ఉన్న ఊర్లో ఉపాధి కరవవడంతో నాలుగురాళ్లను వెనకేసుకోవాలని అయినవారికి దూరంగా గల్ఫ్‌దేశాలకు పయనమయ్యారు.. అలావెళ్లినవారికి అవమానాలు.. ఛీత్కారాలు నిత్యకృత్యమయ్యాయి.. కొందరైతే జైళ్లల్లో మగ్గుతున్నారు.. మరి కొందరు చిన్నపాటి విషయాలకే సేఠ్‌ల చేతులలో ప్రాణాలు కోల్పోతున్నారు.. ప్రమాదంలో చనిపోతే రక్తసంబంధీకులకు చివరి చూపుకూడా దక్కడం లేదు.. వీటన్నింటినీ ఇన్నాళ్లు మౌనంగా భరించారు.. వారిలో చైతన్యం వచ్చింది.. చేయిచేయి కలిపారు.. ఫోరంగా ఏర్పడ్డారు.. తెలుగువారికి ఏ అన్యాయం జరిగినా కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు.
గల్ఫ్ దేశాలలో ఉంటున్న తెలుగువారంతా ఒకేతాటిపైకి వచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయాలను సంఘటితంగా ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక ఫోరంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, బద్వేలు ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వేలాది మంది గల్ఫ్‌దేశాలకు వెళ్లారు.. వెళుతున్నారు. అక్కడికి వెళ్లిన వారు వివిధ రకాలుగా బాధలు పడుతున్నారు..జైళ్లల్లో మగ్గుతున్నారు..షేఠ్ చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు..అన్యాయాలకు..అక్రమాలకు..
బలవుతున్నారు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే మృతదేహాలను రక్తసంబంధీకులు చూసే భాగ్యంకూడా కొన్ని సందర్భాలలో దక్కటం లేదు. ఒక్క కువైట్‌లోనే నాలుగులక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. దీంతోపాటు దుబాయ్, ఖతర్, మస్కట్, సౌదీ అరేబియా దేశాలలో మూడు లక్షల మంది ఉన్నట్లు అంచనా.
గల్ఫ్‌దేశాల్లో తెలుగువారిని చిన్నచూపు చూడటం సాధారణమైపోయింది. ఫిలిప్పీన్, శ్రీలంక,ఇరాన్, ఇరాక్, చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన వారు, అలాగే మన దేశంలోని కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారు ఐక్యంగా తమ వారికి అన్యాయం జరిగితే సమష్టిగా ఆదుకుంటారు. అవసరమైతే తమ దేశ రాయబారి కార్యాలయం నుంచి వత్తిడి తీసుకొస్తారు. అయితే తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలకు స్పందించేవారుగానీ, చేయూత ఇచ్చేవారుగానీ కరువవుతున్నారు. దశాబ్ధాల కాలంలో గల్ఫ్ దేశాలలో తెలుగువారు బాధలు పడుతున్నా పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. కనీసం తోటి తెలుగువారు కూడా సహకరించడం లేదు. దీంతో గల్ఫ్ దేశాలలో రోజురోజుకూ తెలుగువారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. చిన్నచిన్న విషయాలకే తెలుగువారు హత్యలకు గురికావడం, ఇతర సంఘటనలతో తొలిసారిగా గల్ఫ్‌దేశాలలో తెలుగుసంఘాలు ఒక్కటిగా నిలవాలని నిర్ణయించాయి. తెలుగువారికి అండగా, చేయూతగా నిలవాలని ఒకేతాటిపైకి వచ్చాయి.
ఆవిర్భావం ఇలా..
తెలుగువారు పడుతున్న కష్టాలను పరిష్కరించడానికి కువైట్ దేశంలోని అన్ని తెలుగుసంఘాలు ప్రతినిధులు సమావేశమై యునెటైడ్ తెలుగుఫోరం-కువైట్‌గా ఏర్పాటు అయ్యారు. ఈమేరకు శుక్రవారం రాత్రి స్మాలియా ప్రాంతంలో తెలుగుసంఘాల నాయకులు భేటీ అయ్యారు. ఇందులో ఆదర్శ ఆంధ్రాయూత్, తెలుగుకళాసమితి, కళాంజలి, తెలుగులలితకళాసమితి, రాక్‌డ్యాన్స్ అకాడమీ, ప్రవాసాంధ్ర టీడీపీ , ఎన్‌ఆర్‌ఐటీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, మహాత్మాగాంధీవెల్ఫేర్, రియాల్-అరబ్ టు ఏపీ, మయూరి గ్రూప్స్, ప్రవాసాంధ్రకాంగ్రెస్, తెలుగు క్రిష్టియన్ సంఘాలున్నాయి. కోల్లబత్తుల వీర్రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో యడ్ల రవి, యేసురత్నం, దార్ల శ్రీను, త్రిమూర్తులు, ములకల సుబ్బరాయుడు, బలరాంనాయుడు, రాజశేఖర్, రాజేష్, బీపీనాయుడు, మురళీ, భాస్కరరెడ్డి, వెంకటరెడ్డి, వెంకటశివరావు, సత్య పాల్గొన్నారు.
నిధులు సేకరణకు సమాయత్తం
కువైట్‌లో తెలుగుబాధితులను ఆదుకునేందుకు నిధుల సేకరణకు యునెటైడ్ తెలుగుఫోరం-కువైట్ సమాయత్తమైంది. బాధితులకు త్వరలో ఆర్థిక సహాయం అందచేస్తామని ప్రకటించింది. భారతరాయబారి సతీష్‌చంద్రమోహతాను కలిసి తెలుగువారి సాధకబాధకాలపై వినతిపత్రం సమర్పించారు. ఇటీవల సేఠ్ చేతిలో హత్యకు గురైన గాలివీడుకు చెందిన తోకలనరేష్, అగ్గివారిపల్లెకు చెందిన నల్లగుట్ట రమణయ్య, దుద్వాలకు చెందిన మాసగిరి ఓబులరెడ్డి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
తెలుగువారిని హత్య చేయడం దారుణం
కువైట్‌లో తెలుగువారిని హత్య చేయడందారుణం. వీధిన పడిన గల్ఫ్ బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. మావంతు సహాయాన్ని యునెటైడ్ తెలుగుఫోరమ్ ద్వారా అందిస్తాం
- వీర్రాజు, యునెటైడ్‌ఫోరమ్, ఆర్గనైజర్, కువైట్
హత్యలు విచారకరం
పొట్టి కూటి కోసం వచ్చిన వారు ఇలా హత్యలకు గురికావడం విచారకరం. తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలి. సమష్టిగా పోరాడాలి. అందుకే యునెటైడ్ ఫోరమ్‌ను బలోపేతం చేయాలి -ఆకులప్రభాకరరెడ్డి, కువైట్
మానవత్వంతో ఆదుకోవాలి
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరినీ మానవత్వంతో ఆదుకోవాలి. కువైట్‌లో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటడానికి తెలుగు గొంతులు ఒక్కటికావాలి. - కె.ఈశ్వరబాబు, కువైట్
ఎట్టకేలకు స్వదేశాలకు మృతదేహాలు
ఈ నెల 1న కువైట్‌లో వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ తూటాలకు బలైన మూడు మృతదేహాలను స్వదేశాలకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు శనివారం అందిన సమాచారం. ఇందులో వై.ఎస్.ఆర్ జిల్లాలోని గాలివీడు మండలం నాగువారివాండ్లపల్లెకు చెందిన తోకల నరేష్‌కుమార్, చిత్తూరు జిల్లాలోని కంభంవారిపల్లె మండలం ఎంవీపల్లె పంచాయితీ అగ్గివారిపల్లె గ్రామానికి చెందిన నల్లగుట్ట రమణయ్య, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లెలో ఉంటూ సంబేపల్లె మండలం దుద్యాలలో జన్మించిన ఎం.ఓబులరెడ్డి ఉన్నారు. కాగా జిల్లాకు చెందిన తోకల నరేష్‌కుమార్ మృతదేహంను కువైట్‌లో ఈనెల 16న తరలించనున్నట్లు సమాచారం.
ఈ మృతదేహాలను స్వదేశానికి చేర్చే క్రమంలో చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి ఉచితంగా స్వగ్రామాలను తరలించేలా అంబులెన్స్‌ను ఏర్పాటుచేయాలని, ఎన్‌ఆర్‌ఐసెల్‌తోపాటు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లా కలెక్టర్లను కోరుతూ లేఖ రాసినట్లు వలసదారుల హక్కుల మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీ రెడ్డి శనివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. నల్లగుంట రమణయ్య, ఓబులరెడ్డి మృతదేహాలు ఆదివారం కువైట్‌లో తరలిస్తారని సోమవారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయానికి చేరుతాయని స్పష్టంచేశారు. ఈ రెండు మృతదేహాలు వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన నరేష్ మృతదేహం వస్తుందని ఆయన వివరించారు.