Monday, April 18, 2011

తెలుగు భాషోద్యమ సమాఖ్య " కావలి " శాఖ ఆవిర్భావం !

నెల్లూరు జిల్లా కావలిలో తెలుగు భాషోద్యమ సమాఖ్య నూతన శాఖ ఏర్పాటైంది. కావలిలో ఈ నెల 17 న శాఖకు నూతన కార్వర్గం ఎన్నిక జరిగింది. సమాఖ్య కేంద్ర కమిటీ అధ్యక్షులు  డాక్టర్ సామల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా అదే రోజు సాయంత్రం ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.      

అంతర్జాలంలో తెలుగు అంతర్‌ 'జ్వలమై' ఇక వెలుగు!

తెలుగు వారికి అంతర్జాలం (ఇంటర్నెట్‌) ఇంకా బాగా ఉపయోగపడాలంటే 'ఎన్‌కోడింగ్‌ స్టాండర్డైజేషన్‌' జరగాలి. హైదరాబాద్‌లో గత శనివారం ఇదే మొదటిసారిగా ఇంటర్నెట్‌కి, తెలుగు భాషకి గల సంబంధంపై సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, సిలికానాంధ్ర ఉమ్మడిగా నిర్వహించిన ఈ సదస్సులో తెలుగు భాషకు 'యూనికోడ్‌' రూపొందించే కృషి గురించి విపులంగా చర్చ జరిగింది. అనేక సంస్థలు ఈ దిశగా ఎంతో కృషి పరిశోధనా పరంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టకపోవడంతో సమన్వయ లోపం వల్ల ఆ కృషి ఎక్కడిదక్కడే ఉండిపోతోంది. ఒక ఫాంట్‌లో టైప్‌ అయిన విషయం మరో ఫాంట్‌లోకి పోదు కాబట్టి అదే కంప్యూటర్‌లో చూసుకోవాలి. లేదా అదే ఫాంట్‌లో ఓపెన్‌ చేయాలి. ఈ సమస్య వల్ల 'అంతర్జాలం' అన్నది తెలుగు భాషకు అంతగా ఉపయోగపడకపోగా సమాచార మార్పిడి సమస్య ఘోరంగా ఉంది. తెలుగుకు ఉన్న ఈ సమస్య ఇంగ్లీషుకు లేదు. ఇ మెయిల్‌లో పంపిన తెలుగు మేటర్‌ ప్రింట్‌ తీసుకొని తిరిగి కంపోజ్‌ చేసుకోవలసిన దుస్థితి ఉంది. ప్రోగ్రామింగ్‌ సహకరించకపోవడం వల్ల ఇలా జగుగుతోంది. ఇక్కడ సమయం వృధా అవుతోంది. అట్లాస్‌ ష్రగ్డ్‌అని ఇప్పటి ప్రపంచాన్ని ముద్దుగా పిలుచుకుంటున్నాము. కాని తెలుగు భాషకు సంబంధించినంత వరకు కంప్యూటరైజేషన్‌ సౌలభ్యం చాలా పరిమితంగా ఉండి ఇంకా అట్లాస్‌ ఎక్స్‌పేండెడ్‌గానే పడి ఉంది. యూనికోడ్‌ను (ఏ ఫాంట్‌నైనా ఇందులోకి కన్వర్ట్‌ చేయవచ్చు) రూపొందించే కృషికి సమన్వయ లోపాన్ని పూడ్చడం కోసం సిలికానాంధ్ర ముందుకు వచ్చిందని దాని ప్రతినిధి శ్రీ కూచిభొట్ల ఆనంద్‌ సాహితీ గవాక్షానికి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 'ఎన్‌కోడింగ్‌ స్టాండర్డైజేషన్‌' జపాన్‌, చైనా తుదకు మంగోలియా భాషలకు కూడా జరిగిందని చెప్పారు. దీనికి ముఖ్యం ఫాంట్‌ కన్వర్టర్‌ అని వివరించారు. అనేక సంస్థలు సాగిస్తున్న పరిశోధనా ఫలితాలకు అనుసంధాన కర్తగా, సమన్వయ కర్తగా వ్యవహరించడానికి సిలికానాంధ్ర ముందుకు వస్తున్నదని తెలిపారు. 'అంతర్జాలాని'కి ప్రామాణిక తెలుగు ఉంటే బాగుంటుందని ఆయన చెబుతూ ఇందుకు సాంకేతిక పరంగా ఇంగ్లీషుకున్న సౌలభ్యం తెలుగుకు లేదని చెప్పారు. తెలుగుకు అనేక వాడుక భాషలు, యాసలు, మాండలికాలు ఉన్నట్టుగా ఇతర భాషలకు కూడా ఉన్నప్పటికీ ఇంగ్లీషువంటి విదేశీ భాషలకి ప్రామాణిక భాషలు కూడా నిర్దిష్టంగా ఉండడంతో ఇంటర్నెట్‌ పదజాలం ఆయా భాషలకు ప్రత్యేకంగా రూపొందిందని వివరించారు. తెలుగువారు కూడా ప్రామాణిక భాషను అంతర్జాలంలోకి తేవాలని సూచించారు. ఆ దిశగా కృషి చేద్దామని అన్నారు. కేవలం భాషకోసం ఇన్ని లోపాలు భరించే బదులు ఇంగ్లీష్‌ ఇంటర్నెట్‌ భాషని మనంకూడా వర్తింపజేసుకుంటే తప్పేమిటి అని అడగ్గా -అప్పుడు కొంతకాలానికి ప్రపంచంలో ఒక్క ఇంగ్లీషు తప్ప ఇంకే భాష మిగలదు. సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రత్యేకతలు అన్ని భాషతో ముడిపడి ఉంటాయి. భాష మాయమైతే అవన్నీ పోయి సంస్కృతి రీత్యా ప్రపంచం అంతా ఒకేరకంగా మిగులుతుంది. కాబట్టి భాషా పరంగా అలా చేస్తే ఆత్మహత్యా సదృశ్యమౌతుందని ఆనంద్‌ చెప్పారు. రెండేళ్లలో తెలుగులో యూనికోడ్‌ సాధ్యమౌతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే యూనికోడ్‌ దిశగా అనేక సంస్థలు సాగిస్తున్న పరిశోధనలు పురోగతి సాధించినా సమన్వయకర్త లేకపోవడం వల్ల అవి వెలుగులోకి రావడం లేదని ఆయన చెప్పారు. ఇంటర్నెట్‌ మంచి కంటే చెడుకు ఎక్కువ ఉపయోగపడుతోంది కదా అని అడగ్గా, అందుకు సాంకేతిక పరిష్కారం ఉన్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయాలు కూడా విరివిగా వస్తున్నాయని చెప్పారు. ఉదాహరణకి చైనా అంతర్జాలంనుంచి బూతుని నిషేధించినట్లు చెప్పుకొంటోంది కానీ వాస్తవానికి అక్కడ కూడా పరిమితులు లేవని చెప్పారు. ఇది సాంకేతికంగా వీలుకాదని వివరించారు. ఎందుకంటే నిషేధానికి ముందు నిర్వచనం సిస్టంకి లోడ్‌ చేయాలని, ఆ నిర్వచనం ప్రకారం మన ప్రాచీన గ్రంథాలు, అన్నమయ్య పాటలు అన్నీ కూడా 'నాట్‌ యాక్సస్‌బుల్‌' అవుతాయని చెప్పారు. ఎంతో సృజనని భావితరాలు ఆ విధంగా కోల్పోతాయని వివరించారు. సదస్సులో పాల్గొన్న శ్రీ మండలి బుద్ధప్రసాద్‌ను అంతర్జాలానికి మాండలికాల మధ్య పరివర్తన సాధించి కొత్త మాండలిక సమ్మిశ్రమాన్ని రూపొందించే బదులు ప్రామాణిక భాషనే వాడుకుంటే బాగుంటుంది కదా అని సాహితీగవాక్షం ప్రశ్నించింది. అందుకాయన భాష సుసంపన్నం కావాలంటే మాండలికాలని కూడా గ్రహించాలని, ఇప్పుడు ఈ సదస్సులాంటివి జరుగుతున్నది అందుకేనని వివరించారు. మాండిలికాల పరిరక్షణలో భాగంగా ప్రత్యేక అంతర్జాల భాష సృష్టికి కృషి సాగాలని చెప్పారు. ట్రిపుల్‌ ఐటిలలో తెలుగు భాష సంస్కరణకు సాగుతున్న కృషిని ఈ సదస్సులో వక్తలు వివరించారు. ఉదాహరణకి హైపర్‌ టెక్ట్స్‌ అంటే అధిపాఠం. హైపర్‌ మీడియా అంటే అధిమాధ్యమం, వర్డ్‌ ఫైల్‌ అంటే శబ్దదస్తరం.

కంప్యూటర్‌ని సంగణక అనమంటున్నారు. ఆటోమేటిక్‌ పదానికి స్వయంచాలక వాడమంటున్నారు. హైపర్‌ గ్రామర్‌ పదానికి అనువాద పదం అభివ్యాకరణం. సాంకేతిక పదం బదులు తంత్ర అనమంటున్నారు. క్రియేషన్‌ ఆఫ్‌ వర్డ్‌ని పదజనకం అని పేర్కొంటున్నారు. సంగణక ద్వారా అనువాదం చేస్తే యంత్రానువాదం అనే పదం సరిపోతుందని చెపుతున్నారు. డయలక్ట్‌ కన్వర్షన్‌కు మాండలిక పరివర్తన అనే పదాన్ని సృష్టించారు. ప్రస్తుతానికి ఇంటర్నెట్‌ను వాడుకోడానికి మనకి అడ్డంకులేమీ లేవు. భాష ఒక్కటే అడ్డంకిగా మేధావులు ఎందుకు భావిస్తున్నారంటే ఇంగ్లీషు పదాలకి సమానార్థకాలు అవసరమని భావించడం వల్ల. పైన పేర్కొన్న ఇంగ్లీషు బదులుగా వాడమంటున్న పదాలు భాషని ఏ మాత్రం రక్షిస్తాయో మేధావులే చెప్పాలి. అసలు ఇంటర్నెట్‌ను అంతర్జాలం అనకపోతే కొంపలు మునుగుతాయా? అని సామాన్యులు తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. అయితే మేధావులు చెబుతున్నది ఏమిటంటే -ఇంటర్నెట్‌ ఉధృతికి తక్కిన భాషలన్నీ కొట్టుకుపోతాయని. అలా జరక్కుండా ఉండాలంటే అంతర్జాలాలు, పదజనకాలు తప్పనిసరిగా సృష్టించాలని. మొత్తానికి ఇదే తొలిసారిగా నగరంలో శనివారం జరిగిన 'అంతర్జాల సదస్సు' మేధావులని ఆలోచింప చేసింది. ఇంటర్నెట్‌ను ఇంగ్లీషుకి వదిలేయకుండా మన తెలుగువారు పూర్తిగా సొంతం చేసుకోవాలంటే పరిశోధనలు ఆ దిశగా ఎన్నో సాగాలి. ప్రస్తుతం సాగుతున్న పరిశోధనల ఫలితాలు జనాన్ని చేరాలి. తెలుగు భాష మృతభాష కాకుండా ఉండాలంటే ఇంటర్నెట్‌ను కూడా తెలుగుపరం చేయాల్సిందే. ఇందుకు సాగుతున్న కృషిని సమన్వయపరచడానికి సిలికానాంధ్ర ముందుకు వచ్చినందుకు స్వాగతిద్దాం.
                                                                                                     - పురాణం శ్రీనివాస శాస్త్రి
                                                                                           (ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో..)

తెలుగు అంతర్జాలం అభివృద్ధికి గ్లోబల్‌ ఫోరమ్‌ !

తెలుగు అంతర్జాలంపై పరిశోధన చేసే సాంకేతిక విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు రాయితీలు ఇస్తామని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.సిలికానాంధ్ర సహకారంతో శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మొదటి తెలుగు అంతర్జాల సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతర్జాలాన్ని(ఇంటర్‌నెట్‌) సామాన్య ప్రజలకు చేరువలోకి తెచ్చేందుకు ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలోని సమాచారాన్ని తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని ఐటీశాఖ మంత్రి  చెప్పారు.  సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ.. తెలుగు అంతర్జాలంపై పరిశోధన చేసే వారిని ఒక చోటకు చేర్చేందుకు నాలుగైదు నెలల్లో సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పారు.  వచ్చే సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో కాలిఫోర్నియాలో విశ్వంతర్జాల తెలుగు సమ్మేళనం నిర్వహించనున్నారు. తెలుగులో ఆరు ఫాంట్లను రూపొందించాలని, తెలుగు భాష ఎన్‌సైక్లోపీడియాను రూపొందించి అంతర్జాలంలో ఉంచాలనే తీర్మానాలను సదస్సు ఆమోదించింది.తెలుగు అంతర్జాలం అభివృద్ధి కోసం గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ తెలుగు పేరిట వేదికను ఏర్పాటు చేసేందుకు సదస్సు తీర్మానించింది.

Saturday, April 16, 2011

తెలుగు అభివృద్ధికి 'అంతర్జాలం' కీలకం

మన సమాజం అత్యంత వేగంగా ‘ఉన్నత సాంకేతిక’ విజ్ఞానమే లక్ష్యంగా దూసుకు పోతోంది. ఇలాంటి సమాజం సమాచార సృష్టితో పాటు సమాచార ప్రసార వినిమయాలకు విశేష ప్రాధాన్యం ఇస్తుంది. కంప్యూటర్‌తో పాటు అంతర్జాలం (ఇంటర్నెట్) అన్ని రంగాలలోనూ విపరీతమైన మార్పులను తీసుకొచ్చింది. సాంకేతిక, విద్యారంగాలతో పాటు జీవ, ఖగోళ, భౌతిక, మానవ నిర్మాణ, సామాజిక, తత్వశాస్త్రాలు, సాహిత్యం మొదలైన అన్ని రంగాల్లో ఇవి వౌలికమైన మార్పులను తీసుకువచ్చాయి.
సాధారణంగా కంప్యూటరు, దాన్ని ఆధారంగా చేసుకున్న ‘అంతర్జాలం’ - జ్ఞానాన్ని అందుకొంటూ దాన్ని వ్యాపింప చేయడానికి తగిన రూపంలో జ్ఞాన సృజనకు వీలు కలిగిస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలను చేరుకోవడానికి సమాచార సాంకేతిక (Information Technology) ఓ సాధనం. ఇది జ్ఞానాధిక్యం లోనే కాదు. సాంకేతిక వైవిధ్యంలోనూ ఎన్నడూ లేనంత గుర్తింపు పొందింది. దీనిని వివిధ నిర్మాణ సేవలకి సంబంధించిన ఏ అంశానికైనా అనువర్తింపచేయవచ్చు. అంతర్జాలానికి అనుసంధించిన కంప్యూటర్లు ఎటువంటి పనికొచ్చే జ్ఞానాన్నయినా ‘వెంటనే ఉపయోగించదగిన జ్ఞానంగా’ మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. కంప్యూటర్లూ అంతర్జాలమూ ప్రస్తుత పరిస్థితిలో సమాజ అవసరాల కోసం భారతీయ భాషల అత్యవసర ప్రాధాన్యతని నిర్వచిస్తున్నాయి. కంప్యూటరీకరణలో భారతీయ భాషల ప్రవేశం జాతీయ బహుళ భాషల, బహుళ మాధ్యమాల కంప్యూటరీకరణలో భాగంగా చూడాలి. అంతేకాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార సాంకేతికతలో వాటి సహజ స్థానాన్ని పొందేందుకు భారతీయ భాషలను అభివృద్ధి చేయడానికి, ప్రచారం చేయడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానూ చూడాలి. కంప్యూటర్లు అక్షరాస్యతని పెంచడానికేగాక, మానవ వనరుల బహుళ ప్రయోజనం కోసం ఉపయోగపడుతున్నాయి.
ఇవి భాషా సాంకేతికతకు సంబంధించిన దార్శనిక ఆశయాలలో పేర్కొన్నట్లు సాంఖ్యక తేడాని (డిజిటల్ డివైడ్) తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ సందర్భంలో దీనిని ప్రజలందరి వినియోగం కోసం అవసరమైన జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి బాగా సరిపోయే ప్రయోజనకరమైన సాంకేతిక విజ్ఞానంగా భావించాలి. మన ప్రాంతీయ భాషలు ఈ రంగంలో తమ సరైన స్థానాన్ని పొందటం కోసం మనం ఎంతైనా కృషి చేయాలి. 2020 నాటికి భారతదేశం అంతర్జాల సాంకేతికతని ఉపయోగించి, సమాచార సాంకేతిక రంగంలో పనిచేసే నైపుణ్యంగల యువతీ యువకుల బలమైన శక్తిని కలిగి ఉంటుందని అంచనా. వీరివలన కంప్యూటర్లకి సంబంధించి పెద్ద మార్కెట్ అవసరం ఏర్పడుతుంది. ఫలితంగా భారతీయ భాషలకి సంబంధించిన సాఫ్ట్‌వేర్ల కోసం విపరీతమైన సంక్షోభం ఏర్పడుతుంది. అంతర్జాల విప్లవం సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ చేయడమేగాక వినిమయంలో విపరీతమైన వేగాన్ని కూడా పెంచుతుంది. ఇంకోరకంగా చెప్పాలంటే ఉత్పాదకుడికీ వినియోగదారుడికీ మధ్య దేశకాలాదుల దూరం విపరీతంగా తరిగిపోతుంది. నేడు ఉత్పత్తయి, పంపిణీ అవుతున్న సమాచారమంతా దాదాపు ఆంగ్లంలోనో, రోమన్ లిపిలోని భారతీయ భాషలలోనే ఉంటోంది. ఈ రంగంలో భారతీయ భాషలూ భారతీయ లిపులూ ఇంగ్లీషూ యూరోపియన్ భాషలంత తరచుగా ఉపయోగించబడటం లేదు. ఎలక్ట్రానిక్ సమాచార సైట్లు భారతీయ భాషలలోనూ భారతీయ లిపులలోనూ సమాచారం పొందుపర్చడానికీ, సేకరించడానికీ వీలుగా అందుబాటులో ఉండాలి.
ఇటువంటి సైట్లు అన్ని ప్రముఖ కంప్యూటర్ కార్యసారణి వ్యవస్థలలోనూ (ప్లాట్‌ఫాం) ఉచితంగా వినియోగించుకొనేలా ఉండాలి. విభిన్న లిపులతో బహుళ ఫ్లాట్‌ఫాంల ద్వారా సులభంగా ప్రభావవంతంగా సాంఖిక సంపర్క సౌలభ్యాన్ని (డిజిటల్ కమ్యూనికబిలిటీ) సాధించాలి. ప్లాట్‌ఫాంలో స్వేచ్ఛని అంతర్జాలంతో సులభంగా కలిసిపోయే విధానంతోపాటుగా లక్ష్యాన్ని పూర్తి చెయ్యాలి. ఈ పరిస్థితి భారతదేశంలో కంప్యూటింగ్ అంతర్జాల సాంకేతికతకు సంబంధించి స్థానికీకరణం లేదా ప్రాంతీయకరణానికి పిలుపునిస్తుంది. భారతదేశంలో కంప్యూటర్లు భారతీయ భాషలకి ఉపయుక్తంగా ఉండాలి. 2020 నాటికి భారతదేశపు పాఠశాలలు 10 మిలియన్ల కంప్యూటర్‌లని ఉపయోగిస్తాయని, అందులో కనీసం ఐదు శాతం తెలుగులో ఉంటాయని అంచనా. దీన్ని పరిపూర్ణం చేయడానికి తెలుగు ఈ కొత్త తరహా వినియోగానికి తయారై ఉండాలి. ఈ అవసరాలని తీర్చడం కోసం తెలుగు భాషని పరిపుష్ఠం చేసి, దృశ్య ప్రాతినిధ్యానికి, అంతర్జాలంమీద పట్టుకి కావలసిన సాంకేతిక అవసరాలను చేరుకోవడానికి క్రమబద్ధీకృత ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉంది. ఇందులో భాగంగా తెలుగు లిపి కోడీకరణమూ, ప్రామాణీకరణమూ నిరవధికంగా సాగాలి. ఆధునిక కంప్యూటింగ్‌కి ఇది అత్యవసరం. తెలుగులో ఈ రోజు మనకు లభ్యమవుతున్న విషయం అంతా మామూలుగా సాంప్రదాయ ప్రచురణ మాధ్యమంలో లభ్యం అయ్యేదే. దీనిలో ఎలక్ట్రానిక మాధ్యమంలో ఉన్నది చాలా స్వల్పం. ఆధునిక సంపర్క భాషగా తెలుగుని అభివృద్ధి పరచాలంటే అది తన సొంత పట్టాలమీద ప్రయాణం చేయగలగాలి. అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచీకరణం చెందకముందే స్థానీకరించాలి. అందులో భాగంగా సమస్త విషయాలను ఎలక్ట్రానిక్ మాధ్యమంలో అంతర్జాతీయ భాషలలో సమాంతరంగా సృష్టించాలి. ఖచ్చితంగా సమాచార సాంకేతిక సేవికలు (సర్వర్లు) తెలుగు భాషలో ఉన్నప్పుడు సమాచార లభ్యతవలన ప్రజలకు తమ భాషపట్ల ఉన్నటువంటి చిన్నచూపుతగ్గి తమ అవసరాలకు తెలుగును వాడుకొనే ప్రయత్నం చేస్తారు. దీనితోభాషా ప్రణాళిక అమలు దానంతట అదే జరుగుతుంది.
ఇది మన భాషమీద కొత్త డిమాండ్లను కల్పిస్తూ కొత్త కోణాలలో అవసరాలను తీర్చే ప్రయోగాలను ప్రవేశపెట్టడం ఆసక్తిని కలిగించే అంశం. ఎన్నడూలేని విధంగా తెలుగుభాష సామాన్య ప్రజాజీవితంలోను, వ్యక్తిగత జీవితాలలోను తన కొత్త పాత్రలో కనిపిస్తుంది. ప్రపంచం సమాచార విప్లవం గుండా ప్రయాణిస్తోంది. నేడు ‘సమాచారమూ’, ‘జ్ఞానమూ’ విడదీయలేని విధంగా సమాజానికి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఈ అవసరాన్ని తన సొంత వనరుల ద్వారా తీర్చుకోలేని సమాజం విదేశీ మార్కెట్ల నుంచి బలవంతంగా కనుక్కోవలసి వస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే అది విప్లవంలో వెనకబడి పోతుంది.
సమాచార విప్లవాన్ని అందుకోవడానికి మూడు ప్రధాన స్రవంతులైన సాంకేతిక రంగాలు - భాషా సాంకేతికత, కంప్యూటింగ్ సాంకేతికత, అంతర్జాల సాంకేతికత వీటికి సంబంధించిన అంశాల మీద దృష్టి సారించవలసి ఉంటుంది. ఈ సాంకేతిక వసతులను తక్కువ ధరలో ప్రజల భాషలలో అందించవలసి ఉంటుంది. అప్పుడే సమాజంలోని అందరినీ ఇందులో విజయవంతంగా భాగస్వాములని చేయవచ్చు. నేడు దీనికి భిన్నంగా ఉన్న పరిస్థితిని లోతుగా పరిశీలించి సమూలంగా మార్చవలసిన అవసరం ఉంది.
గారపాటి ఉమామహేశ్వరరావు
సెల్ నెం: 9866128846
( ఆంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో ..)

Friday, April 15, 2011

తెలుగులో అంతర్జాలంపై హైదరాబాద్‌లో సదస్సు

అంతర్జాలం వేదికగా విస్తరిస్తున్న కాల్పనిక (వర్చువల్‌) గ్రంధాలలోని తెలుగులో భాషాపరంగా సాగుతున్న ఆధునికీకరణ సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ ప్రక్రియకు దిశానిర్దేశం చేసే ప్రక్రియలో పాలు పంచుకుంటున్న విద్యావేత్తలు, ఫాంట్‌ డెవలపర్లు, విషయ (కంటెంట్‌) డెవలపర్లు, భాషా శాస్త్రవేత్తలు రేపు (16న) హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. అంతర్జాల వాడకందార్ల దేశాల్లో చైనా (21.5%), అమెరికా (12.2%), జపాన్‌ (5%) తరవాత స్థానంలో భారత్‌ (4.1%) ఉంది. అయితే మొదటి 10 అంతర్జాల భాషల్లో ఏ భారతీయ భాషకూ స్థానం దక్కలేదు. 121 కోట్ల మంది నివసిస్తున్న దేశంలో అంతర్జాలాన్ని ఎక్కువమందికి దరి చేర్చాలంటే దేశీయ భాషల్లో వినియోగించేలా ఉండాలని ఇటీవల జరిగిన వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ (www) సదస్సులో ఆయా రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంగ్లం నుంచి దేశీయ భాషల్లోకి, దేశీయ భాషల మధ్య సమాచారాన్ని అనువదించే మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌ (ఎంటీ) సిస్టమ్స్‌ను ఈ సదస్సులో ప్రారంభించిన సంగతి విదితమే. http://sampark.org.in, www.tdil-dc.in వెబ్‌సైట్‌లలో 200 పదాలకు మించని విషయాన్ని పొందుపరిస్తే, అనువాదం లభిస్తుంది. ఈ ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషించిన ట్రిపుల్‌ ఐటీ (హైదరాబాద్‌)తో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రతినిధులు తాజా సమావేశం ఏర్పాటులోనూ చొరవ తీసుకున్నారు. ఆయా భాషల్లో సమాచారాన్ని (ఇ కంటెంట్‌) పొందుపరచడం వల్ల నెట్‌ వినియోగంలో ఉన్న భాషాపరమైన అవరోధాన్ని తొలగించగలమని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ గారపాటి ఉమామహేశ్వరరావు చెప్పారు. గూగుల్‌కు పోటీగా చైనా సొంతగా సెర్చ్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేసుకుందని గుర్తు చేస్తూ, తెలుగు భాషలో ప్రశ్న వేస్తే, అంతర్జాలంలో ఇతర భాషల్లో ఉన్న సమాచారాన్ని వెతికి పట్టుకుని, తెలుగులో అందించే పరిజ్ఞానం అభివృద్ధి చేయాలన్నదే నిపుణుల ఆకాంక్ష అని ఆయన తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ (జూబ్లీహిల్స్‌)లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  విద్యావేత్తలు, ఫాంట్‌ డెవలపర్లు, విషయ (కంటెంట్‌) డెవలపర్లు, భాషా శాస్త్రవేత్తలు రేపు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.

తనికెళ్ల భరణి సాహితీ పురస్కారానికి ఆహ్వానం!

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆయన పేరుతో సాహితీ పురస్కారాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. కవులు, కవయిత్రులు తమ కవితలను పంపాలని ఆహ్వానించారు. జులై 14న తన పుట్టినరోజున ఉత్తమ కవిగా ఎంపికయ్యే రచయితకు 'తనికెళ్ల భరణి సాహితీ పురస్కారం' అందిస్తామని గురువారమిక్కడ భరణి పేర్కొన్నారు. పురస్కారానికి ఎంపికైన రచయితకు నూతన వస్త్రాలు, రూ.50వేల విలువైన బంగారు పూలతో కనకాభిషేకం లేదా నగదును చెల్లిస్తామని తెలిపారు. కళ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సంజయ్‌కిషోర్‌ వివరాల ప్రకారం.. వచన కవితా సంపుటులై ఉండాలి. 50 పేజీలకు తక్కువ కాకుండా ఉండాలి. కవితా సంపుటి మూడు ప్రతులు పంపాలి. అవి 2009 జనవరి నుంచి 2011 ఏప్రిల్‌ మధ్య కాలంలో ప్రచురించినవై ఉండాలి. ఔత్సాహికులు మే 30 లోగా కళ ఫౌండేషన్‌కు పంపాలి. పంపాల్సిన చిరునామా: 6-1-69/5ఎ, సైఫాబాద్‌, హైదరాబాద్‌-4. వివరాలకు 94904 84606 ఫోన్‌ నంబరులో సంప్రందించాలి.

Sunday, April 3, 2011

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి..!

కుకు కుకు కుకు కుకు...
కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి
డుడుం డుడుం డుడుం డుడుం...
వసంతుడే పెళ్లికొడుకు వనమంతా సందడి
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి!



 తెలుగువారందరికీ 
ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు!  




సకల లోక మనో నివాసమైన చైత్రోత్సవమే “ ఉగాది ” !

ప్రాచీన కాలంనుండే ఋతువులు మానవజీవితంలో పండుగలుగా నెలకొన్నవి. చైత్రోత్సవం 'భవిష్యత్‌ పురాణం'లో ప్రస్తావించబడింది.
 ''చైత్రోత్సవే సకలలోక మనోనివాసం
 కామం వసంత మలయాద్రి మరుత్సహాయం
 రత్యా సహార్చ్య పురుష: ప్రవరా చ యోషిత్‌
 సౌభాగ్యరూపనుత సౌఖ్యయుతా సదాస్సాత్‌''
 సకల లోకమనో నివాసమైన చైత్రోత్సవం కోరికల విజృంభణకు మలయ మారుతం తోడై రతీ క్రీడలకు ప్రేరకమై సౌభాగ్య, సుఖ సంతోషాలకు హేతువు అయింది. యశోధరుడు తన 'జయమంగళ' కావ్యంలో వాత్స్యాయనుని కామసూత్రాలను వ్యాఖ్యానిస్తూ సువసంతక, మదనోత్సవ, హోళికోత్సవాలను వర్ణించాడు. క్రీ.శ. నాల్గవ శతాబ్దంలోని జ్యోతి ర్వేత్త వరాహమిహిరుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోని మొదటి రోజే వసంతకాలమని, వసంత విష్ణువ త్కాలంగా నిర్ణయించి, మాస ఋతుసామరస్యాని సాధించి, సంవత్సరాది వసంతకాలంలోనే అని నిర్ణయించాడు. అప్పటినుండి చైత్ర శుద్ధ పాఢ్యమినే సంవత్సరాదిగా యుగాది (ఉగాది)గా పాటించ బడుతున్నది.
 ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కొందరు ప్రభువులు వసంతోత్సవాలను ఆ ఋతువులో నిర్వహించి ఆనందాన్ని పొందినట్లు చరిత్ర చెబుతూంది. కొండవీటిని పాలించిన కుమారగిరిరెడ్డికి వసంతోత్సవం కారణంగానే 'కర్పూర వసంతరాయలు' అనే పేరు వచ్చింది. 'వసంత రాజీయం' అనే కృతి అతని మధుమాస ప్రేమకు ప్రతీక. విజయనగర సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి నంది తిమ్మన తన 'పారిజాతాపహరణం' కావ్య ప్రబంధంలో ప్రతివర్ష వసంతోత్సం ప్రశంస చేశాడు.
 ప్రాచీన అలంకారికుడు భామహుడు 'నగరార్ణవ శైలర్తు చంద్రార్కోదయ వర్ణనై' అని తన 'కావ్యాలంకారం'లో ఋతువర్ణం కావ్య లక్షణంగా పేర్కొన్నాడు. రాజశేఖరుడు తన 'కావ్య మీమాంస' లోని కాలవిభాగంలో ఋతు లక్షణాలను విశదీకరించాడు. 'ప్రాతర్మాధ్యాహ్న మృగయాశైలర్తు వన సాగరా,' అని విశ్వనాథుడు 'సాహిత్య దర్పణం'లో ఋతువర్ణనను పేర్కొన్నాడు. ఈ విధంగా సాహిత్య శాస్త్ర గ్రంథాలలో ఋతువర్ణన ప్రాధాన్యతను సంతరించుకున్నది.
 వసంతఋతు వర్ణనను కవులు కావ్య ప్రపంచంలో ఉద్దీపన విభావములుగా పేర్కొన్నారు. వసంత ఋతువు నాయికా నాయకులకు ఉద్దీపన విభావములు కల్పించే సమ్మోహనాస్త్రం అనగా మనోవికారా నికి హేతువు. చంద్ర మలయానిలం మొదలుకొని ప్రకృతిలోనున్న రమణీయ, వస్తు సందయములు ఉద్దీపనా విభావములే. చైత్ర మాసంలో వసంతఋతువులో శృంగార ఉద్దీపన విభావములు కలిగించే ప్రకృతి రమణీయతను పూవిలుకాని పంచబాణాలలో దర్శించడమయింది.
 ''అరవింద మశోకంచ, చూతంచ నవ మల్లికా!
 నీలోత్పలం చ పంచయితే, పంచ బాణస్యనాయకా:'
 తిరవిందలు, అశోకలు, మామిళ్లు, కొత్త మల్లెలు, నీలోత్ఫలాలు ఇవి అయిదు పూవిలుకాడు మన్మధుని బాణాలు. ఇవి వసంత కాలంలో నాయికా నాయకులతో శృంగార భావాలను ప్రేరేపిస్తాయి కనుక ఉద్దీపనా విభావములుగా కవి సమయాలు.
 'ఋ-గతౌ' అనే సంస్కృత ధాతువు నుండి 'ఋతు' శబ్దం నిష్పన్నము. 'ఇయర్తీతి ఋతు:', 'ఋచ్ఛతీతి ఋతు:' అనే వ్యుత్పత్తులో కాలగమనం, పరిణామం ఋతువులవలనే అనే అర్థం ఇమిడి వుంది. 'ఋతం' అంటే కంపనము, చలనము. 'ఇయర్తి హృదయం ఇతి ఋతమ్‌' 'ఋ-గతౌ', హృదయంగమనమైన గతియే ఋతము అని అమరకోశము వ్యాఖ్యానము. చేతనా చేతనం కలిగిన ప్రకృతిలోని అన్ని వస్తువులు క్రమము తప్పక, స్వధర్మాన్ని విడనాడక ప్రవర్తించేందుకు హేతువు ఋతువు అని, ప్రపంచ స్థితిలో కనబడే నియమమే ఋతమని పాశ్చాత్యులు దీనిని 'రిథిమ్‌' అంటారని పెద్దల భావన. సృష్టి, స్థితి, లయ కారకుడైన పరమేశ్వరుని ఈ మూడు లక్షణాలు ఋతుచక్రంలో ప్రతి ఫలిస్తాయి. వసంత, గ్రీష్మములు సృష్టి కారకములు. వర్షాశక్తులు స్థితి కారకములు. హేమంత శిశిరములు లయ కారకములు. 'జాయతే అస్తి వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి', అని సృష్టిలోని ప్రతిపదార్థానికి ఆరు దశలు ఉన్నవి. అదృశ్యమైన కాలము యొక్క షడ్భావ వికారరూపమైన కార్యక్రమానికి షడృ తువులు ప్రతీకలు.
 వసంత ఋతువులో చెట్లకు చివురుటాకులు ఉదయిస్తాయి. ఇది 'జాయతే' అనే తొలి దశ. గ్రీష్మ ఋతువు కార్యము 'ఆస్తి ఆకు వర్షఋతువులో వర్థిల్లుతుంది కనుక వర్థతే శరత్తులో సరిపక్వమవు తుంది కనుక పరిణమితే. హేమంత ఋతువు క్షీణ దశ అనగా 'అపక్షీయతే', శిధిలమయిన ఆకు శిశిరంలో రాలిపోతుంది, 'వినశ్యతి. ప్రకృతి ఋతువులు సృష్టి లక్షణాలను వాల్మీకి రామాయణంలో శ్రీరామునిచే ఇలా పలికించాడు.
 ''హృష్యంచృతు ముఖం, దృష్ట్యా నవం నవమిహాగతమ్‌'
 ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణి సంక్షయ:'
 మానవుడు పరిస్థితులను గుణంగా వ్యవహరిస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనే సందేశం సృష్టికర్త ఋతుముఖేన అందించాడు.
 ఉపనిషత్సారమైన భగవద్గీత పర బ్రహ్మాన్ని అఖండ కాల స్వరూపముగ సంభావిస్తూ కాల విభాగంలో ఋతువులు పరమాత్మ తత్త్వానికి ప్రధాన స్పోరకములుగా పేర్కొంది.
 'మాసానాం మార్గశీర్షో అహం ఋతూనా
 కుసుమాకర:'
 మాసములలో మార్గశిరం, ఋతువులలో శ్రేష్ఠమైన వసంతము నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. 'ఋతు: సుదర్శన: కాల: పరమేష్ఠీ పరిగ్రహ:' అని శ్రీ విష్ణు సహస్ర నామము ఋతువు పరమాత్మకు అభిన్నముగా వర్ణించింది. వాల్మీకి రామాయణంలో వసంతఋతువుకి అధిక ప్రాధాన్యత నిచ్చి ప్రకృతి వర్ణనలను సహజముగా స్వభావసిద్ధంగా తీర్చిదిద్ది, ప్రకృతికి పాత్రలకు తాదాత్మ్యము చూపిన ఆదికవి. ఋతువర్ణనలో వాల్మీకిని అనుసరించిన కాళిదాసు 'ఋతుసంహారము' ప్రత్యక్షంగా ఋతు వర్ణనల కోసం వ్రాయబడిన తాలికావ్యము.
 'పుంస్కోకిల: చూత రసాసవేన
 మత్త: ప్రియాం చుమ్చతి రాగ హృష్ట:
 కూజ ద్ద్విరేఫో ప్యయ మమ్బుజ స్థ:
 ప్రియం ప్రియాయా: ప్రకరోతి చాటు'
 మగకోకిల మామిడి చిగుళ్లను తిని మదించి అనురాగముతో తన ప్రియురాలిని ముద్దిడుకొంటూ ఉంది. తామర పువ్వులో ఝుంకారం చేసే మగతేటి తన ప్రియురాలి కిష్టమైన శృంగార చేష్టలు చేస్తూంది. వసంతము మానవ హృదయ పరితోషకము. ఋతువు లన్నింటిలో ఆహ్లాదకరమైన ఈ ఋతువును కవులు, రసజ్ఞులు 'ఋతురాజుని', 'ఋతూరాజో కుసుమాకర:' అని గౌరవించి అక్షరాభిషేకం చేశారు. ఆధ్యాత్మ రామాయణాన్ని తేట తెలుగులో వ్రాసిన మడక సింగన ఒక ప్రకృతి వర్ణన కూడా కనబడని వాసిష్ఠ రామాయణానువాదంలో వసంత వర్ణన క్లుప్తంగానైనా చేసి వసంత మహిమను నిరూపించాడు. తెలుగులో ఆదికవిగా ప్రసిద్ధిగాంచిన నన్నయ 'ఆంధ్రమహాభారతము' ఆది పర్వములో వసంతాన్ని సహజంగా వర్ణించాడు. 'కమ్మని లతాంతములకుమ్మెనసి వచ్చు మధుపమ్ముల సుగీత నిన్నదమ్ము లెసగెం,' తాపన వృత్తిలో నున్న పాండురాజుకు మాద్రిపై మరులు గొనుటకు ఇనుమడించిన వసంత శోభ కామోద్దీపకమైనట్లు వర్ణించాడు. నన్నెచోడుడు 'కుమారసుభవము'లో వసంతాన్ని యోగీశ్వరుడైన పరమేశ్వరునికి పార్వతిపై మనసు నిలుపడంలో అత్యంత రమ్యంగా వర్ణించి కామోద్దీపకరముగా చేశాడు. సర్వ ప్రాణులకు మనోవికారం కలిగించేటంతగా వసంత వాతావరణాన్ని కల్పించి, ధ్యాన మగ్న మానసుడైన శివుని రాగమగ్న మానసుని చేయటానికి వచ్చిన మన్మధుడు తానే కామాతురుడైనాడు.
 || ''ఆమనికి నెలమి విపులా
 రామంబుల పొల్పు సూచి రాగోత్కటమై
 కాముడు రతిగని తానును
 గామాతురుడై మనోవికారము నొందెన్‌''
 నన్నయ వర్ణించిన వసంతము పాండురాజుకు ప్రాణాంతకమైతే, నన్నెచోడుని వసంతము రతీకాంతుడు మన్మధునికి దేహుతకమైనది.
 కవులు ఒక ఋతువులో మరొక ఋతు లక్షణాలు తోచేటట్లు, ఒకే కాలంలో అన్ని ఋతువులు ద్యోతక మయేట్లు వర్ణించడానికి గురువు కాళిదాసు 'మేఘసందేశము'లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఎర్రన 'నృసింహ పురాణం'లోనూ, నన్నెచోడుడు 'కుమార సంభవంలోనూ, గోన బుద్ధారెడ్డి 'రంగనాథ రామాయణం'లోనూ ఈ బాటలోనే పయనించి చరితార్థులైనారు. 'నృసింహ పురాణం' లో హిరణ్య కశిపుని తపస్సుని భంగపరచటానికి దేవేంద్రుడు తిలోత్తమాది అప్సరసలను పంపాడు. ఈ సన్ని వేశంలో వర్ణితమైన వసంతంలో ఎర్రన వర్షఋతువు లక్షణాలను స్ఫురింపజేశాడు. పరమశివునికై, పార్వతి కఠోరమైన తపస్సు చేసే సందర్భంలో 'కుమారసంభవం' కావ్యంలో నన్నెచోడడు షడ్రుతువుల సమ్మేళ నాన్ని సందర్శించాడు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో వసంతాన్ని వర్షఋతుపరంగా వర్ణించాడు. శ్రీరాముడు సీతను వెదుకుతూ వచ్చి పంపా సరోదరవరం వద్ద, సీతను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు, వసంత శోభ వర్షఋతువు వలె కనిపించి మానసిక క్షోభను కలిగించింది.
 'వసుధ రాలెడు విరుల్‌ వర్షో పలములు
 ముసురు తేనియసోన ముంచిన వాన
 గా నొప్పుచు వసంత కాలంబు చూడ
 వానకాలము బోలి వసుధ నొప్పియును'
 ఋతువర్ణనలనగానే తెలుగు వాఙ్మయంలో ప్రప్రధమంగా స్మరణకు వచ్చేవాడు శ్రీకృష్ణదేవరాయలు. నిశిత ప్రకృతి పరిశీలనతో, అనుభవైరో వేద్యమైన ఋతు లక్షణాలకు రమణీయ రూప కల్పన చేసి, ఋతువులలో జీవకోటి ప్రవర్తనలోని వైలక్షణ్యాన్ని సుస్పష్ట రేఖలతో ఉన్మీలించిన వర్ణచిత్రకారుడు రాయలు. ఆయా ఋతువుల్లోకి ప్రకృతి పరిస్థితుల్ని సూక్ష్మాతి సూక్ష్మవివరాలతో సాక్షాత్కరింప జేసిన ప్రతిభాశాలి. నిత్య జీవితంలో ఉపేక్షాపాత్రలైన అనేక దృశ్యాలను రాయలు పఠితల పరిశీలనకు పాత్రత కల్పించాడు. కొంగలు బొమ్మిడాయల భక్షించటం మొదలు అంత:పుర లీలావిలాసాల వరకు రాయలు వర్ణించాడు.
                                                                                                - మంగు శివరామ ప్రసాద్‌
అంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో..!