Thursday, March 31, 2011

పత్రికల్లో ఉచ్ఛారణ పదాలు రాస్తే భాష ఎక్కడా మిగలదు !

హైదరాబాద్‌ : భాషలో చమత్కారం, విరుపు వంటి ప్రయోగాలు వచ్చాయని, భాష మీద నిరంతరం ప్రయోగం చేస్తుంటే కొత్తదనం సృష్టించవచ్చని ఆంధ్రప్రభ సంపాదకులు పి.విజయబాబు అన్నారు. వార్తా శీర్షికల్లో చమత్కారం ఉంటుందని, సందర్భాన్ని బట్టి భాషను చమత్కారంగా, అందంగా, భావోద్వేగంగా చెప్పవలసి వుంటుందన్నారు. భాషకు గ్రామీణప్రాంత పలుకుబడులు తీసుకోవల్సిన అవసరం ఉందని, అప్పుడే భాష మరింత పరిపుష్టం అవుతుందన్నారు. బుధవారమిక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ''పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగువినియోగం'' చర్చాగోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వార్తా దినపత్రిక సంపాదకులు టంకశాల అశోక్‌ అధ్యక్షతన జరిగిన ''మేధోమథనం'' కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయబాబు మాట్లాడారు.. పత్రికల్లో ఉచ్ఛారణ పదాలు రాస్తే భాష ఎక్కడా మిగలదని, భాష ప్రామాణికంగా ఉండాలన్నారు. భాష పరిపుష్టానికి కృషి జరగాలని, అప్పుడే మంచి మంచి పదాలు వాడుకలోకి వస్తాయన్నారు. ప్రసారమాధ్యమాలు విస్తృతమైన ప్రస్తుత తరుణంలో సిబ్బందికి భాషపరంగా సరైన శిక్షణ ఇచ్చే సమయం లేకపోవడం వలనే భాష, పద దోషాలు వస్తున్నాయని అన్నారు. ఏదైతే మాట్లాడతామో అవే వాడుక పదాలను రాయడం తప్పన్నారు.
మాండలిక భాషను కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా వుందని, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన 'లొల్లి' అనే పదాన్ని అందరూ వాడుతున్నారని అన్నారు. మాండలికంలో అందమైన పదాలు తీసుకుని భాషా ప్రయోగాలు చేయవచ్చన్నారు. వార్త పత్రిక సంపాదకుడు అశోక్‌ మాట్లాడుతూ, పత్రికలు, ఛానళ్ళలో తెలుగువినియోగంపై చర్చలు ఇంకా సీరియస్‌గా జరగవల్సివుందని అభిప్రాయపడ్డారు. తెలుగుపత్రికల్లో ఆంగ్లపదాలు వాడటం వలన సమస్యలు వస్తున్నాయని, వాటికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందన్నారు. ఆకాశవాణి సీనియర్‌ పాత్రికేయురాలు ఎం.ఎస్‌.లక్ష్మి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో విలేఖరులకు ఆంగ్లపదాలకు సమాన తెలుగు అర్ధాలు లభించడం లేదని, అందుకే వార్తాల పరంగా తెలుగులో ఆంగ్లపదాలు వాడాల్సివుంటుందన్నారు. క్షేత్రస్థాయిలో సాంకేతికపదాలకు అనువాదం లేదని, డిమాండ్‌ అనే పదాన్ని తెలుగులో సమాన అర్ధం లేదన్నారు. అందరికీ అర్ధమవుతాయనే భావించిన తర్వాతే ఆంగ్లపదాలను వార్తల్లో వాడుతున్నారని అంటున్నారు. ఎబిఎన్‌ -ఆంధ్రజ్యోతి ఛానల్‌ సీనియర్‌ పాత్రికేయుడు జి.ఎస్‌. రామ్మోహన్‌ మాట్లాడుతూ, ప్రింట్‌ మీడియా కంటే టివి ఛానళ్ళల్లో ఎక్కువగా వ్యవహారిక భాషను వాడవల్సివుంటుందని, అందుకే ఛానళ్ళ చర్చాకార్యక్రమాల్లో ఆంగ్లపదాలను బాగా వాడతారన్నారు. ముఖ్యంగా టీవీ మాధ్యమం నగర, పట్టణ వాసులపై ఆధారపడివుంటుందని, గ్రామీణప్రాంతాలను పట్టించుకోదని, అందువలనే ఆంగ్లపదాల వాడుకలో సమస్యలు తలెత్తవన్నారు. టీవీ రంగంలో ముఖాలు బావుంటాయనే యోచనతో పట్టణ ప్రాంతాలకు చెందిన వారినే న్యూస్‌రీడర్‌ వంటి ఉద్యోగాలకు తీసుకుంటున్నారని, బులిటెన్‌లో వార్తలు ఎక్కువగా ఇవ్వాలనే తాపత్రయంతో స్పీడ్‌గా వార్తలను చదివిస్తామన్నారు. ఛానళ్ళకు ఉచ్ఛారణ ప్రాధమికమని, లిపి ద్వితీయమని, అయినప్పటికీ భాషకు ప్రామాణికత ఎంతో అవసరమని ఆయన నొక్కిచెప్పారు. సాక్షి జర్నలిజం కళాశాల అధ్యాపకుడు గోవిందరాజు చక్రధర్‌ మాట్లాడుతూ, వ్యవహారిక భాష వినియోగంలో పరిమితులు ఉన్నాయన్నారు. వార్త జర్నలిజం కళాశాల అధ్యాపకుడు కె.శ్రీకాంత్‌ మాట్లాడుతూ, ఆంగ్లభాష చదువుతుంటే ఏదో బ్రతుకుదెరువు ఉందనే మోజు ప్రజల్లో ఉందని, ఈ మోజుతో తెలుగుభాషకు కొంత అవాంతరం వస్తుందన్నారు. ప్రస్తుతం జర్నలిజంలో ప్రవేశించేవారికి తెలుగుపట్ల అవగాహన తక్కువగా ఉంటుందని, అయితే తెలుగుభాష అంతరించదని, పత్రికల్లో మాత్రం తెలుగు ఉంటుందని ఆయన అన్నారు. పత్రికల్లో ఒత్తులు, దీర్ఘాలు మార్చితే ప్రమాదం ఉందని, కానీ పలుకుబడితో లిపిని మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ చెల్లప్ప మాట్లాడుతూ, పత్రికల్లో ఎంతవరకు తెలుగుభాష వ్యాప్తికి కృషి చేస్తున్నాయో విశ్లేషించాలన్నారు. తెలుగుభాషలో సంస్కృత పదాలు చాలవరకు కలిశాయని, ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లపదాలు కలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన ఆచార్య మృణాళిని మాట్లాడుతూ, మీడియా సంస్థలకు రీసెర్చ్‌ అండ్‌ రిఫరెన్స్‌ డిపార్టుమెంట్‌ వుంటే బావుటుందన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిజం విద్యార్దులకు వచ్చిన నివృతిని సీనియర్‌ పాత్రికేయులు తీర్చారు. ఈ చర్చాగోష్టి సందర్భంగా చర్చించిన 11 అంశాలతో కూడిన తీర్మానాన్ని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ చెన్నయ్యకు సీనియర్‌ పాత్రికేయుడు టంకశాల అశోక్‌ అందించారు.

Wednesday, March 30, 2011

తెలుగు కోసం ఒక వ్యవస్థ : తెలుగు విశ్వవిద్యాలయం చర్చాగోష్ఠి

హైదరాబాద్: పత్రికలు, ప్రసార మాధ్యమాలకు ఉపయోగపడుతూ తద్వారా తెలుగు భాష సుసంపన్నం కావడానికి వీలుగా ఒక శాశ్వతమైన యంత్రాంగం ఉండాలని, ఆ యంత్రాంగం ఎప్పటికప్పుడు భాషా ప్రయోగానికి, నూతన పదకల్పనకు తోడ్పడాలని పలువురు దినపత్రికల సంపాదకులు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంగళవారం ‘పత్రికలు-ప్రసార మాధ్యమాలు తెలుగు భాష వినియోగం’ అనే అంశంపై రెండు రోజుల చర్చా గోష్ఠి ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎస్ చెల్లప్ప మాట్లాడుతూ తమిళం మొదలైన సోదర భాషల్లో భాష పరిరక్షణకు, ఆధునికీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకుంటూ తదనుగుణంగా తెలుగును అభివృద్ధి పరచుకోవాలని అన్నారు. సామాన్యుల వద్దకు తెలుగును తీసుకువెళ్తున్న పత్రికలు, ప్రసారసాధనాల కృషి ప్రశంసనీయమని అన్నారు. అయితే ఆంగ్లం ప్రాధాన్యాన్ని విడనాడి, తెలుగుకు పట్టం కట్టాలని అన్నారు. తెలుగు భాష స్థిరీకరణలో పత్రికల పాత్ర ఎనలేనిదని అన్నారు. తెలుగు మాటలు, పదాల వినియోగం ఇటు పత్రికల్లో, అటు ప్రసారమాధ్యమాల్లో తగ్గుతోందని, దీనికో పరిష్కారం చూడాలని అన్నారు.
భాషా వికాసానికి పాటుపడాలి: ఎం.వి.ఆర్ శాస్త్రి
తెలుగు భాషాభివృద్ధి గంభీరమైన సమస్య అని, ఆధునిక సమాజానికి అవసరమైన కొత్త పదాలను అందించడంతో పాటు భాషా వికాసానికి విశ్వవిద్యాలయాలు సైతం పాటుపడాలని ఆంధ్రభూమి సంపాదకుడు ఎం.వి.ఆర్ శాస్త్రి  అన్నారు. పత్రికాభాష- తెలుగు వినియోగం అంశంపై జరిగిన తొలి సదస్సుకు ఎం.వి.ఆర్ శాస్ర్తీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు, ప్రసార మాధ్యమాలు అప్పటికప్పుడు వచ్చిపడే కొత్త పదాలను తెలుగులోకి అనువదించేందుకు తగిన పదజాలం లేదన్నారు. ఈ అవస్థల్ని తీర్చేందుకు విశ్వవిద్యాలయాల నుండి తగిన సహకారం కావాలని అన్నారు. గత 30, 40 ఏళ్లుగా ఆగిపోయిన పదసృష్టిని ఇప్పటికైనా ప్రారంభించాలని సూచించారు. నిఘంటువులు దగ్గర పెట్టుకున్నా కొన్ని పదాలు దొరకవని, ఈ అవస్థలను తీర్చాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపైనా, విద్యావేత్తలపైనా ఉందని ఎంవిఆర్ శాస్త్రి  అన్నారు. ఈ అంశంపైనే ప్రత్యక సమావేశాలు ఏర్పరచి పదసృష్టి చేయాలని చెప్పారు. తెలుగు భాష ప్రామాణిక నిఘంటువులు తయారుకావాలని, ఆంగ్లంలో మాదిరి తెలుగుభాషకు సైతం అక్షరగుణింతాల పరిశీలనకు ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు.
పదసృష్టికి ప్రత్యేక ప్రాజెక్టులు: ఆచార్య భూమయ్య
తెలుగు విశ్వవిద్యాలయం విసి ఆచార్య అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాలు తెలుగు భాషా వికాసానికి ఎంతగానో పాటుపడుతూ లక్షలాది మంది తెలుగు పాఠకులను తయారుచేస్తున్నాయని అన్నారు. తెలుగు పట్ల నిరాదరణ అధికంగా ఉన్న తరుణంలో భాషను నిలబెట్టేందుకు ఎన్నో కార్యక్రమాలు జరగాల్సి ఉందని చెప్పారు.
అంతా పట్టించుకుంటేనే భాష ఎదిగేది: రామచంద్రమూర్తి
అంతా పట్టించుకున్న రోజునే భాష ఎదుగుతుందని హెచ్‌ఎంటివి సిఇఓ డాక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. సమాజానికి, ప్రభుత్వానికీ పట్టింపు లేకపోవడం వల్ల, ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం వల్ల తెలుగు భాష ఎదగడం లేదని చెప్పారు. ఆంగ్లంలో మాట్లాడితే గొప్ప అనే విధంగా అంతా భావిస్తున్నారని, తెలుగులోనే దస్త్రాలు తయారుచేసే అధికారులను సత్కరించడంతో పాటు అన్ని రంగాల్లో వ్యవహారికంలోకి వచ్చిన పదాలకు తెలుగు మాటలను గుర్తించాలని సూచించారు. పండితపరిషత్‌ను ఏర్పాటు చేసి వారం వారం సమావేశమై కొత్త తెలుగు పదాలను అందరి ఆమోదంతో వాడుకలోకి తేవాలని అన్నారు.
పత్రికలు తలచుకుంటే పదసృష్టి: వరదాచారి
పత్రికలు తలచుకుంటే పదసృష్టి సాధ్యమేనని హెచ్‌ఎం టివి అంబుడ్స్‌మన్ డాక్టర్ జి.ఎస్ వరదాచారి అన్నారు. కొత్త పదాలు ఎన్నో వాడుకలోకి వచ్చినా, జనం హర్షించినవే నిలుస్తాయని అన్నారు. అవసరం ఏర్పడినపుడు కొత్త పదాలు పుడతాయని, అలాగే పరిశోధనా ఫలితాలను ఆయా శాస్తవ్రేత్తలు తెలుగులో రాసినపుడు మంచి పదాలు పుడతాయని చెప్పారు. ఇపుడు అనేక రంగాలు విశ్వవ్యాప్తం కావడంతో అన్ని శాస్త్రాల్లో కొత్త పదాలకు తెలుగు మాటలను కనిపెట్టాల్సిన గురుతర బాధ్యత అందరిపై పడిందని అన్నారు.
చట్టబద్ధ వ్యవస్థ ఉండాలి: పొత్తూరి
తెలుగు భాషాభివృద్ధికి చట్టబద్ధ వ్యవస్థ ఉండాలని ప్రారంభోపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగు వాడకంలో పత్రికలు మేలు చేయడంతో పాటు కీడు కూడా చేశాయని అన్నారు. భాష ప్రామాణీకరణ సాధ్యం కాదని, భాషను సుసంపన్నం చేయడానికి కొత్త పదాలు, వృత్తి పదాలు, శాస్త్ర విజ్ఞాన పదాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. తెలుగు భాషను అధికారిక భాషగా చట్టం చేసిన చట్టసభల్లోనే అధినేతలే ఆంగ్లంలో మాట్లాడుతున్నపుడు ఇక ఎవరు పట్టించుకుంటారని అన్నారు. ప్రెస్ అకాడమీని మీడియా అకాడమీగా తీర్చిదిద్దాలని, దానికి చట్టబద్ధత కల్పించి, ఎడిటర్లకు స్థానం కల్పించాలని పేర్కొన్నారు.
మాండలికాలు లేని భాష ప్రామాణికమా?- అల్లం నారాయణ
ఒకటి రెండు జిల్లాల్లో మాట్లాడే భాషను తీసుకువచ్చి ప్రామాణిక భాషగా చెప్పుకోవడం సరికాదని, ఆంగ్లంలోని పదాలను, హిందీ, ఉర్దూ పదాలను స్వీకరించి వినియోగిస్తున్న ప్రామాణిక భాషా నిపుణులు తెలుగులోనే ఇతర ప్రాంతాల మాండలికాలను ఎందుకు స్వీకరించడం లేదని నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ అల్లం నారాయణ ప్రశ్నించారు. భాషకు కులతత్వం, ప్రాంతీయ తత్వం వచ్చిందని, ఈ ప్రాంత మాండలికాలను వినియోగించని భాష ప్రామాణికం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పత్రికలు ప్రజాస్వామ్య లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.
విశ్వసేవ: శంకరనారాయణ
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం విశ్వసేవ అవుతుందని ఈనాడు ప్రతినిధి శంకరనారాయణ అన్నారు. ఆంగ్ల పదాలకు తెలుగును సూచించే ప్రయత్నం గట్టిగా జరగాలని చెప్పారు. భాషా చట్టం ముందు అన్ని మాండలికాలు సమానమేనని, జిల్లా ఎడిషన్లు మాండలికాల్లోనే రాయాలని అన్నారు. ఏ కథనంలోనైనా తెలుగు వెలుగు కనిపించాలని అన్నారు.
శాశ్వత విభాగం ఉండాలి: కె.శ్రీనివాస్
భాషాభివృద్ధికి శాశ్వత విభాగం ఉండాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. భాషపై చర్చ జరిగినపుడు, వౌలికమైన పదాలకు సమానకార్థాలు వచ్చినపుడు భాష ఎదుగుతుందని అన్నారు. మాండలికాల పదకోశాలు తయారుచేయాలని, శ్రామిక వర్గాల సమూహాల నుండి వారు వినియోగించే పదాలను జనసామాన్య వాడుకకు తేవాలని సూచించారు.

భాషతోనే జాతీయ సమైక్యత

న్యూఢిల్లీ: దక్షిణాది విద్యార్థులు ఏదో ఒక రూపంలో హిందీని పాఠ్యాంశ రూపంలో నేర్చుకుంటున్నట్టు ఉత్తర భారత విద్యార్థులూ ఏదో ఒక దక్షిణాది భాషను పాఠ్యాంశంగా ఎంచుకుంటే జాతీయ సమైక్యత బలోపేతమవుతుందని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ ఉద్బోధించారు. ఆంగ్లభాష ప్రభావం ఏమాత్రం కనిపించని విధంగాప్రతి ఒక్క ఉత్తరాది విద్యార్థి ఏదో ఒక దక్షిణాది భాషను నేర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రక్రియలోపించటంతో దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య విలువలు ఉత్తరాది వారికి అందకుండా పోతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సంకలనం చేసిన ‘సహస్ర వర్షోం కా తెలుగు సాహిత్య’ అన్న పుస్తకాన్ని అన్సారీ తన నివాస గృహంలో ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో తెలుగు మూడో స్థానంలో ఉండడం గర్వకారణమని ఆయన ప్రశంసించారు. ప్రాచీన భాష హోదా లభించిన తెలుగు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోడానికి యార్లగడ్డ వంటి వారు తెలుగులోని గొప్ప కృతులను హిందీలోకి అనువదించి భావి తరాలకు అందచేయాలని ఆయన సూచించారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. రచయిత యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగుతో సహా దక్షిణాది భాషలకు సంబంధించిన అనువాదాలు ఉత్తర భారత దేశ ప్రజలకు అందకపోవటం వల్ల రెండు ప్రాంతాల ప్రజల మధ్య సాంస్కృతిక, సమైక్యత కుదరడం లేదని అన్నారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య విలువలు దేశ వ్యాప్తంగా తెలియక పోవటంతో కేవలం రెండు జ్ఞానపీఠ్ అవార్డులతో సరిపెట్టుకోవలసి వచ్చిందన్నారు.