Monday, March 26, 2012

సామాజిక రుగ్మతల నిర్మూలను కలాలే అస్త్రాలు-తెలుగు భాషోద్యమ సమాఖ్య

మైదుకూరు : సమాజంలో చోటు చేసుకుంటున్న సాంస్కృతిక విధ్వంసాలు, సామాజిక రుగ్మతలపై కలాలను అస్త్రాలుగా ప్రయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కవులు, కవయిత్రులు, రచయితలు పేర్కొన్నారు. ఉగాది సంద ర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వ హించిన రచనల పోటీల్లో విజేతలకు ఆదివారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో బహుమతులు ప్రదా నం చేశారు. కథా రచయిత తవ్వాఓబుల్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అందులో కవి లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతీయ భాషా సంస్కృతులు విచ్ఛినమవుతున్న తరుణంలో ప్రజల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పై ఆలోచన పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
తెలుగు భాషోధ్యమ సమాఖ్య తెలుగునాట భాషా సంస్కృతి వికాసానికి చేస్తున్న కృషిని కొనియాడారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన కవితలు, కథలు, వ్యాసరచన పోటీల్లో ఎంపికైన రచనల్లో రచయితలు సామాజిక స్పృహను బాధ్యతతో జోడించారని, కథల్లో కవితల్లో నేటి సమాజంలోని లింగవివక్ష, గ్రామీణ రాజకీయాలు, బాల్యం, భాష, సంస్కృతుల విధ్వంసం తదితర అంశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు. కథా రచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ సాహిత్య వారసత్వాన్ని, సంస్కృతిని ముందు తరాలకు అప్పగించాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగు భాషొద్యమం జరుగుతున్న తీరును ,చేపడుతున్నా కార్యక్రమాలను ఆయన వివరించారు. బీజేపీ నాయకులు బీపీవీ ప్రతాప్‌రెడ్డి, అందె సుబ్బన్న, జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి. ) అభివృద్ధి అధికారి ఎస్.సాదక్, రాటా అధ్యక్షుడు కొండపల్లి శేషగిరి, రైతు సేవా సంఘం అధ్యక్షుడు డీఎన్ నారాయణ, రైతు నాయకుడు పోలు కొండారెడ్డి, మైదుకూరు శాఖ అధ్యక్షుడు వీరస్వామి, సీపీఐ నాయకులు ఏవీ రమణ, రచయితలు, కవులు తదితరులు తమ రచనలు చదివి వినిపించారు.
బహుమతుల ప్రదానం
కథల పోటీలో మొదటి బహుమతి పొందిన శాంతి
ఉగాది సందర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య నిర్వహించిన కవితల పోటీలో పి. నీలవేణి (రామాపురం), లెక్కల వెంకట్రామిరెడ్డి(లెక్కలవారిపల్లె), ఎస్‌ఆర్ ప్రతాప్‌రెడ్డి(చల్లబసాయపల్లె) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మాబుజాన్, డీబీ దేవి, బేబీ సునీత, ఎస్.ఆలియా, కె.శ్రీనివాసులు, ఓ.సుధాకర్ విశేష బహుమతులు పొందారు. కథల పోటీల్లో ఎన్.శాంతి(కడప), కె. రామమోహన్(కామనూరు), ఎల్ కళారెడ్డి(సంబేపల్లి) మొదటి మూడు బహుమతులు సాధించగా, సయ్యద్ సంధాన్‌బాషా, కె.నాగమ్మ, పెరుగు సాయికృష్ణ, వై.రాజశేఖర్, వై.రాజేష్‌కుమార్ విశేష బహుమతులు పొందారు. వ్యాసరచన పోటీల్లో సగిలి విజయరామారావు(మార్కాపురం), గంగనపల్లి వెంకటరమణ(ఆకేపాడు), లక్ష్మినారాయణ(వనిపెంట) మొదటి మూడు బహుమతులు గెలుచుకోగా, ఎన్.శాంతి, పి.మురళి, ఈరి మాధురి, బీవీ నరసింహులు విశేష బహుమతులు పొందారు.

Tuesday, March 13, 2012

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ తిరుమల రామచంద్ర

డాక్టర్ తిరుమల రామచంద్ర 
తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంట ర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి. ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి.

ఆయన లాహోర్‌లో మూడేళ్ళున్నారు. అక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్‌ కాటలాగర్‌)గా పని చేశారు. ఆ తర్వాత లక్నోలో కొద్దిగా హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్‌ క్లర్క్‌గా పనిచేశారు. సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్‌ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్‌ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు.

రాహుల్‌ సాంకృత్యాయన్‌ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్‌ నుంచే అప్పు డే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రా్‌ఫ్‌ పత్రికకు విలేఖ త్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకు న్నారు. లక్ష్మ్‌ణ్‌ స్వరూప్‌, కె.పి. జయస్వాల్‌ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహు భాషా కోవి=దుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్ధించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూప లేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినదికాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

లాహోర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా ప్రసిద్ధకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధా కృష్ణ వాట్‌ ఈజ్‌ ఫెయిత్‌ (అంటే ఏమిటి?) అని రెండు గంటలపాటు శ్రోతలు అంద రూ సమ్మోహితులైనట్లు ప్రసంగించగా, రాధాకృష్ణన్‌ను ఇక్బాల్‌ ప్రశంసించడం మరి చిపోలేని సంఘటనగా స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు. ఆ విశ్వవిద్యాలయ ఓరి యంటల్‌ కాలేజి ప్రిన్సిపల్‌ మహమ్మద్‌ ఖురేషీ అక్కడ సంస్కృత విభాగంలో పని చేస్తున్న మహామహోపాధ్యాయ మాధవ శాస్ర్తి భండారేను ఎంత గౌరవించిందీ వివరించారు.

లాహోర్‌ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని, తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథా లకు తాను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తు న్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు.హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయన్ని దర్శించి ము రిసి పోవడమేకాక జలియన్‌వాలాబాగ్‌ దురంతాలు జరిగిన ప్రదేశాన్ని చూసి కన్నీ రు విడిచారు. అక్కడి ఆవరణ ప్రాకార కుడ్యాలకు తుపాకి గుళ్ళు తగిలినప్పుడు ఏర్పడిన రంధ్రాలను తడిమి కళ్ళు మూసు కుని ఉద్వేగభరిత చిత్తంతో మృతవీరుల దేశభక్తిని స్మరించి నివాళించారు.

దేశ విభజన జరిగి లాహోర్‌ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళికా బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాం తమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుం బాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామ చంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం.ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నానీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగు నాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

డెభె్భై ఏళ్ళ కిందనే  తెలంగాణ  అనే పత్రిక వెలువడిందని, దాని కార్యస్థానం హైదరాబాద్‌ అనీ, అది కొన్ని నెలలకే ఆగిపోయిందనీ- ఈ సంస్మరణ వ్యాసరచయితకు రామచంద్ర ఒక ఇంటర్వూలో చెప్పారు.ఇది ఆయనస్వీయ చరిత్రలో ప్రసక్తం కాలేదు.ఇప్పుడు ఈ స్మరణ నివాళి ముఖ్యోద్దేశం ఏమంటే, తెలుగువారి అతి ప్రముఖ దినపత్రికలలో ఆయన పనిచేసినపుడు కొన్ని పదుల ఇంటర్వ్యూలు ఆయన నిర్వహించినా, అన్ని రంగాల ప్రముఖులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు అక్షరీ కరించినా ఆయనతో మొట్టమొదటి ఇంటర్వ్యూ, చిట్టచివరి ఇంటర్వ్యూ చేయడం ఈ వ్యాస రచయితకే దక్కిందని ఇతడి అభిప్రాయం. ఆయన స్వీయ చరిత్ర రాయడం ఇంకా పన్నెండు సంవత్సరాలకు మొదలు పెడతారనగా 1984లో ఈ వ్యాసరచయిత ఎంతో విపులంగా ఆయన జీవిత వృత్తాంతం సేకరించాడు. తాను అభిలషిస్తున్న స్వీయ చరిత్ర పేరు  కమలాపురం నుంచి క్వెట్టాదాకా  లేదా  హంపీ నుంచి హరప్పా దాకా  అని ఉం టే- ఏది ఎక్కువ బాగుంటుందని ఆయన ప్రసక్తం చేయ గా- రెండోపేరు ఆకర్షకంగా ఉంటుందని చెప్పడం జరిగింది.

1997లో ఆయన ఇంకో నెల రోజుల్లో కీర్తిశేషులవుతారనగా, ఆయనతో ఇంకొక విపులమైన ఇంటర్వ్యూ ఈ వ్యాస రచయితే నిర్వహించడం జరి గింది. ఆ సందర్భం ఏమంటే- అప్పుడు భారత స్వాతంత్య్రోత్సవ స్వర్ణోత్సవం తటస్థించింది. రామచం ద్రగారి జైలు జీవితం, ఆనాటి స్వాతంత్య్రోద్యమ విశే షాలు, తనను ప్రభావితం చేసిన పెద్దలు, తన ఆదర్శాలు, ఆశయాలు, తన భవిష్యదర్శనం, తానింకా చేయదలుచు కున్న రచనలు మొదలైన వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. ఆయన  మూడు వా ఞ్మయ శిఖరాలు  అనే గొప్ప- సాహి తీ వేత్తల- జీవిత చరిత్రలు కూర్చారు.

మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సాహితీవేత్తలు, మీరు ఆదర్శీకరించుకున్న సాహి త్య వ్యక్తిత్వాలు ఎవరివి? అని అడగగా ఆయన  మానవల్లి రామకృష్ణ కవి, సురవ రం ప్రతాప రెడ్డి  అని చెప్పారు. అడవి బాపిరాజు విశిష్ట వ్యక్తిత్వం తనను తీర్చి దిద్దింది అని కూడా ఆయన స్మరించుకున్నారు. పద పాఠ నిర్ణయంలో, పరిశోధనలో వేటూరి ప్రభాకర శాస్ర్తి తనకు ఒరవడి దిద్దారని గుర్తు చేసుకున్నారు.
తిరుమల రామచంద్ర తెలుగు వారికిచ్చిన రచనలు చాలా విలువైనవి. ఇంకొక ఏడాదిలో ఆయన శతజయంతి వత్సరంకూడా రాబోతున్నది.

ఆయన గ్రంథాలు  మన లిపి, పుట్టుపూర్వోత్తరాలు, సాహితీ సుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు, మరపురాని మనీషి, తెలుగు వెలుగులు, హంపీ నుంచి హరప్పాదాకా ఆయనను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.వారిది గొప్ప విద్వక్కుటుంబం. తండ్రిగారికి బంగారం చేయడం పట్ల భ్రాంతి ఉండే దని, అందుకుగాను నూరు తులాల బంగారం వారు ప్రయోగ వ్యగ్రతలో వినియో గించారనీ, ఆయన కాలి నడకన బదరీ క్షేత్రాన్ని రెండు సార్లు దర్శించారనీ, జగదేక మల్లుడు కోడి రామమూర్తితో తమ తండ్రి గారికి స్నేహం ఉండేదనీ, 1922లో గాంధీజీ బళ్ళారి వచ్చినపుడు తాను ఎనిమిదేళ్ళ పిల్లవాడిగా దర్శించాననీ, తమది స్వాతంత్య్రోద్యమ నిమగ్న కుటుంబమనీ, తన తాత తండ్రులు బల్గాం కాంగ్రెస్‌కు హాజరైనారనీ, ఇటువంటి ఎన్నో విశేషాలు, ఉత్సుకతా పాదక మైనవని ఈ వ్యాస రచ యిత ఆయనతో చేసిన రెండు ఇంటర్య్వూల్లో, ఆయన చెప్పారు. ఈ రచయిత వాటి ఆధారంగా ఆయన గూర్చి రెండు జీవిత చరిత్రలు, ఇరవై దాకా వ్యాసాలు ప్రచురిం చడం తన సాహిత్యాభిరుచి సార్థకతగా భావిస్తున్నాడు. ఆయనతో తానే మొదటిదీ, చివరిదీ అయిన ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తు చేసుకుంటున్నాడు.
                                                                                                                              -అక్కిరాజు రమాపతిరాజు
                                                                                                                         సూర్య దినపత్రిక సౌజన్యంతో..  

తెలుగుకు మంత్రిత్వ శాఖ కావాలి-తెలుగు భాషోద్యమ సమాఖ్య

తెలుగు పతాకం
హైదరాబాద్, మార్చి 11: తెలుగు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెలుగు భాషోద్యమ సమాఖ్య కోరింది. సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సామల రమేశ్ బాబు, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఆంగ్లం మాధ్యమంగా ఉన్న పాఠశాలల్లో తెలుగులో మాట్లాడిన పిల్లలను శిక్షించడం అంతులేని దురాచారంగా మారడాన్ని వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సంఘటనను వారు గుర్తుచేస్తూ, ఇలాంటి సంఘటలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రాచీన తెలుగు భాషా పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి కేంద్రం నిధులను విడుదల చేసినా దానికోసం ప్రభుత్వం ఒక భవనాన్ని చూపించకపోవడాన్ని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మనతోపాటే అనుమతి పొందిన ‘కన్నడ పరిశోధనా కేంద్రం’ మూడు నెలల క్రితమే ప్రారంభమైందని, కానీ మనం ఇప్పటికీ కేంద్రాన్ని ప్రారంభించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన 60లక్షల సొమ్ము మురిగిపోయిందని పేర్కొన్నారు. వెంటనే తెలుగు భాషా పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించకపోతే, రానున్న ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన కోట్లాది సొమ్ము వట్టిపోతుందని తెలిపారు.
ప్రభుత్వంలో తెలుగు గురించి పట్టించుకునే పాలనా విభాగం లేనందువల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని సమాఖ్య ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోటీ పరీక్షలతోసహా అన్ని రకాలుగా తెలుగు అవమానాల పాలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దయిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఇతర అకాడమీలను తిరిగి ప్రారంభించాలని కోరారు. రెండేళ్లుగా మూసివుంచిన అధికార భాషా సంఘాన్ని వెంటనే తెరిపించాలని అన్నారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా అన్ని రాజకీయ పక్షాలు ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ డిమాండ్లను సమర్ధించడాన్ని కూడా వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆ సందర్భంగా ఊరేగింపులు, ధర్నాలు జరిగిన విషయాన్ని గమనించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి తెలుగు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, సమాఖ్య ప్రతినిధుల సూచనలను, డిమాండ్లను సావకాశంగా విన్న ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Wednesday, March 7, 2012

ఢిల్లీ దర్బార్‌లో వెలిగిన ముంగండ పండితుడు

క్రీ.శ. 17వ శతాబ్దం ప్రథమార్ధంలో దక్షిణాపథం నుండి ప్రౌఢ వాఙ్మయ సంస్కృతంలో అనేక ప్రబంధాలను రచించుటయే గాక పూర్వ మీమాంస తర్కవితర్క వైయాకరణ వేదాంత వైశేషిక వివేషణాన్యాయ శాస్త్రాలంకారీకులుగా ప్రసిద్ది వహించిన వారిలో ఒకరు మహాద్వైత సిద్ధాంతకర్తలైన అప్పయ్య దీక్షితులు కాగా మరొకరు మహా పండిత జగన్నాథ పండితరాయలు ముఖ్యులు.

గీర్వాణాలంకారశాస్త్ర కావ్య లక్షణములను, మౌలిక తత్వ పరిష్కృత నిర్వచనములను అప్రతిహతంగా నిర్వచించి సాహి తీ లోకానికి అందించిన వారు కవిరాజు జగన్నాథ పండిత రాయలు.

పుణ్య గౌతమీ నది తీరాన గల 'ముంగండ' (మునిఖండ) అగ్రహారం నుందు మహా మహోపాధ్యాయ శ్రీఉపద్రష్ట పేరు భట్టు మహలక్ష్మీ దంపతులకు కలిగిన యిద్దరిలో మొదటి సంతానముగా జగన్నాథుడు, రెండవ కుమారునిగా రామచంద్రయ్య జన్మించారు. పసి ప్రాయము నుండి తండ్రి వద్దనే విద్యను అభ్యసించారు. ప్రాథమిక విద్యతో పాటు ఉపనయనం చేశారు. అప్పటి వైదికాచారాల కనుగుణంగా అయిన సంబంధమైన కామేశ్వరి నిచ్చి పదునారు ప్రాయముననే వివాహం గావించారు.

జగన్నాథుడు యుక్త వయసు వచ్చే నాటికే ఋగ్వేదాది చతుర్వేదాలు ఇతిహాస పురాణాలు ఉపనిషత్తు లన్నింటిని పుక్కిట పట్టిన ప్రతిభాశాలి. అంతేకాక కావ్యాలంకార లక్షణాలను నాట్యశాస్త్ర సూత్రాల మెళుకువలను అధ్యయనం చేసినట్లు, తన తండ్రి వద్దనే నేర్చినట్లు- 'రసరంగాధర' గ్రంథ శ్లోకంలో-

'పాషాణాదపి పీయూషం, స్యంద తేయస్యలీలయా తంవందే పేరు భట్టాఖ్యం, లక్ష్మీకాంతం మహాగురుమ్!' (ర.ప్ర- 3వ శ్లోకం)

చెప్పుకొన్నాడు. పాషాణం నుండి అమృతం పిండే ప్రజ్ఞ గల లక్ష్మీకాంతం నాధుడైన పేరుభట్టు మహాగురువు సహచర్యంలో గడిపినానన్నాడు. 'తైలింగాన్వయ మంగళాలయ మహాలక్ష్మీ దయా లాలితః

శ్రీమత్పేర భట్టు సూనురనిశం విద్యుల్లలాటం తపః!' శుభకరమైన త్రిలింగదేశం (తెలుగు నేల) నాది. ప్రేమతో పెంచిన తల్లి మహాలక్ష్మీ, నా తండ్రి పేరమభట్టుల తఫః ఫలంగా నా పాండిత్యంతో విద్యుత్కవులకే వేడి పుట్టిస్తానని- సవాల్ విసిరాడు.

భరతఖండంలో ప్రసిద్ధ పట్టణాలైన వారణాసీ, తక్షశిల, ఉజ్జయినీలు గొప్ప సంస్కృత విద్యాలయాలుగా నాడు పేరు గాంచినాయి. ఉన్నత విద్య కొరకై జగన్నాథుడిని తండ్రి పేరుభట్టుల వారు సకుటుంబంతో సహా ముంగండ నుండి కాశీకి మకాంను మార్చాడు. పేరు భట్టుల చిన్ననాటి సహచర విద్యార్థియైన శ్రీశేష వీరేశ్వర పండితుని వద్ద శిష్యరికంలో పెట్టాడు. జగన్నాథుడు కాశీలో మహా పండితుల వద్ద వేదాంత, జైమినీయం, న్యాయ వైశేషికం, వ్యాకరణ షట్ శాస్త్రాలను, వాగ్విన్యాస శాస్త్రార్థ కావ్యాలంకారాదులను అభ్యసించాడు.

'భామినీ విలాస' కావ్య రచన రాజకీయ సాంఘిక వ్యవహారాల గురించి వివిధ ప్రక్రియల వర్ణనలతో కూడిన 'ముక్తక' కావ్యం. ఈ కావ్యంలో నాలుగు ప్రకరణాలు ఉల్లాసములు (విలాసములు)గా సుదీర్ఘ రచన సాగింది. ఇందు మొత్తం 365 శ్లోకాలతో నిండినదై వున్నది. ముఖ్యముగా శృంగార, కరుణ విలాసములలో ఏ భామినీతో ప్రత్యక్ష సంబంధం వున్నదో తెలియదు. కానీ, ఆ భామిని కామేశ్వరి అని కొందరు. మరికొందరు లవంగి కావచ్చుననే ఊహాగానాలు లేకపోలేదు.

వారణాసీలో కాశీ సంస్కృత విశ్వవిద్యాలయ పండిత పీఠమందు అప్పయ్య దీక్షితులవారి 'చిత్రమీమాంస' అలంకారశాస్త్ర గ్రంథంలోని ప్రథమార్ధంలో శబ్ద, గుణ, ధ్వనియూ, ద్వితీయార్ధంలో తద్భేద, ఉపమాలంకారాదులందు కావ్య స్వరూపములే విరుద్ధములని కావ్య లక్షణాలకు అవి వ్యతిరేకములు కావున కావ్యాలంకృతమైన కృత శబ్దమునకు రమణీయార్ధత లేకపోవుటయే ఇందుకు కారణమంటూ!

'రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యమ్!' అని సూత్రప్రాయంగా గ్రంథంలోని లోపాల్ని ఎత్తి చూపుతూ కావ్య లక్షణాలను విశదీకరించాడు. 'చిత్ర మీమాంస' గ్రంథంలోని దోషములను ఖండిస్తూ 'చిత్రమీమాంస ఖండనం' అనే ప్రామాణికమైన అలంకార శాస్త్ర గ్రంథాన్నీ, కాశీ సంస్కృత విద్యాలయ ప్రధానాచార్యుడైన భట్టోజీ దీక్షితుల వారి 'ప్రౌఢ మనోరమా' వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని నిశితంగా విమర్శిస్తూ- మంచి పట్టుపట్టి రాసిన మనోరమా గ్రంథంలో శబ్దాలు లేని అలంకారాలు బరువు లేని తూకం వంటిదని, కావ్య వ్రక్రోక్తి వైవిధ్యంలో తూనిక రాల్లు లేని త్రాసు వంటిదని చమత్కరించాడు. గ్రంథ తప్పులను ఎత్తి చూపుతూ 'మనోరమా కుచమర్ధనం' వ్యాకరణ శాస్త్రాలంకార సిద్ధాంత విమర్శనా గ్రంథాన్ని పండితలోకానికి అందించిన మహాపండితుడు శ్రీజగన్నాథ పండితరాయలు.

జగన్నాధ పండితరాయల రచనలలో ముఖ్యముగా 'రసగంగాధరం' నిత్యనూతనమైన అలంకారశాస్త్ర గ్రంథంగా చెప్పుకోతగ్గది. రసప్లావ ఉపమాలంకృత ముక్తము యీ రసగంగాధరము. ఈ గ్రంథములో నాయకమణి ఒక విరోభూషణంగా విరాజిల్లుతోంది. ఢిల్లీ పాలకులైన మొగల్ చక్రవర్తి శెహబుద్దీన్ షెహన్‌షా శ్రీషాజహాన్ పాదుషా వారి పాలనా కాలం క్రీ.శ. 1628-1658 వరకు నడిచింది.

ఢిల్లీ దర్బారులో మహాపండితులు విద్వాంసులు సామంతరాజుల సమక్షంలో అనితర సాధ్యమైన వివిధ ప్రక్రియల శాస్త్రాపాండిత్యంలో అష్టప్రధాన పండితులలో తన ప్రతిభను చాటి పాదుషా వారి మెప్పు పొందుటయే గాక అర్ధ సింహాసనంపై ఆహ్వానింపబడి భారతదేశ ప్రతిష్ఠాత్మకమైన 'పండితరాజు' బిరుదముతో ఘనంగా సత్కారం పొందాడు. షాజహాన్ చక్రవర్తి కుమారుడైన దారాషికోహ్ యువరాజును తన ప్రియశిష్యునిగా పరిగణించాడు.

పాదుషా వారి కొలువులో తన గాన మాధుర్యంచే సంగీతాన్ని వినిపించి సభికులను ఉర్రూతలూగించిన గాయక శిఖామణిగా పాదుషావారి చేతుల మీదుగా 'సంగీత కళాసుధానిధి' 'సంగీత గానసుధ' 'గాన సముద్ర' బిరుదములతో సత్కారమొందాడు. ఢిల్లీపుర వీధుల్లో ఏనుగు అంబారిపై గజారోహణ ఊరేగింపులతో సత్కార సన్మానములు పొందాడు. ప్రసిద్ధ ఫ్రెంచి వైద్యుడు ప్రాంచెస్ బర్నియర్ తన 'ది ట్రావెల్స్ ఇన్ ది మొగల్ ఎంపైర్ బై బర్నియర్' అనే యాత్రా గ్రంథంలో జగన్నాథ పండితరాయల వారి గురించి వ్రాయబడినది.

జగన్నాథ పండితుల వారి పంచ లహరుల రచనా మాధురి మధురిమలు విలసిల్లుతూ, కమనీయ కవితా రీతులతో విరాజిల్లుతూన్న- అవి 1) అమృత లహరి 11 శ్లోకాలయమునాస్తుతి. 2) కరుణా లహరి 65 శ్లోకాలతో గల విష్ణుస్తుతి. 3) లక్ష్మీలహరి 41 శ్లోకాలు గల బీజాక్షర సహిత లక్ష్మీస్తుతి. 4) సుధాలహరి 30 శ్లోకాలతో కూడిన సూర్య దేవుని స్తుతి. 5) గంగాలహరి 53 శ్లోకాలున్న గంగాస్తుతి. ఇదే పీయూష లహరి అనే నామాంతరం గల ప్రసిద్ధ లఘు కావ్యం.

'ఇమాం పీయూష లహరీం జగన్నాథేన నిర్మితాం యః పఠేత్తస్త సర్వత్ర జాయంతే సర్వ సంపద!' ఇందు మొదటి శ్లోకమిది. జగన్నాథ పండితరాయలు 15 అలంకార శాస్త్ర వ్యాకరణ సిద్ధాంత గ్రంథాలు మరో మూడు సంస్కృత నాటకాలు రచించినట్లు తెలుస్తూంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'మహాకవి కాళిదాస్ సమ్మాన్' పేర ప్రతి ఏటా పండితులను సన్మానిస్తోంది. మహాపండితుడు, అలంకార శాస్త్ర వ్యాకరణ లాక్షిణుకుడు, అలంకారీకుడు అయిన జగన్నాథుడు షాజహాన్ చక్రవర్తి చేతుల మీదుగా భారతదేశ ప్రతిష్ఠాత్మకమైన 'పండితరాజ' బిరుదంను పొందినందుకు, తెలుగు బిడ్డడై పుట్టినందుకు మనం గర్వపడాలి. ఆ మహాపండితుని పేర పురస్కారం లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ నిద్రాణతకు సిగ్గుపడాలి. మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం. శోచనీయం.

                                                                                                                               -కె.వి.యల్.యన్.శర్మ
                                                                                                                            -"ఆంధ్రజ్యొతి" సౌజన్యంతో  .