మల్లంపల్లి సోమశేఖర శర్మ |
రాగిరేకులలో, రాతిఫలకాలపై ముద్రితమైన తెలుగు చరిత్రను చైతన్యవంతం చేసిన మహనీయుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ. చరిత్రలో విస్తృతమైన అంశాలను తవ్వితీసి ఆంధ్రుల ప్రశస్తిని, సంస్కృతిని, చారిత్రక వైభవాన్ని ఆవిష్కరించిన అసాధారణ ప్రజ్ఞాశాలి మల్లంపల్లి. చరిత్ర అధ్యయనం, శాసన పరిష్కరణ, సాహిత్యం, యిలా ఆయన అభినివేశంలేని అంశమే లేదనటంలో అతిశయోక్తి లేదు. చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రజ్ఞుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ డిగ్రీలులేని పండిత శిరోమణి. ఆంధ్ర చరిత్రకారుల్లో ప్రథమశ్రేణికి చెందిన పరిశోధక శిఖామణి. కథలు, నవలలు, కవితలు, నాటకాలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించారు. ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు చిలుకూరి వీరభద్రరావుతో కలిసి రచించారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, అచంట లక్ష్మీపతి, రాయప్రోలు సుబ్బారావు వంటి మహానుభావుల సరసన నిలిచి ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకరైనారు. 1891, డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం, మినిమించిలిపాడు గ్రామంలోని నిరుపేద కుటుంబంలో భద్రయ్య, నాగమ్మ దంపతులకు ఈయన జన్మించారు. రాజమండ్రిలో మేనమామ అయ్యగారి ఉమామహేశ్వర రావు ఇంట వుంటూ మెట్రిక్యులేషన్ చదివారు. రాజమండ్రిలోనే చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి దేశమాత పత్రికలో సహాయ సంపాదకునిగా ఆయన చేరారు. ఆ పత్రికలో చాలా రచనలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు. ఆ పత్రికకు చారిత్రక పరిశోధన వ్యాసాలు రాసే చిలుకూరి వీరభద్రరావుతో మల్లంపల్లికి పరిచయమైంది. ఆ పనికి అవసరమైన ఆకారాల సేకరణలో వీరభద్రరరావుకి మల్లంపల్లి తోడ్పడ్డారు. ఇది వారికి కాలేజీలో చదవ లేదన్న లోటును భర్తీ చేసింది. ఆయన దగ్గర చరిత్ర శోధనలో శిక్షణ పొందారు. తెలుగు చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టించారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ చిలుకూరి వీరభద్రరావుకి అందించిన సంపూర్ణ సహకారం, చేసిన కృషి ఫలితంగా కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ప్రచురణ ఆంధ్రుల చరిత్ర గ్రంథం చాలా ప్రామాణికంగా రూపొందింది. గురజాడ అప్పారావుగారు ఈ గ్రంథాన్ని యిలా ప్రశంసించారు. ''స్వతంత్రమైన పరిశోధనలు చేసి దీనిని రాసారు. రాజులు మత సంస్థలకు ఎంతెంత ధనమిచ్చింది, యేయే దానధర్మాలను చేసిందీ, యీ పుస్తకమంతా వర్ణింపబడింది, కులాలను గురించి ఏటూ తేలని వివాదగ్రస్త విషయాలను ఈ గ్రంధం వివరిస్తుంది''
''ఆంధ్ర చరిత్ర''లోని ఉత్తేజకరమైన ఘట్టాలను శర్మ రచించినా పఠనం చేసినా విన్నవారు ప్రభావితులయ్యేవారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి'ని రచించి మల్లంపల్లికి అంకితమిస్తూ యిలా అంటారు.
''డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకు
రాని యీ పాడుకాలాన బుట్టి
నీ చరిత్ర జ్ఞాన నిర్మలాంభ: పూర
మూషర క్షేత్ర పదోదకమయి''
చరిత్ర రచనలు రాజకీయ పరిణామాలతో పాటు సమకాలీన సాంఘిక, ఆర్థిక, మత, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబింపజేసే ఆధునిక చరిత్ర రచనా ప్రక్రియకు మల్లంపల్లి ప్రారంభికులు, 'విజ్ఞాన చంద్రికా మండలి' స్థాపకులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు ఆహ్వానం మేరకు 'ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం' రచనలో భాగస్వామియై మద్రాసు చేరారు. శాస్త్రీయ పద్ధతులలో పరిశోధన చేసే నైపుణ్యాన్ని పొందారు. 1923లో కొమర్రాజు లక్ష్మణరావు మరణించే వరకు వారి వద్దనే పనిచేశారు. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి ఆహ్వానంపై 'భారతి' సాహిత్య మాసపత్రిక సంపాదకులుగా వ్యవహరించారు.
మల్లంపల్లిగారు పురాతత్వ శాఖవారి సహకారంతో ప్రాకృత, కన్నడ భాషలలో ఉన్న తెలుగు శాసనాలను పరిష్కరించారు. తూర్పు గాంగులు, తూర్పు చాళుక్యులు, బాదామి చాళుక్యులు, రేనాటి చోళులు, విజయనగర రాజులు మొదలైనవారి శాసనాలు ఎన్నింటినో ఆయన స్వయంగా సేకరించి తెలుగులోకి అనువదించి 'భారతి'లో ప్రచురించారు. దేశంలోని అనేక ఆంగ్ల పత్రికలు వీరి వ్యాసాలను అనువదించి ప్రచురించారు.
మద్రాసులో మల్లంపల్లి వారి ఇల్లు ఒక సాహితీసదనంగా వెలుగొందుతూండేది. అడవి బాపిరాజు, పంచాగ్నులు ఆదినారాయణ శాస్త్రి, కొంపెల్ల జనార్దనరావు, చావలి బంగారమ్మ, ఖాసా సుబ్బారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, కోలవెన్ను రామకోటేశ్వరరావు వంటి సాహితీవేత్తలు, కవులు, రచయితలు, చారిత్రక పరిశోధకులు వీరి ఇంట్లో తరుచు, సమావేశమయ్యేవారు. శ్రీశ్రీగా ప్రసిద్ధిగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు, నండూరి సుబ్బారావు ముఖతా 'యెంకి పాటలు' విశ్వనాధ సత్యనారాయణ గారి ద్వారా 'కిన్నెరసాని పాటలు' విని పరవశించిపోయాడు.
శాసనాల పరిశోధన క్రమంలో నేలటూరి వేంకటరమణయ్య గారితో పరిచయం, సాంగత్యం ఏర్పడ్డాక మల్లంపల్లి వారి పరిశోధన వేగవంతం గాఢతరమైంది. కట్టమంచి రామలింగారెడ్డిగారు మల్లంపల్లివారి కృషిని గుర్తించి, 1936లో వీరిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర ఉపన్యాసకులుగా నియమించారు. అక్కడ పనిచేసిన పది సంవత్సరాలలోను వీరు 'హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్‌డమ్', 'ఫర్గాటేన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్రా హిస్టరీ' అనే గ్రంధాలను ఆంగ్లంలో ప్రచురించి ఆంధ్ర దేశ చరిత్రకారులలో అగ్రస్థాయి పరిశోధకులుగా గుర్తింపు, సుస్థిర స్థానం పొందారు.
స్వాతంత్య్రానంతరం 'తెలుగు భాషా సమితి' వారు ప్రారంభించిన 'విజ్ఞాన సర్వస్వము' సంపుటాలలో 'తెలుగు సంస్కృతి' సంపుటానికి సంపాదకవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. 1957 నాటికి తన విశేషానుభవంతో ఆ బృహత్ సంపుటాన్ని ప్రచురించగలిగారు మరలా వి.ఎస్. కృష్ణగారి అభ్యర్థనపై రెండవ పర్యాయం చరిత్ర ఉపన్యాసకునిగా చేరి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అనేక పరిశోధనలకు మార్గనిర్దేశకులయ్యారు. సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులుగా కళాప్రపూర్ణ బిరుదు పొందారు.
ఆంధ్రదేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను ఆయన స్వీకరించారు. ఒంటరిగాను, స్నేహితుడు నెలటూరి వెంకటరమణయ్యతో కలిసి నెల్లూరు జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు చేశాడు. ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని 'ఎర్రగుడిపాడు శాసనం' పల్లవ, తెలుగు చోడ, రెడ్డి విజయనగరరాజుల కాలం నాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి. తాను సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ 'ఎపిగ్రాపియా ఇండియా', 'భారతి', 'శారద' వంటి పత్రికలలో వ్యాసాలు రాశారు. ఘంటసాల ప్రాకృత శాసనాల గురించి ఆయన రాసిన వ్యాసం ఆయన మరణం తర్వాత ప్రచురితమైంది. శాసనాల లిపిని పరిశోధించడంలో అఖిల భారత గుర్తింపు పొందిన ఆంధ్ర చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మగారొక్కరే అని చెప్పవచ్చు. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశీలించి సమన్వయం శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవారు. తన నిర్ణయాన్ని పున:పరిశీలించి సరిదిద్దుకోవడానికి ఎదుటివారి సూచనలను, సవరణలను ఆయన గౌరవించేవారు. లిపిశాస్త్రంలోనే గాక వాస్తు, శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో ఆయన నిష్ణాతులు. 'అమరావతీ స్థూపము' అన్న ఆయన రచన దీనికి నిరూపణ. విజయవాడలో మొగల్ రాజపురంలోని దుర్గ గుహలో మూల విరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య శిల్పాన్ని గుర్తించి అది అర్ధనారీశ్వరమూర్తి అని సహేతుకంగా నిరూపించారు.
సోమశేఖర శర్మ తన అధ్యయనాన్ని మధ్య ఆంధ్రయుగ చరిత్రపై సాగించారు. సమస్యాభూయిష్టమైన వేంగి చాళుక్యుల కాల నిర్ణయంపై కూలంకషంగా కృషి చేశారు. కాకతీయులు అన్నా, తెలంగాణా అన్నా ఆయనకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రాంతం రాజవంశాలకు సంబంధించిన 80కి పైగా శాసనాలను లఘువ్యాఖ్యతో ప్రచురించారు. తన స్నేహితుడు, నేలటూరు వేంకటరమణయ్యతో కలిసి ఆచార్య యజ్ఞాని సంపాదకత్వంలో వెలువడిన 'అర్లీ హిస్టరీ ఆఫ్ డెక్కన్'లో సమ్రగమైన కాకతీయుల చరిత్రను రాశారు. కాకతీయుల తరువాత 'అంధకారయుగం' గురించి పరిశోధన చేశారు. క్రీ.శ. 1323-1336 కాలంలో ముసునూరు కాసయ నాయకుడు, ముసునూరు ప్రోలయ నాయకుడు తుర్కుష పాలకులతో స్వాతంత్య్ర పోరాటం సాగించడం, కాసయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి మల్లంపల్లి వారు తన ''ఫర్‌గాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్రా హిస్టరీ''లో వివరించారు. ఈ 'ముసునూరు యుగం' రాజకీయంగా సువర్ణ ఘట్టమని మల్లంపల్లివారు నిరూపించారు. వీరి పరిశోధనలో అగ్రస్థానం వహించే రచన ''ది హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్‌డమ్ అండ్ రాజమండ్రి'' అసంఖ్యాకమైన శాసనాలనూ, కవుల కావ్యాలనూ, ముస్లిం చరిత్రకారుల రచనలనూ పరిశోధించి నమ్మదగిన సమాచారాన్ని నిగ్గుతేల్చి తయారు చేశారు మల్లంపల్లిగారు. మల్లంపల్లి తన 'ఆంధ్రదేశంలో బౌద్ధ సంప్రదాయాలు' అనే వ్యాసంలో బుద్ధుడు జీవించిన కాలంలోనే దక్షిణాపథంలో ప్రత్యేకంగా ఆంధ్రదేశంలో ఆయన బోధనలు ప్రజలను ప్రభావితం చేశాయని చెప్పారు. టిబెట్ దేశ బౌద్ధ గ్రంథాల ఆధారంగా ఈ చారిత్రక అంశాన్ని వివరిస్తూ బుద్ధుని సమకాలికుడైన బిందుసార మహీపతి సమక్షంలో మహాసంబోధి వరకు బుద్ధ జీవితాన్ని దక్షిణ పథానికి చెందినవాడొకడు నాటకంగా ప్రదర్శించాడు, మౌర్యుల తరువాత బౌద్ధానికి తెలుగుదేశం ఆశ్రయమిచ్చిందని ఆయన రాశారు. క్రీ.పూ. 6వ శతాబ్దినాటికే తెలుగుజాతి రాజ్యవ్యవస్థ కలిగి ఉందని, ఈ జాతి ప్రాచీనతని ఆయన వివరించారు.
చరిత్రకు సంబంధించిన వచన రచనలో మల్లంపల్లి ప్రత్యేక ఆసక్తిని చూపారు. 'పాదుకా పట్టాభిషేకం' నాటకం, 'రోహిణీ చంద్రగుప్త', 'అరణ్యరోదనము', 'వివేకము గల మంత్రి' అనే నవలలు, 'ఆంధ్రవీరులు', 'ప్రాచీన విద్యాపీఠాలు', 'ప్రాచీన ఆంధ్ర నౌకాజీవనం' అనే ప్రామాణిక చారిత్రక వ్యాసాలు, రచనలో తన ప్రజ్ఞాపాటవాలను ప్రయోగించారు. అమరావతి స్థూపం, ఇతర వ్యాసాలు, కొన్ని చారిత్రక వ్యాసాలు, ప్రాచీన వృత్తి విద్యా విధానము, మన ప్రాచీన విద్యాసంస్థలు, అనాదృత వాఙ్మయము, బౌద్ధవాఙ్మయ పరిశోధన, నా నెల్లూరు జిల్లా పర్యాటన, నామాన్వేషణ యాత్రలో ఎదుర్కొన్న సమస్యలు, కష్టనష్టాలు వీరి ఇతర రచనలు, ఆంధ్రవీరులు, విజయ తోరణము - రేడియో నాటికలు, ఆంధ్ర సంస్కృతి తరంగిణి, ఆంధ్ర చరిత్ర సంగ్రహం, రెడ్డిరాజుల చరిత్ర అనే గ్రంథాలను కూడా మల్లంపల్లి సోమశేఖర శర్మ రచించారు. 1963, జనవరి 7వ తేదీన ఆయన తన జీవనయాత్ర చాలించారు.
మంగు శివరామ ప్రసాద్
(అంధ్ర ప్రభ దినపత్రిక సౌజన్యంతో..)
No comments:
Post a Comment