Thursday, March 31, 2011

పత్రికల్లో ఉచ్ఛారణ పదాలు రాస్తే భాష ఎక్కడా మిగలదు !

హైదరాబాద్‌ : భాషలో చమత్కారం, విరుపు వంటి ప్రయోగాలు వచ్చాయని, భాష మీద నిరంతరం ప్రయోగం చేస్తుంటే కొత్తదనం సృష్టించవచ్చని ఆంధ్రప్రభ సంపాదకులు పి.విజయబాబు అన్నారు. వార్తా శీర్షికల్లో చమత్కారం ఉంటుందని, సందర్భాన్ని బట్టి భాషను చమత్కారంగా, అందంగా, భావోద్వేగంగా చెప్పవలసి వుంటుందన్నారు. భాషకు గ్రామీణప్రాంత పలుకుబడులు తీసుకోవల్సిన అవసరం ఉందని, అప్పుడే భాష మరింత పరిపుష్టం అవుతుందన్నారు. బుధవారమిక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ''పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగువినియోగం'' చర్చాగోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వార్తా దినపత్రిక సంపాదకులు టంకశాల అశోక్‌ అధ్యక్షతన జరిగిన ''మేధోమథనం'' కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయబాబు మాట్లాడారు.. పత్రికల్లో ఉచ్ఛారణ పదాలు రాస్తే భాష ఎక్కడా మిగలదని, భాష ప్రామాణికంగా ఉండాలన్నారు. భాష పరిపుష్టానికి కృషి జరగాలని, అప్పుడే మంచి మంచి పదాలు వాడుకలోకి వస్తాయన్నారు. ప్రసారమాధ్యమాలు విస్తృతమైన ప్రస్తుత తరుణంలో సిబ్బందికి భాషపరంగా సరైన శిక్షణ ఇచ్చే సమయం లేకపోవడం వలనే భాష, పద దోషాలు వస్తున్నాయని అన్నారు. ఏదైతే మాట్లాడతామో అవే వాడుక పదాలను రాయడం తప్పన్నారు.
మాండలిక భాషను కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా వుందని, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన 'లొల్లి' అనే పదాన్ని అందరూ వాడుతున్నారని అన్నారు. మాండలికంలో అందమైన పదాలు తీసుకుని భాషా ప్రయోగాలు చేయవచ్చన్నారు. వార్త పత్రిక సంపాదకుడు అశోక్‌ మాట్లాడుతూ, పత్రికలు, ఛానళ్ళలో తెలుగువినియోగంపై చర్చలు ఇంకా సీరియస్‌గా జరగవల్సివుందని అభిప్రాయపడ్డారు. తెలుగుపత్రికల్లో ఆంగ్లపదాలు వాడటం వలన సమస్యలు వస్తున్నాయని, వాటికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందన్నారు. ఆకాశవాణి సీనియర్‌ పాత్రికేయురాలు ఎం.ఎస్‌.లక్ష్మి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో విలేఖరులకు ఆంగ్లపదాలకు సమాన తెలుగు అర్ధాలు లభించడం లేదని, అందుకే వార్తాల పరంగా తెలుగులో ఆంగ్లపదాలు వాడాల్సివుంటుందన్నారు. క్షేత్రస్థాయిలో సాంకేతికపదాలకు అనువాదం లేదని, డిమాండ్‌ అనే పదాన్ని తెలుగులో సమాన అర్ధం లేదన్నారు. అందరికీ అర్ధమవుతాయనే భావించిన తర్వాతే ఆంగ్లపదాలను వార్తల్లో వాడుతున్నారని అంటున్నారు. ఎబిఎన్‌ -ఆంధ్రజ్యోతి ఛానల్‌ సీనియర్‌ పాత్రికేయుడు జి.ఎస్‌. రామ్మోహన్‌ మాట్లాడుతూ, ప్రింట్‌ మీడియా కంటే టివి ఛానళ్ళల్లో ఎక్కువగా వ్యవహారిక భాషను వాడవల్సివుంటుందని, అందుకే ఛానళ్ళ చర్చాకార్యక్రమాల్లో ఆంగ్లపదాలను బాగా వాడతారన్నారు. ముఖ్యంగా టీవీ మాధ్యమం నగర, పట్టణ వాసులపై ఆధారపడివుంటుందని, గ్రామీణప్రాంతాలను పట్టించుకోదని, అందువలనే ఆంగ్లపదాల వాడుకలో సమస్యలు తలెత్తవన్నారు. టీవీ రంగంలో ముఖాలు బావుంటాయనే యోచనతో పట్టణ ప్రాంతాలకు చెందిన వారినే న్యూస్‌రీడర్‌ వంటి ఉద్యోగాలకు తీసుకుంటున్నారని, బులిటెన్‌లో వార్తలు ఎక్కువగా ఇవ్వాలనే తాపత్రయంతో స్పీడ్‌గా వార్తలను చదివిస్తామన్నారు. ఛానళ్ళకు ఉచ్ఛారణ ప్రాధమికమని, లిపి ద్వితీయమని, అయినప్పటికీ భాషకు ప్రామాణికత ఎంతో అవసరమని ఆయన నొక్కిచెప్పారు. సాక్షి జర్నలిజం కళాశాల అధ్యాపకుడు గోవిందరాజు చక్రధర్‌ మాట్లాడుతూ, వ్యవహారిక భాష వినియోగంలో పరిమితులు ఉన్నాయన్నారు. వార్త జర్నలిజం కళాశాల అధ్యాపకుడు కె.శ్రీకాంత్‌ మాట్లాడుతూ, ఆంగ్లభాష చదువుతుంటే ఏదో బ్రతుకుదెరువు ఉందనే మోజు ప్రజల్లో ఉందని, ఈ మోజుతో తెలుగుభాషకు కొంత అవాంతరం వస్తుందన్నారు. ప్రస్తుతం జర్నలిజంలో ప్రవేశించేవారికి తెలుగుపట్ల అవగాహన తక్కువగా ఉంటుందని, అయితే తెలుగుభాష అంతరించదని, పత్రికల్లో మాత్రం తెలుగు ఉంటుందని ఆయన అన్నారు. పత్రికల్లో ఒత్తులు, దీర్ఘాలు మార్చితే ప్రమాదం ఉందని, కానీ పలుకుబడితో లిపిని మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ చెల్లప్ప మాట్లాడుతూ, పత్రికల్లో ఎంతవరకు తెలుగుభాష వ్యాప్తికి కృషి చేస్తున్నాయో విశ్లేషించాలన్నారు. తెలుగుభాషలో సంస్కృత పదాలు చాలవరకు కలిశాయని, ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లపదాలు కలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన ఆచార్య మృణాళిని మాట్లాడుతూ, మీడియా సంస్థలకు రీసెర్చ్‌ అండ్‌ రిఫరెన్స్‌ డిపార్టుమెంట్‌ వుంటే బావుటుందన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిజం విద్యార్దులకు వచ్చిన నివృతిని సీనియర్‌ పాత్రికేయులు తీర్చారు. ఈ చర్చాగోష్టి సందర్భంగా చర్చించిన 11 అంశాలతో కూడిన తీర్మానాన్ని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ చెన్నయ్యకు సీనియర్‌ పాత్రికేయుడు టంకశాల అశోక్‌ అందించారు.

Wednesday, March 30, 2011

తెలుగు కోసం ఒక వ్యవస్థ : తెలుగు విశ్వవిద్యాలయం చర్చాగోష్ఠి

హైదరాబాద్: పత్రికలు, ప్రసార మాధ్యమాలకు ఉపయోగపడుతూ తద్వారా తెలుగు భాష సుసంపన్నం కావడానికి వీలుగా ఒక శాశ్వతమైన యంత్రాంగం ఉండాలని, ఆ యంత్రాంగం ఎప్పటికప్పుడు భాషా ప్రయోగానికి, నూతన పదకల్పనకు తోడ్పడాలని పలువురు దినపత్రికల సంపాదకులు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంగళవారం పత్రికలు-ప్రసార మాధ్యమాలు తెలుగు భాష వినియోగం అనే అంశంపై రెండు రోజుల చర్చా గోష్ఠి ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎస్ చెల్లప్ప మాట్లాడుతూ తమిళం మొదలైన సోదర భాషల్లో భాష పరిరక్షణకు, ఆధునికీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకుంటూ తదనుగుణంగా తెలుగును అభివృద్ధి పరచుకోవాలని అన్నారు. సామాన్యుల వద్దకు తెలుగును తీసుకువెళ్తున్న పత్రికలు, ప్రసారసాధనాల కృషి ప్రశంసనీయమని అన్నారు. అయితే ఆంగ్లం ప్రాధాన్యాన్ని విడనాడి, తెలుగుకు పట్టం కట్టాలని అన్నారు. తెలుగు భాష స్థిరీకరణలో పత్రికల పాత్ర ఎనలేనిదని అన్నారు. తెలుగు మాటలు, పదాల వినియోగం ఇటు పత్రికల్లో, అటు ప్రసారమాధ్యమాల్లో తగ్గుతోందని, దీనికో పరిష్కారం చూడాలని అన్నారు.
భాషా వికాసానికి పాటుపడాలి: ఎం.వి.ఆర్ శాస్త్రి
తెలుగు భాషాభివృద్ధి గంభీరమైన సమస్య అని, ఆధునిక సమాజానికి అవసరమైన కొత్త పదాలను అందించడంతో పాటు భాషా వికాసానికి విశ్వవిద్యాలయాలు సైతం పాటుపడాలని ఆంధ్రభూమి సంపాదకుడు ఎం.వి.ఆర్ శాస్త్రి  అన్నారు. పత్రికాభాష- తెలుగు వినియోగం అంశంపై జరిగిన తొలి సదస్సుకు ఎం.వి.ఆర్ శాస్ర్తీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు, ప్రసార మాధ్యమాలు అప్పటికప్పుడు వచ్చిపడే కొత్త పదాలను తెలుగులోకి అనువదించేందుకు తగిన పదజాలం లేదన్నారు. ఈ అవస్థల్ని తీర్చేందుకు విశ్వవిద్యాలయాల నుండి తగిన సహకారం కావాలని అన్నారు. గత 30, 40 ఏళ్లుగా ఆగిపోయిన పదసృష్టిని ఇప్పటికైనా ప్రారంభించాలని సూచించారు. నిఘంటువులు దగ్గర పెట్టుకున్నా కొన్ని పదాలు దొరకవని, ఈ అవస్థలను తీర్చాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపైనా, విద్యావేత్తలపైనా ఉందని ఎంవిఆర్ శాస్త్రి  అన్నారు. ఈ అంశంపైనే ప్రత్యక సమావేశాలు ఏర్పరచి పదసృష్టి చేయాలని చెప్పారు. తెలుగు భాష ప్రామాణిక నిఘంటువులు తయారుకావాలని, ఆంగ్లంలో మాదిరి తెలుగుభాషకు సైతం అక్షరగుణింతాల పరిశీలనకు ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు.
పదసృష్టికి ప్రత్యేక ప్రాజెక్టులు: ఆచార్య భూమయ్య
తెలుగు విశ్వవిద్యాలయం విసి ఆచార్య అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాలు తెలుగు భాషా వికాసానికి ఎంతగానో పాటుపడుతూ లక్షలాది మంది తెలుగు పాఠకులను తయారుచేస్తున్నాయని అన్నారు. తెలుగు పట్ల నిరాదరణ అధికంగా ఉన్న తరుణంలో భాషను నిలబెట్టేందుకు ఎన్నో కార్యక్రమాలు జరగాల్సి ఉందని చెప్పారు.
అంతా పట్టించుకుంటేనే భాష ఎదిగేది: రామచంద్రమూర్తి
అంతా పట్టించుకున్న రోజునే భాష ఎదుగుతుందని హెచ్‌ఎంటివి సిఇఓ డాక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. సమాజానికి, ప్రభుత్వానికీ పట్టింపు లేకపోవడం వల్ల, ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం వల్ల తెలుగు భాష ఎదగడం లేదని చెప్పారు. ఆంగ్లంలో మాట్లాడితే గొప్ప అనే విధంగా అంతా భావిస్తున్నారని, తెలుగులోనే దస్త్రాలు తయారుచేసే అధికారులను సత్కరించడంతో పాటు అన్ని రంగాల్లో వ్యవహారికంలోకి వచ్చిన పదాలకు తెలుగు మాటలను గుర్తించాలని సూచించారు. పండితపరిషత్‌ను ఏర్పాటు చేసి వారం వారం సమావేశమై కొత్త తెలుగు పదాలను అందరి ఆమోదంతో వాడుకలోకి తేవాలని అన్నారు.
పత్రికలు తలచుకుంటే పదసృష్టి: వరదాచారి
పత్రికలు తలచుకుంటే పదసృష్టి సాధ్యమేనని హెచ్‌ఎం టివి అంబుడ్స్‌మన్ డాక్టర్ జి.ఎస్ వరదాచారి అన్నారు. కొత్త పదాలు ఎన్నో వాడుకలోకి వచ్చినా, జనం హర్షించినవే నిలుస్తాయని అన్నారు. అవసరం ఏర్పడినపుడు కొత్త పదాలు పుడతాయని, అలాగే పరిశోధనా ఫలితాలను ఆయా శాస్తవ్రేత్తలు తెలుగులో రాసినపుడు మంచి పదాలు పుడతాయని చెప్పారు. ఇపుడు అనేక రంగాలు విశ్వవ్యాప్తం కావడంతో అన్ని శాస్త్రాల్లో కొత్త పదాలకు తెలుగు మాటలను కనిపెట్టాల్సిన గురుతర బాధ్యత అందరిపై పడిందని అన్నారు.
చట్టబద్ధ వ్యవస్థ ఉండాలి: పొత్తూరి
తెలుగు భాషాభివృద్ధికి చట్టబద్ధ వ్యవస్థ ఉండాలని ప్రారంభోపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగు వాడకంలో పత్రికలు మేలు చేయడంతో పాటు కీడు కూడా చేశాయని అన్నారు. భాష ప్రామాణీకరణ సాధ్యం కాదని, భాషను సుసంపన్నం చేయడానికి కొత్త పదాలు, వృత్తి పదాలు, శాస్త్ర విజ్ఞాన పదాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. తెలుగు భాషను అధికారిక భాషగా చట్టం చేసిన చట్టసభల్లోనే అధినేతలే ఆంగ్లంలో మాట్లాడుతున్నపుడు ఇక ఎవరు పట్టించుకుంటారని అన్నారు. ప్రెస్ అకాడమీని మీడియా అకాడమీగా తీర్చిదిద్దాలని, దానికి చట్టబద్ధత కల్పించి, ఎడిటర్లకు స్థానం కల్పించాలని పేర్కొన్నారు.
మాండలికాలు లేని భాష ప్రామాణికమా?- అల్లం నారాయణ
ఒకటి రెండు జిల్లాల్లో మాట్లాడే భాషను తీసుకువచ్చి ప్రామాణిక భాషగా చెప్పుకోవడం సరికాదని, ఆంగ్లంలోని పదాలను, హిందీ, ఉర్దూ పదాలను స్వీకరించి వినియోగిస్తున్న ప్రామాణిక భాషా నిపుణులు తెలుగులోనే ఇతర ప్రాంతాల మాండలికాలను ఎందుకు స్వీకరించడం లేదని నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ అల్లం నారాయణ ప్రశ్నించారు. భాషకు కులతత్వం, ప్రాంతీయ తత్వం వచ్చిందని, ఈ ప్రాంత మాండలికాలను వినియోగించని భాష ప్రామాణికం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పత్రికలు ప్రజాస్వామ్య లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.
విశ్వసేవ: శంకరనారాయణ
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం విశ్వసేవ అవుతుందని ఈనాడు ప్రతినిధి శంకరనారాయణ అన్నారు. ఆంగ్ల పదాలకు తెలుగును సూచించే ప్రయత్నం గట్టిగా జరగాలని చెప్పారు. భాషా చట్టం ముందు అన్ని మాండలికాలు సమానమేనని, జిల్లా ఎడిషన్లు మాండలికాల్లోనే రాయాలని అన్నారు. ఏ కథనంలోనైనా తెలుగు వెలుగు కనిపించాలని అన్నారు.
శాశ్వత విభాగం ఉండాలి: కె.శ్రీనివాస్
భాషాభివృద్ధికి శాశ్వత విభాగం ఉండాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. భాషపై చర్చ జరిగినపుడు, వౌలికమైన పదాలకు సమానకార్థాలు వచ్చినపుడు భాష ఎదుగుతుందని అన్నారు. మాండలికాల పదకోశాలు తయారుచేయాలని, శ్రామిక వర్గాల సమూహాల నుండి వారు వినియోగించే పదాలను జనసామాన్య వాడుకకు తేవాలని సూచించారు.

భాషతోనే జాతీయ సమైక్యత

న్యూఢిల్లీ: దక్షిణాది విద్యార్థులు ఏదో ఒక రూపంలో హిందీని పాఠ్యాంశ రూపంలో నేర్చుకుంటున్నట్టు ఉత్తర భారత విద్యార్థులూ ఏదో ఒక దక్షిణాది భాషను పాఠ్యాంశంగా ఎంచుకుంటే జాతీయ సమైక్యత బలోపేతమవుతుందని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ ఉద్బోధించారు. ఆంగ్లభాష ప్రభావం ఏమాత్రం కనిపించని విధంగాప్రతి ఒక్క ఉత్తరాది విద్యార్థి ఏదో ఒక దక్షిణాది భాషను నేర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రక్రియలోపించటంతో దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య విలువలు ఉత్తరాది వారికి అందకుండా పోతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సంకలనం చేసిన సహస్ర వర్షోం కా తెలుగు సాహిత్యఅన్న పుస్తకాన్ని అన్సారీ తన నివాస గృహంలో ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో తెలుగు మూడో స్థానంలో ఉండడం గర్వకారణమని ఆయన ప్రశంసించారు. ప్రాచీన భాష హోదా లభించిన తెలుగు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోడానికి యార్లగడ్డ వంటి వారు తెలుగులోని గొప్ప కృతులను హిందీలోకి అనువదించి భావి తరాలకు అందచేయాలని ఆయన సూచించారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. రచయిత యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగుతో సహా దక్షిణాది భాషలకు సంబంధించిన అనువాదాలు ఉత్తర భారత దేశ ప్రజలకు అందకపోవటం వల్ల రెండు ప్రాంతాల ప్రజల మధ్య సాంస్కృతిక, సమైక్యత కుదరడం లేదని అన్నారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య విలువలు దేశ వ్యాప్తంగా తెలియక పోవటంతో కేవలం రెండు జ్ఞానపీఠ్ అవార్డులతో సరిపెట్టుకోవలసి వచ్చిందన్నారు.

Monday, March 28, 2011

బహుభాషా చక్రవర్తి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు!

(శ్రీ పుట్టపర్తి వారి జయంతి సందర్భంగా..! )  
హుభాషా చక్రవర్తి అయిన పుట్టపర్తి నారాయణాచార్యులు 1914 మార్చి 28న అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకాలోని చియ్యేడు గ్రామంలో పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, లక్ష్మీ దేవమ్మ దంపతులకు జన్మించారు. దాదాపు ముప్పరుయేళ్ళ వరకు అనంతపురంలో వున్న ఆచార్యులు కడపజిల్లాకు చెందిన కనకమ్మను పెండ్లి చేసుకున్నాక జీవితం ఆఖరి వరకు కడప గడపలే తన సాహిత్య ప్రస్థానంగా జీవించారు.
 శతాధిక గ్రంథకర్త, బహుభాషావేత్త, విమర్శకుడు, అద్భుతమైన వక్త, అయిన ఆచార్యులు సాహిత్యంకోసం పుట్టి, సాహిత్యం కోసమే జీవించి, మరణశయ్యపై కూడా పెరిస్త్రోయికా గ్లాస్‌నోస్త్‌ పుస్తకం చదువుతూనే కన్నుమూసిన ధన్యజీవి ఆయన. ఆచార్యులు ఎన్నో గ్రంథాలు రచించినప్పటికీ కడపజిల్లా కమ్యూనిస్టు మిత్రులతో చేసిన మైత్రికి ప్రతిఫలమే 'మేఘదూతము' గేయకావ్యం.
 నారాయణాచార్యులు వ్యక్తిత్వం దృక్పథం, అంతరంగం ఆవిష్కరించిన కావ్యం ఏదైనా వుందీ అంటే అది ఒక్క మేఘదూతము మాత్రమే !
 మేఘదూతము ఆచార్యులు రచించడానికి పూర్వనేపథ్యం ఒక విషాదకరమైన దురదృష్టకర మైన ఘటన ఒకటుంది. ఆయన అనంతపురం విడిచి వచ్చాక కడపజిల్లా ప్రొద్దుటూరులో వుండే వారు. ఆచార్యుల సాహిత్య సృష్టి, జనాకర్షకమైన సాహిత్యోపన్యాసాలు యెందరినో అభిమానులుగా మార్చసాగింది. ఆకాలంలో రాష్ట్రశాసన మండలి సభ్యత్వ వ్యవహారం వచ్చింది. ఆచార్యులకే ఆ పదవి వచ్చేలా వుందని గట్టి ప్రచారం జరిగింది. అప్పుడు కొందరు స్వార్థపరులైనవారు ఆచార్యుల ఇంటిపై పరోక్షదాడి చేశారు. సున్నితమనస్కుడైన ఆచార్యులు ఆ హఠాత్‌ ఘటనతో చలించి పోయారు. విధిలేని పరిస్థితిలో కడపకు నివాసం మార్చుకున్నారు. అప్పుడు ఆచార్యులకు అండదండలుగా ఆనాటి సిపిఐ మిత్రులు గట్టిగా నిలిచారు. ఆ పరిచయం, ఆచార్యులను కారల్‌ మార్క్స్‌ దాస్‌ కాపిటల్‌ డైలెక్టికల్‌ మెటీరియలిజమ్‌ తదితర సాహిత్యం అధ్యయనం చేయించింది. ఫలితంగా ఆచార్యుల దృష్టిపథంలో ఒక కొత్త సామాజిక వాస్తవ దృశ్యం తొణికిసలాడుతూ కనిపించింది. మానవుని కల - కళగా ఆవిర్భవిం చాలని, సాహిత్యం ప్రజలకోసం, ప్రగతికోసం సగటు మనిషికి ప్రేరణ కలిగించాలనే సామాజిక బాధ్యతను గుర్తెరిగారు. ఆ ప్రభావం యెంతవరకు దారితీసిందంటే - కారల్‌మార్క్స్‌ - అరవింద ఘోష్‌ల ఆలోచనలు ఒక థియరీగా రాగలిగితే యెంత బావుణ్ణోకదా అని చెప్పేవారు ఆచార్యులు.
 ఛందోబద్ధ పద్యరచనలోనే కాదు - మాత్రాఛందస్సులో గేయాలు రచించడం కూడా ఆచార్యుల కళాత్మక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది.
 'మేఘదూతము' గేయకావ్యంలో ఆచార్యులు తీసుకున్న ఇతివృత్తము సమకాలీన సామాజిక సమస్యవే కావడం గమనార్హం. పేదలపై ధనికుల దౌర్జన్యాలను యెదురించి ప్రశ్నించిన ఓ సగటు మనిషిని ప్రభుత్వం చెరసాలలో పెట్టింది. ప్రజాపక్షంగా ప్రతిఘటించిన ఆ పేదవాడు - కొత్తగా పెళ్లి చేసుకుని ఉంటాడు కూడా. అతన్ని జైలుపాలు చేసినప్పుడు, ఆ బందీఖానాలో ఆ ఒంటరి ఖైదీ తన భార్యని గుర్తు చేసుకుంటాడు. ఆమె యెలావుందోననుకుంటాడు. ఒకవేళ తనను మరచిపోయి వుంటుందా అని అనుమానిస్తాడు. ఆ విధంగా చేయదని తానే జవాబు చెప్పుకుంటాడు. తన జైలు జీవితం యెలా వుందో ఆమెకు ఎలా తెలియచేయాలని ఆలోచిస్తున్న ప్పుడు జైలు కిటికీలోంచి మేఘం ఒకటి కనిపిస్తుంది. ఆ మేఘమే తన దూతగా భావిస్తాడు. ఆ మేఘంతో విషయాలు వివరించి, తన భార్య ఉంటున్న ఊరికి ఎలా ఏ మార్గంలో పోవాల్నో తెలియచేస్తాడు ఆ ఖైది. నిజానికతడు నిరపరాధి.
 ఇక్కడ గమనించాల్సిందేమిటంటే - ఖైదీని కలి ఆవహించి జైలు జీవితాన్ని అయితేనేమి, మేఘానికి ప్రయాణం చేయాల్సిన మార్గం తెలుపడానికైతేనేమి అన్నీతానై కవితాకళలో వివరించడం అనేదే విశేషం. ఆ జైలులో జోరీగలు తంబూరనాదంలా ధ్వనిస్తున్నాయి. చీకటి ఈగలు కొంచెం కొంచెం అనే నెత్తురు పీల్చేస్తున్నాయి. తలనిండా పేలుపడి రామునిసైన్యంలా ఉన్నాయి. రాముని సైన్యం అంటే కోతులగుంపు. కోతులనేవి వూరకే యెక్కడ ఉంటాయి. చిందరవందర చేస్తాయి. పేనులను కోతుల స్వభావంతో కవి చెప్పడం ధ్వని. ఇక ఆ ఖైదీ శరీరం నిండా మట్టి పేరుకునిపోయింది. స్నానం చేసి ఎన్నాళ్లు అయ్యిందోమరి. ఇక ఆ ఖైది శరీరం ఎలా ఉందంటే మామిడిపండును తిని, చివికి పారవేసిన వట్టి ముట్టెలా వుందంట. అంటే యెంతగా బక్కచిక్కిపోయాడో ధ్వనిగా కవి ఎరుకపరుస్తున్నారు.
 అది కరువుల రాయలసీమ. అక్కడ కట్టుకోడానికి బట్టకు తినడానికి తిండికి కరువు. పంటలేలేవు. కాకపోతే పుట్టగొడుగులున్నాయి. అదే ఆ కరువు ప్రజల ఆహారము. ఇక అక్కడ మగవాళ్ళే లేరు. కారణం కూలికోసం వెదుక్కుంటూ వలసలు పోయారు.
 ఇంత కఠినమైన కరువు ప్రాంతం చూశాక - ఓ మేఘమా నీవు నీరు కురిపించే స్వభావం గల మేఘానివి కదా! ఆ కరువు దేశంమీద వర్షిస్తే బాగుంటుంది. నీ నీరు యెలా వుంటుందంటే - ద్రాక్షారసము రుచిగల తుంగభద్రా నదీ జలాల మాదిరివుంటాయని ధ్వనిగా చెప్పాడు.
 ఆ విధంగా మేఘానికి ఆ ఖైదీ దారి చెప్తూ (చూపిస్తూ) ఉండగా ఒక దగ్గర వేశ్యలు కనిపిస్తా రని - వారిని చూసి మొహం మాడ్చుకోవద్దని కోర్తూ ఇలా అంటాడు.
 ''కూటికై
 తనువమ్ముకొన్నారు - తిన తిండియేయున్న
 వారు పాతివ్రత్యభావంబు బలికేరు''
 వాళ్ళకు తినడానికి కూడా తిండిదొరకక విధిలేని దుస్తితిలో శరీరాలు అమ్ముకొని కడుపులు నింపుకుంటున్నారనే చేదునిజం గ్రహించు - నిజంగా వాళ్ళకే ఆహార పానీయాలు వుండివుంటే పతివ్రతాస్త్రీలుగా తప్పక జీవించి వుందురు అంటాడు. అంటే సర్వసామాజిక సమస్యలకు పరిష్కారం ఆర్థిక పరిస్థితే కారణమని కవి ధ్వని. మేఘదూతం చదివితే తెలుగు ప్రజల జీవితాలనుండి వేగంగా దూరమైపోయిన, పోతున్న యెన్నో తెలుగుపదాలు, జాతీయాలు, నుడికారాలు, సామెతలు, ఆమెతలు యెదురౌతాయి. తప్పిపోయి దొరికిన అమ్మను చూసిన అనుభూతి కలుగుతుంది.
 తిరువాన్కూర్‌ యూనివర్శిటీ వారు మలయాళ భాషా నిఘంటువు రూపొందించదలచి దక్షిణభారతదేశంలో బహుభాషా వేత్త యెవరైనా ఉన్నారా అని అన్వేషించింది. చివరికి యేలాగో కడపలో ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యులను కనుగొన్నారు. ఆచార్యులు మలయాళ నిఘం టువు నిర్మాణం సమర్థవంతంగా పూర్తిచేయడమే కాక, ఎన్నో ఆదానప్రదానాలు చేశారు. ఆనాటి మలయాళ, సంస్కృత విద్వాం సుడు సూరనాడు కుంజన్‌ పిళ్ళరు. మలయాళంలోగొప్పకవి. ఆయనే ఆచార్యులను కనుగొని తమ భాషా నిఘంటువు నిర్మాణబాధ్యత అప్పగించారు.
 టువంటి అరుదైన పండితుడు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు 1990 సెప్టెంబర్‌ 1వతేదీ కడపలో కన్నుమూశారు. ఆచార్యులు ఆసుపత్రిలో మరణశయ్యపై ఉండి కూడా గ్లాస్‌గోస్త్‌పెరిస్త్రోయికా చదువుతూ వుండ టం ఆయన పఠనాసక్తిని చాటుతోంది.
- శశిశ్రీ

Saturday, March 26, 2011

తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు !

తెలుగుసాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2009కి గాను శుక్రవారం సాహితీ పురస్కారాలు ప్రకటించింది. విజేతలకు ఈ నెల 31న వర్సిటీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు అందజేస్తారు. రచయితలను రూ.20,116 నగదు, ప్రశంసాపత్రంతో సత్కరిస్తామని విశ్వవిద్యాలయం ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య తెలిపారు. 
పద్య కవితా పురస్కారం: పురుషోత్తముడు, -చిటిప్రోలు కృష్ణమూర్తి 
ఉత్తమ వచన కవితా సంపుటి: భరోస, -డా.అమ్మంగి వేణుగోపాల్‌ 
కథల సంపుటి: గజ ఈతరాలు, -గొరుసు జగదీశ్వరరెడ్డి 
నవల: మునెమ్మ, -డా.కేశవరెడ్డి 
సాహిత్య విమర్శ గ్రంథం: 'సంవిధానం'   -గుడిపాటి
నాటకం: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, -డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని 
అనువాద పురస్కారం: ప్రేంచంద్‌ బాలసాహిత్యం పదమూడు కథలు,- ఆర్‌.శాంతసుందరి 
వచన రచన: ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ, -డా.గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 
రచయిత్రుల గ్రంథాలు: తెలుగుధనం, -డా.తుర్లపాటి రాజేశ్వరి.

Friday, March 25, 2011

25 మందికి శ్రీకర నామ ఉగాది పురస్కారాలు!

పదమూడు రంగాల్లో విశిష్ఠ సేవలను అందిస్తున్న 25 మంది ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకర నామ ఉగాది పురస్కారాలను ప్రకటించింది. గురువారం కళాభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెల 4న ఉదయం 9 గంటలకు రవీంద్రభారతిలో జరిగే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రిఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పురస్కారాలను బహూకరిస్తారని తెలిపారు. 
 ఎంపికైన వారి వివరాలు..
సాహిత్యం: డా.ముదిగొండ శివప్రసాద్‌, డా.తిరుమల శ్రీనివాసాచార్య  
సంగీతం: జి.వి.రామకుమారి (విజయవాడ), అయ్యగారి శ్యామసుందరం  
శిల్పం: వై.శివరామాచారి, రోహిణి రెడ్డి  
చిత్రలేఖనం: కె.శేషగిరిరావు  
పాత్రికేయం: ఎస్‌.జనార్థన్‌, వల్లీశ్వర్‌(ఆంధ్రప్రదేశ్‌ పత్రిక), స్వాతిసంపాదకుడు వేమూరి బలరాం
నాట్యం: వి.రంగమణి (కూచిపూడి), అంజిబాబు (కథక్‌)  
నాటకం: ఎస్‌.ఎన్‌.చారి (హనుమకొండ), జి.ఎస్‌.ఎన్‌.శాస్త్రి
ఇంద్రజాలం: కె.కళాధర్‌ (మైమ్‌), ఎస్‌.మనోహర్‌రావు (రాజమండ్రి)  
బుర్రకథ: బాబ్జీ (రామచంద్రపురం), ప్రేమానందం (మందపల్లి)  
హరికథ: బి.రంగారావు భాగవతార్‌ (శ్రీకాకుళం), బి.యతిరాజు భాగవతార్‌ (కుసుంపురం)
వైద్యం: డా.జి.ప్రసాదరావు (ఆశా హాస్పిటల్‌)  
జానపదం: డా.ఎస్‌.మురళి బాబు (విశాఖ), పి.ప్రకాశ్‌ (మెదక్‌జిల్లా)
ప్రవాసాంధ్రులు: సి.ధర్మకర్త (రసమయి-దుబాయి), కోమటిజయరామ్‌ (తానా-అమెరికా)

Saturday, March 19, 2011

తెలుగు అంకెల్ని సమాధి చేస్తారా?

5వ తరగతి గణితం (కొత్తది)  
5వ తరగతి గణితం (పాతది) 
తెలుగు అంకెలు
దవ తరగతి విద్యార్థులకు  గత విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన గణిత పాఠ్యప్రణాళికలో తెలుగు అంకెలకు సంబంధించిన పాఠ్యాంశాన్ని పూర్తిగా తొలగించడంతో భావితరాల వారికి తెలుగు అంకెలు ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఐదవ తరగతి విద్యార్థులకు 1994-95 విద్యా సంవత్సరం నుండి 2008-09 విద్యా సంవత్సరం వరకు గణితశాస్త్రంలో తెలుగు అంకెల పరిచయం ఒక అధ్యాయంగా ఉండేది. 2009-10 విద్యా సంవత్సరం నుండి ఐదవ తరగతికి కొత్త పాఠ్య ప్రణాళికను అమలులోకి తెచ్చారు. పాత పాఠ్య ప్రణాళికలో ఉండిన తెలుగు అంకెల విభాగాన్ని పూర్తిగా తొలగించారు. ఈ క్రతువులో తెలుగు అంకెల బలి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేశారు. పాత పాఠ్యపుస్తకాల స్థానంలో కొత్త పాఠ్య పుస్తకాలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం 2009-10 విద్యా సంవత్సరంలో తనదైన క్రతువును ప్రారంభించింది. 2009-10 విద్యాసంవత్సరంలో 1వ తరగతితో పాటు, 3,5 తరగతుల పాఠ్య పుస్తకాలను సమూలంగా మార్పు చేశారు. ఆ తర్వాతి విద్యా సంవత్సరమైన 2010-11లో 2,4,6వ తరగతుల పాఠ్య పుస్తకాలను మార్పు చేశారు. ఆరవతరగతిలోని సంఖ్యామానం అనే అధ్యాయంలో తెలుగు అంకెలను కనీసం పరిచయ అంశంగానైనా పొందుపరచలేదు. తెలుగు భాషపట్ల, తెలుగు సంస్కృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఈ అనాలోచిత చర్య పరాకాష్టగా చెప్పవచ్చు. పాత పాఠ్య పుస్తకంలో తెలుగు అంకెల పరిచయం ఇలా ఉంది. ‘‘తెలుగు భాషకు చెందిన ప్రాచీన గ్రంథాలు తెలుగులోనున్న జ్యోతిష్య శాస్త్ర పత్రికలు మొదలగు వాటిలో మనకు తెలుగు సంఙ్ఞ విధానంలో గూడా 10 అంకెలు వాడబడినాయి. స్థాన విలువ పద్ధతి కూడా ఉంది. హిందూ, అరబిక్ విధానంలోని స్థానాల్లో తెలుగు సంఙ్ఞ విధానంలో కూడా ఉన్నాయి. కనుక ఆ సంఙ్ఞ విధానంలోని సదుపాయాలు, లాభాలు దీనిలో (తెలుగు సంఙ్ఞ విధానంలో) కూడా ఉన్నాయి’’ అని పాఠ్య గ్రంథ రచయితలు తెలుగు అంకెల ప్రాధాన్యతను స్పష్టంగా పేర్కొన్నారు.
పాత పాఠ్య గ్రంథంలోని మొదటి అధ్యాయం పేరు సంఖ్యామానం-సంఙ్ఞమానం. ఇందులో తెలుగు అంకెల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు 4వ అభ్యాసాన్ని పొందుపరిచారు. ఈ అభ్యాసంలో రెండు సమస్యల్ని కూడా ఇచ్చారు. అయితే తెలుగు అంకెలపై పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇవ్వరాదని ఒక హెచ్చరికను జారీ చేయడం గమనార్హం.
తెలుగు అంకెలపై ఆంధ్రభూమిలో 19-03-11 తేదీన ప్రచురితమైన వ్యాసం.
తెలుగు అంకెలపై పరీక్షల్లో ప్రశ్నలను ఇవ్వకపోవడం బాధాకరం. కాగా రోమన్ అంకెల బోధనకు మాత్రం పెద్దపీట వేశారు. రోమన్ అంకెల్ని ఆజన్మాంతం మరచిపోకుండా ఉండేందుకు ప్రాజెక్టు పనుల్ని పకడ్బందీగానే పొందుపరిచారు. పాత పాఠ్యాంశం పరిస్థితి అలా ఉంటే కొత్త పాఠ్యాంశంలో తెలుగు అంకెల్ని ఏకంగా సమాధి చేసి రోమన్ అంకెలకు మరొక పేజీని అదనంగా కేటాయించి ఇటాలియన్ సంస్కృతిపట్ల విధేయతను ప్రకటించుకున్నారు. ఈ నిర్వాకాన్ని పునరుద్ఘాటిస్తున్నట్లుగా ‘‘రాష్ట్ర ప్రమాణాలకు అనుగుణంగా గణిత పాఠ్య ప్రణాళికను సమీక్షించి’’ అంటూ కొత్త పాఠ్యపుస్తకానికి రాసిన ముందు మాటలో సంకల్పం చెప్పుకున్నారు. పాత పాఠ్య ప్రణాళికలోని తెలుగు అంకెల పాఠ్యాంశాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం మాత్రం చేయలేదు. తెలుగు అంకెల్ని గణిత పాఠ్య ప్రణాళిక నుండి తొలగించిన విషయమై 15 రోజుల కిందట  ‘‘రాష్ట్ర విద్యా పరిశోధక శిక్షణామండలి’’లో గణిత విభాగం అధిపతి శ్రీ బ్రహ్మయ్య గారిని  సంప్రదిస్తే తాను ఇటీవల బాధ్యతలు చేపట్టానని, గతంలో ఈ నిర్ణయం జరిగి ఉండవచ్చునని వివరించారు. తెలుగు అంకెలు వినియోగంలో లేనందువల్ల ఆ పాఠ్యాంశాన్ని తొలగించి, ఉండొచ్చునని, ఏది ఏమయినా ఈ అంశాన్ని తమ మండలిలో పునఃసమీక్షిస్తామని తెలిపారు. ఎన్.టి. రామారావు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు భాషాభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. తెలుగును అధికార భాషగా అమలు చేసేందుకు ఎన్.టి.ఆర్. పట్టుదల వహించారు. తెలుగు అంకెల పరిరక్షణకు ప్రత్యేక ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర వాహనాల నెంబరు ప్లేట్లపై తెలుగు అంకెలతో వాహనాల నెంబర్లను రాయించారు. వావిలాల గోపాలకృష్ణయ్య, నండూరి రామకృష్ణమాచార్య, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఎ.బి.కె. ప్రసాద్ వంటి వారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా తెలుగు వికాసానికి ఎంతోకొంత పాటు పడ్డారు. ప్రస్తుతానికొస్తే 2009 మే నెల ఐదవ తేదీతో అధికార భాషా సంఘానికి గడువు తీరిపోయింది. ఇంతవరకు మళ్లీ నియామకం జరుగలేదు. తెలుగు భాషా సంస్కృతులకు ప్రపంచీకరణ ముప్పు దాపురించిందని మనం గగ్గోలు పెడుతున్నాం. ఆంగ్ల భాష ఆధిపత్యం కారణంగా తెలుగు భాష కనుమరుగైపోతోందని ఆవేదన చెందుతూ ఉద్యమబాట పడుతున్నాం. మన తెలుగు భాషను పరిరక్షించుకొనేందుకు ప్రపంచీకరణ, ఇంగ్లీషు ఆధిపత్యం లాంటి బయటి శక్తులతో అనేక రీతుల్లో పోరాటం చేస్తున్నాం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వ తీరు ‘‘ఇంట్లోవాడే పెట్టే కంట్లో పుల్ల’’ అన్నట్లుగా మారిపోయింది. ప్రపంచానికి సున్నాను అందించింది, ఎంతో విశిష్టమయినది మన భారతీయ సంస్కృతి అని, ఈనాడు ప్రపంచంలో వాడకులో ఉన్న అంకెలు హిందూ అరబిక్ అంకెలని మనకు తెలుసు. భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తికి అనుగుణంగా భిన్న సంస్కృతులకు ఆలవాలమైన మనదేశంలో అనేక వేషభాషలు, కులమతాలు, ఆచారవ్యవహారాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళం, మరాఠి, గుజరాతి, తదితర భాషల్లో ఒక్కో భాషకు ప్రత్యేకమైన నుడికారాలు, సంఙ్ఞలూ (అంకెలూ) ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆ భాషా సంస్కృతులను ఆయా భాషల్లోని ప్రత్యేకతలను వారు కాపాడుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్రంలో తెలుగు భాష కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖ లేకపోవడంవల్ల ఇలాంటి సందర్భాల్లో ఎవరికితోచినట్లు వారు నిర్ణయాలు చేస్తున్నారు. తెలుగు విషయంలో ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేనందున ఈ పరిస్థితి నెలకొంది. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, అధికార భాషా సంఘానికి విశేషాధికారాలను కల్పించి, తెలుగును రాష్ట్రంలో అన్ని స్థాయిల్లోనూ అధికార భాషగా పూర్తిగా అమలు చేయాలని, ఉద్యమకారులు ఎంతకోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉంటే పాఠ్య గ్రంథాల విషయంలోగాని, మరేదైనా విషయంలో గానీ తెలుగుకు అన్యాయం జరుక్కుండా జోక్యం చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడు తెలుగు కోసం ఏం కావాలన్నా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉంది. అధికార భాషా సంఘాన్ని వెంటనే నియమించడం, తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పర్చడం ఇవి తక్షణావసరాలు.
-తవ్వా ఓబుల్ రెడ్డి
అంధ్రభూమి దినపత్రిక, 19-03-2011 

Tuesday, March 15, 2011

కువైట్‌లో తెలుగువైభవం వేడుకలు

కువైట్‌లో ఆంధ్రావైభవం వేడుకలను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు కువైట్‌ రాక్‌డ్యాన్స్‌ అకాడమీ  వ్యవస్థాపకులు కె.ఈశ్వర్‌బాబు సోమవారం తెలిపారు. శ్రీకృష్ణచైతన్య సేవా సత్సంగ కమిటీ ప్రాంగణంలో శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌బాబు మాట్లాడుతూ మే 6వ తేది నుండి తెలుగు సంస్కృతి సాంప్రదాయలు ప్రతిబింబించేలా 100 మంది దంపతులతో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వృతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రాక్‌డ్యాన్స్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు విచిత్ర వేషదారణ, నృత్యాలు, పాటలు, ఆధ్యాత్మిక బోధన, ప్రతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రధాన కార్యదర్శి దార్ల శ్రీనివాసాచారి మాట్లాడుతూ 2011 నూతన సంవత్సర వేడుకను కువైట్‌లో మొట్టమొదటి సారిగా తెలుగు డ్యాన్స్‌ కళాశాల రాక్‌డ్యాన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, ఇదే స్పూర్పితో ఆంధ్రవైభవం వేడుకలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు 0096599692266 నెంబర్లో సంప్రదించాలన్నారు.

Monday, March 14, 2011

తెలుగు పతనానికి వ్యవస్థే కారణం- జస్టిస్ నాగార్జునరెడ్డి

న్యాయమూర్తి నాగార్జునరెడ్డి
తెలుగుభాష క్రమంగా పతనావస్థకు చేరువ కావడానికి  ఈ వ్యవస్థే కారణమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జునరెడ్డి అన్నారు. కడపలో ఆదివారం " పెన్నేటి కతలు, మనిషీ-పశువూ " తదితర రచనలు చేసిన విలక్షణ రచయిత పి.రామకృష్ణకు మల్లెమాల సాహిత్య పురస్కారం-2011 ప్రదానసభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుభాష స్థితిగతులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్లభాషపై మక్కువ పెంచుకుంటూ తెలుగుభాషను నిరాదరిస్తున్నారని, అధికార భాషా సంఘం  ఏం చేస్తుందో అర్ధం కావడం లేదని విచారం వెలిబుచ్చారు. ప్రస్తుత విద్యావ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్నారు. భాషా సబ్జెక్టుల కంటే గ్రూప్ సబ్జక్టుల మార్కులకే ప్రభుత్వం విలువిస్తున్నందున ఈ పరిస్థితి ఏర్పడిందని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి తెలుగుభాషను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పాఠకుల కన్నా కవులు, రచయితలే ఎక్కువయ్యారని, దీంతో రచనలకు సార్థకత లభించడం లేదని పేర్కొన్నారు. భాష, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ, సునిశిత పరిశీలన, సృజనాత్మక శక్తి, ఆసక్తి ఉన్నవారే మంచి రచయితలు కాగలర ని చెప్పారు. తనకు తల్లి అంటే ఎంత ప్రేమో తెలుగుభాషన్నా అంతే ప్రేమని తెలిపారు. ఆంగ్లేయుడైన బ్రౌన్ తెలుగుపై చూపిన అభిమానాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగు భాషలో లేని సాహితీ సంపద ఇంగ్లీషులో లేదని ఆయన స్పష్టం చేశారు.
కొట్టుమిట్టాడుతున్న తెలుగు భాషాజ్యోతిని కాపాడుకునేందుకు కవులు, రచయితలు, కళాకారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి కవిత్వం బాగుందన్నారు. సభాధ్యక్షుడు డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్ర్తి మాట్లాడుతూ డాక్టర్ మల్లెమాల పేర ఉన్న ఈ అవార్డును అర్హుడైన రామకృష్ణకు ఇవ్వడం సంతోషకరమన్నారు. రామకృష్ణకు ఈ పురస్కారం అందుకునేందుకు అన్ని అర్హత లు ఉన్నాయన్నారు. డాక్టర్ మల్లెమాల పురస్కార నివేదిక సమర్పిస్తూ ఈ అవార్డును రామకృష్ణకు ఇవ్వడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. ఆయన రచయితగానే కాక వ్యక్తిగా కూడా ఉన్నతుడని పేర్కొన్నారు.
పుస్తకావిష్కరణలు
మల్లెమాల పురస్కారాన్ని అందుకుంటున్నరచయిత పి. రామకృష్ణ
ఈ సందర్భంగా డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి రాసిన వేణుగానం కవితా సంపుటిని జస్టిస్ నాగార్జునరెడ్డి ఆవిష్కరించగా, డాక్టర్ ఆవుల రామచంద్రయ్య రాసిన బఠానీలు కవితా కదంబం పుస్తకాన్ని డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్ర్తి ఆవిష్కరించారు. అనంతరం మల్లెమాల సాహితీ పుర స్కారాన్ని రచయిత రామకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు నగదు బహుమతి అందజేశారు. పూలమాలలు, శాలువా కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ వరలక్ష్మి సత్కార పత్రం అందజేశారు. పురస్కార గ్రహీత రామకృష్ణ మాట్లాడుతూ తనపై అభిమానంతో ఈ అవార్డు ఇచ్చినందుకు డాక్టర్ మల్లెమాలకు కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో మహావధాని నరాల రామారెడ్డి, కాళహస్తి మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డి, రచయితలు వి. ప్రతిమ, వడలి రాధాకృష్ణ, వేంపల్లె అబ్దుల్‌ఖాదర్ తదితరులు ప్రసంగించారు.

Thursday, March 10, 2011

ట్యాంకు బండ్ ఘటనలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత !

హైదరాబాదులోని ట్యాంకుబండ్ ఫై తెలంగాణా వాదులు గురువారం చేపట్టిన మిలియన్ మార్చ్ లో అక్కడి తెలుగు మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం అత్యంత దారుణమైన హేయమైన చర్య! శ్రీకృష్ణదేవరాయలు , అన్నమయ్య, బ్రహ్మనాయుడు, శ్రీశ్రీ, త్రిపురనేని రామస్వామి చౌదరి తదితర తెలుగు ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేసి తెలుగుజాతి ఔన్నత్యాన్ని మంటగలిపారు. ప్రభుత్వాలూ, నేతల అసమర్థ వైఖరుల కారణంగానే తెలంగాణా సమస్య జటిలమైంది.  ఇలాంటి సంఘటనల వల్ల ఎంతో బలీయమైన తెలుగుజాతి ప్రపంచం దృష్టిలో చులకనైపోయింది. ట్యాంకు బండ్ పై   విగ్రహాలను ద్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మిలియన్ మార్చ్ సందర్భంగా మీడియా ప్రతినిధులపై,వాహనాలపై కూడా దాడి జరగడం శోచనీయం. తెలంగాణా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేక పోయిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలి.  రాష్ట్రం రావణకాష్టం కాకుండా చూడాలి.    

Saturday, March 5, 2011

తమిళనాడులోని హోసూరులో తెలుగు వారి ప్రదర్శన

తమిళనాడులోని హోసూరులో తెలుగు  వారి  ప్రదర్శన
ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగా ఫిబ్రవరి 20న తమిళనాడులోని హోసూరులో తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ భాషా ప్రజలు సంఘటితంగా పెద్ద ప్రదర్శన నిర్వహించారు. వీధుల్లో జరిగిన ఊరేగింపులో మూడువేల మందికి పైగా పాల్గొని తమ మాతృభాష రక్షణ తమ హక్కు అని నినదించారు. తమిళనాడు ప్రభుత్వం 15-12-2010న జారీ చేసిన నిర్బంధ తమిళ చట్టం నెం.316ను వెంటనే రద్దు చెయ్యాలని, 2006 వరకు ఉన్నట్లుగానే మొదటి భాషగా మాతృభాష ఉండాలని, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక విజ్ఞానం వంటి అంశాలను కూడా మాతృభాషలో చదివే విధంగా ఉత్తర్వులను సవరించాలని కోరారు. తాము రాష్ట్ర అధికారభాష తమిళాన్ని ఒక భాషగా చదవడానికి ఇష్టంగా ఉన్నామని, అయితే తమ మాతృభాషను అణచివేయడాన్ని అంగీకరించం అని స్పష్టం చేశారు. ‘లింగ్విష్టిక్ మైనార్టీస్ ఫోరం’ అనే పేరుతో ఒక ఏడాదిగా తమిళనాడులో జరుగుతున్న ఆందోళనను తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నందున మళ్లీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసన ప్రదర్శన తర్వాత పెద్ద బహిరంగ సభ జరిగింది. అన్ని భాషలకూ సంబంధించిన సంఘాలు, నేతలు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
హోసూరు-తెలుగు, కన్నడ రాష్ట్రాలకు ఆనుకొని తమిళనాడులో ఉంది. రాష్ట్రాల ఏర్పాటులో ఆ ప్రాంతాన్ని తమిళనాడులోకి చేర్చడంతో అక్కడ 80 శాతం ఉన్న తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ ప్రాంతంలో సుమారు 500 తెలుగు మాధ్యమ పాఠశాలలున్నాయి. అక్కడి హోసూరు, తమిళ అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటిలోనూ ఎన్నడూ ద్రవిడ పార్టీలు గెలుపొందవు. జాతీయ పార్టీలనే ఎన్నుకుంటారు. తెలుగువారు అత్యధికంగా, వారికి తోడుగా కన్నడిగులు సమైక్యంగా అన్ని ఉద్యమాల్లో వ్యవహరిస్తారు. ఒకనాటి మహానేత రాజగోపాలాచారి చదువుకొన్నది హోసూరులోని తెలుగు మాధ్యమ పాఠశాలలోనే. రాష్ట్రాల హద్దుల ఏర్పాట్లలో రాజాజీ తన స్వార్థం చూసుకొని తెలుగువారికి అన్యాయం చేశారని అక్కడివారికి కోపం. భాషాపరమైన అణచివేతను ఎదుర్కొంటూనే ఇనే్నళ్ళుగా స్వాభిమానంతో అక్కడి తెలుగు, కన్నడ ప్రజలు జీవిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రభుత్వ నేతలు ఎన్నోసార్లు అక్కడికి వెళ్లివచ్చారు కాని, వారికి తగిన తోడ్పాటు నివ్వడంలో మన ప్రభుత్వం విఫలం అయింది. తమ మాతృభాషను రక్షించుకోవడానికి ఉద్యమిస్తున్న అక్కడి తెలుగు, కన్నడ భాషా జాతీయులకు మన సంఘీభావాన్ని తెలుపుదాం.
-ఆంధ్రభూమి సౌజన్యంతో..

Wednesday, March 2, 2011

తెలుగు సంవత్సరాల పరిచయం !

ప్రతి ఏటా చైత్ర మాసం శుక్ల పాడ్యమి అంటే ఉగాది పండుగతో తెలుగు సంవత్సరం మొదటిరోజుప్రారంభం అవుతుంది.   తెలుగు సంవత్సరాలు 60  ఉన్నాయి. ప్రస్తుతం 25 వ సంవత్సరం అయిన వికృతి నామ సంవత్సరం జరుగుతోంది. 
తెలుగు సంవత్సరాలు...1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. అంగీరస, 7. శ్రీముఖ, 8. భావ, 9. యువ,  10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య,  13. ప్రమాధి, 14. విక్రమ, 15. వృష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్తు, 22. సర్వధారి, 23. విరోథి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవళంబి, 32. విళంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ 36. శుభకృత్తు, 37. శోభకృత్తు, 38. క్రోథి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్తు, 46. పరీధావి, 47. ప్రమాదిచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్తి, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్ముఖి, 56. దుందుభి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.