభవం' పుస్తక ప్రతిని ఆమె సీఎంకు అందించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న వేడుకలను విలక్షణంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు ఫౌండేషన్ ఆపరేషన్స్ హెడ్ ఎమ్వీ.రామిరెడ్డి పేర్కొన్నారు. ఉత్సవాల్లో దేశంలోని ప్రఖ్యాతి గాంచిన జానపద నృత్యరూపాలతో పాటు, రాష్ట్రంలో మరుగున పడిన జానపద కళా ప్రదర్శనలూ ఉంటాయన్నారు. కార్యక్రమంలో రామ్‌కీ ప్రతినిధులు సర్ణ విజయరామిరెడ్డి, పి.వినయ్‌కుమార్, కె.వి.ఆర్.ఎల్.ఎన్.శర్మ, వి.నారాయణరెడ్డి, కె.రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
-ఈనాడు
Subscribe to:
Posts (Atom)