Saturday, March 20, 2010

తెలుగుతల్లికి 'ప్రాచీన' పూదండ: మండలిలో రోశయ్య

హైదరాబాద్‌: తెలుగుతల్లి గళసీమలో ప్రాచీన భాష హోదా మాలను అలంకరించుకున్నామని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. శాసనమండలి, శాసనసభలోనూ సభ్యుల హర్షధ్వానాల మధ్య శుక్రవారం ఆయన ఈ విషయం తెలియజేశారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2006 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబరు 31న ఒక నోటిఫికేషన్‌ జారీ చేస్తూ చెన్నై హైకోర్టులో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం తీర్పునకు ఇది లోబడి ఉంటుందని తెలియజేసిందని వెల్లడించారు. సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్‌ జె.గీతారెడ్డి ఇటీవల తెలుగు భాషావేత్తల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారని, ఈ విషయంలో సహకరించాల్సిందిగా ఎంపీలను కోరారన్నారు. ఇందుకు స్పందించిన ఎంపీలు ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రికి లేఖలు రాశారని తెలిపారు. దీనిపై వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన మైసూరులోని భారతీయ భాషల అధ్యయన సంస్థ సంచాలకులు, విశ్వవిద్యాలయ విరాళాల సంఘ అధ్యక్షులకు లేఖను పంపిందని వెల్లడించారు. దీంతో తెలుగువారి చిరకాల కోరిక నేరవేరిందని సీఎం అన్నారు. ఇందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరినా అందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భాషావేత్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్టీఆర్‌ హయాంలో అధికార భాషా మంత్రిత్వశాఖ ఉందని, దాన్ని పునరుద్ధరించాలని దాడి వీరభద్రరావు చేసిన సూచనకు సీఎం సానుకూలంగా స్పందించారు.

Wednesday, March 17, 2010

తెలుగు భాష పరిరక్షణకు ఇంటింటి ప్రచారం!

మైదుకూరు; ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగును అమలు పరిచేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి, కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి కోరారు. ఉగాది పర్వ దినాన్ని పురష్కరించుకొని తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఉద్యమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ లో మంగళవారం తెలుగు ఉధ్యమ ప్రచార గీతాల సిడి ని తవ్వా ఓబుల్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే ఉద్యమ నినాదాల స్టిక్కర్లను ఎస్‌టియు రాష్ట్ర నాయకుడు ఎపి శ్రీనివాసులు, కరపత్రాలను అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డివిఎస్‌ నాయుడు, మైదుకూరు ఉధ్యమ గీతాన్ని రాటా అధ్యక్షులు కొండపల్లి శేషగిరి ఆవిష్కరించారు.
చీరాలలో ఈ నెల 14న జరిగిన తెలుగు భాషోద్యమ సమాఖ్య సర్వ సభ్య సమావేశ వివరాలను శాఖ ఉపాధ్యక్షులు ఎ. వీరాస్వామి వెళ్లడించారు. తెలుగు భాషపై సమాఖ్య చేపట్టిన ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్లేందుకు సమాఖ్య అధ్యక్షుడు దాక్టర్ సామల రమేష్ బాబు అధ్యక్షతన రూపొందించిన కార్యక్రమంపై కార్యవర్గం చర్చించింది. 1నుండి 10వ తరగతి వరకు తెలుగు ఒక అంశంగా తప్పని సరిగా పాఠశాలల్లో భోదించేందుకు ఉద్యమాన్ని నిర్మించాలని, తెలుగులో మాట్లాడడం నేరంగా పరిగణించే పాఠశాలలపై చట్టపరమైన చర్యలకు డిమాండ్‌ చేయాలని కూడా ఈ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం వెంకట సుబ్బయ్య, సంయుక్త కార్యదర్శి ధరిమి శెట్టి రమణ, బాబయ్య, మహానందప్ప, పాల కొండయ్య, మల్లేశ్వర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Tuesday, March 16, 2010

ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు!


తెలుగు సాహితీ మిత్రులకూ,
తెలుగు వారందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Saturday, March 13, 2010

తెలుగుకు ప్రాచీన హోదాపై మళ్లి కదలిక

న్యూఢిల్లీ,మార్చి13 : తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి కల్పించిన సౌకర్యాలు అమలుచేయవలసిందిగా కోరుతూ కేంద్రం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌కు, మైసూరులోని భారతీయ భాషల కేంద్రం సంస్థకు లేఖలు రాసింది. మానవ వనరుల మంత్రిత్వశాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ అనితా భట్నాగర్‌ జైన్‌ యుజిసి, సిఐఐఎల్‌లకు లేఖలు రాశారు. తెలుగుకు ప్రాచీనహోదా కల్పిస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని సౌకర్యాలు అమలుచేయడంలో ఎలాంటి అడ్డంకులూ లేవని న్యాయమంత్రిత్వ శాఖ స్పష్టీకరించడంతో యుజిసి, సిఐఐఎల్‌ ఇక తదుపరి చర్యలు తీసుకోవచ్చునని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. తెలుగుకు ప్రాచీన హోదా అమలుపై రాష్ట్రప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు లక్ష్మీప్రసాద్‌ ఈ లేఖలను శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు.
ప్రస్తుతం కొన్ని కేంద్రీయ యూనివర్సిటీలలో తెలుగులో ప్రతిభావంతులైన పండితులకు కొన్ని పీఠాలు ఏర్పాటుచేయవలసిందిగా అనితా భట్నాగర్‌ యుజిసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌కు రాసిన లేఖలో నిర్దేశించారు. ఈ ఉన్నత పీఠాల్లో నియమించే పండితుల వయసు, కాలపరిమితి, అర్హతలు, వేతన భత్యాలు మొదలైనవి యుజిసి తర్వాత నిర్ణయించవచ్చునని ఈ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్‌ స్థాయిలో నిర్ణయం తీసుకున్న రీత్యా ఈ చర్యలకు గట్టి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఇక, ప్రాచీన భాష అయిన తెలుగులో పండితులకు రెండు ప్రధాన అంతర్జాతీయ అవార్డులను వార్షికంగా ప్రకటించాల్సి వుందని మైసూరులోని సిఐఐఎల్‌కు కూడా కేంద్రం లేఖ రాసింది. సిఐఐఎల్‌లో భాగంగానో, లేదా సాహిత్య అకాడమీలో భాగంగానో ప్రాచీన హోదా గల భాషల్లో అధ్యయనాలకు ఒక ఉన్నత ప్రతిభా కేంద్రాన్ని ఏర్పరచాలని కూడా అనితా భట్నాగర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తగిన భూమిని, సరైన మౌలిక సదుపాయాలను, ఫ్యాకల్టీని, పరిశోధకులను, ఇతర సిబ్బందిని నియమించాల్సి వుందని కూడా తెలిపారు.
అంతర్జాతీయ అవార్డులు, కన్నడ, తెలుగు భాషల్లో అధ్యయనంకోసం ప్రతిభాకేంద్రాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకోవలసిందిగా ఆమె సిఐఐఎల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ సచ్‌దేవను కోరారు. నాలుగురోజులక్రితం ఢిల్లీ వచ్చిన లక్ష్మీప్రసాద్‌ తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు 40మంది ఎంపిల సంతకాలతో కూడిన లేఖలు సమర్పించడమే కాక, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీని కులుసుకున్నారు. ప్రాచీన హోదా కల్పించేందుకు న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని మొయిలీ స్పష్టంచేసిన విషయం విదితమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ఈ బృహత్కార్యం ఎట్టకేలకు నెరవేరిందని, ముఖ్యమంత్రి రోశయ్య, రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారని, తెలుగుకు ప్రాచీన హోదా అమలయ్యేలా చేసిన ఘనత వీరికి దక్కుతుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు.

Monday, March 8, 2010

అమ్మ భాష పరిరక్షణకు బెంగళూరులో సదస్సు

బెంగళూరు, మార్చి 7 : అదో విశిష్ట కార్యక్రమం. ఆంగ్ల వ్యామోహ పెనుతుపానులో కొట్టుకుపోతున్న మాతృభాషల్ని పరిరక్షించుకునే వ్యూహాన్ని చర్చించేందుకు ఏర్పాటైన సదస్సు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా, గోవా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు. ఆయా రాష్ట్రాల్లో మాతృభాష దుస్థితి, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. సదస్సు తీర్మానాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
మాతృభాష పరిరక్షణ మన లక్ష్యం కావాలి... సంరక్షణకు నడుం బిగిద్దామని ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.
నగర శివార్లలోని వాగ్దేవి విలాస్‌ విద్యాలయ ప్రాంగణం విశిష్ట కార్యక్రమానికి వేదిక అయింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు భారతీయ మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర మాతృభాషా పరిరక్షణ తొలి సదస్సును ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి అధ్యక్షుడు ఎ.చక్రపాణి, బెంగళూరు కోళదమఠాధిపతి శాంతవీరమహాస్వామి ఆరంభించారు. ఆయా రాష్ట్రాల్లో అమ్మభాష దుస్థితి, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి డాక్టర్‌ అశోక్‌ కామత్‌ (మహారాష్ట్ర), డాక్టర్‌ చిదానందమూర్తి (కర్ణాటక), డాక్టర్‌ ఉద్గాత (ఒరిస్సా), ఆచార్య డి.కృష్ణమూర్తి (బెంగళూరు), దామోదర మౌజో (కొంకణి) తదితరులు తమ ప్రసంగాల్ని కొనసాగించారు. యునెస్కో ఇటీవల ప్రకటించిన సర్వే నివేదికపై విస్తృతంగా చర్చించారు. మాతృభాషలు
మృతభాషలుగా మారకుండా తీసుకోవాల్సిన చర్యల్ని ప్రస్తావించారు. సాయంత్రం వరకు సదస్సు కొనసాగింది.
దేశం నుంచి బ్రిటిష్‌ పాలకుల్ని తరిమికొట్టినా వారి ఆంగ్లాన్ని వదల్లేకపోతున్నామని ఎ.చక్రపాణి విచారం వ్యక్తం చేశారు. కోళదమఠాధిపతి శాంతవీరస్వామి ప్రసంగిస్తూ... మాతృభాషలకు తగినంత ప్రాధాన్యత లభించడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ఆంగ్ల వ్యామోహం అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మభాషను గౌరవించని వ్యక్తుల్ని గుర్తించవద్దని హితవు పలికారు. కర్ణాటకలో పాలనా భాషగా కన్నడ అమలును కచ్చితంగా పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ... తెలుగు, కన్నడలకు ఏడాది క్రితమే ప్రాచీన హోదా లభించినా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందనే నెపంతో కేంద్రం నిధులు విడుదల చేయటం లేదు. కేసు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదే సమయంలో భాషాభ్యున్నతికి తగినన్ని నిధుల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. నిధుల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ఎల్‌. వివేకానంద, కె.సి.కల్కూర, కె.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, March 2, 2010

తెలుగు భాషొద్యమ సమాఖ్య సర్వసభ్య సమావేశం చీరాలలో 14న

తెలుగు భాషోద్యమ సమాఖ్య సర్వసభ్య సమావేశం 2010 మార్చి 14 వ తేదీన ప్రకాశం జిల్లా చీరాలలో జరుగుతుంది. తె.భా.స కేంద్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రంలో తెలుగు భాష ఉనికికే ముప్పు వాటిల్లే రీతిలో మైదుకూరు, విజయవాడ, మహబూబ్ నగర్ తదితర చోట్ల తెలుగు భాషను అవమాన పరిచే రీతిలో జరిగిన ఈ సంఘటనలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. తెలుగు భాష పరిరక్షణకు సరైన చర్యలను తీసుకోవాల్సిందిగా ప్రభుత్వంపై ఈ సమావేశం వత్తిడి తీసుకురానుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ సమావేశానికి సమఖ్య ప్రతినిధులు హాజరవుతారు.