Thursday, December 16, 2010

19న హైదరాబాద్‌లో "తానా" 'తెలుగు వైభవం'

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే సంకల్పంతో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఈ నెల 19న రవీంద్రభారతిలో 'తానా చైతన్య స్రవంతి-తెలుగు వైభవం' ఉత్సవాలను నిర్వహించనుంది. మంగళవారమిక్కడ తానా అధ్యక్షుడు కోమటి జయరామ్‌ విలేకరులతో మాట్లాడారు. ఔత్సాహిక కళాకారుల ప్రతిభను వెలుగులోకితెచ్చేందుకు రెండేళ్లకోసారి రాష్ట్రంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రతిభావంతులకు 2011లో అమెరికాలో జరిగే తానా సభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇదే నెల 22, 23 తేదీల్లో చంద్రగిరికోట (తిరుపతి)లో ఆధ్యాత్మిక వైభవం, 24, 25 తేదీల్లో విజయవాడలోని సిద్దార్థ కళాశాల మైదానంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. తెలుగు కవితల పోటీలు, రాష్ట్రస్థాయి నాటికల పోటీలు, వేదపఠనం, భక్తిగీతాలపాన, జానపద కళల ప్రదర్శన, తెలుగు సాంస్కృతిక సమ్మేళనం వంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సీనియర్‌ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌ను గిడుగు రామ్మూర్తి పురస్కారంతో, మల్లాది సుబ్బమ్మను సేవా పురస్కారంతో సత్కరిస్తామని తెలిపారు.
తానా' ఆధ్వర్యంలో విజయవాడలో జానపద కళావైభవం
ప్రాభవం కోల్పోతున్న తెలుగు జానపద కళలకు ప్రాచుర్యం కల్పించి, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో విజయవాడలో 'జానపద కళావైభవం' పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటుచేయబోతున్నట్టు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు కోమటి జయరాం తెలిపారు. ఈనెల 24, 25  తేదీల్లో సిద్ధార్థ అకాడమీ మైదానంలో వీటిని ఘనంగా నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. వీటిల్లో మంచి ప్రావీణ్యం చూపిన కళాకారులకు తానా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. విజయవాడలో జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులను సన్మానించనున్నట్టు తెలిపారు. న్యూజెర్సీలో ఉండే విజయవాడ వాసి సుబ్బారావు అనుమోలు అమెరికాలో స్థిరపడిన వారికి ఇచ్చే అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకున్నారని, ఆయన్ను కూడా విజయవాడలో సన్మానించనున్నట్టు తెలిపారు. 23, 24 తేదీల్లో నాటికలు, కవితల పోటీలు, జానపద కళల ప్రదర్శన, దివంగత తెలుగు దిగ్గజాల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటుచేస్తామని సాంస్కృతిక సమన్వయకర్త విజయ ఆసూరి చెప్పారు. తెలుగుజాతి సంస్కృతి పేరుతో కవితాగోష్ఠి, రచయితల చేత పత్రాల సమర్పణ ఉంటుందనీ, వీటిని పుస్తకరూపంలో ముద్రించి తానా సభల్లో ఆవిష్కరిస్తామని తానా సమన్వయకర్త బీఎస్‌ కోటేశ్వరరావు తెలిపారు. అమెరికాకు వచ్చే తెలుగువారికి తానా ఎప్పుడూ సహాయంగా ఉంటుందని కోమటి జయరాం చెప్పారు. ఇక్కడి నుంచి కొత్తగా వచ్చే వారి కోసం ఉపయోగపడే సమాచారం తానా వెబ్‌సైట్‌లో ఉంటుందని పేర్కొన్నారు. అక్కడికొచ్చి చదువుకునే వారికి ప్రతి ఏటా 35 మందికి ఉపకార వేతనాలు ఇస్తున్నట్టు చెప్పారు. అంతరించిపోతున్న కళలకు తానా ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అన్నారు. ఈ సమావేశంలో తానా భారత సమన్వయకర్త గారపాటి ప్రసాద్‌, ఆహ్వాన సంఘం సభ్యులు పట్టాభి, బెల్లపు బాబ్జీ, కృచ్ఛేవ్‌, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Sunday, December 5, 2010

తెలుగువారి పండువగా ప్రాణహిత పుష్కరాలు!

ప్రాణహితనది
ప్రాణహిత పుష్కరాలు  ఈ సంవత్సరం స్వస్తిశ్రీ వికృతినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత రుతువు, మార్గశీర మాసం, శుద్ధపాడ్యమి, బృహస్పతి గురువు మీనరాశిలో ప్రవేశించిన సందర్భంలో ( 2010 డిసెంబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు) వారం రోజుల పాటు   ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి . ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ యేడు గత ఎన్నడూ లేని విధంగా ఈ పుష్కరాలను నిర్వహించేందుకు సిద్ధపడింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో, కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం లోని త్రివేణి సంగమం వద్ద వీటిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పుష్కరాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇందుకోసం రూ.తొమ్మిది కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్‌కు రూ.ఐదు కోట్లు, ఆదిలాబాద్‌ జిల్లాకు నాలుగు కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుష్కరాలను ప్రారంభిస్తారు.
ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాణహిత జన్మస్థానమైన కౌటాల మండలం తుమ్డిహేటి, కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండలాల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నారు. పుష్కర స్థలం వద్ద స్నాన ఘట్టాలు, విశ్రాంతి గదుల నిర్మాణంతో పాటు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. యాత్రికులకు తాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలిక రోడ్లు తదితర ఏర్పాట్లు  సాగుతున్నాయి. వేమనపల్లి, ముత్తారం నుండి ప్రాణహిత నది వరకు మట్టి రోడ్డు వేశారు. మరుగుదొడ్లు, స్నానాల గదులను తడకలతో ఏర్పాటు చేశారు. విశ్రాంతి గదుల పేరిట పందిళ్లు వేశారు.
ప్రాణహిత పుష్కరాలు - విశిష్టత ! 
బృహస్పతి మీనరాశిలో ప్రవేశం జరగడంచే ప్రాణహితనదికి ఈసారి పుష్కరాలు సంభవించాయి.
పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి సంభవించే పవిత్ర నదీ పండుగ.పన్నెండు నెలల పాటు ఒక్కో రాశిలో తిరిగే బృహస్పతి (గురువు) ఒక్కోరాశి ప్రవేశించినప్పుడు ఒక్కోనది 'పుష్కరిణి'గా దేశంలోని పన్నెండు నదులకు ఒక క్రమపద్ధతిలో పుష్కరాలను  రూపొందించారు. అందులో భాగంగానే గురువు మేషరాశి లో ప్రవేశిస్తే గంగానదికి, వృషభరాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి, మిథునంలోనయితే సరస్వతీ నదికి, కర్కాటకం లో యమునా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరీ నదికీ, కన్యలో ప్రవేశిస్తే కృష్ణానదికీ, తులారాశిలోనయితే కావేరీ నదికీ, వృశ్చికంలో తామ్రపర్ణీ నదికీ పుష్కరాలుగా భావిస్తారు. గురువు ధనస్సులో ప్రవేశిస్తే సింధూనదికీ, మకరంలో ప్రవేశిస్తే తుంగభద్రా నదికీ, కుంభంలో ప్రవేశిస్తే భీమరథీ నదికీ, మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి  పుష్కరాలను నిర్వహిస్తారు. .
 బృహస్పతి ఒకరాశి నుండి ఇంకొక రాశికి వెళ్లేప్పుడు పన్నెండు నదుల జలాలను శక్తివంతంగా ప్రభావితం చేస్తాడు. కనుక పుష్కరసమయంలో ఆయా నదులలో స్నానాదులు బుద్ది బలాన్ని పెంచుతాయి. వైదిక కార్య కలాపాల ద్వారా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తాయి. పుష్కరాల సమయంలో ముప్పదిమూడు కోట్ల దేవతలు కొలువుంటారు. పుష్కరాల సమయంలో స్నానం చేసినా, దానం చేసినా, జపం చేసినా, పితృ తర్పణంగానీ, పిండప్రదానం గానీ చేసినా సకల పాపాలు హరిస్తాయని భారతీయుల నమ్మకం.
'నవగ్రహాలలో ఒక గ్రహం బృహస్పతి', శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో గ్రహాలలో బృహస్పతిని నేనే అని చెప్పినందున బృహస్పతి శ్రీమహావిష్ణువు అంశ స్వరూపుడై, సకల దేవతలకు గురువు అయిన వాడు. బుద్ధిని కలిగించేది కాబట్టి గురువైన బృహస్పతిని ప్రార్థిస్తే బుద్ధి కుశలతోపాటు ఐశ్వర్య సిద్ధికూడా కలుగుతుంది.
ఒకనాడు ఇంద్రుడు, బృహస్పతి శివదర్శనార్థం ముని వేషదారులై కైలాసానికి బయలు దేరుతారు. శివుడు వీరిరువురిని పరీక్షించదలచి ఉగ్రరూపం ధరించి, దిగంబరుడై వీరి మార్గానికి అడ్డుగా నిలు స్తాడు. అప్పడు ఇంద్రుడు శివున్ని గుర్తించలేక అతనిపైకి వజ్రాయుధాన్ని ప్రయోగించబోగా శివుడతనిని భస్మం చేస్తాడు. ఆ దిగంబరుడే శివుడని గ్రహించిన బృహస్పతి శివుని స్తుతించి, ఇంద్రుని పునర్జీవున్ని చేయమని ప్రార్థిస్తాడు. శివుడు అనుగ్రహిస్తాడు. అందువల్ల బృహస్పతికి జీవుడనే పేరు వచ్చిందని కథనం. అట్టి బృహస్పతి పుష్కరిని కలిసి 12 సంవత్సరాల కొకసారి పవిత్ర నదులను ఆవహిస్తాడు. అటువంటి పవిత్ర నదుల్లో 12 నదులు పుష్కర నదులుగా పేర్కొన బడుతున్నాయి. సువర్ణ, రజిత, ధాన్య, భూదాన, వస్త్రం, లవణ, శాక, ఫలదానాలు, ఘృత, తైల, కర్పూర, కస్తూరి, చందన, కంబళ, సాలగ్రామ, పుస్తకదానాలు మిక్కిలి ప్రశస్తమైన దానాలు పుణ్య ప్రదంగా పుష్కర సమ యంలో చేయాలని పురాణాలు తెల్పుతున్నాయి. ప్రణీతానదినే 'ప్రాణహిత' నదిగా పిలువబడుతుంది. గోదావరీనదికి ప్రధానమైన ఉపనది ప్రాణహితానది.ఈ నదికే 'ప్రణీతా'నది అని మరోపేరు. ఈ నది సహాద్రి పర్వత శ్రేణుల్లో జన్మించి,  పెనగంగా, వైన్‌గంగా, వార్ధ అనే మూడు చిన్న నదులను కలుపుకొని ఏర్పడినది. ఈ నది ఆదిలాబాదు జిల్లా చెన్నూర్‌వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రాణహితనదీ తీరంలో కాళేశ్వర క్షేత్రం ఉన్నది.కాళేశ్వర క్షేత్రంలో బ్రహ్మచే సృష్టించబడి సర్వతీర్థములకు ప్రధానమైన ప్రణీతానది, వరదానది, వింధ్యపర్వత శిఖరం నుంచి బయలుదేరిన శివప్రియమగు వైన్యగంగ, లోకపావని గౌతమీ నది, ప్రణీత గోదావరి నదుల గుప్తగామినిగా ప్రవహించుచున్న బ్రహ్మపత్నియగు సరస్వతీ నదియను ఐదు నదులు పంచగంగగా సంగమిస్తాయి. త్రిలింగాలలో ఒకటైన కాళేశ్వర క్షేత్రం ముక్తేశ్వర క్షేత్రం,దక్షిణ ప్రయాగ అనికూడా పిలువబడుతుంది.
పుష్కర సమయంలో పేదలకు, బ్రాహ్మణులకు దానాలు చేస్తే  శుభ ఫలితాలు లభిస్తాయి. మొదటిరోజు, ఆహార ధాన్యాలు, రెండవరోజు గోవులు, వస్త్రములు, ఉప్పు, ; మూడవరోజు, పళ్లు, శాఖములు; నాల్గవరోజు  నెయ్యి, నూనె, పాలు; ఐదవరోజు నాగలి, ఆవు, మహిష దానాలు; ఆరవరోజు పళ్లు, సెజ్జలు (మంచాలు),  కుర్చీలు, పీటలు,; ఏడవరోజు  కంది, పెసర, మినుము, శనగ, పప్పుధాన్యాలు; ఎనిమిదవరోజు పసుపుకుంకుమ, చీరలు, సారెలుసుమంగళ ద్రవ్యాలు, గాజులు, పూలు; తొమ్మిదవరోజు యజ్ఞోపవీతాలు, పుస్తకాలు, రుద్రాక్షలు, పూజా సామాగ్రి; పదియవరోజు నగదు సొమ్మునవరత్నాలు, ; పదకొండవరోజు గో.భూ. తిలదశ దానాలు; పన్నెండవరోజు షోడశ దానాలు చేస్తే పుణ్య ఫలాలు లభిస్తాయి. పుష్కర సమయంలో తల్లిదండ్రులను, గురువులను, ఆకలితో ఉన్నవారిని  ఆదరిస్తే  పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు.



Thursday, November 11, 2010

బ్రౌన్ ఆశయాలకు అంకితమవ్వాలి - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

సీపీ బ్రౌన్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే విధంగా ఆయన జయంతి రోజున అంకితమవ్వాలని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో యోగి వేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి అధ్యక్షతన సీపీ బ్రౌన్ 212 జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కేతు విశ్వనాథరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రౌన్ 1992లో కలెక్టర్ అసిస్టెంట్‌గా ఉంటూ కడపలోని కరువు, సాంస్కృతిక స్థితిగతులను వివరిస్తూ లండన్‌కు లేఖలు రాశారన్నారు.
 యోగి వేమన యూనివర్శిటీ వీసీ అర్జుల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బ్రౌన్ తెలుగుభాష, తెలుగుజాతికి ఎనలేని సేవ చేసిన మహానీయుడని కొనియాడారు. వైవీయూలో పరిశోధనలకు అనుగుణంగా మరో బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని సిటీ క్యాంపస్‌గా, యూనివర్శిటీలో ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రాన్ని యూనివర్శిటీ క్యాంపస్‌గా ఉంచుతామన్నారు. యూనివర్శిటీ పరిశోధన కేంద్రంలో తెలుగు, హిస్టరీ, లలితకళల విభాగం, జర్నలిజం అనుసంధానం అవుతాయని తెలిపారు. సీపీ బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో మ్యూజియంను ఏర్పాటు చేసి అరుదైన పుస్తకాలు ఉంచుతామన్నారు. జిల్లా చరిత్ర, సాంస్కృతిక, సాహితీ, రాజకీయ చరిత్రలను తరతరాలకు తెలియజేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
 జానమద్ది హనుమచ్ఛాస్తి మాట్లాడుతూ సీపీ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో సంగ్రహ నివేదికను రిజిస్ట్రార్, పాలక మండల సభ్యుడు, ఆచార్య సి.శివరామిరెడ్డి సమర్పించారు. అనుసంధానకర్తగా వైవీయూ రీసెర్చి అసిస్టెంట్ కట్టా నరసింహులు వ్యవహరించారు. సీపీ బ్రౌన్ గీతాన్ని వై.మధుసూదన్ ఆలపించారు. బ్రౌన్ సైకత ముఖ చిత్రాన్ని ముద్దనూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, ఉపాధ్యాయుడు జార్జిలు తీసుకురాగా, సభలో ఆవిష్కరించారు. డాక్టర్ కృష్ణారెడ్డి తమ్ముని కుమారుడు సునీల్‌కుమార్‌రెడ్డి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్ర్తిని సన్మానించి రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందించారు. వేమన నీతి - లోకరీతి అనే పేరుతో వేమన పద్యాలు ఉన్న ఆడియో సీడీలను చిలకలూరిపేటకు చెందిన ఎస్ మహేష్ సభికులకు బహూకరించారు. వేమన సాహిత్యంతోపాటు పద్యాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు.
లోపాలు చూపేవాడే సద్విమర్శకుడు
మంచి విమర్శకుడైనవాడు భజనపరుడు కాదు.. వస్తు విశ్లేషణ కర్త కాదు.. లక్ష్యాన్ని పరిచయం చేసేవాడు, లోపాలను చూపేవాడే సద్విమర్శకుడు అని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. బ్రౌన్ జయంతి ఉత్సవాలలో భాగంగా జానమద్ది హనుమచ్ఛాస్ర్తి ఆవిష్కరించిన మన నవలలు-మన కథానికలు అనే పుస్తకాన్ని ఆయన సమీక్షించారు. కథా రచయిత ఆచార్య రాచపాలెం రామచంద్రారెడ్డి 13 నవలలను పరిచయం చేశారన్నారు. ఆయన ఆధునిక సాహిత్య విమర్శకుల్లో నిష్ణాతుడని కొనియాడారు. వైవీయూ వీసీ అర్జుల రామచంద్రారెడ్డి సతీమణి వరలక్షుమ్మ ఈ పుస్తకాన్ని స్వీకరించారు. తెలుగుభాష కోసం జీవితం సమర్పించిన బ్రౌన్ అనే పుస్తకాన్ని శశిశ్రీ రాయగా, రిజిస్ట్రార్ శివరామిరెడ్డి ఆవిష్కరించారు.
 భాషా పరిశోధన వ్యవహార కర్తగా ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో భాషా పరిశోధన వ్యవహారకర్తగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని నియమించినట్లు యోగి వేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అర్జుల రామచంద్రారెడ్డి తెలిపారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో బుధవారం నిర్వహించిన సాహితీ కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. భాషా పరిశోధనలు అంతంత మాత్రంగానే సాగుతున్నందున భాషపై మంచి పట్టు ఉన్న ప్రసిద్ధ కథకుడు, విమర్శకుడు అయిన కేతు విశ్వనాథరెడ్డిని వ్యవహార కర్తగా నియమిస్తూ యూనివర్శిటీ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.
 ఆయన నియామకంతో భాషా పరిశోధనలు ఆశాజనకంగా ఉంటాయని కమిటీ భావించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ భాషా పరిశోధనకు వైస్ ఛాన్సలర్ రామచంద్రారెడ్డి, సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్ర్తి సలహాలతో అవిరళ కృషి చేస్తానన్నారు. బ్రౌన్ చరిత్ర, నిర్మాణం, నిఘంటువు, చంధస్సు, వ్యాకరణం, భాషకు చేసిన కృషితోపాటు జిల్లా వస్తు చరిత్ర, అదనపు చరిత్ర, ముస్లిం రచనలు ఆనాటి రచనల ఆధారంగా సమగ్ర విషయాన్ని సేకరించి పరిశోధనలు చేసి తెలుగుభాషకు గుర్తింపు తెస్తానన్నారు. చరిత్ర, లలిత కళలు, జర్నలిజం ఆధారంగా, రాజకీయ, సాంస్కృతిక పరంగా జిల్లా సమగ్ర చరిత్ర నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

Friday, November 5, 2010

తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు !

ఈ దీపావళి మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సుఖ సంతోషాలను తీసుకు రావాలని ఆకాంక్షిస్తూ..!
తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు !  

Wednesday, November 3, 2010

తెలుగు దినపత్రికలలో ఏ పత్రికను అభిమానిస్తున్నారు?

తెలుగు దినపత్రికలలో ఏ పత్రికను ఎక్కువమంది అభిమానిస్తున్నారు? అనే విషయమై ఈ  " తెలుగు " బ్లాగు ద్వారా జరుపుతున్న అభిప్రాయ సేకరణ ఇది. వీక్షకులు ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. బ్లాగులో మీ కుడిచేతి వైపున పై భాగంలో అభిప్రాయ సేకరణ పత్రంలో మీ ఓటు వేయవచ్చు..!

Sunday, October 31, 2010

కళామతల్లికి దివ్య నీరాజనం-తెలుగు లలిత కళాతోరణం

తెలుగు భాషా సంప్రదాయ సంస్కృతుల పట్ల అపారమైన అభిమా నం, గౌరవం గల శ్రీ ఎన్.టి.రామారావు దృఢ సంకల్పంతో తెలుగు లలిత కళా తోరణంని మన జాతికి అందించారు. మహోన్నత కళాకారుడై న ముఖ్యమంత్రిగా ఆయన తన అనుభవాన్ని, ఆలోచల్ని కలబోసి సకల కళా ప్రాంగణంగా లలిత కళా తోరణం రూపకల్పనకు కృషి చేశారు. ఆయనతో పాటు పలువురు మహామహులు మూడు నెలల వ్యవధిలో అహరహం శ్రమిస్తేనే ఆ వేదిక నిర్మాణం పూర్తయింది.
హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు కళాతోరణం
తెలుగువారితో పాటు రాష్ట్ర రాజధానికి వచ్చే పర్యాటకులందరూ చూడాల్సినంత విశిష్టమైన ప్రాంగణం అది. రసరాజధానిగా సిసలైన కళాహృదయానికి దర్పణం పట్టే లా ఆ నిర్మాణం తీర్చిదిద్దిన తీరుతెన్నులు ఎన్టీఆర్ పలుకరించినట్టే ఉంటాయి. ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలోకి వచ్చిన కొద్దికాలంలోనే 1985 ఆగస్టులో ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ పనోరమలో ప్రారంభించినపు డు జనవరిలో జరగబోయే ఫిల్మోత్సవ్-86కి అమోఘమైన ఆతిథ్యం ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు.  ఆంధ్రప్రదేశ్‌లో తొట్ట తొలిసారిగా జరగబోతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంకు ప్రతిష్టాత్మకమైన వేదికగా ఒక ప్రాంగణాన్ని సంసిద్ధం చేయాలని ఎన్టీఆర్ తలపెట్టారు. వెంటనే అనుకూలమైన ప్రాంతాలు, ప్రాంగణాలను ఆయన స్వయంగా పర్యటించారు. రవీంద్రభారతిని ఆసాంతం అన్నివైపుల విస్తరించాలన్న ఆలోచనల్ని అధికారులు తెచ్చినా చారిత్రక సందర్భాల్లో జాతీయ రంగస్థలిగా నిర్మించిన దానిని మార్చకూడదు అంటూ ఎన్టీఆర్ నిర్ద్వందంగా నిరాకరించారు. సంజీవయ్యపార్క్, ఇందిరా పార్క్ ఎదురుగాఉన్న ఇప్పటి ఎన్టీఆర్ స్టేడి యం, పెరెడ్ గ్రౌండ్స్, రామకృష్ణ ఎస్టేట్, జూబిలిహాల్ ఎదురుగా గల లాన్స్ మొదలైనవి పరిశీలించి వాటి ఉనికి తన ఆలోచనలకు సరిపోదని ఇంకా స్థలాలు వెతికారు. ఆయన వెంట రాఘవేంద్రరావుతోపాటు ఉన్న అధికారుల బృందంలోని ఐ.ఎ.ఎస్. అధికారి ఎస్. బెనర్జి పబ్లిక్ గార్డెన్‌లో రహదారి ప్రక్కనే గల విశాల ప్రాంతంలోని 'గొయ్యి'ని తాను చూశానని పరిశీలించమని సూచించారు. ఆ జాగానంతా పరికించి చూసి నాకు ఇంత పల్లంలో ఉన్న స్థలమే కావాలి. 'ఒకే' అంటూ ఎన్టీఆర్ చకచక పనులు నాకు పురమాయించడం మొదలుపెట్టి 24 గంటల్లో ఆయన చెప్పిన వారందరిని రప్పించాలని నన్ను ఆజ్ఞాపించారు.
చీఫ్ ఇంజనీర్ రాఘవన్, సినిరంగ ప్రముఖులు, ఆయనకు ఆప్తులు అయిన డి.వి.ఎస్.రాజు, యు.విశ్వేశ్వర రావు ఆర్కిటెక్ట్‌లు రమణారెడ్డి బృందం వెంటవెంటనే స్పందించారు. ప్రముఖ శిల్పి గణపతిస్థపతి ఆయ న శిష్యులతో వెంటనే సంప్రదింపులు ఆరంభించారు. నిర్మాణ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త డాక్టర్ అప్పారావు, మద్రాసు కళాక్షేత్ర రాజగోపాలతో ఆ ప్రాంగణం అంతా పరిశీలించి రామారావు మదిలో మెదిలే ఆలోచనలకు ఆరుబయలు ప్రధాన ప్రదర్శన ప్రాంగ ణం సరిగ్గా సరిపోతుంది అన్నారు. ఆరు బయట ప్రాంగణం కాబట్టే కళాతోరణం పేరు ఒక్కటే ఔచిత్యభరితమైనది. జియోఫిజిక్స్ నిపుణుడు ప్రొఫెసర్ భీమశంకరం, విద్యుత్ రంగ నమూనాకర్త నార్ల తాతారావు, ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ జె.జగన్నాథన్‌తో ఎన్టీఆర్ అన్ని లోతుపాతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే స్వయంగా తమ మనసులో మెదిలే 'స్కెచ్'ని కాగితంపై పెట్టారు. ఆయన సన్నిహితులు డి.యోగానంద్, వల్లభజోస్యుల శివరాం, ఎం.ఏ. రహ మాన్ , 'కేతా'లతో తన ఆలోచనల్ని పంచుకున్నారు. చకచక పనులు మొదలుపెట్టారు. రోడ్డు భవనాల శాఖ సిబ్బందితో నిర్మా ణం పనులు మొదలు అయ్యాయి. ప్రతిరోజూ అక్కడకు అక్కడే కనీసం రెండు గంటలు నేనూ, శ్రీరామారావుగారూ ఉండేవాళ్లం. ఆయన సూచన లు అందిస్తూ నిర్మాణాన్ని శ్రద్ధగా పర్యవేక్షించేవారు. ఇంటికి వచ్చిన వెంట నే మళ్ళీ శ్రీ నర్సయ్యనో, శ్రీ లక్ష్మీనారాయణనో, శ్రీ ప్రసాద్ నో వెళ్ళి ఏం జరుగుతుందో చూసి తనకు చెప్పమనేవారు. అది ఆయన అనన్యసామాన్యమైన దీక్షాదక్షత. ప్రత్యేకమైన సినిమా సౌండ్, ప్రొజక్షన్ లు, తర్వాతి కాలంలో జరగబోయే కార్యక్రమాలకు అనుకూలంగా విశాల వేదిక, దాని వెనుకే వసతి, గ్రీన్ రూంల కల్పన వంటివి సాకారం అయ్యాయి. 70 ఎంఎంకి మూడురెట్లు పెద్దదైన 'తెర'కు బట్ట కన్నా పలుచని తెలు పు పెయింట్‌ను ఖాయం చేశారు. బొంబాయి నుంచి కావల్సినవన్నీ తెప్పించారు. దేశవిదేశాల్లో పెరెన్నికగన్న వెస్ట్రెక్స్ కంపెనీకి చెందిన ఎస్.పి.రావు, అప్పుడే కొత్తగా వస్తున్న 'ఫొటోఫోన్' పద్ధతులు, ఫిలిప్స్ ఇండియా లైటింగ్ సౌండ్ పరికరాలతోపాటు బొంబాయి నుంచి జాలి మిస్త్రిలు వచ్చి తమ నైపుణ్యంతో అమరికల్ని చేశారు. జర్మనీ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన 'లెన్స్'తో ప్రొజక్షన్ ను ఎన్టీ రామారావు స్వయంగా పర్యవేక్షించారు. విశాలమైన ఆ ప్రాంగణం లో వారం రోజులపాటు కలర్, బ్లాక్ అండ్ వైట్, సౌండ్ కెమెరాల్లో గొప్పవి అనుకున్న సినిమాల్ని ఆ తెరపై చూశారు. దాన వీర శూర కర్ణతో మొదలుపెట్టి శ్రీకృష్ణపాండవీయం, దేవదాసు, గుండమ్మకథ వంటి వాటితో పాటు 'ది బ్రిడ్జి ఆన్ ది రివర్ క్వాయ్' ప్రాంగణంలో నలుమూలల నుంచి చూశా రు.

ఆ ప్రయోగాలు ఏర్పాటు ఖరారు అయిన తరువాత మొత్తం ప్రాంగణం రూపు రేఖల్ని నిర్ధారించారు. మెయిన్‌రోడ్‌కి ఎడంగా ఆహ్లాదకరమైన పచ్చికబయలు చల్లగాలిలో వేదికపై ప్రదర్శనల్ని హాయిగా చూడాలని అభిలషించారు. ప్రొజెక్షన్ గదికి ప్రక్కన వి.ఐ.పి. బాక్స్‌లు ఆ ముందు ఎక్కడ కూర్చున్నా అనువుగా తిలకించేలా మెట్లుమెట్లుగా 'గ్యాలరీ' రూపొందిం ది. అసలు 'గొయ్యి' జాగాని తమ కౌశలంతో బ్రహ్మాండ ప్రదర్శన ప్రాంగణంగా తీర్చిదిద్దారు. తెలుగు సంస్కృతి వాస్తులపై విస్తృతమైన చర్చ జరిగింది. కళల నిలయం పవిత్ర ఆలయంలా ఉండాలని రామారావు అభిలషించారు. గోడలు, గోపురం, బురుజులు వంటివి అమరావతి, కాకతీయ శిల్పారామాలలో ఆయన చేసిన చేర్పులుమార్పులతో ఖరారు అయ్యాయి. వాటికి జేగురు రంగు వేయించారు. ప్రవేశద్వారం ముంగిటలోని, రంగస్థలిపైగాని నటరాజు విగ్రహం పెడదామని ముందు అనుకున్నారు. ఆ తరువాత దివాకర్ల వెంకట అవధాని వంటి పండితుల ఆమోదంతో లేపాక్షి బసవయ్య 'నంది'ని ఖరారు చేశారు. ఆ సమయంలోనే విశ్వవిఖ్యాత రచయిత, కళకారుడైన శ్రీ హరీంద్రనాద్ చటోపాధ్యాయను ఆహ్వానించి ఆ ప్రాంగణాన్ని చూపిస్తే "అద్భుతం, అమోఘం ఈ సృష్టి'' అంటూ రామారావుని ఆయన శ్లాఘించారు. ముందు 'ఫౌంటెన్'తో విశాల ప్రాంగణంలో అడుగుపెట్టంగానే కనుల కు విందుగా నందీశ్వరుడు ఉండేలా రూపుదిద్దుకుంది. ద్వార బంధాలు వాటి చెంత గజరాజు, మృగరాజుల వంటివి ఉండాలని రామారావు 'స్కెచ్' వేసి చూపించారు. 100 రోజులలోపు పూర్తయిన ఆ నిర్మాణం నామకరణంపై కూడా ఎంతో తర్జనభర్జన జరిగింది. నటరాజ స్థలి, ఉత్సవ రంగం, తెలుగు కళా క్షేత్రం, సకల కళా స్థలి వంటివి చర్చకు వస్తుంటే పేరు పెట్టడంలో తనదైన ప్రత్యేకత గల ఎన్టీఆర్ ఒక్క మెరుపులా తెలుగు లలితా తోరణం అన్నారు. ఒక్కసారిగా ఆ చుట్టూ ఉన్న పెద్దలు, మహామహులు మహదానందంగా స్పందిస్తూ ఆమోదించారు. ఆయన ప్రవేశపెట్టి న ప్రతి ప్రజా సంక్షేమ కార్యక్రమానికి, నిర్మాణానికి ముందు 'తెలుగు' పదం ఉండి తీరవలసిందే తెలుగు విధ్యాపీఠంలా. 1986 జనవరి 8 శుభముహూర్తంలోన ఉదయం 9-30 గంటలకు తోరణం లాంఛనంగా ప్రారంభించారు. ఇంక ప్రారంభోత్సవం కోసం ప్రత్యేకమైన ద్వారాలు వాటిపై వేదికలు పెట్టే అచ్చమైన తెలుగు కళారూపాల్ని ప్రదర్శించేలా చేశారు. మామిడి తోరణాలు, అరటి ఆకులు, గెలలు, పువ్వులు, వంటి వాటితో తెలుగు తోటగా ఆ ప్రాంగణం సంసిద్ధం అయింది. 3000 మంది అతిరథ మహారథులు, భారత, అంతర్జాతీయ చలనచిత్ర రంగ ఉద్దండు లు కలిసి తెలుగు విందు ను ఆరగిస్తూ దేశవిదేశాల్లో ఎక్కడా లేని 'లలిత కళా తోరణాన్ని ఆ ఆ నిర్మా ణ కౌశల్యానికి ఎంతో అభినందించారు. తన కృతజ్ఞతా ప్రసంగంలో మహానటుడు శ్రీ దిలీప్‌కుమార్ ఇటువంటి దేదీప్యమానమైన వర్ణనాతీతమైన ఉత్సవాన్ని తన అనుభవంలో చూడలేదని శ్రీ రామారావును అంగ్లభాషలో అభినందనలతో కీర్తించారు. తరువాత కాలంలో ఫిల్మోత్సవ్-86 తరువాత రాష్ట్ర సాంస్కృతిక శాఖకి ఈ ప్రాంగణాన్ని అప్పగించారు. సినిమాలు కాకుండా ఇతర ప్రదర్శనల కోసం కొల్లాప్పిబిల్ స్టేజిని 86-87 కాలం నాటి కే సంసిద్ధం చేశారు. రామారావు సూచనలపై చక్కని చిత్రాలు చూపించడంతోపాటు అగ్రశ్రేణి సంగీత విద్వాంసులు, కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు విరివిగా జరిగాయి. భారత రత్న లతామంగేష్కర్‌తో ఘంటసాల విగ్రహాన్ని ఈ ప్రాంగణం ప్రవేశద్వారం వద్ద ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన పద్మశ్రీ బాలు ఆహ్వానం మేరకు అప్పుడు ముఖ్యమంత్రిగా పదవిలో లేని శ్రీ రామారావు వచ్చి ఆ వేదికపై నుంచి ప్రసంగించి ఏదో బాధతో విసవిస వెళ్ళిపోయిన సందర్భం ఇప్పటి కాలంలో చాలా మందికి మరిచిపోయిన జ్ఞాపకం.     శ్రీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తెలుగు లతితకళాతోరణంలో అప్పటి దేశాధ్యక్షులు శ్రీ జైల్‌సింగ్, శ్రీ ఆర్. వెంకటరామన్-ఉపాధ్యక్షులు శ్రీ శంకర్ దయా ళ్ శర్మగారులు సన్మానింపబడ్డారు. సృష్టి ఒకటైనప్పటికీ శ్రీ రామారావుగారి దృష్టి బహుముఖీనమైనది. సువిశాలమైనది. నిర్వచనాల పరిధిని అధిగమించిన -అభివర్ణనాతీతమైన సమున్నతపూర్వకమైన విశిష్ట వ్యక్తి త్వం ఆ మహనీయునిది. "తెలుంగా నీకు దీర్ఘాయురస్తు; తెలుంగా నీకు బ్రహ్మాయురస్తు'' "రసోవైసః''

-గోటేటి రామచంద్రరావు ,అప్పటి ఎన్టీఆర్ ప్రత్యేక పౌరసంబంధాల అధికారి .(ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో..)

Saturday, October 30, 2010

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా ..గతమెంతో ఘనకీర్తి కలవోడా !

తెలుగు లలితకళాతోరణానికి రాజీవ్ పేరును జోడిస్తూ రాష్త్ర ప్రభుత్వం జారీచెసిన ఉత్తర్వులపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రతిపాదనను తెచ్చిన టి.సుబ్బరామి రెడ్డి తన ప్రయత్నాన్ని ఎట్టకేలకు విరమించుకోక తప్పలేదు. తెలుగు లలితకళాతోరణాన్ని యధాతధంగా ఉంచుతామని సుబ్బరామిరెడ్డి 30 నవంబరు 2010 వ తేదీ మధ్యాహ్నం టి.వి.9 చానెల్ ద్వారా ప్రకటించారు. తెలుగు జాతిలో వెల్లువెత్తిన ఆత్మాభిమానం తాకిడికి తట్టుకోలేకే ఈ దుష్ట యత్నాన్ని విరమించుకున్నారని భావించవచ్చు. " తెలుగు " అనే భావనే ఒక జాతినీ, భాషనూ సూచించే ఒక గొప్ప నామవాచకమైనప్పుడు తెలుగు కు ముందు మరొక పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనేది జాతిజనుల ప్రశ్న! బడి పిల్లలు తెలుగులో మాట్లాడినందుకు "నేనెప్పుడూ తెలుగులో మాట్లాడను" అనే ఆంగ్లంలో రాసిన అట్ట బోర్డులను  పసిపిల్లల మెడల్లో వేలాడదీసి శిక్షించిన సంఘటన జరిగిన సందర్భంలో చేష్టలుడిగి  చూసిన ప్రభుత్వం తెలుగు లలిత కళాతోరణం విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన దుర్గతిని మాత్రం ప్రజలు గమనిస్తున్నారని విస్మరించకూడదు. సుబ్బరామిరెడ్డి వెనుకడుగు వేసిన తర్వాతనైనా ప్రభుత్వం తాను జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం విరమించుకుంటే బాగుంటుంది.    తెలుగు లలితకళాతోరణాన్ని 33 ఏళ్ళ లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుందామని ప్రయత్నించి దానికి పబ్లిక్, ప్రయివేట్, పార్ట్ నర్ షిప్ (పిపిపి) అనే అందమైన పేరును తగిలించారు.. వాట్ యాన్ అయిడియా సర్జీ! ..జనం అంటున్నారు..మాట్లాడ్డానికే కాదు..జాతి స్ఫూర్తికీ  " తెలుగు " అవసరమని..!       

Thursday, October 28, 2010

లలిత కళా తోరణం పేరును మారిస్తే సహించం- తెలుగు భాషోద్యమ సమాఖ్య

హైదరాబాదులోని " తెలుగు లలిత కళాతోరణం" పేరుకు ముందు రాజీవ్ గాంధీ పేరును జత చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసం హరించుకోవాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ విభాగం తీర్మానించించింది. సమాఖ్య కేంద్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు గారి సూచనలమేరకు ఈ తీర్మాణం చేసి ముఖ్యమంత్రి కి ఒక లేఖను పంపడం జరిగింది. తెలుగు జాతి, తెలుగు సంస్కృతి అనే భావనల ముందు మరే పేరైనా దిగదుడుపేనని తెలుగు లలిత కళాతోరణం పేరును మార్చడం అంటే తెలుగు జాతిని అవమాన పర్చడమేనని తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి లేఖను పంపిన వారిలో తెలుగు భాషొద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి, కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, సమాఖ్య మైదుకూరు శాఖ ప్రతినిధులు ఎ.వీరాస్వామి, మహానందప్ప, వెంకట సుబ్బయ్య, ధర్మిశెట్టి రమణ తదితరులు ఉన్నారు. తెలుగు భాష పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వారు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను కూడా వారు విడుదల చేశారు. కొందరు వ్యక్తుల ప్రయోజనాలకోసం తెలుగుజాతి స్ఫూర్తికి విఘాతం కలగడం శోచనీయమని వారు పేర్కొన్నారు.

Wednesday, September 1, 2010

తెలుగు భాషా పరిరక్షణ బాధ్యత భావి పౌరులదే!

తెలుగుభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భావిపౌరులైన విద్యార్ధులపై
ఉందని తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29 వ తేదీన వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో జరిగిన తెలుగు భాషాదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి తవ్వా ఓబుల్‌ రెడ్డి అధ్యక్షతన తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక తమిదేపాటి వెంకటసుబ్బయ్య స్మారక ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న శాసనాల పరిశోధకుడు డాక్టర్‌ అవధానం ఉమామహేశ్వర శాస్త్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలాన్ని బట్టి ఇంగ్లీషు తదితర పరభాషలను నేర్చుకోవాల్సి వచ్చినప్పటికీ మాతృభాష అయిన తెలుగు ను విస్మరించరాదని, ఉన్నత విద్యాభ్యాసంలో కూడా తెలుగును ఒక అంశంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇంగ్లీషు భాషపై మోజుతో తెలుగును నిర్లక్ష్యం చేయరాదని ఆయన హితవు పలికారు. తమిళభాష కంటే తెలుగు భాష ఎంత మాత్రం కొత్త భాష కాదనీ, ఏడవ శతాబ్దం వరకు తమిళభాషకు ' తెలుగు-కన్నడ' లిపిని వినియోగించిన దాఖలాలున్నాయని ఆయన వెల్లడించారు. తెలుగుభాష తల్లిపాల వంటిదైతే ఇంగ్లీషుభాష డబ్బా పాలవంటిదని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథి, జానపదకళల పరిశోధకుడు డాక్టర్‌ మూలే రామమునిరెడ్డి కార్యక్రమంలో ప్రసంగిస్తూ నేటి విద్యావిధానంలో తెలుగు భాషకు నానాటికీ ప్రాధాన్యత తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మైదుకూరులోని ఆంగ్లమాధ్యమ పాఠశాలలో తెలుగులో మాట్లాడిన విద్యార్థులను శిక్షించిన సంఘటనలో తెలుగుభాషోద్యమ స్ఫూర్తిని రగిలించడంలో ఇక్కడి తెలుగు
భాషాభిమానులు చేసిన కృషి రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తవ్వా ఓబుల్‌ రెడ్డి మాట్లాడుతూ వ్యవహారిక భాషా ఉద్యమకారుడు శ్రీగిడుగు రామమూర్తిపంతులు గారి జీవిత విశేషాలను సభికులకు తెలిపారు. తెలుగు భాషొద్యమ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ సామల రమేష్‌బాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న తెలుగుభాషోద్యమ సమాఖ్య కార్యక్రమాల గురించి వివరించారు. గిడుగు వారు నడిపిన ' తెలుగు' అనే పత్రిక స్మారకంగా తవ్వా ఓబుల్‌ రెడ్డి రూపొందించిన 'తెలుగు' అనే అంతర్జాల పత్రిక, 'శ్రీకృష్ణదేవరాయ' అనే మరో అంతర్జాల పత్రికను ఈ సందర్భంగా శ్రీఉమామహేశ్వర శాస్త్రి, శ్రీరామమునిరెడ్డి ఆవిష్కరించారు. శ్రీఉమామహేశ్వర శాస్త్రి, శ్రీరామముని రెడ్డి లను ఈ సందర్భంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలుగు భాషొద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఉపాధ్యక్షుడు అరబోలు వీరాస్వామి, కార్యదర్శి ముండ్లపాటి వెంకటసుబ్బయ్య, సహకార్యదర్శి ధరిమిశెట్టి రమణ, కార్యవర్గ సభ్యులు పెరుగు కృష్ణయ్య యాదవ్‌, తమిదేపాటి వెంకటేశ్వర్లు, విశ్రాంత తెలుగు పండితులు టి. పుల్లయ్య, తెలుగు భాషాభిమానులు ఉత్సలవరం శేఖర్‌, కె.జి.పి. వెంకటయ్య విద్యార్థులు పాల్గొన్నారు.









Monday, July 19, 2010

కడప ప్రాంత శాసనాలలో రాయల కాలంనాటి చరిత్ర !


విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి.
సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప  ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప  ప్రాంతంలో లభించిన రాయలనాటి శాసనాలలోని అంశాలు వేటికవే తమదైన విభిన్నతను సంతరించుకున్నాయని చెప్పవచ్చువివిధ సీమలుగా విభజింపబడిన ప్రాంతాలకు నాయంకరులను నియమించిన సందర్భాల్లో, కవులకు అగ్రహారాలను ధారవోసిన సందర్భంలో, దేవాలయాలను కట్టించిన సందర్భాల్లో, దేవాలయాల్లో ధ్వజస్థంభాలను నిలిపిన సందర్భాల్లో, చెరువులను తవ్విన సందర్భంలో,పన్నులను విధించిన సందర్భాల్లో, పన్నులను రద్దుచేసిన సందర్భంలో ఈ శాసనాలు వేయించబడ్డాయి. ఈ శాసనాల్లో చాలా మటుకు అన్నీ తెలుగు భాషలోనే ఉండగా అక్కడక్కడా కొన్ని శాసనాలు సంస్కృతం, కన్నడ భాషల్లో కూడా లభించాయి.
శ్రీకృష్ణదేవరాయలు క్రీ..1509 నుండి  క్రీ.. 1529 వ సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పాలన చేశారు. ఈ కాలంలో వేసిన అనేక శాసనాలు కడప ప్రాంతం లోని వివిధ చోట్ల వెలుగు చూశాయిపులివెందుల వద్ద లభ్యమైన క్రీ.. 1509 నాటి శాసనం పరిశోధకులకు లభ్యమైన రాయల శాసనాల్లో మొదటిదిగా భావిస్తున్నారుకడప జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి చివరి శాసనంగా ఖాజీపేట మండలం తుడుమల దిన్నెలో లభించిన క్రీ.. 1529  నాటి శాసనం పేర్కొనబడుతోంది. నాచరాజసోముని అగ్రహారమైన తురుమెళ్లదిన్నె గ్రామంలోని చెన్నకేశవస్వామికి ధ్వజస్థంభం నిలిపిన సందర్భంగా ఈ శాసనాన్ని వేయించారు.
శాసనాలూ కైఫీయతులు ఆశ్చర్యం గొలిపి, ఆసక్తి రేపే ఎన్నో  చారిత్రక కథనాలనూ  మనకు అందించాయి. కడప ప్రాంతమైన కొప్పోలు గ్రామానికి చెందిన బొడ్డుచెర్ల తిమ్మన శ్రీ కృష్ణదేవరాయలనే చదరంగంలో ఓడించాడనీ రాయలు తిమ్మనను మెచ్చుకుని కొప్పోలు గ్రామాన్ని  అగ్రహారంగా ఇచ్చాడని ఒక కైఫీయతు సారాంశం.                                                           
‘‘శతసంఖ్యలొక్కటైనను
సతతము మనకృష్ణరాయ జగతీపతితో
చతురంగమాడ గెలుచును
ధృతిమంతుడ బొడ్డుచెర్ల
తిమ్మన భళిరే!’’  
అనే చాటువు కూడా జనం లో పరివ్యాప్తమైంది.
కృష్ణరాయలు ప్రతి ఆటలోను ఓడిపోయినట్టు ఈ చాటువు ద్వారా తెలుస్తోంది.
ఒక సారి కూచిపూడి భాగవతులు విజయనగర రాజధాని హంపీకి ఈ ప్రాంతం మీదుగా వెళుతున్నారట! గ్రామాల్లో ప్రదర్శనలిచ్చుకుంటూ ఒక  గ్రామంలో మజిలీ చేశారట! సంబెట గురువరాజు అనే స్థానిక పాలకుడు పన్నుల పేరుతో మహిళలను పీడిస్తుండగా కూచిపూడి భాగవతులు గురువరాజు ఘోర కృత్యాలను చూసి  చలించిపోయారట! భాగవతులు విజయనగరం వెళ్లిన తర్వాత  శ్రీ కృష్ణదేవరాయల ఎదుట గురువరాజు అకృత్యాలను వీధినాటకంగా ప్రదర్శించారట. గురువరాజు పాశవిక చర్యలను తెలుసుకున్న రాయలు గురవరాజుపై సైనిక చర్య తీసుకుని ప్రజలకు ఊరట కల్పించారట. ఈ ఉదంతం మాచుపల్లె కైఫీయతులో చోటు చేసుకుంది.                                                
కృష్ణరాయలు కాలంలో సైతం కళాకారులు తమ ప్రదర్శనలకు సామాజిక స్పృహను జోడించారన్న విషయం మాచుపల్లె కైఫీయతు ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీ కృష్ణదేవరాయలకు భూమానాయుడు అనే గొడుగుపాలుడి కథ కూడా ఎంతో ఆసక్తికరమైనదే! కృష్ణదేవరాయలు పెనుగొండ నుంచి హంపీ విజయనగరానికి గుర్రంపై స్వారీ చేస్తోంటే గుర్రం వెంట పరిగెడుతూ భూబానాయుడు గొడుగు పట్టాడట. ఇందుకు మెచ్చుకున్న రాయలు గొడుగుపాలునికి ఒక రోజంతా అగ్రహారాలనూ, మాన్యాలనూ దానం చేసే అధికారం ఇచ్చారట! ఆయన ఎర్పరిచిన అగ్రహారాలకు భూమానాయుని పల్లెలు అవతరించాయి. ఇప్పటికీ భూమాయపల్లె పేరుతో కడప ప్రాంతంలో అనేక పల్లెలు ఉండటం మనం గమనిస్తాం. ఖాజీపేట మండలం, మైదుకూరు మండలం, ఎర్రగుంట్ల మండలాల్లో భూమాయపల్లె, భూమానాయుడుపల్లె ఉన్నాయి. ఈ విషయం ఎర్రగుంట్ల మండలంలోని కోడూరు  కైఫీయతు తెలుపుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో గండికోట నాయంకరులను నియమించినట్లుగా వేయించిన శాసనాల్లో ఇప్పటిదాకా 19 శాసనాలు  లభించాయి. వీటిలో ఆరు  శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి శాసనాలు . గండికోటను సాళువ తిమ్మరుసయ్యకు నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.. 1517 నాటి గూడూరు శాసనం తెలుపుతోంది.అవసరం తిమ్మరుసయ్యకు నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.. 1525 నాటి తలమంచిపట్నం శాసనం ద్వారా తెలుస్తోంది. గండికోటను అవసరం దేమరుసయ్యకు నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.. 1526 నాటి నేకనాంపేట శాసనం వెల్లడిస్తోంది. సాళువగోవిందయ్యకు  నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.. 1527 నాటి ఉప్పలూరు శాసనంద్వారా తెలుస్తోంది. రాయసం అయ్యపరుసయ్యకు నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.. 1528 నాటి పందిళ్ల పల్లెక్రీ..1529 నాటి కత్తెరగండ్ల శాసనాలు తెలుపుతున్నాయి.
శ్రీకృష్ణదేవరాయలు తర్వాతి పాలకులైన అచ్యుతదేవరాయలు, సదాశివదేవరాయలు కాలంలో దాదాపు 15 శాసనాలు గండికోట నాయంకరానికి సంబంధించినవి వెలుగులోకి వచ్చాయి.
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కడప ప్రాంతం లోని దేవాలయాల్లో  నైవేద్యం, అంగరంగవైభవాలకు గ్రామాలను దానంగా ఇచ్చినట్లుగా కూడా అనేక శాసనాలున్నాయి. గండికోట సీమలో వెలుగు చూసిన శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి మొదటి శాసనంగా  క్రీ.. 1509 నాటి పులివెందుల శాసనాన్ని పేర్కొంటున్నారు. విజయవాడ మాధవవర్మ వంశీయుడైన నరసయ్యదేవ మహారాజు పులివెందుల సమీపంలోని కుందలూరు గ్రామాన్ని శ్రీరంగనాధస్వామి నైవేద్యం, అంగరంగవైభవాలకు సమర్పించినట్లుగా ఈ శాసనం తెలుపుతోంది.
గండికోట, సిద్దవటం, ములికినాడు, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి, కందనవోలు(కర్నూలు), రాయదుర్గం సీమల్లో అమల్లో ఉన్న పెండ్లి సుంకాన్ని శ్రీకృష్ణదేవరాయల ఉత్తర్వు ప్రకారం  మంత్రి తిమ్మరుసు రద్దు చేసినట్లుగా క్రీ.. 1510 నాటి రామేశ్వరం (ప్రొద్దుటూరు) శాసనం ద్వారా తెలుస్తోంది. సంస్కృతంలో చెక్కబడిన ఈ శాసనం ప్రొద్దుటూరు రామేశ్వరం గుడి గోపురం ముంగిట మరికొన్ని శాసనాలతో పాటు ఇప్పుడు కూడా ఉంది.
ఆంద్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన కోకటం గ్రామంలోని సకలేశ్వర స్వామి దీపారాధన కోసం పది ఖండుగల భూమిని దానంగా ఇచ్చినట్లు క్రీ.. 1518 నాటి కోకటం గ్రామ శాసనం తెలుపుతోంది. కమలాపురం సమీపంలోని తిప్పలూరు గ్రామాన్ని కృష్ణదేవరాయలు అష్టదిగ్గజకవులకు అగ్రహారం గా ఇచ్చినట్లుగా క్రీ.. 1527 నాటి తిప్పలూరు శాసనం వెల్లడిస్తోంది. కమలాపురం సమీపంలోని పందిళ్లపల్లె కేశవరాయ ఆలయంలో డోలూ, సన్నాయి వాయించి ఊడిగం చేసినందుకు తిమ్మోజు అనే నాయీబ్రాహ్మణునికి ఒక ఖండుగ మాన్యాన్నీ, పెరుమాళ్ల సంకీర్తనకు ఓబులదాసరికి మరో ఖండుగ మాన్యాన్నీ దానం చేసినట్లుగా క్రీ.. 1528 నాటి పందిళ్లపల్లె శాసనం వల్ల తెలుస్తోంది.
పుష్పగిరి ప్రాంత దొమ్మరులు ఆ గ్రామకాపులు తమకు చెల్లించే దొమ్మరిపన్నును చెన్నకేశవస్వామి దీపారాధనకు, పూలతోటలకు తమ 24 కులాల వారికి పుణ్యముగా దానమిచ్చినట్లు క్రీ.. 1519 సంవత్సరం నాటి పుష్పగిరి శాసనం ద్వారా తెలుస్తోంది.
ఆనాడు సకిలిసీమగా పిలువబడిన పోరుమామిళ్ల సమీపంలోని చెన్నవరం గ్రామంలో వ్యాపారుల ద్వారా లభించే గ్రామకట్నం, గానుగకట్నం, మగ్గం పన్నులను కత్తెరగండ్ల లోని చెన్నకేశవస్వామి అమృతపడి సేవకు, అంగరంగవైభవాలకు దానమిచ్చినట్లుగా క్రీ.. 1525 నాటి కత్తెరగండ్ల శాసనం వివరిస్తోంది.                                                          
మైదుకూరు మండలం వనిపెంటలో  నిర్మితమైన కోటను  క్రీ.. 1528 లో కృష్ణదేవరాయలు నారప నాయుని పినఅహోబలనాయునికి వార్షిక రుసుమునకు ఇచ్చినట్లుగా 1914 వ సంవత్సరంలో ప్రచురితమైన కడప జిల్లా గెజిట్‌లో పేర్కొన్నారు. క్రీ.1525లో వనిపెంట సమీపంలో తూర్పున ఒక చెరువు ను నిర్మించినట్లు, తర్వాత కాలంలో ఆ చెరువు తెగడంతో అక్కడి చెన్నకేశవాలయంలో కొంత భాగంతో పాటు ఆలయ ప్రహారీ గోడలు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు ఆలయ ప్రాకారంపై ఉన్న శాసనం ద్వారా తెలుస్తోంది. మైదుకూరు మండలం గంజికుంటసీమ నాయంకరుడు బక్కరాజు తిమ్మరాజు అనుచరుడైన నారపనాయుని అహోబలనాయుడు వనిపెంట గ్రామాన్ని రాయసం గంగరుసుకు గుత్తకు ఇచ్చినట్లు గంగరుసు వనిపెంటకు తూర్పున చెరువును నిర్మించినట్లు  వనిపెంట చెన్నకేశవస్వామి దేవస్థానంలో లభించిన క్రీ.. 1521 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. అలాగే మైదుకూరు మండలం ఎల్లంపల్లె వద్ద కొండపై వెలసిన  శ్రీతిరువెంకటనాధుని ఉత్సవ కైంకర్యాలకు మైదుకూరు సమీపంలోని పేరనిపాడు, గడ్డంవానిపల్లె గ్రామాలను దానంగా ఇచ్చినట్లు కొండ పశ్చిమబాగంలోని వనంలో లభించిన శాసనంద్వారా తెలుస్తోంది. క్రీ.. 1528లో శ్రీకృష్ణదేవరాయలు పేరనిపాడు పరిపర గ్రామాలను సంగమయ్య అనే బ్రాహ్మణునికి కరణీకంగా ఇచ్చినట్లుగా గడ్డంవానిపల్లె లోని హనుమంతరాయ గుడివద్ద లభించిన  శాసనం ద్వారా వెల్లడవుతోంది. మైదుకూరు మండలం తువ్వపల్లెను కృష్ణదేవరాయలు బ్రాహ్మణ అగ్రహారంగా చేశారు. అగ్రహార యజమాని అయ్యవారప్ప తువ్వపల్లెకు తూర్పున గొప్ప చెరువును తవ్వించాడు.
కృష్ణదేవరాయలు కాలంలో దువ్వూరు నాయంకరుడిగా వ్యవహరిస్తూ ఉండిన  పర్వతయ్య దేవమహారాజు కోన తిరువెంగళనాథునికి దాసరిపల్లెను దానమిచ్చినట్లు క్రీ.. 1515 నాటి శాసనంలో ఉంది.కొర్రపాడు గ్రామంలోని చెన్నకేశవాలయానికి భూములను మాన్యంగా ఇచ్చినట్లు క్రీ.. 1527 నాటి కొర్రపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. జమ్మలమడుగు సమీపంలోని బోడితిప్పనపాడును ఉమామహేశ్వర పురమనీ, మేడిదిన్నెను కృష్ణరాయపురమనీ రాయలకాలంలో పిలిచేవారట! మేడిదిన్నెను నాగదేవభొట్లు అనే బ్రాహ్మణునికి అగ్రహారంగా ఇచ్చినట్లు శాసనం ద్వారా వెల్లడయింది. జిల్లాలో కృష్ణరాయపురం పేరుతో అనేక గ్రామాలకు ప్రతినామకరణం చేయడాన్ని కూడా శాసనాలద్వారా గమనించవచ్చు
ఖాజీపేట మండలం పత్తూరు పాలెగాడుగా ఉండిన ముసలినాయుడు తిరుగుబాటు చేయగా  కృష్ణదేవరాయలు అణచివేశాడని, కృష్ణదేవరాయలు పుష్పగిరిని సందర్శించిన సందర్భంగా ముసలినాయుడు లొంగిపోయాడని మెకంజీ కైఫీయతులలో పేర్కొనబడింది. శ్రీకృష్ణదేవరాయలు పుష్పగిరి ఆలయంలో ఇతర కులాల వారు అర్చకత్వం చేస్తుండగా వారిని మానిపించి బ్రాహ్మణులను పూజారులుగా నియమించినట్లు చెప్పబడుతోంది.
విజయనగర కాలంలో కడప ప్రాంతంలో పాలనాభాధ్యతలను నిర్వర్తించిన  అయ్యపరుస నాయకుడు, మత్తకుమరయ్య, దేవచోడమహారాజు, పెద్దతిమ్మరుసయ్య, రాజరాజ బుక్కరాజు, తిమ్మరాజు, నాగపనాయుడు, సైన్యాధికారులు రాయసం కొండమరుసయ్య, కమలనాయకుడు తదితరుల పేర్లు కడప జిల్లాలో లభ్యమైన శాసనాల ద్వారా వెల్లడవుతున్నాయి.
కడప ప్రాంతంలోని వెల్లాల, దొమ్మర నంద్యాల, పాలూరు, పెద్దముడియం, మోరగుడి, తొర్రివేముల, యనమలచింతల, పొట్టిపాడు, వెనికేకాలువ, మచ్చుమర్రిగంగాపురం, అరకటవేముల, దాసరిపల్లె, గడ్డంవానిపల్లె, సిద్దవటంసమీపంలోని రేకులకుంట, మేడిదిన్నె, చిన్నమాచుపల్లె, పొందలూరు, తుమ్మలమేరు, ప్రొద్దుటూరు సమీపం లోని ఉప్పరపల్లె, కొర్రపాడు గ్రామాల దేవాలయాల వద్ద కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి శాసనాలు లభించాయి.
ప్రముఖ పరిశోధకులు, సాహితీవేత్త శ్రీరాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, సరస్వతీపుత్ర డాక్టర్‌ పుట్టపర్తి నారాయణాచార్యులు, ఆచార్య తిరుమల రామచంద్ర, లాంటి మహనీయులు తమ రచనల ద్వారా శ్రీకృష్ణదేవరాయల నాటి ప్రజాజీవితాన్నీ, చారిత్రక విశేషాలనూ మనకు అందించారు. డొమింగో పేజ్‌, ట్రావెర్నియర్‌, కల్నల్‌ మెకంజీ, సి.పి.బ్రౌన్‌ విజయనగర సామ్రాజ్య వైభవాన్ని భావితరాలకు అందించే కృషి జరిపారు. శ్రీ అవధానం ఉమామహేశ్వర శాస్త్రి కడప జిల్లా శాసనాలు, చరిత్ర అనే అంశంపై పరిశోధన చేసి పరిశోధనాంశాన్ని గ్రంథస్థం చేశారు. చరిత్ర పరిశోధకులు జి. శ్రీనివాసులు తన గండికోట సీమ చరిత్ర గ్రంథంలో విజయనగర కాలంనాటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కోణంలో అనేక అంశాలను వెలుగులోకి తెచ్చారు. విద్వాన్‌ కట్టా నరసింహులు కడపలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రం ద్వారా కైఫీయతులపై పరిశోధన చేశారు.  
పురావస్తు శాఖ , చరిత్రకారులు మరింతగా దృష్టి సారిస్తే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శాసనాలతో పాటు విజయనగర పాలకులకు చెందిన మరెన్నో శాసనాలు వెలుగుచూసే అవకాశం ఉందిమైదుకూరుకు చెందిన ' తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ' చొరవతో  ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఖాజీపేట మండలం ముత్తులూరుపాడులో  బుక్కరాయల కాలం(14వ శతాబ్దం) నాటి  అరుదైన శాసనం వెలుగు చూసిన ఉదంతమే ఇందుకు తార్కాణం!

Thursday, July 8, 2010

శ్రీ కృష్ణ దేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలు

సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2010 జూలై 5 వ తేదీన హైదరాబాదులో ప్రారంభించింది. ఈ ఉత్సవాలు ఆగస్టు నెల 8 వ తేదీన అనంతపురంజిల్లా పెనుకొండలో జరిగే ముగింపు ఉత్సవాలతో ముగుస్తాయి. ఉత్సవాల వివరాలకోసం ఈ క్రింది ప్రకటనను నొక్కండి!.

Wednesday, June 30, 2010

తమిళ మహాసభతో నైనా తెలుగుప్రజ మేల్కొనాలి: సీనియర్ సంపాదకులు ఏబికె ప్రసాద్

తమిళభాష 'ప్రాచీనత' పేరిట తీర్చిన మహాసభ (జూన్‌ 23-27 కోయంబత్తూరులో) విజయవంతంగా, జాజ్వల్యమానంగా ముగిసింది.
ఆరుద్ర ఒక చోట ప్రస్తావించినట్టుగా ప్రాచీన జానపద సాహితీ సంపదను రక్షించుకుని తమిళులు ప్రాచీన సాహిత్యంగల వాళ్లయ్యారు. మనవాళ్లు అంతే ప్రాచీన చరిత్ర, వాఙ్మయం కలిగి ఉండి కూడా దానిని కాపాడుకోలేక లేనివాళ్లయ్యారు. అయితే కోల్పోయింది కోల్పోగా ఏతావాతా మిగిలిన పాత వాఙ్మయం సహితం క్రీ.పూ. ఆరవ శతాబ్దానిదే కావడం విశేషం.

"భాషకు తగ్గ వేష మూ ఉండాలి' అంటా రు! కాని మన తెలుగు వాడు రెండింటిలోనూ పేలవమైపోయాడు;పైగా సిగ్గూ, ఎగ్గూ కూడా లేదు. పొరుగువాడి భాషాభిమానాన్ని, సాంస్కృతికపరమైన వాడి చైతన్యాన్ని చూసైనా నేర్చుకోవాలన్న తపన కూడా వీడికి కరువైంది. చూసిరమ్మంటే కాల్చివచ్చే వాడికన్నా చూసైనా నేర్చుకునేవాడు తెలివిగలవాడు. తమిళ నాడు ముఖ్యమంత్రి కరుణానిధి తన కొడుకూ, మంత్రీ అయిన స్టాలిన్‌కు రేపటి ముఖ్యమంత్రి పదవి అనే సోపానపటాన్ని దిద్దితీర్చుకునే మహా ప్రయత్నంలో భాగంగా తమిళభాష 'ప్రాచీనత' పేరిట తీర్చిన మహాసభ (జూన్‌ 23-27 కోయంబత్తూరులో) విజయవంతంగా, జాజ్వల్యమానంగా ముగిసింది.
ఈ సందర్భంగా ప్రాచీన ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటైన తమిళ భాషకు, తమిళుల విశిష్ట సంప్రదాయాలకు, చరిత్రకు వారసులైన నేటి తమిళ ప్రజలందరికీ శుభాభినందనలు తెల్పడంతో పాటు ప్రాచీన తమిళ మహాసభలో కరుణానిధి, ఆయన సత్కారం అందుకున్న ఒక విదేశీ చరిత్రకారుడూ పేల్చిన కొన్ని అవాకులకు, చవాకులకూ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది! తన భాష గొప్పతనాన్ని చెప్పుకోవడం వేరు, తన భాష తప్ప ఇతర భాషలకు చరిత్రలేదని, ప్రాచీనతలేదనీ చెప్పడానికి సాహసించడం వేరు! ఈ విషయంలో తమిళ మహాసభ ఎన్ని స్కోత్కర్షలతో ముగిసినా, తమ భాషాసంస్కృతులను, వాటి ప్రాచీనతను మరచి పోతూ చిరునామా చెరుపుకుంటున్న తెలుగువారికి ఆ సభ గుణపాఠం కావాలి.

తమిళాన్ని విదేశాల్లో ప్రమోట్‌ చేయించుకుని, అత్యంత ప్రాచీన భాషలైన గ్రీకు, లాటిన్‌, సంస్కృతాలతో సమఉజ్జీగా నిలబెట్ట డానికి ప్రొఫెసర్‌ జి.ఎల్‌.హార్డ్‌ అనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ దక్షిణాసియా చరిత్రాధ్యయనశాఖ అధికారి ద్వారాను, అలాగే సింధు లిపిని, ద్రావిడ చరిత్రాధ్యయనం ప్రాతిపదికగా పరిశీలించిన భారత దేశ చరిత్రాధ్యయన కర్త అయిన ఆస్కో పర్పోలా ద్వారాను "ప్రపంచ భాషలలో తమిళమే ప్రాచీనమని చెప్పించడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగు తున్నాయి. కాని విచిత్రమేమంటే ఈ ఇద్దరు విదేశీ ప్రొఫెసర్లు భాషాశాస్త్రంతో సంబంధం లేనివారే, భాషా శాస్త్రవేత్తలు కానివారే! కొందరు తమిళ పాలకులు భాషను రాజకీయం చేయడంలో అంతర్భాగంగా 'తాటితోనే దబ్బనం' దూర్చినట్లుగా భాషాశాస్త్రంతో బొత్తిగా సంబంధంలేని విదేశీ ఆచార్యోత్తముల ద్వారా 'ప్రపంచ భాషలలో తమిళమే' గొప్పదని చెప్పించడం లో సఫలీకృతులయ్యారు.
అయితే, అందుకు మనం నొచ్చుకోవలసిన పని లేదుగాని ద్రావిడ భాషా కుటుంబంలో సమ ప్రతిపత్తితో వందేళ్లు అటూ ఇటుగా స్వతంత్రంగా ఎదుగుతూ వచ్చిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో తమిళానికి ఉన్న 'ప్రత్యేక ప్రతిపత్తి' ఏమిటో తెలుసుకోవాలంటే తమిళనాడు ప్రభుత్వం విద్యాశాఖ విడుదల చేసిన ఒక ఉత్తర్వు చూడాలి. అందులో ఆ భాష పూర్వాపరాల గురించి ఇలా ఉంది. "భూమి పుట్టకముందే, భూమిపైన రాయీరప్పా పుట్టకముందే తమిళభాష పుట్టింది' కాలాన్ని మానవమాత్రుడెవడూ గుర్తించలేనంత వెనక్కి నడిపించగల మూర్ఖశిఖామణులకు ఈ దేశంలో కొదవలేదు. అయితే అటువంటి వారిలో తమిళులది అగ్రస్థానం అని ఈ మాట రుజువుచేస్తోంది.
తమిళసభలో 'ప్రాచీన తమిళ పురస్కారం' అందుకోవడానికి కరుణానిధి 'ఆహ్వానం'పై వచ్చిన ప్రొఫెసర్‌ పర్పోలా పురస్కారానికి స్పందిస్తూ చేసిన ప్రసంగంలో కొన్ని వైరుధ్యాలున్నాయి. అవి- 1) "ఎంతో కొంత గర్వించగల హక్కు తమిళులకు ఉంది. కాని సుసంపన్నమైన వారసత్వంగల భాషలలో తమిళం ఒక్కటే సంపదగల భాషకాదు.
అనేక భాషలతో దీపిస్తున్న దేశం భారతదేశం. అద్భుతమైన లిత, మౌక సాహిత్యం ఉన్న భాషలు ఈ దేశంలో ఉన్నాయి- 'ఈమాట చెప్పిన ఈ పెద్ద మనిషి' తరువాత మాటమార్చి "ప్రాచీన భాషా, సాంస్కృతిక వారసత్వానికి ప్రాచీన తమిళం ఒక్కటే ఆధారం' అని చెప్ప సాహసించాడు. "ప్రాచీన తమిళం ఆధారంగా లేకుండా సింధులిపి పుట్టుపూర్వోత్తరాలను ఛేదించడం కష్టం' అన్నాడు! కానీ భాషాశాస్త్రంతో సంబంధంలేని ఈ విదేశీ ఆచార్యుడికి తెలియని ఒక చారిత్రక సత్యం ఉంది- ద్రావిడభాషా కుటుంబం నుంచి స్వతంత్ర ప్రతిపత్తితో, స్వతంత్ర మౌక(జానపద/'దేశి') వాఙ్మయంతో విడివడి వచ్చిన మొట్టమొదటి భాష తెలుగే! ఈ పరిణామం, ఈ స్వతంత్ర ప్రతిపత్తీ క్రీస్తుపూర్వం 6000 సంవత్సరం నాటికే సంభవిం చిందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో సంస్కృత భాషాచార్యుడైన ప్రొఫెసర్‌ టి.బర్రో వెల్లడించాడు. అతను భాషాశాస్త్రవేత్త కూడా. ఈ తెలుగు ప్రాచీనత ఆధునిక రూపం తొడిగి శరవేగంతో ముందుకు దూసుకుపోవడం క్రీ.శ. 600-1000 సంవత్సరాల మధ్య ప్రారంభమైౖందన్నాడు.
భాషాభిమానం దురభిమానం కింద మారితే ఏ వికృత రూపం తీసుకుంటుందో చెప్పడానికి- తెలుగు భాష ప్రాచీనతకు అద్దంపడుతున్న 'భట్టిప్రోలు శాసన' 'లిపి' తెలుగుది కాదు మాది అని నిన్నమొన్నటి దాకా హూంకరించి చాలించుకున్నవాళ్లు ఎవరో కాదు, కొందరు తమిళ పండితులే!

నిన్న మొన్నటిదాకా అన్ని భాషలకు మూలం 'సంస్కృతం' అని కొందరు ఛాందసులు చాటగా, ఇప్పుడు ప్రపంచ భాషలకే 'తమిళం' ఆదిగురువని గొప్పలు చెప్పుకునే స్థితికి కొందరు దిగజారారు. అప్పకవి లాంటి వాడు సహితం "భారతీదైవి శైశవ భారతంబు ప్రాకృతంబు' అని అంగీకరించవలసి వచ్చింది! నిజానికి సంస్కృతం సహా అన్ని భాషలకూ మూలం "బ్రాహ్మీ' లిపి అని మహామహా పండితులే తేల్చి చెప్పారు. అంతేగాదు, తమిళపండితుడూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కొలువులో ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన కాశీపాండ్యన్‌ తమ తమిళభాషకన్నా తెలుగు భాషా ప్రాచీనతకే ప్రాధాన్యమిచ్చాడు! ఈ 'బ్రాహ్మీ' మూలం ద్రావిడ భాషా కుటుంబంలోని ప్రాచీన తెలుగు రూపమేననీ, అశోకుని కాలానికంటే(క్రీ.పూ. 300) ముందటిదైన తెలుగుకు, అంటే క్రీ.పూ. 400 సంవత్సరాల నాటి తెలుగుకు ప్రాచీనరూపం బ్రాహ్మీ కాగా, భాష మాత్రం "తెలుగు ప్రాకృతం' అనీ పురాతత్వశాస్త్రవేత్తలూ భావించారు.
తమిళం, తెలుగు ప్రాచీన ద్రావిడ భాషలు కాబట్టి, ప్రాచీన తమిళం 'గ్రంథి' లిపిలో రాయగా, ప్రాచీన తెలుగు 'బ్రాహ్మీ' లిపిలో ఉందనీ, ప్రాకృతం, పాళీ, సంస్కృ తం- ఈ మూడూ తెలుగు నుంచే 'బ్రాహ్మీ' లిపి అరువు తెచ్చుకున్నాయనీ కాశీపాండ్యన్‌('హిడెన్‌ హెరి టేజ్‌') పేర్కొన్నాడు.

అంతేకాదు, కవి పండి తులు, పరిశోధకులైన మారే పల్లి రామచంద్రశాస్త్రి కూడా "తొలి 'తెన్‌' (తెలుగు) పలుకుమానుపు భరత ఖండమంతటను నెరసి యుండెననుటకు' ఉదాహ రణంగా మల్తో, పాట్నాల దగ్గర, కొలామీ, నాగపుర వాయవ్య భాగంలోనూ, బ్రాహుయీ సింధు, బెలూ చిస్థాన్‌లలోనూ వాడుకలో తెలుగు వ్యాపించి ఉండటా న్ని పేర్కొన్నారు. అంతే గాదు, ప్రాచీన 'తెన్‌' (తెలు గు) పలుకులో 'వ్రాగమి' అంటే వాఙ్మయం ఉందనీ, దాని తొలి బిడ్డలైన తమిళం లోనూ, తెలుగులోనూ 'వ్రాగమి' అప్పటి నుండే ఉందనీ భావించవచ్చు. ఈ వాఙ్మయం ఆ పిమ్మటి తరాలకూ, నేటి తరాల దాకా అందక పోవడానికి తెలుగుదేశంలో జైన, బౌద్ధాలపై పెచ్చరిల్చిన శైవ, వైష్ణవ మత విద్వేషాలు, నేటి పాలకుల మాదిరే నాటి పాలకుల అశ్రద్ధే కారణమని చరిత్ర చెబుతోంది. కనుకనే ఆరుద్ర ఒక చోట ప్రస్తావించినట్టుగా ప్రాచీన జానపద సాహితీ సంప దను రక్షించుకుని తమిళులు ప్రాచీన సాహిత్యంగల వాళ్లయ్యారు.

మనవాళ్లు అంతే ప్రాచీన చరిత్ర, వాఙ్మయం కలిగి ఉండి కూడా దానిని కాపాడుకోలేక లేనివాళ్లయ్యారు. అయితే కోల్పోయింది కోల్పోగా ఏతావాతా మిగిలిన పాత వాఙ్మయం సహితం క్రీ.పూ. ఆరవ శతాబ్దానిదే కావడం విశేషం. అందుకే, నన్నయకు వేయి సంవత్సరాలకు పూర్వమే (అంటే, 2,000 సంవత్సరాలకు పైబడే) తెలుగు భాష ఉందని ఆచార్య గంటి జోగి సోమయాజులు గుర్తు చేయాల్సి వచ్చింది. అలాగే, ద్రావిడ నాగరికతకు ముందున్న ఎన్నో గిరిజన (ఆదివాసీల) భాషల ఉనికీ, ఉసురూ ఏమయ్యాయో తెలియదు. ఈ భాషలు బతికివున్న కాలాన్ని క్రీ.పూ. 300గా బర్టన్‌సేన్‌ ఉదహరించాడు. 'బ్రాహ్మీ' లిపిలో ఆది తమిళ శాసనాలు వెలువడక ముందే ఈ గిరిజన భాషలు తమ ఉనికిని దీటుగా చాటుకున్నాయి. కాగా, శాతవాహనుల కాలానికి (క్రీ.పూ 250-క్రీ.శ 245) ముందే ఆదితెలుగు పరివ్యాప్తమై ఉందన్నాడు బర్టన్‌! ఆయన మరో విషయాన్ని వెల్లడించాడు; అంతటి సువిశాల ప్రాంతంలో వెలుగొందిన తెలుగు, బలమైన సమైక్యతా లక్షణాలు లేకుండానే క్రీ.పూ. 1500 నుంచీ చారిత్రక విభాత సంధ్యల వరకూ చెక్కుచెదరకుండా ఉండడం అసా«ధ్యం' అని కూడా కితాబిచ్చాడు!.

తెలుగువారి నాగరికతకూ సింధు నాగరికతకూ మధ్య సంబంధ బాంధవ్యాలు
ఇక పర్పోలా, కరుణానిధులూ సింధు లిపికీ, తమిళానికీ మధ్య ఉన్నదని పేర్కొంటున్న సంబంధ బాంధవ్యాలు- ప్రాచీన తెలుగుకు, తెలుగువారి నాగరికతకూ సింధు నాగరికతకూ మధ్య కూడా ఉన్నాయని పరిశోధకుల నిర్ధారణ. సింధు నాగరికత ద్రావిడ నాగరికతగా చెప్పే కొందరు తమిళ సోదరులు, అదే ద్రావిడ భాషా, నాగరికత లలో అంతర్లీనమైన తెలుగు భాషా నాగరికతలకు మాత్రం ఎందుకు వర్తించ దో చెప్పరు. ఈ మూర్ఖత్వమే, తమిళభాషకు ప్రాచీన ప్రతిపత్తిని వెయ్యి సంవత్సరాల ప్రమాణ పరిమితిలోనే పరోక్షంగా దొంగచాటుగా సాధించు కుని అదే ద్రావిడభాషా కుటుంబంలోని తెలుగు, కన్నడాలకు 1,500-2,000 సంవత్సరాల 'ప్రాచీనతా' పరిమితిని తమిళ పాల కులు ప్రతిపాదించారు. పైగా ఆ పరిమితిని కూడా తరువాత దొంగచాటుగా మార్చి 1,500 సంవత్స రాలకు మించి ఉండాలని ఒకసారి, కాదు 2,000 సంవత్సరాలు, ఆపైన ప్రాచీనత కలిగిన భాషలకు మాత్రమే ప్రాచీన భాషా ప్రతిపత్తిని కల్పించాలని 'సొడ్డు' పెట్టారు!
ప్రాచీన భాషల పూర్వాపరాలపై విశేష పరిశోధన చేసిన తమిళ పండితుడు ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్య మలయాండీ తమిళనాడులోని 'వైగై' నదీ లోయలో వర్ధిల్లిన తమిళ నాగరికత, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్రా నదీలోయలో వర్ధిల్లిన తెలుగు వారి నాగరికతా సమాంతరంగా ప్రభవిల్లాయని, ఈ రెండు నాగరికతలు క్రీ.పూ. 4000-3000 నాటి సింధు నదీలోయ నాగరికతతో బరాబరీగా తులతూగాయనీ, ఇవి ప్రపంచంలోని ఎగువ పాత రాతియుగపు నాగరికతలతో (పెరూ, ఈస్టర్‌ ఐలాండ్‌, కొలంబియా, పొలినీషియా) ఎలా సరిపోలాయో సాక్షాత్తూ ముద్రి కలతో సహా నిరూపించాడు. కుత్సితం రాజకీయం లోనే కాదు, భాషారంగంలో, పురాపరిశోధనల్లో కూడా ఉందని మన తెలుగువాళ్లకు అప్పుడుగాని అర్థం కాలేదు. "కుడుమిస్తే చాలు, పండగ' అనుకునే తెలుగువాడికి, భాషా సంస్కృతుల నుంచి దూరమవుతున్న విద్యావ్యవస్థకు సారథ్యం వహిస్తున్న పాలకులకూ ఇది గుణపాఠం!

ఇక కరుణానిధి ప్రసంగం 'అంతర్జాతీయ' సరి హద్దులు తాకింది! ఎలా? "తమిళం అంతర్జాతీయ భాష మాత్రమే కాదు, అది ప్రపంచ భాషలన్నింటికీ తల్లి భాష' అన్నాడు! అంతేకాదు, ఒక భాషను 'విశిష్ట' లేదా 'ప్రాచీన' లేదా 'శ్రేష్ఠ' భాషగా ప్రకటించడానికి ప్రపంచ భాషాశాస్త్రవేత్తలు పెట్టిన పదకొండు విధాల ప్రమాణాలకన్నా 'మించిన యోగ్యతలు' తమిళానికి ఉన్నాయన్నది 'ప్రపంచ వ్యాపిత స్థూలాభిప్రాయ'మని కరుణానిధి ఉవాచ! తెలుగు ప్రాచీనతకు వేల సంవత్సరాల లిపి, నాణాల, శాసనాల, పురావస్తు చారిత్రక ఆధారాలు కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగు గ్రామ నామాలు, వంశనామాలు శతాబ్దాల నాటివి కావు, వేల సంవత్సరాల నాటివి ఉన్నాయి. శాతవాహనుల నాటి (450 ఏళ్ల పాలన- క్రీ.పూ 230-క్రీ.శ. 225 దాకా) కోట లింగాల (తెలంగాణ) వద్ద, సింగవరం(కృష్ణా జిల్లా) వద్ద దొరికిన నాణాలను, శాసనాలనూ తమిళ పురాతత్త్వ వేత్త ఐరావతం మహదేవన్‌ ఈనెల 24న 'హిందూ'లో ప్రచురించిన నాణాల, శాసనాల ఆధారాలతో ఏవిధంగా పోల్చిచూసినా, మిన్నగా తులతూగు తాయి!

తెలుగుదేశంలో మెకంజీ కాలం నాటికే 6,000కు పైగా శాసనాలు లభించాయి. ఇంత పురాసంపద దక్షిణ భారతంలోనే మరొక జాతికి లేదు. మహదేవన్‌ ప్రచురించిన వాటిలో ఒక రాతి శాసనం క్రీ.పూ. 2-1 శతాబ్దాల నాటిది; మరొకటి మట్టి పాత్రల మీద రాసిన శాసనం క్రీ.పూ. 2వ శతాబ్దిది. ఇంకొకటి ఒక వెండి నాణెం క్రీ.పూ. 3వ శతాబ్దిది. కానీ, ప్రాచీన నాణాల ప్రసిద్ధ తెలుగు పరిశోధకుడు డాక్టర్‌ దామె రాజారెడ్డి తమిళ పరిశోధనలకు సంబంధించిన కొన్ని 'కొత్త' విశేషాలు తెలిపారు! తమిళులు 'సంగం'(కవులు, రచయితల సంఘం) సాహిత్యాన్ని క్రీ.పూ. 3వ శతాబ్దిదిగా పేర్కొంటే, 'బ్రిటానికా విజ్ఞాన సర్వస్వం' పండిత సంపాదకులు 'సంగం' సాహిత్యా కాలాన్ని క్రీ.శ. 1-4 శతాబ్దుల మధ్య కాలానికి దించేశారు! ఇక ఈ సాహిత్యంలో ఉన్నవని చెప్పే పాటలు మధురైలో రాసినవనీ, వాటిలో రాజుల ప్రణయ గాథలు, వారి పాలనా చర్యలే ప్రధానమనీ, సంగం సాహిత్యంలో పేర్కొన్న రాజులు, పురాణ కల్పిత వ్యక్తులా, వాస్తవమైన రాజులా! అనే అంశంపై నిన్నమొన్నటి దాకా వివాదం నడిచిందనీ డాక్టర్‌ రాజారెడ్డి వెల్లడించారు.
ఎందు కంటే మద్రాసులో తమిళ సోదరులు చెబుతున్నట్టు రాజులు లేదా వారి సేనానులకు చెందిన నాణాలు సంగం కాలానివి కావనీ, ఆ తరువాతి కాలానికి చెందిన చేర, చోళ, పాండ్య రాజులకు ఆ నాణాలను అంటకట్టడం జరిగిందనీ డాక్టర్‌ రాజారెడ్డి నిరూపిం చారు! తమిళులు 'పెరుంగదై' పేరిట అనువదించు కున్న కథలు తెలుగు కథలకు, ప్రపంచ కథలకూ మూలంగా భావిస్తున్న గుణాఢ్యుని ప్రాచీన బృహ త్కథగా పండితులు నిర్థారణ చేశారు! కొన్ని దశాబ్దాల క్రితం కోయంబత్తూరు 'దొంగ కరెన్సీ నోట్ల'కు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు ఇతర భాషలను న్యూనపరిచే మనోవైక ల్యానికీ పేరొందడమే చిత్రం! మన పాలకులకూ, పౌరులకూ ఇప్పటికైనా రోషమొస్తుందా?! మాతృ భాషనూ, సంస్కృతినీ అంటిపెట్టుకుని ఉండే పాలకు లకు పునర్నవమే గాదు, పునర్జయమూ ఉంటుంది!.
సాక్షి సొజన్యంతో..,

Thursday, April 22, 2010

శ్రీ కృష్ణదేవరాయల చిత్రపటం లభ్యమైంది!

సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల రూపును వెల్లడించే చిత్రపటం ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పోర్చుగీసు యాత్రీకుడు,చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో ఈ చిత్రాన్ని గీశారు. రాయలను చిత్రించడానికి పేస్ కు 15 వారాల సమయం పట్టిందట! పూనే నగరం లోని భారతీయ ఇతిహాస్ సంశోదన్ మండల్ లో ఉన్న ఈ చిత్రాన్ని హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి వెలుగులోకి తెచ్చారు. శ్రీ కృష్ణదేవరాయల 500 వ పట్టాభిషేక వారోత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో రాయల అసలు చిత్రం వెలుగు చూడటం సంతోషించదగ్గ విషయం! విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 26 మంది రాజుల్లో 1509 నుండి 1529 వరకు ఓటమి ఎరుగని చక్రవర్తిగా పాలన సాగించిన రాయలు తన 49 వ ఏట కడుపుశూల వ్యాధికి గురై మరణించారని చరిత్ర చెబుతోంది.

Saturday, March 20, 2010

తెలుగుతల్లికి 'ప్రాచీన' పూదండ: మండలిలో రోశయ్య

హైదరాబాద్‌: తెలుగుతల్లి గళసీమలో ప్రాచీన భాష హోదా మాలను అలంకరించుకున్నామని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. శాసనమండలి, శాసనసభలోనూ సభ్యుల హర్షధ్వానాల మధ్య శుక్రవారం ఆయన ఈ విషయం తెలియజేశారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2006 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబరు 31న ఒక నోటిఫికేషన్‌ జారీ చేస్తూ చెన్నై హైకోర్టులో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం తీర్పునకు ఇది లోబడి ఉంటుందని తెలియజేసిందని వెల్లడించారు. సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్‌ జె.గీతారెడ్డి ఇటీవల తెలుగు భాషావేత్తల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారని, ఈ విషయంలో సహకరించాల్సిందిగా ఎంపీలను కోరారన్నారు. ఇందుకు స్పందించిన ఎంపీలు ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రికి లేఖలు రాశారని తెలిపారు. దీనిపై వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన మైసూరులోని భారతీయ భాషల అధ్యయన సంస్థ సంచాలకులు, విశ్వవిద్యాలయ విరాళాల సంఘ అధ్యక్షులకు లేఖను పంపిందని వెల్లడించారు. దీంతో తెలుగువారి చిరకాల కోరిక నేరవేరిందని సీఎం అన్నారు. ఇందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరినా అందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భాషావేత్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్టీఆర్‌ హయాంలో అధికార భాషా మంత్రిత్వశాఖ ఉందని, దాన్ని పునరుద్ధరించాలని దాడి వీరభద్రరావు చేసిన సూచనకు సీఎం సానుకూలంగా స్పందించారు.

Wednesday, March 17, 2010

తెలుగు భాష పరిరక్షణకు ఇంటింటి ప్రచారం!

మైదుకూరు; ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగును అమలు పరిచేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి, కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి కోరారు. ఉగాది పర్వ దినాన్ని పురష్కరించుకొని తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఉద్యమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ లో మంగళవారం తెలుగు ఉధ్యమ ప్రచార గీతాల సిడి ని తవ్వా ఓబుల్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే ఉద్యమ నినాదాల స్టిక్కర్లను ఎస్‌టియు రాష్ట్ర నాయకుడు ఎపి శ్రీనివాసులు, కరపత్రాలను అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డివిఎస్‌ నాయుడు, మైదుకూరు ఉధ్యమ గీతాన్ని రాటా అధ్యక్షులు కొండపల్లి శేషగిరి ఆవిష్కరించారు.
చీరాలలో ఈ నెల 14న జరిగిన తెలుగు భాషోద్యమ సమాఖ్య సర్వ సభ్య సమావేశ వివరాలను శాఖ ఉపాధ్యక్షులు ఎ. వీరాస్వామి వెళ్లడించారు. తెలుగు భాషపై సమాఖ్య చేపట్టిన ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్లేందుకు సమాఖ్య అధ్యక్షుడు దాక్టర్ సామల రమేష్ బాబు అధ్యక్షతన రూపొందించిన కార్యక్రమంపై కార్యవర్గం చర్చించింది. 1నుండి 10వ తరగతి వరకు తెలుగు ఒక అంశంగా తప్పని సరిగా పాఠశాలల్లో భోదించేందుకు ఉద్యమాన్ని నిర్మించాలని, తెలుగులో మాట్లాడడం నేరంగా పరిగణించే పాఠశాలలపై చట్టపరమైన చర్యలకు డిమాండ్‌ చేయాలని కూడా ఈ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం వెంకట సుబ్బయ్య, సంయుక్త కార్యదర్శి ధరిమి శెట్టి రమణ, బాబయ్య, మహానందప్ప, పాల కొండయ్య, మల్లేశ్వర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Tuesday, March 16, 2010

ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు!


తెలుగు సాహితీ మిత్రులకూ,
తెలుగు వారందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Saturday, March 13, 2010

తెలుగుకు ప్రాచీన హోదాపై మళ్లి కదలిక

న్యూఢిల్లీ,మార్చి13 : తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి కల్పించిన సౌకర్యాలు అమలుచేయవలసిందిగా కోరుతూ కేంద్రం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌కు, మైసూరులోని భారతీయ భాషల కేంద్రం సంస్థకు లేఖలు రాసింది. మానవ వనరుల మంత్రిత్వశాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ అనితా భట్నాగర్‌ జైన్‌ యుజిసి, సిఐఐఎల్‌లకు లేఖలు రాశారు. తెలుగుకు ప్రాచీనహోదా కల్పిస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని సౌకర్యాలు అమలుచేయడంలో ఎలాంటి అడ్డంకులూ లేవని న్యాయమంత్రిత్వ శాఖ స్పష్టీకరించడంతో యుజిసి, సిఐఐఎల్‌ ఇక తదుపరి చర్యలు తీసుకోవచ్చునని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. తెలుగుకు ప్రాచీన హోదా అమలుపై రాష్ట్రప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు లక్ష్మీప్రసాద్‌ ఈ లేఖలను శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు.
ప్రస్తుతం కొన్ని కేంద్రీయ యూనివర్సిటీలలో తెలుగులో ప్రతిభావంతులైన పండితులకు కొన్ని పీఠాలు ఏర్పాటుచేయవలసిందిగా అనితా భట్నాగర్‌ యుజిసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌కు రాసిన లేఖలో నిర్దేశించారు. ఈ ఉన్నత పీఠాల్లో నియమించే పండితుల వయసు, కాలపరిమితి, అర్హతలు, వేతన భత్యాలు మొదలైనవి యుజిసి తర్వాత నిర్ణయించవచ్చునని ఈ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్‌ స్థాయిలో నిర్ణయం తీసుకున్న రీత్యా ఈ చర్యలకు గట్టి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఇక, ప్రాచీన భాష అయిన తెలుగులో పండితులకు రెండు ప్రధాన అంతర్జాతీయ అవార్డులను వార్షికంగా ప్రకటించాల్సి వుందని మైసూరులోని సిఐఐఎల్‌కు కూడా కేంద్రం లేఖ రాసింది. సిఐఐఎల్‌లో భాగంగానో, లేదా సాహిత్య అకాడమీలో భాగంగానో ప్రాచీన హోదా గల భాషల్లో అధ్యయనాలకు ఒక ఉన్నత ప్రతిభా కేంద్రాన్ని ఏర్పరచాలని కూడా అనితా భట్నాగర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తగిన భూమిని, సరైన మౌలిక సదుపాయాలను, ఫ్యాకల్టీని, పరిశోధకులను, ఇతర సిబ్బందిని నియమించాల్సి వుందని కూడా తెలిపారు.
అంతర్జాతీయ అవార్డులు, కన్నడ, తెలుగు భాషల్లో అధ్యయనంకోసం ప్రతిభాకేంద్రాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకోవలసిందిగా ఆమె సిఐఐఎల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ సచ్‌దేవను కోరారు. నాలుగురోజులక్రితం ఢిల్లీ వచ్చిన లక్ష్మీప్రసాద్‌ తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు 40మంది ఎంపిల సంతకాలతో కూడిన లేఖలు సమర్పించడమే కాక, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీని కులుసుకున్నారు. ప్రాచీన హోదా కల్పించేందుకు న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని మొయిలీ స్పష్టంచేసిన విషయం విదితమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ఈ బృహత్కార్యం ఎట్టకేలకు నెరవేరిందని, ముఖ్యమంత్రి రోశయ్య, రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారని, తెలుగుకు ప్రాచీన హోదా అమలయ్యేలా చేసిన ఘనత వీరికి దక్కుతుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు.

Monday, March 8, 2010

అమ్మ భాష పరిరక్షణకు బెంగళూరులో సదస్సు

బెంగళూరు, మార్చి 7 : అదో విశిష్ట కార్యక్రమం. ఆంగ్ల వ్యామోహ పెనుతుపానులో కొట్టుకుపోతున్న మాతృభాషల్ని పరిరక్షించుకునే వ్యూహాన్ని చర్చించేందుకు ఏర్పాటైన సదస్సు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా, గోవా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు. ఆయా రాష్ట్రాల్లో మాతృభాష దుస్థితి, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. సదస్సు తీర్మానాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
మాతృభాష పరిరక్షణ మన లక్ష్యం కావాలి... సంరక్షణకు నడుం బిగిద్దామని ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.
నగర శివార్లలోని వాగ్దేవి విలాస్‌ విద్యాలయ ప్రాంగణం విశిష్ట కార్యక్రమానికి వేదిక అయింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు భారతీయ మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర మాతృభాషా పరిరక్షణ తొలి సదస్సును ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి అధ్యక్షుడు ఎ.చక్రపాణి, బెంగళూరు కోళదమఠాధిపతి శాంతవీరమహాస్వామి ఆరంభించారు. ఆయా రాష్ట్రాల్లో అమ్మభాష దుస్థితి, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి డాక్టర్‌ అశోక్‌ కామత్‌ (మహారాష్ట్ర), డాక్టర్‌ చిదానందమూర్తి (కర్ణాటక), డాక్టర్‌ ఉద్గాత (ఒరిస్సా), ఆచార్య డి.కృష్ణమూర్తి (బెంగళూరు), దామోదర మౌజో (కొంకణి) తదితరులు తమ ప్రసంగాల్ని కొనసాగించారు. యునెస్కో ఇటీవల ప్రకటించిన సర్వే నివేదికపై విస్తృతంగా చర్చించారు. మాతృభాషలు
మృతభాషలుగా మారకుండా తీసుకోవాల్సిన చర్యల్ని ప్రస్తావించారు. సాయంత్రం వరకు సదస్సు కొనసాగింది.
దేశం నుంచి బ్రిటిష్‌ పాలకుల్ని తరిమికొట్టినా వారి ఆంగ్లాన్ని వదల్లేకపోతున్నామని ఎ.చక్రపాణి విచారం వ్యక్తం చేశారు. కోళదమఠాధిపతి శాంతవీరస్వామి ప్రసంగిస్తూ... మాతృభాషలకు తగినంత ప్రాధాన్యత లభించడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ఆంగ్ల వ్యామోహం అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మభాషను గౌరవించని వ్యక్తుల్ని గుర్తించవద్దని హితవు పలికారు. కర్ణాటకలో పాలనా భాషగా కన్నడ అమలును కచ్చితంగా పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ... తెలుగు, కన్నడలకు ఏడాది క్రితమే ప్రాచీన హోదా లభించినా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందనే నెపంతో కేంద్రం నిధులు విడుదల చేయటం లేదు. కేసు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదే సమయంలో భాషాభ్యున్నతికి తగినన్ని నిధుల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. నిధుల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ఎల్‌. వివేకానంద, కె.సి.కల్కూర, కె.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.